Homeఎడిటోరియల్ / బహుళKamala Sohonie: శాస్త్రీయ విభాగంలో పీహెచ్‌డీ.. తొలి భారతీయురాలిగా కమలా సోహోనీ రికార్డు

Kamala Sohonie: శాస్త్రీయ విభాగంలో పీహెచ్‌డీ.. తొలి భారతీయురాలిగా కమలా సోహోనీ రికార్డు

Kamala Sohonie sets record as the first Indian woman: స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళలకు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. సామాజిక కట్టుబాట్లు, కుటుంబ ఆచార వ్యహారాలతో పాటు పరిపాలనా బాధ్యతల నిర్వహణ కోసం పురుషులకు విద్యనందించేందుకు ప్రాధాన్యతనిచ్చిన బ్రిటిష్ వలస పాలకుల విధానాల కారణంగా, 1947 నాటికి మహిళా అక్షరాస్యత రేటు 8 శాతం కంటే తక్కువగా ఉండేది. అయితే, ఆ సవాళ్ళను, అడ్డంకులను అధిగమించి మహిళలు కూడా పురుషులతో సమానంగా శాస్త్రసాంకేతిక రంగాలలో రాణించగలరని నిరూపించిన శాస్త్రవేత్తలలో శాస్త్రీయ విభాగంలో పీహెచ్‌డీ పొందిన మొదటి భారతీయ మహిళ అయిన కమలా సోహోనీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. చెరుకు వంగడాలను సృష్టించిన వృక్ష శాస్త్రవేత్త జానకీ అమ్మాళ్, భారత అణు కార్యక్రమ పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ భాభా మెచ్చిన భౌతిక శాస్త్రవేత్త బీభా చౌధురి, స్వదేశీ వాతావరణ పరికరాల రూపకల్పన, తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి మార్గం సుగమం చేసిన అన్నా మణి, 1930వ దశాబ్ధంలో భారతదేశంలో డాక్టరేట్ ఆఫ్ సైన్స్ సంపాదించిన రెండో మహిళగానే కాక ప్రాణాలను కాపాడే మలేరియా నిరోధక, కీమోథెరపీ మందుల అభివృద్ధికి సహకారం అందించిన అసిమా ఛటర్జీలు ప్రముఖులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

అడ్మిషన్ నిరాకరించిన సర్ సివి రామన్..

1933లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలైన తరువాత, కమల భారతదేశపు ప్రముఖ శాస్త్రీయ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి), బెంగళూరులో చదవాలని కలలు కన్నారు. కానీ ఆమె దరఖాస్తును సాక్షాత్తు నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త, నాటి సంస్థ డైరెక్టర్ సర్ సివి రామన్ ఆమె ఒక మహిళ అన్న ఏకైక కారణంతో తిరస్కరించారు. తన కోర్సును డిస్టింక్షన్‌తో పూర్తి చేస్తానని కమల హమీ ఇచ్చినప్పటికీ ఆయన ఆమె అభ్యర్థనకు ఒప్పుకోలేదు. అప్పుడు ఆమె రామన్ కార్యాలయంలో సత్యాగ్రహానికి దిగడంతో సీవీ రామన్ దిగిరాక తప్పలేదు. రెగ్యులర్ అభ్యర్థిగా చేర్చుకోకపోవడంతో ఆమె తన గైడ్ సూచనల మేరకు రాత్రుళ్లు ఆలస్యంగా పనిచేయాల్సి వచ్చింది. ఒక సందర్భంలో ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఎస్ఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో కమల ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “రామన్ గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ, ఆయన చాలా సంకుచిత మనస్తత్వం కలవారు. నేను ఒక మహిళను అయినందుకే ఆయన నాతో ప్రవర్తించిన తీరును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయినప్పటికీ, రామన్ నన్ను రెగ్యులర్ విద్యార్థినిగా చేర్చుకోలేదు. ఇది నాకు చాలా అవమానకరం. ఆ సమయంలో మహిళల పట్ల పక్షపాతం చాలా తీవ్రంగా ఉండేది. ఒక నోబెల్ బహుమతి గ్రహీత కూడా అలా ప్రవర్తిస్తే ఇంకేం ఆశించగలం?” అని ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బయోకెమిస్ట్రీలోని దిగ్గజాల రచనలను అధ్యయనం చేయడంతో పాటు కొందరికి ఆమె లేఖలు కూడా రాశారు. ఆమె పాలు, పప్పుధాన్యాలలో ఉండే ప్రోటీన్లపై అధ్యయనం చేశారు. ఆ సమయంలో భారతదేశంలో పోషకాహార సమస్యల కారణంగా ఈ అంశానికి ప్రాముఖ్యత ఉండేది. పప్పుధాన్యాలలో ప్రోటీన్ల లక్షణాలను వివరించిన మొదటి వ్యక్తి కమలా. కమల 1936లో తన పరిశోధనను సమర్పించి, బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి పట్టా పొందారు.బొంబాయిలోని హాఫ్కిన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ టెస్టింగ్‌లో కొద్దికాలం పనిచేసిన తరువాత, ఆమె 1937లో యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.

శాస్త్రీయ రంగంలో పీహెచ్‌డీ చేసిన మొదటి మహిళ..

ఆధునిక ప్రమాణాలతో పోలిస్తే 1930వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా మహిళా అక్షరాస్యత రేట్లు సాధారణంగా చాలా తక్కువగా ఉండేది. 1931 జనాభా లెక్కల ప్రకారం కేవలం 2.9 శాతం మహిళలు మాత్రమే అక్షరాస్యులు. అయితే, డాక్టర్ కమలా సోహోనీ 1939లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డాక్టరేట్‌ను పూర్తి చేసి, శాస్త్రీయ రంగంలో పీహెచ్‌డీ సంపాదించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించి తరువాతి తరం మహిళలకు ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆమె పట్టుదల, శాస్త్రీయ కృషి భారతీయ విజ్ఞాన శాస్త్రంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేశాయి. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఆమె చూపిన దృఢత్వం, అడ్డంకులను ఛేదించి ఆమె సాధించిన విజయాలు విజ్ఞానశాస్త్రంలో భవిష్యత్ తరాల మహిళలకు స్ఫూర్తినిచ్చాయి. 1937లో యునైటెడ్ కింగ్‌డమ్‌ చేరుకున్న ఆమె కేంబ్రిడ్జ్‌లోని బయోకెమికల్ అండ్ ఫిజియలాజికల్ లాబొరేటరీలో, ప్రఖ్యాత న్యూరోకెమిస్ట్ డెరెక్ రిక్టర్ బృందంలో చేరి ఆయన అక్కడినుండి వెళ్ళిన తర్వాత, రాబిన్ హిల్ పరిశోధనా ప్రయోగశాలలో చేరారు. ఆమె పనితీరుకు ముగ్ధులైన ఆమె గురువులు, ప్రొఫెసర్ ఫ్రెడ్రిక్ జి హాప్కిన్స్‌తో కలిసి పనిచేయడానికి ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోమని సూచించారు. ప్రొఫెసర్ హాప్కిన్స్ ఒక నోబెల్ బహుమతి గ్రహీత. ఆహారంలో విటమిన్ల ప్రాముఖ్యత గురించి ఆయన చేసిన ఆవిష్కరణలు జీవరసాయన శాస్త్రం, పోశాకాలపై మనకున్న జ్ఞానాన్ని విప్లవాత్మకంగా మార్చాయి. ఆమె ఆ ఫెలోషిప్‌ను దక్కించుకొని 1939లో ఎటువంటి షరతులు లేకుండా ఆ కార్యక్రమంలోకి తీసుకోబడింది. హాప్కిన్స్ ప్రోత్సాహంతో, 16 నెలల లోపే, సాధారణంగా వందల కొద్దీ పేజీలు ఉండే థీసిస్‌కి భిన్నంగా ఆమె తన పీహెచ్‌డీ డిగ్రీ కోసం, కేవలం 40 పేజీలతో మొక్కల కణజాల శ్వాసక్రియలో సైటోక్రోమ్ సి ఉనికిని వివరిస్తూ ఒక థీసిస్‌ను సమర్పించారు. అది సమీక్షా కమిటీని అమితంగా ఆకట్టుకోవడంతో 27 సంవత్సరాలకే సైన్స్‌లో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయ మహిళగా కమల సోహోనీ చరిత్ర సృష్టించారు.

అమెరికా ఫార్మా కంపెనీల నుంచి ఆఫర్లు..

వెనువెంటనే కమలకు అమెరికా ఫార్మా కంపెనీల నుండి అద్భుతమైన ఆఫర్లు రావడం ప్రారంభమైనప్పటికీ, మహాత్మా గాంధీకి వీరాభిమాని అయిన ఆమె. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయవాద పోరాటంలో సహాయపడాలని ఆకాంక్షించి 1939లో స్వదేశానికి తిరిగి వచ్చారు. స్వాతంత్రోద్యమ ర్యాలీలలో పాల్గొన్న ఆమె తన ఆభరణాలను సైతం విరాళంగా ఇవ్వడంతో పాటు కేవలం ఖాదీ చీరలను మాత్రమే ధరించారు. 1939 నుండి 1942 వరకు ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో పనిచేసిన తర్వాత, ఆమె కూనూరులోని న్యూట్రిషన్ రీసెర్చ్ ల్యాబ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. అక్కడ ఆమె పోషణలో విటమిన్ల పాత్రపై పరిశోధనలు నిర్వహించారు. అక్కడ ఆమె వృత్తిరీత్యా యాక్చువరీ అయిన ఎం. వి. సోహోనీని వివాహం చేసుకుని, 1947లో ముంబైకి తరలివెళ్లారు. మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో బయోకెమిస్ట్రీ విభాగాన్ని ప్రారంభించి, ఆమెను బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా నియమించింది. ఆమె తన విద్యార్థులను వరి, పాలు, పప్పుధాన్యాలు వంటి గ్రామీణ భారతీయులు ఉపయోగించుకోగల ఉత్పత్తుల పోషక విలువలు, జీర్ణశక్తిపై పరిశోధన చేయమని ప్రోత్సహించి, ప్రేరేపించారు. ఆమె పరిశోధనా విద్యార్థులలో చాలామంది ఆ తర్వాత ప్రముఖ శాస్త్రవేత్తలుగా ఎదిగారు. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తాటి రసంతో తయారుచేసే సాంప్రదాయ పానీయమైన ‘నీరా’ యొక్క పోషక విలువలపై అధ్యయనం చేయమని ఆమెను కోరారు. ఇది పిల్లల ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుందని, గర్భిణీ స్త్రీల మరణాలను తగ్గిస్తుందని ఆమె కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు బెల్లం, మొలాసిస్‌ను చవకైన ఆహార అనుబంధంగా ఉపయోగించడానికి పునాది వేసింది. ఈ కృషికి గాను ఆమె రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ కమల అప్పుడు బొంబాయిలో స్థాపించబడిన అరే మిల్క్ ప్రాజెక్ట్‌కు సలహాదారుగా పాలు విరిగిపోకుండా నివారించడానికి ఒక ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు పాల నాణ్యతను మెరుగుపరిచే చర్యలపై కూడా సలహాలు ఇచ్చారు. రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేస్తున్నప్పుడు, ఆమె అర్హత ఉన్నప్పటికీ, ఒక మహిళగా నాలుగేళ్లపాటు డైరెక్టర్‌ పదవి పొందకుండా వివక్షకు గురయ్యారు. ఆ తరువాత డైరెక్టర్‌ పదవిలో నియమించబడినందుకు ఆమె మాజీ గురువు, సలహాదారు డాక్టర్ డెరిక్ రిక్టర్, “ఇంత పెద్ద సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు మొదటి మహిళా డైరెక్టర్‌గా కమల చరిత్ర సృష్టించారు” అని వ్యాఖ్యానించారు. ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా ఆమె పనిచేసిన కాలంలో, అభ్యర్థి లింగం ఆధారంగా ఏ దరఖాస్తునూ తిరస్కరించలేదు.

వినియోగదారుల రక్షణకు విశేష కృషి.. 

ఆమె కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో (సిజిఎస్ఐ) చురుకైన సభ్యురాలిగా ఉండి, వినియోగదారుల భద్రతపై వారి పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. 1982లో ఆమె ఆ సొసైటీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె సిజిఎస్ఐలో పనిచేస్తున్న సమయంలో, ఆహార పదార్థాల స్వచ్ఛతను పరీక్షించడానికి సామాన్య ప్రజలు ఉపయోగించగల ఒక కిట్‌ను కూడా రూపొందించారు. 1997లో ఆమె “సైన్స్‌కు చేసిన విశిష్ట సేవ, కృషికి జాతీయ పురస్కారం” గెలుచుకున్నారు. 1998లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్, డాక్టర్ కమలా సోహోనీని న్యూఢిల్లీకి ఆహ్వానించి అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సత్కరించారు. కమలా సోహోనీపై అభిమానంతో అందరూ లేచి నిలబడి ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు చేస్తున్న సమయంలో ఆమె ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. తరువాత, జూన్ 28, 1998న ఆమె న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News