Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Kaleswaram Telangana ATM: కాళేశ్వరం..తెలంగాణ ఏటీఎం

Kaleswaram Telangana ATM: కాళేశ్వరం..తెలంగాణ ఏటీఎం

తెలంగాణకు ‘ఎనీ టైమ్‌ మంచినీళ్లు’ ఇచ్చే ఏటీఎం

కాళేశ్వరమే లేకుంటే
ఈ నీళ్లెక్కడివి?
ఈ పంటలెక్కడివి?
ఈ ధాన్యం ఎక్కడిది?
ఈ భూములకు ఈ ధరలెక్కడివి?
అందుకే కాళేశ్వరం ఏటీఎం అన్న మాట నిజం. అది తెలంగాణ ఏటీఎం

- Advertisement -

తెలంగాణ ప్రజల, రైతులకు ‘ఎనీ టైమ్‌ మంచినీళ్లు’ ఇచ్చే ఏటీఎం
పాపం.. నలుగురు దివ్యాంగులు. పుట్టు గుడ్డివాళ్లు. వాళ్లకు ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందనే అనుమానం కలిగింది. ఒకరు చెప్తే కాకుండా తామే స్వయంగా తెలుసుకోవాలనుకున్నరు. ఎవరి సాయంతోనో ఒక ఏనుగు వద్దకు పోయారు. పాపం కండ్లు లేవు కదా! ఒకాయన ఏనుగు తోక పట్టుకున్నడు. ఇదేరా ఏనుగు అన్నడు. ఇంకొకాయన తొండం పట్టుకుని ఇదే ఏనుగు అన్నడు. మరొకాయన చేటంత చెవిని పట్టుకొని అదే ఏనుగన్నడు. వేరొకాయన మొగురంలాంటి కాలు పట్టుకుని అదే ఏనుగు అనుకున్నడు. ఎవరికి వాళ్లు తాము ఏనుగును చూశామనుకొని సంబురపడిపోయారు. ఇది చూపు లేనివాళ్ల సంగతి. కానీ, కళ్లుండీ చూడలేని కాంగ్రెస్‌, బీజేపీ నేతల తీరు అచ్చం ఇలాగే ఉంది.

లోకం తెల్వని యువ నాయకుడు రాహుల్‌గాంధీ బ్యాచ్‌, పేరు గొప్ప ప్రధాని మోదీ అండ్‌ టీమ్‌ను ఇలాగే అనుకోవాల్సి వస్తున్నది. మేడిగడ్డలో ఒక పిల్లర్‌ కుంగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే తెలుసుకున్న రాహుల్‌ బ్యాచ్‌, దాన్ని చూసేందుకు బారేజ్‌ మీదికి వెళ్లి, ఎక్స్‌పాన్షన్‌ గ్యాప్‌ను పగులు అనుకొని, తెలిసీ తెల్వక ఏదేదో మాట్లాడి అభాసుపాలయ్యారు. నెహ్రూ తర్వాత కాంగ్రెస్‌కు పెద్దగా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర లేదు కదా! కట్టడం సంగతి పక్కనబెడదాం… రాహులైతే ఇంత పెద్దవాటిని చూసి కూడా ఉండకపోవచ్చు! ఇక మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా పంపిన బృందం, రెండు గంటల పాటు ఒక బారేజ్‌ మీద తిరిగి, నాలుగు గంటల సమీక్ష చేసి, రాష్ట్ర ప్రభుత్వం వివరాలివ్వలేదంటూనే 43 పేజీల తీర్పు రాసి పారేసింది. ఆత్రం ఎక్కువైతే ఇలాంటి సిత్రాలే బయటకు వస్తాయి.

ఇంతకీ కాళేశ్వరమంటే ఒక పిల్లరా? ఒక బరాజా? ఒక రిజర్వాయరా? ఒక పంప్‌హౌజా? ఒక సర్జ్‌పూలా? ఏంటిది కాళేశ్వరమంటే? కాళేశ్వరమంటే వీటిలో ఏ ఒక్కటీ కాదు. ఇలాంటి అనేక నిర్మాణాల సమాహారం అది. ఒక ప్రాజెక్టు కాదు. పాత, కొత్త పలు ప్రాజెక్టుల సమూహం (ఇంటిగ్రేషన్‌). మూడు పెద్ద బరాజ్‌లు (మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం), మూడు నదీగర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్‌హౌజ్‌లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1,531 కిలోమీటర్ల పొడవైన కాల్వలు, ప్రపంచమే కనీవినీ ఎరుగని బాహుబలి మోటార్ల పంపుహౌజ్‌లు ఇన్ని కలిస్తే దాని పేరు కాళేశ్వరం. దీన్ని ఒక్క ప్రాజెక్టు అనొద్దు. ఇది మిషన్‌ కాళేశ్వరం. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న తాగునీటి, సాగునీటి పారుదల వ్యవస్థలోని ప్రతి పాత ప్రాజెక్టును, చెరువును, చెక్‌డ్యామును, వాగును గొలుసుకట్టు పద్ధతిలో కలిపి, వాటన్నింటికీ 365 రోజులు నీళ్లు సరఫరా చేసేలా రూపొందించిన డిజైన్‌ కాళేశ్వరం. మేడిగడ్డకు పోయి, పావుగంట సేపు గడిపి, పిల్లర్‌కాని పిల్లర్‌ను, పగులు కాని పగులును చూస్తే అర్థమయ్యేది కాదు కాళేశ్వరం. అన్ని లింక్‌లు అనుసంధానమై ఉన్నట్లు కనిపించినా, ఏ లింక్‌కు ఆ లింక్‌ స్వతంత్రంగా సేవలందించ గల గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. కళ్లు, చేతులు, తల, ముక్కూ మొహం అన్నీ కలిస్తేనే శరీరం. లింకులన్నీ కలిస్తేనే కాళేశ్వరం.

కేంద్ర సర్కారు నుంచి, కేంద్ర జల సంఘం నుంచి, ప్రపంచ ప్రముఖుల నుంచి పలు ప్రశంసలు అందుకున్న, నాలుగేండ్లుగా చరిత్రకందని గోదావరి వరదలను, డిజైన్‌కు మించిన సామర్థ్యంతో తట్టుకుని నిలబడ్డ కాళేశ్వరంపై ఎన్నికల సమయంలోనే ఎందుకు రచ్చ జరుగుతున్నది? ఎన్నికల సమయంలోనే ఆగమేఘాల మీద రిపోర్టులు ఎందుకు వస్తున్నాయి? ఇదీ ఆలోచించాల్సిన ప్రశ్న.

లక్ష్మీ బరాజ్‌ (మేడిగడ్డ) నుంచి సరస్వతి బరాజ్‌ (అన్నారం). అక్కన్నుంచి పార్వతి బరాజ్‌ (సుందిల్ల). అక్కన్నుంచి ఎల్లంపల్లి జలాశయం. ఎల్లంపల్లి నుంచి రెండు దశల్లో ఎత్తిపోతల ద్వారా ఒకవైపు శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి. మరోవైపు వరద కాల్వ ద్వారా శ్రీరాజరాజేశ్వరి జలాశయం (మిడ్‌మానేరు)కు. మిడ్‌మానేరు నుంచి ఒకవైపు లోయర్‌ మానేరు… మరోవైపు కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ జలాశయం – రంగనాయకసాగర్‌ – మల్లన్నసాగర్‌ – కొండపోచమ్మసాగర్‌. స్థూలంగా ఇదీ కాళేశ్వరంలోని పలు ప్రాజెక్టుల అనుసంధానం.

మేడిగడ్డ నుంచి జలాలను తరలించాల్సిన అవసరం లేకున్నా.. అక్కడ సాంకేతిక ఇబ్బందులు వచ్చినా… అన్నారం, లేకపోతే సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించుకోవచ్చు. ఎల్లంపల్లికి పుష్కలంగా వరద ఉంటే… దిగువన ఉన్న మూడు బరాజ్‌ల నుంచి లిఫ్టు అవసరం లేకుండానే ఎస్సారెస్పీ, మిడ్‌మానేరుకు నీటిని తరలించవచ్చు. ఎస్సారెస్పీ ద్వారానే దిగువకు వరద ఉంటే… మిడ్‌మానేరు నుంచి అటు లోయర్‌ మానేరు… ఇటు అన్నపూర్ణ జలాశయం – రంగనాయకసాగర్‌ – మల్లన్నసాగర్‌ – కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలించుకోవచ్చు. అంటే ఏ లింకుకు ఆ లింకునే ఒక ప్రాజెక్టుగా రూపకల్పన చేయడంతో ఎక్కడ లోపం తలెత్తినా, అవసరం లేకున్నా, మిగిలిన లింకుల్లో నీటి సరఫరా యథాతథంగా జరుగుతుంది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద సాంకేతిక లోపం ఉన్నందున అన్నారం- సుందిళ్ల నుంచి నీళ్లు తరలించుకోవచ్చు. ఒకవేళ ఎల్లంపల్లికే మంచి వరద ఉంటే అక్కడినుంచే కొండపోచమ్మ సాగర్‌ వరకు గోదావరిని ఎత్తిపోసుకోవచ్చు.

ఇవేవీ తెలియనివారు ఇగురం చెప్తున్నారు. చిన్న సమస్యపై పెద్ద హంగామా చేస్తున్నారు. సందు దొరికిందని సంబురపడిపోతున్నారు. కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు పనయిపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని చంకలు గుద్దుకుంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నరు. నిజానికి ఇబ్బంది తలెత్తింది మేడిగడ్డ వద్దనే. ఆ బరాజ్‌ నిర్మాణానికి వెచ్చించింది సుమారు రూ.1800 కోట్లు. దీన్ని కట్టిన కంపెనీయే ఐదేండ్ల పాటు నిర్వహణ కూడా చూస్తుంది. అంటే బరాజ్‌కు ఏ సమస్య వచ్చినా కంపెనీదే బాధ్యత. ప్రజాధనం మీద శ్రద్ధ ఉన్నది కనుకే కేసీఆర్‌ ఇలాంటి పకడ్బందీ షరతులతో ఒప్పందాలు చేసుకున్నారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞానికి దిగి ఢిల్లీకి మూటలు పంపలేదు.

ఆరు దశాబ్దాల పాటు అధికార వైభోగాన్ని అనుభవించి, వలస పాలకులు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నప్పుడైనా తెలంగాణ రైతులు కరువు కాటకాల్లో మగ్గిపోతున్నప్పుడైనా, తెలంగాణ రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేస్తున్నప్పుడైనా, ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణ పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడైనా, ఎన్నడైనా వచ్చి ఒక్క ఓదార్పు మాట చెప్పని కాంగ్రెస్‌ పెద్దలు ఇప్పడు ఎన్నికల సమయంలో, ఓట్ల కోసం హెలికాప్టర్లు వేసుకొని మరీ వస్తున్నారు.

డిజైన్లలో లోపం అని సూపర్‌ ఇంజినీర్‌ కిషన్‌రెడ్డి కొత్త లాజిక్‌ లేవదీశారు. కేంద్ర జల సంఘానికి చెందిన జాతీయ సాంకేతిక సలహా మండలి కాళేశ్వరం డిజైన్లను సమగ్రంగా పరిశీలించి ఆమోదించింది. అలాంటప్పుడు డిజైన్లలో లోపం ఉంటే ఆ తప్పు ఎవరిది? డిజైన్‌ మాన్యువల్స్‌, కోడ్స్‌ రూపొందించిన కేంద్ర సంస్థలదా?

ఇక కొత్తగా నామాలు పెట్టుకున్న పాత గులాబీ నాయకుడొకరు, తొందర తొందరగా, ఆదరాబాదరాగా కట్టడం వల్లే సమస్య వచ్చిందని సూత్రీకరించారు. కాళేశ్వరం కట్టినప్పుడు ఆయన ఇదే ప్రభుత్వంలో మంత్రి. ఇలా ఆదరా బాదరాగా కట్టడం మంచిది కాదనీ, దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఎన్నడైనా అన్నారా? కనీసం క్యాబినెట్‌ సమావేశాల్లో తన అభిప్రాయం చెప్పారా? మిగిలినవారు అంగీకరించకపోతే డిసెంట్‌ నోట్‌ రాశారా? ‘సరిగా నిర్మించడం లేదు. నేను డబ్బులు విడుదల చేయను’ అని ఆర్థికమంత్రిగా ఎన్నడైనా అడ్డం పడ్డారా? లేదు. కేసీఆర్‌ అప్పుడు ప్రాజెక్టు కట్టే పనిలో బిజీగా ఉంటే, వారు భూములు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. అందువల్ల వారికివేవీ పట్టలేదు. ఇప్పుడు పార్టీ మారారు కనుక, తగుదునమ్మా అని బండ రాళ్లేసుకొని బండి కట్టుకుని బయల్దేరారు.

అవును. కేసీఆర్‌ తొందరపెట్టారు. నిజంగా తొందరపెట్టారు. వేగంగా కట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను బతిమిలాడి పనిచేయించారు. మంత్రి హరీశ్‌రావును అదే పనిమీద పొద్దూ మాపూ ఉరికించారు. ఎందుకు? ఇదే కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ 60 ఏండ్ల పాటు తెలంగాణను ఎండబెడ్తే, వాగులు, వంకలల్ల తుమ్మలు మొలిస్తే, పంట పొలాల్లో పల్లేర్లు కాస్తే, శవ స్నానాలకూ నీళ్లు లేకపోతే, భూగర్భ జలాలు అడుగంటిపోతే, బోర్లతో భూమి తల్లికి పొక్కలు పొడిచినా చుక్క నీరు తగలకపోతే, మన కండ్లల్లోంచి నీళ్లకు బదులు ఏండ్లకేండ్లు రక్తం కారితే, కండ్లల్లో దుమ్మే తప్ప దమ్ము లేకుండా పోతే చూడలేక, తన ప్రజలకు వీలైనంత తొందరగా నీళ్లందించాలనే తాపత్రయంతో కేసీఆర్‌ వేగంగా అన్ని అనుమతులు తెచ్చుకొని, పొరుగు రాష్ర్టాలను ఒప్పించి, ఒప్పందాలు చేసుకొని కాళేశ్వరం కట్టించారు. అది కూడా తప్పేనా? మూడేండ్లలో కేసీఆర్‌ కాళేశ్వరం కట్టడం తప్పు… 60 ఏండ్లుగా కాంగ్రెస్‌ తెలంగాణను ఎండబెట్టడం రైటా?

ఒక్క కాళేశ్వరాన్నే కాదు; కాంగ్రెస్‌ వాళ్లు ముడుపుల కోసం మొదలుపెట్టి, నడిమధ్యలో ఆపేసిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు… తదితర పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్‌ రెండేండ్లలోనే పూర్తిచేశారు. అనుమతులున్నా లేకున్నా, కోర్టు కేసులతో అడ్డుకున్నా, మారుపేరు పెట్టి, మాయోపాయాలు చేసి పాలమూరు ఎత్తిపోతలనూ ఒక దారికితెచ్చారు. గోదావరిలో నీళ్లే అందనిచోట దేవాదుల ఇన్‌టేక్‌ వెల్‌ తవ్వితే, దానికి నీళ్ల కోసం ఆగమేఘాల మీద సమ్మక్క బరాజ్‌ కడుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రజల, పొలాల దాహార్తి తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. కాళేశ్వరంలో 148 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిపితే ఎక్కడా చిన్న సమస్య లేదు. సంఘటనా లేదు.

కాళేశ్వరంలో మొత్తమ్మీద 228 పిల్లర్లు నిర్మిస్తే, సమస్య వచ్చింది ఒక్క పిల్లర్‌ వద్ద! భారీ ప్రాజెక్టులన్న తర్వాత ఇటువంటి బాలారిష్టాలు సహజం.

మనం కొత్త ఇల్లు కట్టుకుంటాం. ఎంతమంచిగ కట్టినా ఎయిర్‌క్రాకులు రావా? అక్కణ్నో ఇక్కణ్నో ఉరువదా? అట్లని పెట్టిన డబ్బంత ఖతమే అనుకుంటమా? ఇల్లే కట్టకుండ ఉంటే బాగుండని ఊర్కుంటమా?

కాంగ్రెస్‌ హయాంలోలాగా బీఆర్‌ఎస్‌ ఒక్కో ప్రాజెక్టును దశాబ్దాల పాటు, ముగ్గురు, నలుగురు ముఖ్యమంత్రులు మారే వరకు చేయలేదు. ఒకే ఒక్క టర్మ్‌లో పూర్తిచేసి, రైతాంగానికి ఫలాలు అందించింది. తెలంగాణ ప్రజల కోసం, రైతుల కోసం కేసీఆర్‌ పట్టుబట్టి, మూడేండ్లలోనే గోదావరిపై సంక్లిష్టమైన మూడు బరాజ్‌ నిర్మాణాలను పూర్తి చేశారు.

ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగనట్లుగా, అసలు తమ హయాంలో పెచ్చులు కూడా ఊడనట్లుగా కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు చేస్తున్న హంగామా చూస్తుంటే గురివింద గింజలు సిగ్గుపడుతున్నాయి.
కాంగ్రెస్‌ హయాంలో 1963లో పనులు మొదలై, 14 ఏండ్ల పాటు సాగిన శ్రీరాంసాగర్‌ 1977లో అందుబాటులోకి వచ్చింది. 120 టీఎంసీల నీటి నిల్వతో ప్రాజెక్టు చేపడితే, పట్టుమని పదేండ్లు గడవక ముందే, పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. సాక్షాత్తూ ఏపీఈఆర్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చి ల్యాబరేటరీ) అధ్యయనం చేసి ఈ సంగతి తేల్చింది. ఇప్పుడు ఆ మాత్రం నిల్వైనా ఉందా అన్నది అనుమానమే! మేడిగడ్డను పునరుద్ధరించగలం. మరి ఎస్సారెస్పీలో పూడిక తీయగలమా? దాని వాస్తవ నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించగలమా? ఇదీ డిజైన్‌ లోపమంటే!

కాంగ్రెస్‌ హయాంలో మొదలుపెట్టి, సగంలోనే వదిలివేసిన కల్వకుర్తి ఎత్తిపోతల్లో, మోటర్లు ఆన్‌ కాకముందే, ఎల్లూరు పంపుహౌజ్‌ల్లోకి వరద వచ్చి మునిగిపోయింది. దీంతో కాంగ్రెస్‌ సర్కారు చేతులెత్తేసింది. ఇదీ తెలివి లేకుండా కట్టడమంటే! కాళేశ్వరం పంపుహౌజ్‌ మునిగితే నానా రాద్ధాంతం చేసినవాళ్లు దీనికేమంటారు? కాంగ్రెస్‌కు చేతకాక వదిలేస్తే, పెండింగ్‌ ప్రాజెక్టుగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రన్నింగ్‌ ప్రాజెక్టుగా మార్చింది. తొందర అని తప్పుబడుతున్న కాంగ్రెస్‌.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో, 2008 నుంచి 2014 వరకు. ఒక్క బరాజ్‌నైనా ఎందుకు కట్టలేకపోయింది. కావాల్సినంత సమయం ఉన్నది కదా! మూతి (బరాజ్‌) దగ్గర తట్టెడు మట్టి ఎత్తిపోయకుండా, తోక దగ్గర, అంటే చేవెళ్ల దగ్గర సొరంగం, కాల్వల నిర్మాణాలు చేపట్టి… దాదాపు రూ.7500 కోట్లు ఖరాబు చేయలేదా? ఇదీ ప్రజాధనం వృథా అంటే! కాంగ్రెస్‌ హయాంలో తుమ్మలు మొలిచిన ఆ కాల్వలన్నింటినీ కేసీఆర్‌ కాళేశ్వరంతో వినియోగంలోకి తీసుకువచ్చారు.

కాంగ్రెస్‌ వందల కోట్లు ఖర్చుపెట్టి కట్టిన ప్రాజెక్టు దేవాదుల. దీని ఇన్‌టేక్‌ లెవల్‌ను 71 మీటర్లుగా నిర్ణయించి, ఏడాదిలో 170 రోజుల పాటు మోటార్లకు నీటి లభ్యత ఉంటుందన్నారు. మరి ఏమైంది? కనీసం 17 రోజులైనా అక్కడ నీటి లభ్యత ఉన్నదా? ఇదీ అసలైన నిర్మాణ లోపం అంటే! తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ దేవాదులకు ఏడాది పొడవునా నీరందేలా సమ్మక్క బరాజ్‌ (తుపాకులగూడెం) నిర్మిస్తున్నారు.

కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన పాలెంవాగు 2008లో ఒక సీజన్‌ వరదకే ఏకంగా కొట్టుకుపోయింది. మళ్లీ కడితే, ఏడాది తిరిగేలోపు 2009లో చిత్రంగా అదే తేదీన మళ్లా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎర్త్‌బండ్‌ ఎందుకు కొట్టుకుపోయిందో.. రాహుల్‌ ఒక్కసారి పక్కకు తిరిగితే ‘గుత్తేదారు సోదరులు’ చెప్పేవారు. కాకతీయ కాల్వ తవ్వి నీళ్లొదలగానే 118 కిలోమీటరు, 131 కిలోమీటరు వద్ద నిర్మాణాలు కొట్టుకుపోయాయి. 1998లో వరద వచ్చి శ్రీశైలం కుడి పవర్‌ప్లాంట్‌, 2014లో జూరాలకు వరద వచ్చి పవర్‌హౌజ్‌ మునిగిపోయాయి. ఇదీ చరిత్ర.

ఇక గత 22 ఏండ్లుగా మోదీ ప్రత్యక్ష, పరోక్ష పరిపాలనలో ఉన్న గుజరాత్‌లో కడుతున్న వంతెనలు కడుతున్నట్టే కూలిపోతున్నాయి. నిర్మాణంలో ఉన్న డ్యామ్‌లు కొట్టుకుపోతున్నాయి. కిందటేడాది అక్టోబర్‌లో జరిగిన మోర్బీ తీగల వంతెన దుర్ఘటనలో 135 మంది మరణించారు. గడిచిన 14 నెలల్లోనే ఒక్క గుజరాత్‌లోనే ఏకంగా తొమ్మిది బ్రిడ్జిలు కూలిపోయాయంటే అక్కడి బీజేపీ ప్రభుత్వం పనితీరును అర్థం చేసుకోవచ్చు. అంతవరకెందుకు ప్రధాని మోదీ కలల ప్రాజెక్టుగా చెప్పుకొనే నర్మదా కెనాల్‌కు ఇప్పటికే పలుమార్లు గండిపడింది. ఘనత వహించిన కేంద్రప్రభుత్వం అద్భుత నిర్మాణమంటూ కితాబిచ్చిన ముంబై-నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మీద రోజుకు కనీసం మూడు ప్రమాదాలు సంభవిస్తున్నాయంటే ఎంత అద్భుతంగా డిజైన్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ప్రాజెక్టుల్లో సమస్యలు ఒక్క తెలంగాణలోనేనా? ఇంకెక్కడా రాలేదా? గంగానదిపై కట్టిన ఫరక్కా బరాజ్‌, గోదావరిపై నిర్మించిన కాటన్‌ బరాజ్‌, కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బరాజ్‌లో కూడా పిల్లర్ల్ల కుంగుబాటు సమస్యలు వచ్చాయి. వాటిని ఇంజినీర్లు సర్దుబాటు చేశారు. అయినా ఎక్కడా కాని రచ్చ, ఇక్కడే! ఎందుకు? అప్పుడు ఇటువంటి రాజకీయ నాయకులు లేరు. ఇట్లా ఎన్నికల కోసం సర్కారీ విభాగాలను, సంస్థలను వాడే కేంద్ర ప్రభుత్వమూ లేదు! అక్కసుతో అగడు పడ్డట్టు ఎగిరే విపక్షాలూ లేవు. ఇక్కడ మన విపక్ష నాయకులు చాలా తెలివైనవారు కదా! ప్రజల్ని, వారి ప్రాణాలను, ప్రాంత ప్రయోజనాలను బలిపీఠంపైకి ఎక్కించైనా సరే, ఓట్ల రాజకీయం చేయడంలో సిద్ధహస్తులు. తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో నీళ్లు, రైతులు, ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు వస్తే, అక్కడి రాజకీయ నాయకులు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా కలసికట్టుగా పోరాడుతారు. ప్రజలకు, ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తారు. కానీ ఇక్కడ? ఏం చేస్తాం… మన దౌర్భాగ్యం!

కాంగ్రెస్‌ హయాంలోలాగా బీఆర్‌ఎస్‌ ఒక్కో ప్రాజెక్టును దశాబ్దాల పాటు, ముగ్గురు, నలుగురు ముఖ్యమంత్రులు మారే వరకు చేయలేదు. ఒకే ఒక్క టర్మ్‌లో పూర్తిచేసి, రైతాంగానికి ఫలాలు అందించింది. తెలంగాణ ప్రజల కోసం, రైతుల కోసం కేసీఆర్‌ పట్టుబట్టి, మూడేండ్లలోనే గోదావరిపై సంక్లిష్టమైన మూడు బరాజ్‌ నిర్మాణాలను పూర్తి చేశారు. నాలుగు సీజన్లలో డిజైన్‌కు మించి వరద వచ్చినా, గోదావరికి చరిత్రలోనే అతిపెద్ద వరద వచ్చినా అవి తట్టుకొని నిలబడ్డాయి. పిల్లర్‌ కుంగుబాటు ఒక సాంకేతిక సమస్య. దాన్ని ఇంజినీర్లు పరిష్కరిస్తారు. దానికే మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడమంటే తెలంగాణ ఇంజినీర్లను, వారి కష్టాన్ని అవమానించడమే.

కాళేశ్వరమంటే ఒక పిల్లర్‌ మాత్రమే కాదు. ఒక బరాజ్‌ అంతకంటే కాదు. కాళేశ్వరమంటే తెలంగాణ. నడి ఎండల్లో ప్రతి చెరువూ, చెక్‌డ్యాము నిండి ఉన్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. ప్రతి వాగూ పారుతున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. పొరుగున ఉన్న నాందేడ్‌, చంద్రాపూర్‌, బల్లార్షాల్లో కరువు తాండవమాడుతుండగా, తెలంగాణ పచ్చగ పండుతున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. 23 లక్షల బోరుబావులకు భూమి తల్లి 24 గంటలూ నీటిని ఎగదన్ని ఇస్తున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం.

కాళేశ్వరమంటే ఒక పిల్లర్‌ మాత్రమే కాదు. ఒక బరాజ్‌ అంతకంటే కాదు. కాళేశ్వరమంటే తెలంగాణ. నడి ఎండల్లో ప్రతి చెరువూ, చెక్‌డ్యాము నిండి ఉన్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. ప్రతి వాగూ పారుతున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. పొరుగున ఉన్న నాందేడ్‌, చంద్రాపూర్‌, బల్లార్షాల్లో కరువు తాండవమాడుతుండగా, తెలంగాణ పచ్చగ పండుతున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. 23 లక్షల బోరుబావులకు భూమి తల్లి 24 గంటలూ నీటిని ఎగదన్ని ఇస్తున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. ఎన్నడో తవ్విన ఎండిపోయిన కాల్వలు జలధారలుగా మారినయంటే అందుకు కారణం కాళేశ్వరం. ప్రతి ఇంట్లో గోదావరి పుణ్యస్నానాలు సాగుతున్నయంటే అందుకు కారణం కాళేశ్వరం. మహానగరం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి గొంతుకా సమృద్ధిగా నీళ్లు తాగుతున్నదంటే అందుకు కారణం కాళేశ్వరం. పొద్దంతా కష్టపడి ఇంటికొచ్చిన రైతన్న కంటి నిండా నిద్ర పోతున్నడంటే అందుకు కారణం కాళేశ్వరం. బీదాబిక్కీ కడుపునిండా తిండి తింటున్నరంటే అందుకు కారణం కాళేశ్వరం. వ్యవసాయం తెల్వదని వెక్కిరింపులకు గురైన తెలంగాణ మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించి అన్నపూర్ణగా నిలిచిందంటే అందుకు కారణం కాళేశ్వరం.

పాతాళ భువి నుంచి మల్లన్న-పోచమ్మ దివిలోకి ఎగిసివచ్చిన సుర ఝరి కాళేశ్వరం. గోదారి గంగ తాండవాన్ని ఒడిసిపట్టిన శివుని జటాఝూటం కాళేశ్వరం. తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చిన నదీమతల్లి నట విన్యాసం కాళేశ్వరం. బీళ్లు విచ్చిన, నెర్రెలు వారిన తెలంగాణ నేలను ఆర్తిగా తడిపిన జలధార కాళేశ్వరం. తెలంగాణ రైతుల గుండెల్లో బతుకు ఆశలు మొలిపించిన అమృత భాండం కాళేశ్వరం. తెలంగాణ పొలాల్లో బంగారు రాశులు పూయించిన సువర్ణ కలశం కాళేశ్వరం. కాంగ్రెస్‌, బీజేపీ పాత పాపాలను కడిగిన పవిత్ర గంగ కాళేశ్వరం… డాక్టర్‌ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ & ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News