Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Kargil Vijay Diwas @ 25 years: విజయ్ దివస్ రజతోత్సవాలు

Kargil Vijay Diwas @ 25 years: విజయ్ దివస్ రజతోత్సవాలు

1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన దేశం పాకిస్తాన్ పై విజయం సాధించి నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు. ఈ యుద్ధం సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించిన అసమాన్య ధైర్యసాహసాలు మరియు శౌర్యప్రతాపాలను గుర్తు చేసుకుంటూ, వారి పట్ల మన కృతజ్ఞతను చాటుకోవడంతో పాటు సంఘీభావాన్ని తెలిపేందుకు ప్రతి సంవత్సరం జూలై 26న దేశవ్యాప్తంగా “విజయ్ దివస్” జరుపుకుంటున్నాము. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందగా 1,363 సైనికులు క్షతగాత్రులయ్యారు. ఒక సైనికుడు యుద్ధ ఖైదీగా పాక్ దళాలకు చిక్కాడు. భారత సైన్యం యొక్క ఒక హెలికాప్టర్, జెట్ యుద్ధ విమానాన్ని పాక్ సైన్యం పేల్చివేయగా మరొక యుద్ధ విమానం కూలిపోయింది. కార్గిల్ పట్టణం శ్రీనగర్ నుండి 205 కిమీ దూరంలో భారత్ – పాకిస్థాన్ అంతర్జాతీయ నియంత్రణ రేఖ మీదుగా ఉంటుంది. వేసవికాలంలో సైతం చాలా చల్లగా ఉండే కార్గిల్ ఉష్ణోగ్రతలు తరచూ మైనస్ 48 డిగ్రీలకు పడిపోతుంటాయి.

- Advertisement -

కార్గిల్ యుద్ధం నేపథ్యం:
కార్గిల్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య మే నుండి జూలై 1999 వరకు జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో ఇరు దేశాల సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి మరియు ఇతర ప్రాంతాలలో జరిగింది. మే 1999 ఆరంభంలో పాకిస్థానీ తీవ్రవాదులు భారత ఆధీనంలోని భూభాగంలోకి చొరబడి కీలక స్థానాలను ఆక్రమించుకున్నాయి. మే 3 – 12 మధ్య భారత సైన్యం అక్రమ చొరబాట్లను గుర్తించి, మే 15 నుండి 25 వరకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించి, మే 26, 1999న, అక్రమ చొరబాటుదార్లను మరియు పాకిస్థాన్‌ బలగాలను తరిమికొట్టేందుకు “ఆపరేషన్ విజయ్” సైనిక చర్య చేపట్టింది. కాశ్మీర్‌లోని వివాదాస్పద ప్రాంతంలో రెండు దేశాల మధ్య వాస్తవాధీన నియంత్రణ రేఖ యొక్క భారతదేశం వైపున ఉన్న వ్యూహాత్మక స్థానాల్లోకి కాశ్మీరీ తీవ్రవాదుల వేషధారణలో పాకిస్థానీ సైనికులు చొరబడటం వలన ఈ ఘర్షణ తలెత్తింది. అక్రమ చొరబాటుదారులను మన భూభాగం నుండి తరిమివేయడం కోసం సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో నైసర్గికంగా అత్యంత క్లిష్టతరమైన ప్రాంతాలలో భారత సైన్యం సైనిక చర్యలకు ఉపక్రమించింది. కార్గిల్ యొక్క నైరుతి మరియు ఈశాన్య ప్రాంతాలలోని ముష్కో వ్యాలీ, ద్రాస్, బటాలిక్ సెక్టార్, కక్సర్, టోలోలింగ్, టైగర్ హిల్, ప్రాంతాలలో హోరాహోరీగా కొనసాగిన ఈ యుద్ధంలో రెండు దేశాల సైన్యాలు భారీ పరిమాణంలో శతజ్ఞులు, ఫిరంగులు, మందుగుళ్ళతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. 16000 అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వత ప్రాంతాలు భారత భూభాగంలో కింద ఉండే ద్రాస్ మరియు కార్గిల్ పట్టణాలపై సులభంగా దాడిచేసేందుకు పాకిస్థాన్ కు ఎంతో వ్యూహాత్మకంగా మరియు భారత్ కు ప్రతికూలంగా ఉండడం వారికి కలిసొచ్చింది. భీకరమైన ఈ యుద్ధంలో చొరబాటుదార్లకు మరియు సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా పదాతిదళాలకు కీలకమైన మద్దతు అందించడంలో భారత వైమానిక దళం అద్వితీయమైన పాత్ర పోషించింది. వైమానిక దాడుల ద్వారా పలు పాకిస్థాన్ స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. భారత వైమానిక మరియు పదాతి దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ను “ఆపరేషన్ సఫేద్ సాగర్” అంటారు. కార్గిల్ ప్రాంతంలో పాకిస్థాన్ బలగాల నుండి ఆకస్మిక దాడిని ఎదుర్కొన్నప్పటికీ, భారత సైన్యం ధీటుగా స్పందించి చొరబాటుదారులను విజయవంతంగా వెనక్కి నెట్టి, ఆక్రమిత స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. జూన్ 12, 1999న దేశ రాజధాని ఢిల్లీలో నాటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మరియు భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ఆ తరువాత ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సమావేశాలు జరిగినప్పటికీ అవి ఫలితాలను సాధించలేకపోయాయి. నియంత్రణ రేఖ నిబంధనలను గౌరవించాలని అమెరికా సహా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ కు హితవు పలకడంతో, జూలై 11న నాటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని ప్రకటించగా, భారత్ అందుకు జూలై 16 వరకు గడువు విధించింది. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా చెదురుమదురు సంఘటనలు కొనసాగాయి. ఎట్టకేలకు జులై 26, 1999న భారత్ సైన్యం పాకిస్తాన్ బలగాలను మన భూభాగం నుండి పూర్తిగా తరిమివేయడంతో యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తరువాత, యుద్ధఖైదీలుగా చిక్కిన పాక్ సైనికులను మానవతా దృక్పథంతో భారత్ విడుదల చేసింది.

చొరబాటుదార్లకు పాక్ సైన్యం చేయూత:
ముజాహిదీన్ తీవ్రవాదుల వేషధారణలో పాకిస్థాన్ తన సైన్యం మరియు పారామిలిటరీ బలగాలకు శిక్షణ ఇచ్చి రహస్యంగా కార్గిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట భారత కదలికల పర్యవేక్షణ మరియు సమాచారాన్ని సేకరించడం కోసం “ఆపరేషన్ బదర్” అనే సంకేత నామంతో తెగబడింది. ఈ చర్య వెనుక వారి ప్రధాన లక్ష్యం భారత బలగాలను సియాచిన్ గ్లేసియర్ గుండా గల నియంత్రణ రేఖ వద్ద నుండి బలవంతంగా వైదొలగింపజేసి ఆ ప్రాంతానికి లడఖ్ కు సంబంధం లేకుండా చేసి కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి తద్వారా లబ్ది పొందడం. అయితే అచంచల దేశ భక్తి, ధైర్యసాహసాలు మరియు శౌర్యప్రతాపాలకు మారుపేరైన మన భారత సేనల ముందు వారి కుటిల సంకల్పం నెరవేరలేదు సరికదా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అంతర్జాతీయ సమాజం ముందు పరువు పోయింది. శత్రువులపై దాడికి భారత సైన్యం భారీ పరిమాణంలో సుమారు 250 ఫిరంగి తుపాకులు, బోఫోర్స్ FH-77B ఫీల్డ్ హోవిట్జర్, మూడు వందల ఆర్టిలరీ తుపాకులు, మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, సుమారు 5000 షెల్స్, రాకెట్లు, 155 ఎంఎం బోఫోర్స్ మీడియం తుపాకులు మరియు 105 ఎంఎం తుపాకులను వినియోగించింది. ఈ దాడులను టీవీలలో ప్రసారం చేయడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి.

ఒళ్ళు గగుర్పొడిచే కెప్టెన్ కెంగురూస్ శౌర్యం:
కార్గిల్ విజయంలో ఎందరో సైనికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీరోచితంగా పోరాడారు. అలాంటి సాహసికులలో ఒకరైన కెప్టెన్ నీకెజాకుఓ కెంగురూస్ గురించి తెలుసుకుందాం. జూన్ 28, 1999న బ్లాక్ రాక్ అనే శిఖరంపై శత్రువులు ఏర్పాటుచేసిన వ్యూహాత్మక మెషిన్ గన్ పోస్ట్‌ను చేజిక్కించుకునే బాధ్యతను కెప్టెన్ కెంగురూస్ యొక్క “ఘాతక్ ప్లాటూన్‌”కు అప్పగించారు. శత్రువులు ఈ స్థానం నుండి చాలా రోజులుగా భారీ ఎత్తున కాల్పులు జరుపుతుండడంతో, ఆ సెక్టార్‌లో బెటాలియన్ పురోగమించడానికి అవరోధం ఏర్పడింది. దీంతో శత్రు స్థావారాన్ని ధ్వంసం చేయడం భారత సైన్యాన్నికి అనివార్యమైంది. కొండపైన ఉన్న ఈ గన్ పోస్ట్ నిటారుగా ఉండి లక్ష్యం శత్రువుకు ఫిరంగుల ద్వారా కాల్చివేసేందుకు అత్యంత అనుకూలంగా ఉండటంతో అప్పగించిన కార్యక్రమం చేపట్టడం అత్యంత కఠినంగా మారింది. అయినప్పటికీ మడమ తిప్పని ధైర్యంతో కెప్టెన్ కెంగురూస్ సూదిమొన లాంటి కొండపైకి తన దళాలతో ముందుకు కదిలడంతో దాదాపు ఏడు పాకిస్థానీ బంకర్‌లు వారికి సవాలు విసిరాయి. వారు మొదటి బంకర్ వద్దకు చేరుకోగానే శత్రువులు విసిరిన గ్రెనేడ్ కెప్టెన్ కెంగురూస్‌ పొత్తికడుపును చీల్చినప్పటికీ, ఆయన గాయాలను లెక్కచేయకుండా దాడి కొనసాగించమని తన దళసభ్యులను నిర్దేశించాడు. ఆయన నేతృత్వం లోని కమాండో బృందం కొండపైకి ఎక్కుతుండగా శత్రు సేనలు తీవ్రమైన మోర్టార్ మరియు ఆటోమేటిక్ గన్స్ తో కాల్పులు జరపడంతో ఒక పక్క భారీ ప్రాణ నష్టం సంభవిస్తున్నప్పటికీ మరో పక్క ఆయన రాకెట్ లాంచర్‌ని ఉపయోగించి మొదటి బంకర్‌ను ధ్వంసం చేశాడు. తమ నాయకుడి ప్రేరణతో, కమాండో బృందం రెట్టించిన ఉత్సాహంతో కొండపైకి మరింత ముందుకు సాగింది. ఆఖరి కొండను చేరుకోవడానికి వారు ఎత్తైన రాతి గోడను ఎక్కాల్సి వచ్చింది. బృంద సభ్యులు అందించిన తాడు సహాయంతో పైకి ఎక్కేందుకు కెంగురూస్ ప్రయత్నించినప్పటికీ, కాలిబూట్ల కారణంగా పట్టు సడలిపోతోంది. 16,000 అడుగుల ఎత్తులో రక్తం గడ్డకట్టే మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మెరుగైన పట్టు కోసం కెప్టెన్ కెంగురూస్ ఒక్క ఉదుటున తన బూట్లను జారవిడిచి పాదరక్షలు లేకుండానే ఆ రాతి గోడను ఎక్కగానే రెండవ బంకర్ నుండి ఇద్దరు శత్రు సైనికులు ఒక్క సారి ఆయనపై లంఘించారు. సమయస్ఫూర్తి ప్రదర్శించిన కెంగురూస్, వారని తన కమాండో కత్తితో నరికి చంపాడు. మూడవ బంకర్‌ను చేరుకునే క్రమంలో పైనుంచి వచ్చిన బుల్లెట్ల వర్షం కారణంగా ఆయన కొన్ని వందల అడుగుల దిగువన ఉన్న కొండపైకి జారిపోయాడు. అలా ఒంటిచేత్తో రెండు బంకర్లను ధ్వంసం చేయడమే కాక ఆయన శత్రు స్థానాన్ని నిర్వీర్యం చేయడంలో అద్వితీయమైన శౌర్యప్రతాపాలు ప్రదర్శించాడు.

కార్గిల్ యోధులకు ‘వీర్ చక్ర’ పతకాలు:
ఈ యుద్ధం సందర్భంగా నిరుపమాన ధైర్యసాహసాలు మరియు శౌర్యప్రతాపాలను ప్రదర్శించినందుకు గాను భారత ప్రభుత్వం గ్రనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా, రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ లను యుద్ధ కాలంలో అందించే మొదటి అత్యున్నత సైనిక పతకం “పరమ్ వీర్ చక్ర”తో సత్కరించింది. కెప్టెన్ అనుజ్ నయ్యర్, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, కెప్టెన్ గుర్జిందర్ సింగ్ సూరి, నాయక్ దిగేంద్ర కుమార్, లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, నాయక్ ఇమ్లియాకుం ఎఒ, కెప్టెన్ కీషింగ్ క్లిఫర్డ్ నాంగ్రుం, కెప్టెన్ నీకెజాకుఓ కెంగురూస్, మేజర్ పద్మపాణి ఆచార్య (హైదరాబాద్), మేజర్ సోనం వాంగ్చుక్, మరియు మేజర్ వివేక్ గుప్తా లను రెండవ అత్యున్నత సైనిక పతకం “మహా వీర్ చక్ర” పతకాలతో సత్కరించింది.

కార్గిల్ “విజయ్ దివస్” రజతోత్సవం సందర్భంగా మన దేశ సైనికులకు వినమ్రంగా ఒక ‘సెల్యూట్’ చేసి వారి పట్ల మనకు గల గౌరవాన్ని చాటుకుందాం. జై హింద్!

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News