కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వి. శ్రీషానంద ఈ మధ్య ఒక విచిత్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. బహిరంగ న్యాయస్థానంలో ఆయన కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారంటూ సుప్రీం కోర్టు ఆయన మీద సూమోటో కేసును విచారణకు స్వీకరించింది. బెంగళూరులోని ఒక ప్రాంతం మరో పాకిస్థాన్ లాగా మారుతోందని ఒకసారి, ఒక మహిళా న్యాయవాదిని చులకన చేస్తూ మరోసారి ఆయన వ్యాఖ్యలు చేసినట్టు సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్ర విషయాలుగా పరిగణించింది. న్యాయమూర్తి శ్రీషానంద ఈ వ్యాఖ్యలపై మనఃపూర్వక పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను దురుద్దేశంతోనో, ఉద్దేశపూర్వకంగానో ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఏ వర్గాన్నీ, ఏ వ్యక్తినీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని ఆయన తెలిపారు. తాను కేసుల విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా అసందర్భంగా ప్రసారం చేయడం జరిగిందని కూడా ఆయన వివరించారు.
దురదృష్టమేమిటంటే, ఈ అవకాశాన్ని పురస్కరించుకుని బెంగళూరు న్యాయవాదుల సంఘం న్యాయస్థాన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేసింది. దాంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా విచారణల పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.
ఇక నుంచి న్యాయస్థానాల్లో జరిగే ప్రతి విచారణా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని, అందువల్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు తాము చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని వ్యాఖ్యలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఆగస్టులో ప్రకటించింది. వారు అనాలోచితంగా చేసే వ్యాఖ్యలు న్యాయవ్యవస్థకు మాయని మచ్చ తెచ్చిపెడతాయని కూడా అది హెచ్చరించింది. “న్యాయస్థానాల్లో విచారణల సందర్భంగా న్యాయమూర్తులు ఏ వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియా వాటిని తీర్పులుగానే పరిగణిస్తుంటాయి” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఇటీవల వ్యాఖ్యానించారు. మొత్తం మీద న్యాయస్థానాల్లో విచారణలు జరుగుతున్నప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ వ్యాఖ్యల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే, ఈ సందర్భంగా న్యాయవాదుల డిమాండ్ మాత్రం గర్హనీయమైంది. న్యాయ స్థానాల్లో చోటు చేసుకున్న విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడమన్నది పారదర్శకత కోసం, తమకు నిష్పాక్షికంగా న్యాయం అందుతోందన్న అభిప్రాయం పౌరులకు కలగడం కోసమే కాదు. తాము ప్రజలకు బాధ్యత వహించాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని న్యాయమూర్తులు, న్యాయవాదులు గ్రహించుకోవడం జరుగుతుంది. నిజానికి కర్ణాటకలో చోటు చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఒక పాఠం కావాల్సి ఉంది. ప్రత్యక్ష ప్రసారాలను ఆపేసి, వెనుకటి పద్ధతినే అనుసరించాలని న్యాయవాదులు డిమాండ్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు. దురభిప్రాయాలతో కూడిన వ్యాఖ్యలను చేయడమంటే ఒక వర్గం విషయంలోనో, ఒక వ్యక్తి విషయంలోనో తాము పక్షపాతంతో వ్యవహరించినట్టే అవుతుందని న్యాయమూర్తులు తప్పకుండా గ్రహించాలి. అటువంటి వ్యాఖ్యల వల్ల న్యాయమూర్తుల నైతిక ప్రాధాన్యం తగ్గిపోతుంది. న్యాయవ్యవస్థ పట్ల సాధారణ ప్రజానీకంగా నమ్మకం సన్నగిలిపోతుంది. ఈ న్యాయమూర్తి తమకు న్యాయం కలుగజేస్తారా అన్న అనుమానం కక్షిదార్లకు లేదా బాధితులకు కలుగుతుంది.
న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, తాము నిష్పక్షపాతంగా ఉన్నట్టు ప్రజలకు కనిపించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేయడం కంటే, న్యాయమూర్తుల్లో, న్యాయవాదుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పట్ల అవగాహన కలిగించడం అవసరం. తమ వ్యాఖ్యలు, తీర్పులు, రూలింగులు నిష్పాక్షికంగా, అందరినీ కలుపుకునిపోయే విధంగా, చట్టం ముందు అందరూ సమానులేనన్న ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా ఉన్నాయని న్యాయమూర్తులు ప్రజలకు చెప్పకనే చెప్పడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశంలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.