ఎండలకి, వానలకి, మంచు గాలులకి లెక్క చేయకుండా వారి కుటుంబాలను కూడా మరచి, కేవలం దేశ రక్షణనే భుజా నికెత్తుకొన్న వీరులే సైనికులు. వీరు భరతమాత ముద్దు బిడ్డలు. అటువంటి ఎంతో మంది వీరులు 1999 కార్గిల్ యుద్ధంలో పోరాట పటిమతో, ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో నీచాతి నీచమైన పాకిస్థాన్‌ను వెంటాడి తరిమి తరిమి, కొట్టి కొట్టి, మన దేశ పతాకాన్ని రెపరెప లాడించిన రోజే జూలై 26. కార్గిల్ యుద్ధంలో భాగంగా పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్న రోజు. ఈ యుధ్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ని యావత్ దేశ ప్రజలూ జరుపు కుంటారు. వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తారు. యుద్ద వీరులను సత్కరించి దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు. దేశ సరిహద్దులను రక్షించే వీర సైనికులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కార్గిల్ విజయ్ దివాస్ సిల్వర్ జూబ్లిని పురస్కరించుకొని, 26 జూలై 2023 నుండి ప్రారంభం అయ్యి ఏడాది పొడవునా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జరుపుకుంటారు.
ఒక్కసారి ఆ రోజులలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకుందాం. 1971 ఇండో పాకిస్థాన్ యుధ్దం తరువాత మెదటి సారిగా రెండు దేశాలు నేరుగా సైనిక ఘర్షణకు దిగిన యుధ్దం గా ఇది నిలిచింది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి 1998 లో అణు పరీక్షలు జరిపారు. మే 3, 1999 న పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు భారత నియంత్రణలో ఉన్న కార్గిల్ భూభాగంలోనికి చొరబడ్డారనే సమాచారంతో, భారత సైన్యం అప్రమత్తమైంది. మే 10న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది. మే 31న వాజపేయు గారు కార్గిల్ లో ఇది యుధ్దం లాంటి పరిస్థితి అని ప్రకటించారు. ఈ యుద్ధం సుమారు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశాల్లో కొనసాగింది. అత్యంత సవాలుగా ఉండే భూభాగంలలో ఒకటిగా నిలిచింది. జూన్ 5న పాకిస్థాన్ ప్రమేయాన్ని వెల్లడించే పత్రాలను మన సైన్యం విడుదల చేసింది. జూన్ 9న బటాలిక్ సెక్టార్ లోని ముఖ్యమైన రెండు స్థావరా లను మన సైన్యం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి మరో నాలుగు రోజులలోనే టోలోలింగ్ శిఖరాన్ని మన దేశం తిరిగి పొందింది. అప్పటి ప్రధాన మంత్రి కార్గిల్ ను సందర్శించారు. జూలై 11 నాడు పాకిస్థాన్ దళాలు తోకముడిచి పారిపోయాయి. బటాలిక్‌లోని మన ప్రాంతాలను మన సైన్యం స్వాధీనం చేసు కుంది. జూలై 14 నాడు ఆపరేషన్ విజయ్ విజయవంతం అయినదని మన సైన్యం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఫిరంగి దళం, వైమానిక శక్తి, పదాతిదళ కార్యకలాపాలను విస్తృతంగా ఉపయోగించారు. భారత వైమానిక దళం సంఘర్షణ సమయంలో వైమానిక సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది, వ్యూహాత్మక స్థానాల నుండి శత్రువును తరిమి కొట్టడానికి కీలకమైన వైమానిక దాడులు నిర్వహించింది. యుద్ధ సమయంలో భారత సైన్యం టోలోలింగ్, టైగర్ హిల్ పాయింట్ 4875 వంటి వ్యూహాత్మక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. భారత ఆర్మీ అధికారి అయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా, యుద్ధ సమయంలో తన ధైర్యసాహసాలు, సాహసోపేతమైన చర్యలకు జాతీయ హీరో అయ్యాడు. అతని ప్రసిద్ధ పదాలు, ‘యే దిల్ మాంగే మోర్,’ ఐకానిక్‌గా మారాయి. జూలై 26 నాటికి కార్గిల్ యుద్ధం ముగిసింది. జై భారత్. జై జై భారత్.
- డీజే మోహన రావు
9440485824.
(నేడు కార్గిల్ దివాస్)