Monday, April 7, 2025
Homeఓపన్ పేజ్Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి.. నిజం తక్కువ.. అబద్ధాలు ఎక్కువ !

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి.. నిజం తక్కువ.. అబద్ధాలు ఎక్కువ !

- Advertisement -

కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) ప్రాంతం నుంచి వన్యప్రాణులు భయంతో పారిపోతున్నాయంటూ అనేక ఫొటోలు, వీడియోలు ఈ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా వన్యప్రాణులు నగరంలోకి వచ్చేస్తు న్నాయనే వాదనతో ఒక అపార్ట్‍మెంట్‌ సమీపంలో ప్రజలకు దగ్గరగా నడుస్తున్న సంబల్‌ జింకను చూపించే వీడియో ఒకటి కూడా వాటిలో ఉంది. కానీ, వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా ఆవాసాలను కోల్పోయిన జింక హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిసరాల్లోని ఒక అపార్ట్‍మెంట్‌ సమీపంలో కనిపిం చిందనే వాదనలో నిజం లేదు. ఆ వీడియో అసలు విశాఖపట్నం లోని విశాలాక్షినగర్‌ ప్రాంతంలోనిది. కంబాలకొండ అటవీ ప్రాంతం నుంచి విశాలాక్షినగర్‌లోకి అప్పట్లో ఆ జింక వచ్చింది. రివర్స్​‍ ఇమేజ్‌ సెర్చ్‍ ద్వారా అందులో నిజానిజాలు ఏంటని పరిశీలించినప్పుడు అసలు విషయం తెలిసింది. అదే కాదు.. అసలు కంచ గచ్చిబౌలి భూముల్లో ఒకవైపు జేసీబీలతో చెట్లు కొట్టేస్తుంటే మరోవైపు నెమళ్లు అటూ ఇటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక ఫొటో కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా సర్క్​యులేట్‌ అయ్యింది. తీరా దాన్ని పరిశీలిస్తే అది అసలు ఒరిజినల్‌ ఫొటోనే కాదని, ఏఐ ద్వారా సృష్టించారని తెలిసింది. నిజానికి మనిషి అడుగుల చప్పుడు అయితేనే అక్కడినుంచి పారిపోయే నెమళ్లు.. జేసీబీల శబ్దానికి ఇంకా అక్కడే ఉంటాయా అన్న సాధారణ విషయం కూడా తెలియకుండానే అనేకమంది సోకాల్డ్​‍ మేధావులు ఆ ఫొటోను విపరీతంగా షేర్‌ చేసేశారు. అంతే కాదు, ఒక ఏనుగు కంచ గచ్చిబౌలి భూముల్లో పనిచేస్తున్న జేసీబీని విధ్వంసం చేస్తున్నట్లు కూడా ఒక వీడియోను పెట్టి.. గజరాజును పిలవండిరా అంటూ షేర్‌ చేసేశారు. అది కూడా ఇక్కడిది కానే కాదు. ఏదో వేరే దేశంలోనిది. బెన్‌ సోజో అనే ఛానల్‌ ఫిబ్రవరి నెలలో ఈ వీడియోను పోస్ట్‍ చేసింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలించేశారు. ఈ విధంగా సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. వీళ్లంతా ఎవరి సేన అనేది తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసు వర్గాల చేతుల్లోకి వెళ్లింది.

నిజం నోరు దాటేలోపు.. అబద్ధం అరవై ఊళ్లు చుట్టబెట్టేస్తుంది

కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి ఇచ్చిన భూములను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసేసు కుంటోందంటూ విపరీతమైన గొడవ జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… సోషల్‌ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంతో నిజంగానే సెంట్రల్‌ యూనివర్సిటీకి ఉన్న వేలాది ఎకరాల భూములన్నింటినీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసిందని చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా యూని వర్సిటీ మాజీ విద్యార్థులైతే… తాము ఆ పచ్చటి చెట్ల కింద, దట్టమైన వృక్షాల మధ్య కూర్చుని చదువుకునేవాళ్లమని, అవన్నీ నగరానికి లంగ్‌ స్పేస్ ఇస్తాయని, అలాంటి భూములను ఆక్రమించుకోవడం ఏంటని విపరీతంగా బాధపడిపోతున్నారు. ఇందులో కొన్ని నిజానిజాల గురించి మనం మాట్లాడుకోవాలి.

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ నగరంలో సెంట్రల్‌ యూనివర్సిటీ పెడతామంటే సరేనని ప్రభుత్వ భూములను దానికి కేటాయించారు. కానీ, అప్పట్లో సరిగ్గా ఎన్ని ఎకరాలు ఇచ్చారన్న విషయం ఎక్కడా రాతకోతల్లో గానీ, పత్రాల్లో గానీ లేదు. అలాగే.. యూనివర్సిటీ కూడా తన భూముల చుట్టూ ప్రహరీ ఏమీ కట్టలేదు. అందువల్ల అసలు యూనివర్సిటీకి కచ్చితంగా కేటాయించిన భూమి ఎంత అనేది తెలియదు. అసలు అదొక్కటే కాదు.. నగరంలో ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా భూములు ఇచ్చారు. అందుకే మిధాని, డీఆర్‌డీఓ, బీడీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌.. హెచ్‌ఏఎల్‌ అనేక సంస్థలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యాయి. కానీ, అటు సెంట్రల్‌ యూనివర్సిటీ గానీ, ఇటు ఈ సంస్థలు గానీ వేటిలోనైనా ఇంత భారీ స్థాయిలో భూములు ఇచ్చినందుకు తెలంగాణ వాసులకు ఏమాత్రం ఉద్యోగాలు కల్పించారన్నది ఇప్పుడు తెలంగాణ వాదులు లేవనెత్తుతున్న ఒక ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఏ పరిశ్రమలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తామని చెబుతున్నా.. అందుకు ప్రతిగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా ముందే చెబుతున్నారు. అందులో అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవాటి నుంచి సర్వసాధారణ ఉద్యోగాల వరకు అన్నీ ఉంటాయి. ఏదో ఒక స్థాయిలో ఎన్నో కొన్ని ఉద్యోగాలు తమ వాళ్లకు రావాలనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆశించే విషయం. కానీ, గతంలో ఇవన్నీ లేకపోవడం వల్లనే తెలంగాణలో ఇన్ని సంస్థలు ఏర్పడినా తెలంగాణ వాసులకు ఉద్యోగాలు ఏమీ రాలేదు. తమకు ఏమాత్రం ఉద్యోగాలు ఇవ్వని యూనివర్సిటీకి అసలు అన్ని వందల, వేల ఎకరాల భూములు ఎందుకని కూడా తెలంగాణ ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు.

అమెరికా లాంటి అగ్రరాజ్యంలో విశ్వవిద్యాలయాలకు కొన్ని వేల ఎకరాల భూములు ఉంటాయని, అందుకే అక్కడినుంచి పెద్ద పెద్ద మేధావులు వస్తారని కూడా కొంతమంది వాదిస్తున్నారు. నిజమే, అమెరికాలో ఒక్క విశ్వవిద్యాలయాలకు మాత్రమే కాదు… మామూలు ఇళ్లు కూడా ఎకరాల్లోనే ఉంటాయి. ఒక్కో ఇంటికి బ్యాక్‌ యార్డ్‍ అని, ఫ్రంట్‌ స్పేస్ అని.. ఇలా రకరకాల పేర్లతో చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఖాళీ స్థలం వదిలిపెడతారు. మరి మన దేశంలో వంద గజాల లోపు ఇళ్లు ఎన్ని ఉన్నాయి? గట్టిగా మాట్లాడితే అసలు 50 గజాల్లోపు కూడా ఇళ్లు కట్టేసుకునేవారు ఎంతమంది ఉంటున్నారు? ఎందుకంటే, అమెరికా లాంటి దేశాల్లో భూవిస్తీర్ణం అపారంగా ఉంది, జనాభా చాలా తక్కువగా ఉంది. అంతేకాదు, బ్రెజిల్‌ దేశాన్నే తీసుకుంటే.. ఆ దేశ విస్తీర్ణం 85 లక్షల చదరపు కిలోమీటర్లు. కానీ జనాభా మాత్రం కేవలం 21 కోట్లు. మన దేశ విస్తీర్ణం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. జనాభా మాత్రం 145 కోట్లు! అలాంటి పొరుగు దేశాలతో మనల్ని మనం పోల్చుకోవడం ఎంత అవివేకమో దీన్ని బట్టి తెలుస్తుంది. జనాభా పరిమితంగా ఉండి, భూమి విస్తీర్ణం అపారంగా ఉన్నచోట కేవలం విశ్వవిద్యాలయాలకే కాదు.. చివరకు పాఠశాలలకు కూడా వందల ఎకరాలు కేటాయించుకోవచ్చు. జన సాంద్రతను బట్టే భూముల కేటాయింపు ఉంటుంది. నిజానికి కంచ గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఉండేదని కొంతమంది వాదిస్తున్నారు. కానీ అందుకు ఆధారాలు ఎక్కడా లేవు. ఇప్పుడు అవి 1,500 ఎకరాలు అయిపోయాయని బాధపడుతున్నారు. నిజానికి యూనివర్సిటీకి ఎన్ని ఎకరాలు అవసరం అనేదానికి ఎక్కడా ప్రమాణాలు లేవు. మొత్తం భవనాలకు, ఇతరత్రా అవసరాలకు కలిపినా కొంత కనీస స్థాయిలో అనుకున్నా 100 ఎకరాలు ఉంటే ఎక్కువ. కానీ, ప్రశాంత వాతావరణం ఉంటే విద్యార్థులకు చదువు బాగా వస్తుందన్న ఉద్దేశంతోను, అప్పట్లో అన్ని అవసరాలు లేకపోవడం వల్లను అంత భారీ స్థాయిలో కేటాయించి ఉంటారు. పైగా ఇప్పుడు ఆ వివాదమంతా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి, అసలు యూనివర్సిటీకి కేటాయించిన భూములు ఎంత, అందులో నిజంగా ప్రభుత్వం తీసుకుంటే.. అలా తీసుకున్న మొత్తం ఎంతనే వివరాలన్నీ తెలిసిపోతాయి.

ఒక్కసారి అదంతా పక్కన పెట్టి, 15 నెలలు వెనక్కి వెళ్దాం. అప్పటినుంచి గడిచిన దశాబ్ద కాలంలో తొలుత టీఆర్‌ఎస్, తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఏం చేశాయి? ‘రేవంత్‌ మాటలు నమ్మి 400 ఎకరాల భూమిలో అంగుళం కూడా కొనకండి. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం. కాంగ్రెస్ సర్కార్‌ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారు’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌ గురువారం చేసిన వ్యాఖ్యలను చూస్తే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇలా పాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తర్వాత వచ్చే ప్రభుత్వాలు రద్దు చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వం అన్న మాటకు అర్థం ఏముంటుంది? ఆ మాటకొస్తే అసలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎకరం భూమి కూడా అమ్మలేదా? అలా అమ్మకుండానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించారా? అప్పుడు, ఇప్పుడు కూడా తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, కేంద్రంలో అధికా రంలో ఉన్న ప్రభుత్వాలు వేర్వేరు పార్టీలకు చెందినవే. అందువల్ల కేంద్రం నుంచి అసాధారణ స్థాయిలో సహకారం తెలంగాణకు ఎప్పుడూ రాలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలన్నా కూడా పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. అసలు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన భూములను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెబితే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి? ఇటువంటి వ్యాఖ్యలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిం టుందన్న విషయం అమెరికాలో ఉద్యోగం చేసి మరీ వచ్చిన కేటీఆర్‌కు తెలియదా? అలాగే యూనివర్సిటీలకు వందల ఎకరాల భూములు ఎందుకు…అని ఆ పార్టీ అగ్రనాయకులు కేసీఆర్‌ అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు బహుశా కేటీఆర్‌ మరిచిపోయి ఉంటారు .

బీఆర్‌ఎస్ హయాంలో నాడు హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా, ప్రభుత్వమే నేరుగానూ అమ్మిన భూములన్నీ కూడా హాట్‌ కేకుల్లాంటి ప్రాంతాలే. వాటిని ఒక్కసారి తిరిగి చూసుకుంటే.. కోకాపేట, గచ్చిబౌలి, బుద్వేలు, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, నియో పోలిస్ వంటి ప్రాంతాల్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఇక కోకాపేటలో బీఆర్‌ఎస్ కార్యాలయానికి కేటాయించిన భూమి విలువ రూ.వందల కోట్లలో ఉంటుంది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మకానికి పెట్టేసిన నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసానికి పాల్పడిందన్నది పచ్చి వాస్తవం. ఎందుకంటే, ఆయా ప్రాంతాలన్నింటిలో ధరలను కృత్రిమంగా పెంచేయడంతో కొన్నవాళ్లు బేరాలు మొదలుపెట్టారు. తాము అంత ధర చెల్లించేం దుకు సిద్ధమేనని, అయితే అక్కడ తాము కట్టే అంతస్తుల విషయంలో పరిమితులు, నిబంధనలు సడలించాలని అన్నారు. దానికి వెంటనే సరేనన్న నాటి ప్రభుత్వం ఏకంగా ఆకాశాన్ని తాకే స్థాయిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేసింది. నిజానికి దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది? అక్కడ చేపట్టే నిర్మాణ కార్యక్రమాల వల్ల కాలుష్యం వెదజల్లదా? అలాగే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తవా? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ బీఆర్‌ఎస్ నాయకులను అడిగితే వారినుంచి సమాధానం మాత్రం రాదు.

ఆ 10 ఏళ్లు .. రూ.20 వేల కోట్ల విలువైన భూములు

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్మేసి రూ.20 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. వీటిలో కోకాపేట, నియో పొలిస్ వంటి ప్రాంతాలు అత్యంత విలువైనవే కాకుండా అక్కడ కొండలు, గుట్టలు, చెట్లు, పొదలనూ తొలగించారు. తన పాలనలో కేసీఆర్‌ కూడా రాష్ట్ర బడ్జెట్‌కు వాణిజ్య పన్నులు, మద్యం అమ్మకాలతో పాటు ప్రభుత్వ భూముల అమ్మకాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్యం అమ్మకాలు చాలా పెద్దస్థాయిలోనే పెరిగాయి. దానికితోడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మంచి మద్యం బ్రాండ్లు దొరకట్లేదని ఇక్కడినుంచి కొనుక్కుని తీసుకెళ్లిన వారు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల ఒక రాష్ట్ర అమ్మకాలే కాకుండా, రెండురాష్ట్రాల నుంచి కూడా మద్యం ఆదాయం తెలంగాణకు ఇబ్బడిముబ్బడిగానే వచ్చింది. అయినా అది సరిపోదని భూముల అమ్మకాలు చాలా పెద్ద స్థాయిలోనే చేపట్టారు. 2015 నుంచి 2024 వరకు టీజీఐఐసీ భాగస్వామ్యంతోనూ, ప్రభుత్వమే నేరుగానూ సుమారు 342 ఎకరాల భూమిని వేలం వేసి.. రూ.9,031 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు అదంతా అక్రమమని, ఆ భూములన్నింటినీ తాము వెనక్కి తీసుకుంటున్నామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తే ఏమవుతుంది? అలాగే… 2018 నుంచి 2024 వరకు హెచ్‌ఎండీఏ ద్వారా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి.. 1,445 ప్లాట్ల (7,81,612 చదరపు గజాలు)ను విక్రయించి, రూ.11,875 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుందని కూడా సమాచారం. వీటిలో కోకాపేట, నియోపొలిస్, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల వంటి ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములూ ఉన్నాయి. కోకాపేటలో ఎకరం వంద కోట్ల రూపాయలకు అమ్ముడైందంటూ, అదో రికార్డని కూడా నాడు డబ్బా కొట్టుకున్నారు. ఎకరం వంద కోట్లు పెట్టి కొన్న వ్యాపారి.. అక్కడ అపార్టుమెంట్లు కడితే చదరపు అడుగుకు ఎంత ధర పెడతారని కూడా చాలామంది లెక్కలు వేసుకుని, గుండెల మీద చేతులు పెట్టుకున్నారు. ఇక ఉప్పల్‌ భగాయత్‌, నిజాంపేట.. ఇలాంటి ప్రాంతాల్లో అయితే కృత్రిమంగా కూడా ధరలు పెంచి మరీ విక్రయించేశారన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగానే వచ్చాయి. కానీ అప్పటి పాలకుల నోళ్లకు భయపడి ఎవరూ పెద్దగా దాని గు…గురించి ప్రచారం మాత్రం చేయలేదు. ఇలా.. పారిశ్రామిక, నివాస భూములు రెండూ కలిపి ప్రభుత్వ స్థలాల అమ్మకాల ద్వారా రూ.20,906 కోట్ల మేరకు ఆదాయాన్ని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమకూర్చుకుంది.

ఏమైంది ఆ దూకుడు?

తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలోకి రాక ముందు వరకు రేవంత్‌ రెడ్డి అంటేనే ఒక ఫైర్‌ బ్రాండ్‌. దూకుడుకు మారుపేరు. ఆయన మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఈ విషయంలో రేవంత్‌ రెడ్డికి మంచి పేరుంది. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముందరి కాళ్లకు బంధాలు పడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయమే కాదు, గతంలో ముచ్చర్ల భూముల విషయంలో కూడా రేవంత్‌ సర్కారు మీద సోషల్‌ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోంది. సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన భూముల్లో ఒక్క అంగుళం కూడా తాము ముట్టుకోబోమని ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కొంతమంది చెబుతున్నా, ఆ వాయిస్ ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. ఎవరైనా మనమీద దాడికి దిగుతు న్నారంటే మొదట డిఫెన్స్​‍ చేసుకోవాలి, తర్వాత అసవరాన్ని, అవకాశాన్ని బట్టి ఎదురుదాడి కూడా చేయాలి. అప్పుడే రాజకీయాల్లో నిలబడగలం. సోషల్‌ మీడియాలో బలంగా ఉండడం కొన్ని వర్గాలకు ఉన్న మంచి అవకాశం. దాన్ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అందిపుచ్చుకోవాలి. అక్కడ జరుగుతున్న ప్రచారానికి అక్కడే సమాధానం ఇవ్వడంతో పాటు.. స్వయంగా ముఖ్యమంత్రి కూడా అవసరమైతే ప్రజల ముందుకు రావాలి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వేదికపై తన మాట గట్టిగా వినపడేలా చెప్పుకోవాలి. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా ఇలా ప్రభుత్వ భూముల అమ్మకం విషయంలో వారేం చేశారన్నది తెలియజెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వానికి ఏనాడూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి అపార సాయం అందింది లేదు. అందువల్ల రోజువారీగా ప్రభుత్వం నడవాలన్నా, అభివృద్ధి-, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించాలన్నా కూడా సొంత ఆదాయవనరులు చూసుకోవడం చాలా అవసరం. అందుకు ఉన్న ప్రధాన మార్గాలు.. వాణిజ్య పన్నులు, మద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలే. కొత్తగా ఎలాంటి పన్నులు విధించడానికి అవకాశం ఉండదు. అలా విధిస్తే ప్రజలు తిరగబడతారు. అందుకని ఉన్న కొద్దిపాటి ఆదాయ మార్గాలతోనే ఎలాగోలా నెట్టుకురావాలి. దానికితోడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కంటే ఎంతో కొంత బాగా చేశామని నిరూపించుకోగలగాలి. కేవలం సంక్షే మ కార్యక్రమాలతోనే కాలం గడిపేస్తే ఏమవుతుందన్నది పొరు గున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గతానుభవాలు తేటతెల్లం చేస్తు న్నాయి. అక్కడి జగన్‌ ప్రభుత్వం అమలుచేసినన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రమూ అమలు చేయలేదన్నది వాస్తవం. అయినా కూడా అభివృద్ధిని విస్మరించడంతో.. అంతకుముందు 151 స్థానాల్లో గెలిపించిన ప్రజలే ఈసారి 11 స్థానాలకు పరిమితం చేశారు. అందువల్ల సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాను అనుకున్న ఫ్యూచర్‌ సిటీ, మెట్రో రైలు విస్తరణ లాంటి కార్యక్రమాలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలి. కనీసం పని మొదలుపెడితే.. ఎప్పటికో అప్పటికి పూర్తవుతుంది. అదే సమయంలో వీటన్నింటితో పాటు.. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఎదురొడ్డాలి. ఎదురుదాడి చేస్తేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందన్న విషయాన్ని రేవంత్‌ రెడ్డి మర్చిపోకూడదు. ముఖ్యమంత్రి రూపం లోంచి మళ్లీ నిఖార్సైన రాజకీయ నాయకుడి అవతారంలోకి అవసరమైతే కొన్నాళ్లు పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే తాను అనుకున్నట్లుగా.. కొడంగల్‌ బిడ్డే పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు.

[email protected]
9885809432

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News