Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Justice delayed: న్యాయం అందని ద్రాక్షేనా?

Justice delayed: న్యాయం అందని ద్రాక్షేనా?

హత్యలు, అత్యాచారాల కేసుల్లో లభించని న్యాయం

పదుల సంఖ్యలో చిన్న పిల్లలు గల్లంతు కావడం, ఇందులో కొందరి ఎముకలు, అస్తిపంజరాలు లభ్యం కావడం వంటి 2006 డిసెంబర్‌ నాటి సంఘటనలు గుర్తుండే ఉంటాయి. ఆ కేసులో ప్రధాన నిందితులను న్యాయస్థానం ఇటీవల విడుదల చేయడం దేశ ప్రజలను నిర్ఘాంతపరచింది. ఉత్తర ప్రదేశ్‌ లోని నోయిడాలో ఉన్న నిఠారీ అనే ప్రాంతంలో శిశు హత్యలు వెల్లువెత్తినప్పుడు ఇందుకు సంబంధించిన వార్తలు రోజూ పతాక శీర్షికలకు ఎక్కేవి. మొణీందర్‌ సింగ్‌ పాంధేర్‌ అనే వ్యక్తి పెరట్లోని ఒక మురుగు కాల్వలో ఎనిమిది మంది పిల్లల అస్తిపంజరాలు లభ్యమైనప్పుడు దేశమంతా గగ్గోలు పెట్టింది. ఆ తర్వాత మరికొందరు పిల్లల ఎముకలు, బొమికలు కూడా దొరికాయి. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలివి. ఈ అవశేషాలన్నీ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నపిల్లలవి. కొందరు మైనర్‌ బాలికల మృతదే్హాలు కూడా ఈ ప్రాంతంలో అనేక చోట్ల బయటపడ్డాయి. ఆ పిల్లల తల్లితండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు కానీ, ఈ కేసుల్లో తేలిందేమీ లేదు. ఆ తర్వాత సి.బి.ఐ ఈ కేసుల విచారణ చేపట్టడం, కాలువల్లోనూ, నీటి గుంటల్లోనూ అస్తిపంజరాలు బయటపడడం, ఎముకలు కనిపించడం జరిగింది.
ఈ కేసులపై అలహాబాద్‌ హైకోర్టులో విచారణ ప్రారంభమైన 17 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను న్యాయస్థానం విడుదల చేసింది. ప్రధాన నిందితుడైన సురీందర్‌ కోలీని, అతనికి సహాయ సహకారాలు అందజేసిన పాంధేర్‌ను విడుదల చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి ఈ ఇద్దరికీ ఉరిశిక్ష విధిస్తూ, దిగువ కోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ కేసులో లోపభూయిష్టంగా దర్యాప్తు జరిగిందని, సరైన సాక్ష్యాలను అందజేయలేకపోయారని హైకోర్టు ఈ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో హైకోర్టు సి.బి.ఐని, పోలీస్‌ అధికారులను తీవ్రంగా మందలించింది. అరెస్టు చేసిన తీరు, సాక్ష్యాధారాలు సేకరించిన పద్ధతి, దర్యాపు చేసిన విధానం లోపభూయిష్టంగా, అధ్వానంగా ఉన్నాయని, ఇంతకంటే చెప్పేదేమీ లేదని కోర్టు స్పష్టం చేసింది.
నేర సంబంధమైన కేసుల్లో మన న్యాయస్థానాలు ఎలా వ్యవహరిస్తున్నాయో, మన న్యాయవ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తమ పిల్లలు కనిపించకుండా పోవడం, ఆ తర్వాత వారి అస్తిపంజరాలు దొరకడం వగైరా పరిణామాలతో బాగా కుంగిపోయి ఉన్న కుటుంబాలకు ఈ విధంగా నిందితులను వదిలిపెట్టడమన్నది శరాఘాతంగా ఉంటుందనడంలో సందేహం లేదు. తమకు న్యాయం జరుగుతుందని దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుటుంబాలు ఈ తీర్పును చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఉంటాయి. ఇందుకు ఎవరిని నిందించాలి? నిఠారీ వంటి కేసుల్లోనే కాదు. అనేక హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో చాలావరకు ఈ విధంగానే జరుగుతోంది. దర్యాప్తులు లోపభూయిష్టంగా ఉండడం, సరైన సాక్ష్యాలు లభించకపోవడం, విచారణలు ఆలస్యంగా పూర్తి కావడం, దర్యాప్తులో సరైన నైపుణ్యాన్ని ప్రదర్శించకపోవడం, సాక్షులు మారిపోవడం వంటి కారణాల వల్ల బాధితులకు న్యాయం అనేది అందని ద్రాక్షపండు అయిపోతోంది.
నేర సంబంధమైన కేసుల్లో విచారణ పూర్తయి, శిక్ష పడేవరకూ నిందితుడిని నేరస్థుడిగా నిర్ధారించకూడదు. వారిని నేరస్థుడిగా నిరూపించే బాధ్యత పూర్తిగా దర్యాప్తు అధికారుల మీదే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, నేరం జరిగిన ప్రదేశం నుంచి సరైన సాక్ష్యాధారాలను సేకరించి, విశ్లేషించడం జరగడం లేదు. పైగా, దర్యాప్తును బలోపేతం చేయడానికి, అది న్యాయస్థానాల్లో నిలబడేలా చేయడానికి తగ్గ ఫోరెన్సిక్‌ సౌకర్యాలు, నైపుణ్యాలకు దేశంలో తీవ్రమైన కొరత ఉంది. శిక్షకు దారితీసే విధంగా కేసును పకడ్బందీగా తయారు చేయడమన్నది జరగడం లేదు. లోపభూయిష్టమైన దర్యాప్తులకు, విచారణలకు బాధితులు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News