Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Kalam Salam: అబ్దుల్‌ కలాం నీ మానవత్వానికి సలాం

Kalam Salam: అబ్దుల్‌ కలాం నీ మానవత్వానికి సలాం

రామేశ్వరంలోని ధనుష్కోడిలో నిరుపేద జాలర్ల కుటుంబంలో పుట్టిన కలాం

‘మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన మొదటి శాస్త్రవేత్త మాత్రమే కాక అత్యధిక ఓట్లు సాధించిన మొదటి రాష్ట్రపతి. ఆ పదవికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తులలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. దేశ 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పదవిలో కొనసాగిన ఆయన నిరాడంబర జీవితం అసాధారణమైన వ్యక్తిత్వం ఎందరికో ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత దేశ క్షిపణి ప్రాజెక్టులైన పృథ్వీ, అగ్నిలను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి అత్యంత శ్లాఘనీయమైనది. అతను మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ప్రముఖ పాత్రపోషించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలో ఏర్పడిన స్తంభనను తొలగించడానికి ఉపయోగించే కరోనరీ స్టెంట్‌లను క్షిపణి మిశ్రమాలతో అభివృద్ధి చేసి 1990ల మధ్యకాలంలో వాటి ధరను రూ.55 వేల నుండి రూ.10 వేలకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని ధనుష్కోడిలో నిరుపేద జాలరుల కుటుంబంలో 15 అక్టోబర్‌ 1931న జన్మించిన అవుల్‌ పకీర్‌ జైనుల్‌ ఆబదీన్‌ అబ్దుల్‌ కలాం తన అకుంఠిత దీక్షాదక్షతలతో జాతి గర్వించదగ్గ రాష్ట్రపతిగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
నిరాడంబర జీవితం: 27 జూలై 2015న భారత మాజీ రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం మరణించే నాటికి ఆయన వద్ద కేవలం 2,500 పుస్తకాలు, ఒక చేతి గడియారం, ఆరు చొక్కాలు, నాలుగు ప్యాంట్లు, మూడు సూటు, ఒక జత బూట్లు మాత్రమే ఉండటం ఆయన నిరాడంబరతకు తార్కాణం. తుది శ్వాస వరకు కూడా ఆయన తాను రచించిన పుస్తకాలపై వచ్చే రాయల్టీ, ప్రభుత్వం నుండి పొందే పింఛనుతో అత్యంత సాధారణ జీవితం గడిపారు.
ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వం: తన ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా, ఆయన యువతరంతో పాటు పెద్దలను ఇట్టే ఆకర్షించే వారు. అతని కలం నుండి జాలువారిన వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ తో సహా అనేక పుస్తకాలు అత్యంత పాఠకాదరణ పొందడమే కాక అత్యధి కంగా అమ్ముడుపోయాయి. విద్యార్థులతో సమయాన్ని గడిపేం దుకు అమితంగా ఇష్టపడే ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఉపన్యాసాలు, సెమినార్లలో నిమగ్నమయ్యేవారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అబ్దుల్‌ కలాం అని ఆయనతో చిన్నపాటి అనుబంధం కలిగిన వారు కూడా నిస్సందేహంగా వెలిబుచ్చే అభిప్రాయం. 1979లో భారత సైన్యంలో చేరి భోపాల్‌లో ఎలక్ట్రికల్‌ మెకానిక్‌గా శిక్షణ పొందిన కథిరేశన్‌, మాజీ సైనికోద్యోగిగా 1980 చివరి దశకంలో హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ లాబొరేటరీలో అబ్దుల్‌ కలాం వద్ద డ్రైవర్‌గా చేరి దాదాపు ఐదున్నర సంవత్సరాలు సేవలందించారు.
కథిరేశన్‌ డిఆర్‌డిఎల్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తిరునల్వేలిలోని ముఖ్య విద్యాశాఖాధికారి కార్యాలయంలో సూపర్వైజర్‌గా చేరినట్లు అబ్దుల్‌ కలాంకు ఉత్తరం ద్వారా తెలియ చేయగా, అప్పటికే భారత రాష్ట్రపతి పదవిలో ఉన్న అయన ప్రత్యుత్తరం పంపడం మానవ సంబంధాలకు ఆయన ఇచ్చే విలువను సూచిస్తుంది. ఆ అపురూపమైన ఉత్తరం ఇప్పటికీ కథిరేశన్‌ వద్ద భద్రంగా ఉంది. తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన కొద్దిపాటి భూమిపై వచ్చే ఆదాయంతో, తన నుంచి డబ్బు ఆశించకుండానే తన భార్య కుటుంబాన్ని నడిపించగా తన జీతం పూర్తిగా చదువుకే ఖర్చుపెట్టారు ఆయన. డ్రైవర్‌గా తన పనివేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండడంతో సాయంత్రం తనకు చదువుకోవడానికి అనువుగా ఉండేదని, డిఆర్‌డిఎల్‌లోని ప్రతి ఒక్కరి నుండి తాను ప్రేరణ పొందానంటారాయన. ఒకప్పటి డ్రైవర్‌ స్థాయి నుండి నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి డా. అబ్దుల్‌ కలాం అందించిన తోడ్పాటు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అందుకు తాను ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని కథిరేశన్‌ కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఒకసారి దక్షిణ తమిళనాడులోని చిన్న పట్టణమైన విరుదునగర్‌లోని కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. సమీపంలోని గ్రామం నుండి ఆయనను కలవడం కోసం ఒక సందర్శకుడు కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో, సెక్యూరిటీ సిబ్బంది ఆ సందర్శకుడిని కళాశాల గేటు వద్దనే నిలిపేశారు. అబ్దుల్‌ కలాంను కలిసి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఆ సందర్శకుడు అక్కడ గేటు వద్దనే ఆయన బయటికి వచ్చే వరకు నిరీక్షించి ఆయన దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సందర్శకుడు గతంలో అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీలో డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన కథిరేసన్‌.
మూర్తీభవించిన మానవత్వం: 2006 జనవరి 20న ఒడిశా రాష్ట్రం, కేంద్రపారా జిల్లా ఖారినాశి గ్రామంలో అత్యంత పేదరికంతో జీవిస్తున్న త్రిపుర దాస్‌ అనే వ్యక్తి తన కుటుంబం ఎదుర్కొంటున్న ఇక్కట్లను వివరిస్తూ 2005లో సంభవించిన వరదల అనంతరం తాను జిల్లా యంత్రాంగంలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్‌ గా పని చేసినట్లు పేర్కొంటూ, స్పెషల్‌ రిలీఫ్‌ కమిషన్‌ కార్యాలయం, పోలీస్‌ శాఖలో ఖాళీలున్నట్లు తన దృష్టికి వచ్చిన దరిమిలా తనకు ఆ రెండు శాఖలలో ఎందులోనైనా ఉద్యోగం కల్పించాలని కోరుతూ 2006 జనవరి 20న లేఖ రాశారు. అందుకు తక్షణమే స్పందించిన అబ్దుల్‌ కలాం, త్రిపుర దాస్‌కు డ్రైవర్‌ ఉద్యోగం ఏర్పాటు చేయవలసిందిగా 2006 మార్చి 23న కేంద్ర పారా జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌కు ఉత్తరం పంపడంతో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. అదే విధంగా, మహాకాలా పాడ్‌ బ్లాక్‌ పరిధిలోని బడతోట గ్రామానికి చెందిన మరో యువకుడు తపన్‌ మండల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనే తన ఆశయ సాధనకు తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి అవరోధంగా మారిందని తెలియజేస్తూ అబ్దుల్‌ కలాంకి లేఖ రాయగా, తపన్‌కు ఉన్నత చదువులు అభ్యసించేందుకు రూ.66,000 విద్యాఋణం మం జూరు చేయవలసిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుండి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌కు ఆదేశాలు అందాయి. రాష్ట్రపతి కార్యాలయ చొరవతో విద్యా ఋణం పొంది ఎంసిఏ పూర్తిచేసిన అతను ఆ తరువాత బెంగళూరులోని యాక్సెంచర్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం పొందాడు.
భారత క్షిపణి పితామహుడు: తన క్షిపణి రక్షణ కార్యక్రమంతో భారతదేశం గర్వపడేలా చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం. భారత రాష్ట్రపతి పదవిని అధిరోహించక ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఏరో స్పేస్‌ ఇంజనీర్‌ గా పనిచేసిన ఆయన భారతదేశ మిస్త్స్రల్‌ మ్యాన్‌గా పేరుగాంచారు. ఆయన ప్రత్యేకించి బాలిస్టిక్‌ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధి కోసం అవిరళ కృషి చేసారు. ఆయన 1998లో భారతదేశం నిర్వహించిన పోఖ్రాన్‌ అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ అందుకు మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్‌ పై ఆయన గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో, 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. ఆయన భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్‌, రిలయన్స్‌ మొబైల్‌ భాగస్వామ్యంతో అవుట్‌ లుక్‌ మ్యాగ జైన్‌ నిర్వహించిన ది గ్రేటెస్ట్‌ ఇండియన్‌ పోల్‌ లో ఆయన రెండవ స్థానంలో నిలిచారు. విద్యార్థులకు బోధించడం ఆయనకు అత్యంత ప్రీతికరమైన వ్యాపకం. జూలై 27, 2015న తన 83వ సంవత్స రంలో భారత మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్‌ కలాం ఐఐఎం షిల్లాంగ్‌ లో ఉపన్యసిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. ఆయన స్వస్థలం రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియలకు జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది సామాన్య ప్రజలు విచ్చేసి నివాళులర్పించారు.

  • యేచన్‌ చంద్ర శేఖర్‌
    మాజీ రాష్ట్ర కార్యదర్శి
    8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News