Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్JK problems: కొత్త సమస్యలలో జమ్మూ కాశ్మీర్

JK problems: కొత్త సమస్యలలో జమ్మూ కాశ్మీర్

ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది

కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ లకు ఇప్పట్లో రాష్ట్ర ప్రతిపత్తి కల్పించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది కొద్దిగా నిరుత్సాహం కలిగించే విషయమే కావచ్చు. నాలుగేళ్ల క్రితం ఈ ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ఈ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడమన్నది తాత్కాలిక వ్యవహారమని, తొందరలోనే వీటికి మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని కేంద్రం అప్పట్లో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఎప్పటి లోగా ఈ ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం జరుగుతుందని ప్రశ్నించిన ప్పుడు, నిర్దిష్టమైన కాలపరిమితిని తాను చెప్పలేకపోతున్నట్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ జవాబిచ్చారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతాలు అల్లకల్లోలంగా ఉన్నమాట నిజమే. అయితే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోందా అన్నది అంతుబట్టడం లేదు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రకారం ఆర్టికల్ 370 ఏనాడో రద్దయింది. ఇప్పుడిక జమ్మూ కాశ్మీర్ లకు భారత రాజ్యాంగమే వర్తిస్తుంది. అవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ లకు శాసనసభలుంటాయి. కానీ, లడాఖ్ కు మాత్రం శాసనసభ ఉండదు. శాసన సభలు ఉన్న ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు, పురపాలక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో ఉంది. ఎన్నికల కమిషన్లు త్వరలో తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ లోగా ఓటర్ల జాబితాలను మెరుగు పరచడం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు ఏర్పడి ఉన్నాయని, ఉగ్రవాదం, చొరబాట్లు, హింసా విధ్వంసకాండలు తగ్గుముఖం పట్టాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అందువల్ల ఎన్నికలు
నిర్వహించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ప్రశాంత పరిస్థితుల నెలకొన్నందువల్ల ప్రభుత్వం తన రాజ్యాంగపరమైన విధులు నిర్వర్తించడానికి ఇక అడ్డంకులు ఉండకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాలకు
రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడానికి అభ్యంతరం ఉండకూడదనే భావించాలి. కేంద్రం ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టింది. అవి చురుకుగా అమలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సి.వై. చంద్రచూడ్ ఈ వ్యవహారాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడానికి, ఈ వ్యవహారాలకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇక్కడ 2019 ఆగస్టు నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్రం పేర్కొంటున్న సానుకూల ఫలితాలను బట్టి ఇక్కడ వెనువెంటనే ఎన్నికలు జరిపించడానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నికలు నిర్వహించడమే కాదు, రాష్ట్ర ప్రతిపత్తిని కలిగించడానికి కూడా అభ్యంతరాలు ఉండనక్కర లేదు. అంతేకాదు, 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థించుకోవడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించవలసిన అవసరం లేదు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 14 రోజు లుగా దీనిపై వాదోపవాదాలను వింటోంది. ఈ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించడంతో పాటు, ప్రభుత్వం చేసిన ప్రకటనలను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రభుత్వ రాజ్యాంగ విధుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ రాష్ట్రాలను మార్చడానికి దారితీసిన చరిత్రాత్మక పరిణామాలను కూడా పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు పూర్తిగా ప్రభుత్వ ప్రకటనలనే పదే పదే ఉటంకిస్తూ, ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News