Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Jan Viswas Bill: జనవిశ్వాస్‌ బిల్‌

Jan Viswas Bill: జనవిశ్వాస్‌ బిల్‌

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన బిల్‌ “ జనవిశ్వాస్‌”. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం కేంద్ర మంత్రి పీయూష్‌ ఘోయాల్‌ గారి మాటల్లో చెప్పాలంటే వ్యాపారాన్ని సులభం చేయడం, నమ్మకంతో వ్యాపారం చేయడానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అందులో బాగంగా వ్యాపారంలో సహజంగా చేసే ఎదుర్కొనే అనేక శిక్షార్హమైన తప్పులను నేరంగా ఫరిగనించకుండా కేవలం జరిమానాల ద్వారా మాఫీ చేయడం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల మనుగడ ప్రజలను, వివిధ సంస్థలను విశ్విసించడంలోనే ఉంటుంది, కాలం చెల్లిన నిబందనలు, నియమాలు ఆ విశ్వసనీయతనను దెబ్బతీస్తాయి. కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన ఉండాలంటే సమాజంలో సులభమైన జీవితం, సులబమైన వ్యాపార వాతావరణం ఉండాలి. అభివృద్దికి నిరోదంగా ఉన్న పురాతన చట్టాలను సవరించాల్సి ఉంది. మారిన సామాజిక ఆర్ధిక స్థితిగతులను, అందిపుచ్చుకుంటున్న సరికొత్త సాంకేతిక నైపుణ్యానికి అనుగుణంగా మన వెనుకటి ఆలోచనా విదానాలను మార్చుకో వలసిన తరుణమిది.
ప్రపంచ పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచి, పెట్టుబడుల కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. చిన్న నేరాలకు కూడా శిక్షపడుతుందన్న భయం వ్యాపారాభివుద్దికి, విశ్వసనీయతకు అడ్డంకిగా మారింది. అందుకే చిన్న నేరాలను గుర్తించి వాటికి శిక్షించడానికి బదులు, జరిమానాలు విధించడం అన్నివిదాల మంచిదని అభిప్రాయానికి వచ్చాం, అదేవిదంగా ఇలా చేయడం న్యాయవ్యవస్థమీద బరువును కూడా తొలగిస్తుంది. తెలిసీ తెలియక చేసిన నేరాల పేరుతొ సమయాన్ని, డబ్బును, మానసిక ఆనందాన్ని కోల్పోయి, కోర్టుల చుట్టూ తిరుగుతూ శక్తిని కోల్పోయే బదులు రాజీ చేసుకోవడం, జరిమానా చెల్లించడం ద్వారా ఆయా ఆరోపణల నుండి భయటపడే వీలుకల్పించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్న నేరాలను నేర ఫరిదినుండి తప్పించడంతో పాటు, ఆయా కేసుల్లో విదిస్తున్న జరిమానాలను కూడా ఈ చట్టం సమీక్షిస్తుంది. చట్టంలో ఉద్దేశించిన కనీస జరిమానా ప్రతి మూడు సంవత్సరాలకు పది శాతం (10%) పెరుగుతూ పోతుంది”. ఇదీ ప్రభుత్వ వివరణ.

- Advertisement -

బిల్లు పూర్వాపరాలను పరిశీలిస్తే మొత్తంగా 42 చట్టాల్లోని వివిధ నిభందనలకు సవరణలు చేరుస్తూ ఉద్దేశించిన బిల్లు ఇది. ప్రెస్‌ మరియు రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ ఆక్ట్‌, ద ఇండియన్‌ పోస్టాఫీస్‌ ఆక్ట్‌, ది రబ్బర్‌ ఆక్ట్‌, ది సినీమాటోగ్రాఫీ ఆక్ట్‌, ది ఇండస్ట్రియల్‌ ( డెవలప్మెంట్‌ & రెగులేషన్‌ ) ఆక్ట్‌, ది టీ ఆక్ట్‌, మర్చంట్‌ పిప్పింగ్‌ ఆక్ట్‌, ది పేటెంట్స్‌ ఆర్ట్‌ , ది నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ బ్యాంక్‌, ది నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ఆక్ట్‌, ది కంటోన్మెంట్‌ ఆక్ట్‌ లాంటి అనేక చట్టాలకు సవరణలు ఉద్దేశించడం, శిక్షల స్థానంలో జరిమానాలతో ఆయా నిబందనలను సవరించడం ముదావహమే. కానీ ది స్పైసిస్‌ బోర్డు ఆక్ట్‌, ది ఎన్విరాన్మెంట్‌ (ప్రొటక్షన్‌) ఆక్ట్‌, ది మెట్రో రైల్వేస్‌ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌) ఆక్ట్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆక్ట్‌, ది లీగల్‌ మెట్రోలజీ ఆక్ట్‌ లాంటి కొన్ని చట్టాల్లో సవరణలు ఉద్దేశించిన నిబందనలను పరిశీలిస్తే ఈ బిల్లు తన లక్ష్య ఫరిదిని దాటి మరింత ముందుకు వెళ్ళిందా, వ్యాపారానికి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు వ్యాపారుల్లో నిర్బీతికి, అనైతికతకు కూడా మార్గాలను సూచిస్తున్నామా అనిపిస్తున్నది. చిన్న నేరాలకు జరిమానాలతో శిక్షించడం వలన సమయం
మిగులుతుంది, కోర్టుల మీద భారం తగ్గుతుంది, నిందితుల్లో మార్పుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, కానీ ఏవి చిన్న నేరాల కోవలోకి వస్తాయి అనేదే ప్రశ్న. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చర్యలు, ప్రజల ఆహార భద్రతతో చలగాటమాడే చట్టాలు, భవిష్యత్‌ తరాల హక్కులతో ముడిపడిఉన్న పర్యావరణ రక్షణకు తూట్లు పొడిచే ఆలోచనలు చిన్న నేరాలెలా అవుతాయి.

ముఖ్యంగా పరిశీలిస్తే, “ వ్యవసాయ ఉత్పత్తుల ( గ్రేడింగ్‌ &మార్కెటింగ్‌) చట్టం” 1937, హర్టికల్చర్‌ తో కలిపి అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులు, వాటినుండి తయారుచేయబడిన ఆహారపదార్థాలు, పానీయాల మీద అజమాయిషీ చేసే చట్టం. జనవిశ్వాన్‌ బిల్లులో “ వ్యవసాయ ఉత్పత్తుల ( గ్రేడింగ్‌ &మార్కెటింగ్‌) చట్టం” 1937 లోని అధికరణలకు సవరణ చేస్తూ, గ్రేడింగ్‌ లో అవకతవకలు చేసిన వ్యాపారికి, సంస్థకు జరిమానా మాత్రమే విదించేలా మార్పుచేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడున్న చట్టంలోని సెక్షన్‌ 5 సి ప్రకారం నష్టపోయిన వినియోగదారు లేదా గుర్తింపు పొందిన వినియోగదారుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, ఇప్పుడా అవకాశం వినియోగదారులు కో ల్పోతున్నారు, కేవలం ప్రభుత్వం నియమించే అధికారి మాత్రమే ఇకమీదట దీన్ని పర్యవేక్షిస్తాడు. కార్పొరేట్ల కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వాలు నియమించిన అధికారులు ఎవరికి వంతబాడుతారో తెలియంది కాదు, కనీసం అప్పీలు అవకాశం కూడా న్యాయస్థానాలకు ఇవ్వలేదు. ఆన్లైన్‌ వ్యాపారం విస్తరించి ప్రపంచమంతా కుగ్రామంలా మారిపోయిన శతాబ్దమిది, వినియోగదారులు వస్తువులను స్వయంగా పరిశీలించకుండా గ్రేడ్‌ ఆదారంగా గుడ్డిగా కొనే పరిస్థితి నెలకొన్నది. వ్యక్తిగతంగా చూస్తే ఒక వస్తువు ఖరీదు చిన్నదే కావచ్చు కాని విస్తృత మార్కెట్‌ లోకి ఎెళ్ళినతరువాత, వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నకొ ద్దీ దాని విలువ లక్షలు, కొట్లలో ఉంటుంది, వేలు, లక్షలాది జీవితాలమీద దాని ప్రభావం ఉంటుంది. ఆహారానికి సంబందించిన విషయం కనుక కచ్చితంగా ఇది మన ఆరో గ్యానికి, ఆదాయానికి ముడిపడిన వ్యవహారం, నిర్లక్ష్యం చేయతగింది, చూసీ చూడకుండా వదిలేయాల్సింది కానేకాదు. ఇటువంటి తప్పులను శిక్షార్హమైన నేరాలుగా పరిగనిస్తేనే వ్యాపారవర్గాల్లో భయం, వ్యాపార క్రమశిక్షణ ఉంటాయి. ఏ తప్పు చేసినా పర్వాలేదు, దొరికితే కేవలం 5 లక్షల జరిమానాతో పోతుందిలే అనుకుంటే కోట్ల విలువైన వ్యాపారాన్ని తప్పుడు పద్దతిలో చేయడానికి ఎవరైనా దైర్యం చేసే ప్రమాదం ఉన్నది.

పర్యావరణం ( పరిరక్షణ) చట్టం, 1986 లో 5 సంవత్సరాల జైలుశిక్ష స్థానంలో కేవలం 5 లక్షల జరిమానా విదిస్తూ చట్టంలో మార్పులను సూచిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులు, వేలాది/లక్షలాది ప్రజలమీద ప్రభావం చూపే ప్రాజెక్టులు, పర్యావరణ కాలుష్యంతో భావి జీవితాలమీద ప్రభావం చూపే ప్రాజెక్టులు నిర్మిస్తున్న కారో రేట్‌ సంస్థలకు 5 లక్షలు ఒక లక్కనా? జైలు శిక్షలు ఉంటాయంటేనే భయంలేకుండా భరితెగిస్తున్న కార్పోరేట్‌ సంస్థలు, జరిమానాలకు జంకుతాయా ! పైపెచ్చు తీర్పిచ్చే అధికారులను కేంద్రమే నియమిస్తుంది. ఇంకేముంది వడ్డించేవాడు మనోడే కదా అన్న చందంగా తయారాతుంది. ఇంతవరకూ పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 16 ప్రకారం ఏదైనా కంపనీ పర్యావరణ చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తే సంబందిత భాద్యుడు/డైరెక్టర్‌ వ్యక్తిగతంగా అందుకు భాద్యత వహించాల్సి వచ్చేది. ఇప్పుడు సవరిస్తున్న చట్టంలో కంపనీ భాద్యులు/డైరెక్టర్లు పూర్తిగా చట్ట పరిధి నుండి తప్పుకుంటున్నారు. ఇక కారో రేట్‌ సంస్థలను ప్రభుత్వాలు ఎలా అదుపుచేస్తాయో ఏలినవారే సెలవివ్వాలి. అదేచట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం ఒకవేళ పర్యావరణ నిబందనలను ప్రభుత్వ సంస్థ గనుక ఉల్లంగిస్తే సదరు డిపార్టుమెంటు హెడ్‌ ప్రత్యక్షంగా భాద్యత వహిస్తాడు, కానీ ఇప్పుడు ప్రతిపాదించిన సవరణ చట్టంలో అసలు ప్రభుత్వ అధికారులను భాద్యులు చేసే అవకాశమే కనిపించడం లేదు. ఇది ఒకరకంగా పర్యావరణ చట్టాలకు తూట్లుపొడిచే చర్య అనే చెప్పాలి. అదేవిదంగా స్పైసిస్‌ బోర్డు చట్టంలో సవరణ చేస్తూ యాలకుల పంట ధరలమీద ప్రభుత్వ నియంత్రణను వదులుకోవడం ఆహ్వానించదగ్గ విషయమైతే కాదు.

అదేవిదంగా “కేబుల్‌ /టెలివిజన్‌ ( రెగ్యులేషన్‌)” చట్టంలో మార్పులు తెస్తూ ఎన్నిసార్లు చట్టాన్ని ఉల్లంగించినా అది శిక్షార్హమైన నేరం కాదు, కేవలం జరిమానా మాత్రమే చెల్లించాలని తీర్మానించడం చట్టాన్ని నీరుగార్చడమే అని చెప్పాలి. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్న కార్పొరేట్ల కనుసన్నల్లో నడుస్తున్న కేబుల్‌/టెలివిజన్‌ సంస్థలు జరిమానాలకు జంకుతాయా! ఈ ఆదునిక యుగంలో ప్రజల మీద ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తున్న ప్రధాన రంగం మీడియా. సరైన దిశలో అదుపు చేయకపోతే, అదుపు తప్పడం ఖాయం. ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం ఒకవేళ కంపనీ గనుక చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే సంబందిత భాద్యుడు/ డైరెక్టర్‌ వ్యక్తిగతంగా శిక్షార్హుడు అవుతాడు, కానీ రాబోయే చట్టం వారిని పూర్తిగా వ్యక్తిగత భాద్యతల నుండి తప్పిస్తున్నది. అంటే కార్పోరేట్‌ కంపనీలు ఇకమీదట ఏం చేసినా చెల్లుతుంది, మహా అయితే జరిమానాలు చెల్లిస్తారు. వ్యాపారులకు సౌకర్యం పేరుతొ చట్టాలను నీరుగార్చడం అసలు లక్ష్యాన్ని దేబ్బతీయదా? అదేవిదంగా “మెట్రో రైల్వేలు 2002″చట్టానికి సవరణ తెస్తూ మద్యం మత్తులో విధులు నిర్వర్తించి ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరంగా వ్యవహరించిన అధికారులను సైతం క్రిమినల్‌ శిక్షల నుండి తప్పిస్తూ కేవలం 10 వేల రూపాయల వరకు జరిమానాలకే ఫరిమితం చేయడం ఏవిదమైన సంస్కరణ నో ఏలినవారికే తెలియాలి. ఇంతవరకూ ఉన్న 2 సంవత్సరాల శిక్షను ఎందుకు తొ లగిస్తున్నారో వివరణ ఇవ్వాల్సిన భాద్యత ప్రభుత్వానిది. తాగి మోటార్‌
బైక్‌ నడిపినవారిని శిక్షిస్తూ, వేలాది ప్రాణాలతో ముడిపడిన మెట్రో అధికారుల నిర్లక్షాన్ని మాత్రం జరిమానాలకు పరిమితం చేయాలనుకోవడాన్ని ఏవిదంగా అర్ధంచేసుకోవాలి. పెరుగుతున్న రైలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకునైనా ఈ సవరణ మీద పునరాలోచన చేయాలి. జనవిశ్వాన్‌, బిల్లులో ఉద్దేశించిన మరో ముఖ్యమైన సవరణ “ ఫుడ్‌ సేఫ్టీ & స్టాండర్డ్స్‌” చట్టం, 2006 లోని వివిధ సెక్షన్‌ లకు ఉద్దేశించింది. ఇప్పటివరకూ సదరు చట్టంలోని సెక్షన్‌ 59 (1) ప్రకారం మానవ వినియోగానికి (తినడానికి) పనికిరాని ఆహారాన్ని తయారుచేసినా, నిల్వచేసినా, పంపిణీ చేసినా శిక్షార్హమే. ఇప్పుడు కొత్త చట్టంలో
అటువంటి తప్పిదాన్ని జరిమానాతో సరిపెట్టాలని చూస్తున్నారు. ఈ సవరణ వలన వేలసంఖ్యలో ఉండే
వ్యాపారులకు లాభం జరుగుతుందేమో కానీ, కోట్ల సంఖ్యలో ఉండే సామాన్యుల ఆరోగ్యభద్రత ప్రమాదంలో పడదా అన్నది ప్రధాన ప్రశ్న. సెక్షన్‌ 63 ప్రకారం ఏదేని వ్యక్తీ లేదా ఆహార పదార్థాల వ్యాపారి అనుమతి లేకుండా ఆహార పదార్థాలను తయారుచేయడం, నిల్వచేయడం, ఎగుమతి చేయడం గనుక చేస్తే అతను లేదా సదరు సంస్థ క్రిమినల్‌ శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తలపెట్టిన కొత్త సవరణ వారిని ఆ శిక్ష నుండి తప్పిస్తూ, కేవలం 5 లక్షల వరకు జరిమానాలకే ఫరిమితం చేస్తున్నది. ఇప్పటికే దేశంలో కల్తీ ఆహరం విచ్చలవిడిగా పరుచుకుంటున్నది, శిక్షల స్థానంలో జరిమానాలు చేరితే ఇకమీదట కల్లీ వ్యాపారం రెక్కలువిప్పుకునే ప్రమాదం లేదా? అదేవిదంగా “ లీగల్‌ మెట్రోలజీ “ చట్టం 2009 లోని నిబందనలకు కేవలం జరిమానాలకే పరిమితం చేయడం సమాజానికి శ్రేయస్కరం కాదనే చెప్పాలి. మొదటి సారి లేదా రెండవసారి తప్పుచేస్తే జరిమానాలు విదించవచ్చు, కానీ ఎన్నిసార్లు చేసినా జరిమానాలు మాత్రమే ఉంటాయంటే ఇక వ్యవస్థలో భయపడేదేవరు?
పైపెచ్చు ఈ జనవిశ్వాస్‌ సవరణలు గతంలో జరిగిన నేరాలకు కూడా వర్తించాలని ఉబలాటపడటం (రెట్రాస్పెక్టివ్‌ ఎఫ్ఫెక్ట్‌ ) చూస్తుంటే దీనివెనుక కార్పోరేట్ల ఒత్తిడి ఉన్నదా అనే అనుమానం కలుగుతున్నది. ఏదో ఇంటి కిరాయి పెరిగినట్టు మూడు సంవత్సరాలకు ఒకసారి 10% జరిమానా పెరగడం కూడా సహేతుకంగా లేదు. ప్రభుత్వ ఉత్సాహానికి దురుద్దేశాన్ని ఆపాదించాలని కాదు కానీ, నాణానికి ఒకవైపు నుండిమాత్రమే కాకుండా రెండోవైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కార్పోరేట్‌ శక్తుల కబంద హస్తాల్లోకి వెళ్ళకుండా, ప్రపంచ వ్యాపార పెట్టుబడుల కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దగలిగినప్పుడే అటు ఆర్థిక ప్రగతి ఇటు సామాజిక పురోగతి సాధ్యపడుతుంది. చట్టాలు అభివృద్దికి అడ్డు కాకూడదు, అదేసమయంలో అభివృద్ధి సాకుతో వ్యవస్థ కొన్నివర్గాల చేతుల్లోకి వెళ్ళకూడదు. విమర్శలను సహృదయంతో స్వీకరించి, సలహాలను పునః పరిశీలించి విస్పష్ట వివరణ ఇస్తూ, అనుగుణంగా మార్పులు చేస్తే జనవిశ్వాస్‌ బిల్లు చట్టంగా మారడం సర్వదా ఆహ్వానించదగ్గ విషయమే. కనీసం రాజ్యసభలోనైనా సవివరంగా చర్చిస్తారని, చర్చించాలని కోరుకుందాం.

చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి.
న్యాయవాది

మంథని: పెద్దపల్లి జిల్లా

9440449392

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News