Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Karnataka Assembly Elections 2023: కర్నాటక అసెంబ్లీ బరిలో నాలుగు స్థంభాలాట

Karnataka Assembly Elections 2023: కర్నాటక అసెంబ్లీ బరిలో నాలుగు స్థంభాలాట

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల రగడ అప్పుడే తారాస్థాయికి చేరింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. కర్నాటక రాజకీయ సంప్రదాయం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇక్కడ సర్కారు మారుతుంది. కాబట్టి ఓటరు తీర్పును అనుసరించి ప్రస్తుతం ప్రతిపక్షత్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవటం ఖాయం అనే సెంటిమెంట్ జోరుగా రగిలింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చిపడుతోంది. హేమాహేమీలు, ప్రముఖులు, సీనియర్ రాజకీయ నేతలు అంతా కాంగ్రెస్ టికెట్ల కోసం ఎగబడినంత పనిచేస్తున్నారు. దీంతో ఇక్కడ టికెట్ల కోసం పైరవీలు భారీ ఎత్తున సాగుతున్నాయి.

- Advertisement -

వీరిలో కొందరు ఆశావాహులంతా ఢిల్లీకి చక్కర్లు కొడుతుంటే కొందరు శివకుమార్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకొందరు మాజీ సీఎం సిద్ధరామయ్యను సాయం కోరుతున్నారు. ఇంకొందరు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై ఒత్తిడి తెస్తూ టికెట్ సంపాదించే పనిలో ఉన్నారు. మే 2023 నాటికి కర్నాటక అసెంబ్లీ గడువు తీరిపోతుంది.

సిద్ధు విషయానికి వస్తే ఆయన ఎప్పటిలానే తన సొంత స్టైల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ పోతున్నారు. ఇది డీకేకు అధిష్టానానికి కొత్త టెన్షన్లు తెచ్చిపెడుతోంది. పార్టీతో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండానే బాగల్కోట నియోజకవర్గానికి విజయానంద్ అభ్యర్థిత్వాన్ని సిద్ధు కన్ఫర్మ్ చేసేసి ప్రకటించేశారు. మాజీ ఎమ్మెల్యే విజయానంద్ ఫుల్ జోష్ లో ఉండి ఎన్నికల సన్నాహాకాలు ఇప్పటికే పూర్తిస్థాయిలో చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన తన బయోగ్రఫీని బయోపిక్ గా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారుకూడా. విజయానంద్ ట్రావెల్స్ పేరుతో అతిపెద్ద ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేస్తున్న ఈయన ఎలాగైనా మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు.

కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ఆశాజనంగా ఉన్నా లీడర్ల మధ్య ఉన్న పోటీ కారణంగా ఇక్కడ వర్గ పోరు మరింత ఎక్కువైంది. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఇప్పటికీ అధిష్ఠానం తేల్చకపోగా రాహుల్ పాదయాత్ర భారత్ జోడో యాత్రలోనూ సీఎం అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీకే, సీఎల్ పీ నేత సిద్ధూ ఇద్దరూ చెరోవైపు రాహుల్ వెంట నడిచారు. కాగా సందర్భం వచ్చినప్పుడు హైకమాండ్ సీఎం ఎవరన్న విషయంపై స్పష్టత ఇస్తుందని, ప్రస్తుతానికి రాష్ట్ర కాంగ్రెస్ సమైక్యంగా ఎన్నికలకు సిద్ధం కావాలని ఖర్గే పదేపదే చెబుతున్నారు. బీజేపీ ప్రచారం కోసం మోడీ, షా స్వయంగా ప్రజల వద్దకు వెళ్లారని ఇదే రీతిలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ముందు ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి వారిని కలవాలని ఖర్గే సూచిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఏ ఒక్క కాంగ్రెస్ నేత తిరగటం లేదు. ఎవరికి వారు తమతమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్టే అలాంటి ఫలితాలే కర్నాటకలో పునరావృతం కావాలని ఖర్గే కాంగ్రెస్ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. కాబట్టి హిమాచల్ స్ఫూర్తితో కాంగ్రెస్ ఇక్కడ పోరాటం చేస్తోంది. సొంత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పరువు కాపాడుకోవాలని ఖర్గే ఆరాటపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్న 1,300 మంది నేతలు ఇప్పటికే టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఒక్కో అప్లికేషన్ 5000 రూపాయలు కాగా, ఫిల్ చేసిన ఫార్మ సబ్మిట్ చేసేందుకు రెండు లక్షల రూపాయల డిపాజిట్ కేపీసీసీ పేరుతో కట్టాలి. 224 సీట్లున్న కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున పోటీ చేసందుకు ఇప్పటికే 1,300 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే కాంగ్రెస్ గెలుపు ఖాయమనే అర్థం కదా అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. విజయపురా అర్బన్, శివమొగ్గా వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇలా అప్లై చేసుకున్న వారి సంఖ్య 20 మందికి పైగా ఉండటం హైలైట్. దేవనహళ్లి (బెంగళూరు ఎయిర్ పోర్ట్ ఉన్న ప్రాంతం), మండ్యా వంటి నియోజకవర్గాల్లో 10 మందికి పైగా అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి కేపీసీసీకి ఉన్న నిధుల లేమిని అధిగమించడానికి వేసిన ఎత్తు కూడా కాసుల వర్షం కురిపించిందన్నమాట.

జేడీఎస్ మాత్రం బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్-జేడీఎస్ కూటమి ఈ ఎన్నికల్లో దిగుతుందా అన్నది తేలాల్సి ఉంది. మిషన్ 123 పేరుతో ఇప్పటికే జేడీఎస్ ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వర్చువల్ కాన్ఫరెన్సులు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరితో పొత్త పెట్టుకోవాలా అన్న యోచనలో ఉంది. కాగా జేడీఎస్ ప్రీ పోల్ అలయెన్స్ కు పోస్ట్ పోల్ అలయెన్స్ కు కూడా ఎప్పటిలానే సిద్ధంగా ఉంది.

ఇటు బీజేపీ కర్నాటక శ్రేణులు మాత్రం వీర జోష్ లో ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన ఘన విజయాల ప్రభావం కన్నడిగులపై మరింత సానుకూలంగా ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. పైగా మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించి, కర్నాటక రాష్ట్రానికి కమలనాథులు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను పదేపదే డప్పు కొట్టుకుంటున్నారు. ఇక రానున్న బడ్జెట్ 2023లోనూ ఎన్నికలు జరుగనున్న కర్నాటకపై కాస్త ఎక్కువ ప్రేమ చూపించేలా యూనియన్ బడ్జెట్ సిద్ధమవుతోంది కూడా. అధికార వ్యతిరేకత కాకుండా ప్రో-ఇన్కంబెన్సీని గుజరాతీలు చూపించినట్టే కన్నడిగులు కూడా తమపట్ల చూపుతూ ఎన్నికల్లో తీర్పు ఇస్తారని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై విశ్వాసం వ్యక్తంచేస్తుండటం విశేషం. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరిపి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా బొమ్మై బీజేపీ హైకమాండ్ కు లేఖ సంధించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోషించిన పాత్రనే కర్నాటక ప్రాంతీయ పార్టీ అయిన జనతా దళ్ సెక్యులర్ పోషిస్తుందనే అంచనాలు భారీగా వెలువడుతున్నాయి. కాగా ఆప్ మాత్రం 2023 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అదికూడా అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధమైపోయింది. మొత్తం 224 స్థానాల్లో తాము బరిలోకి దిగుతున్నట్టు కేజ్రీవాల్ అధికారిక ప్రకటన చేసేశారు. ఈమేరకు ఇప్పటికే సగం కసరత్తు చేసిన కేజ్రీవాల్ సగానికి పైగా అభ్యర్థుల తొలి జాబితాను జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఎన్నికలకంటే నాలుగు నెలల ముందే ఇలా అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసేందుకు స్వయంగా కేజ్రీవాల్ తరలివస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ అన్నీపీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాయని తాము అవినీతి రహిత పాలన అందిస్తామన్న విషయాన్ని ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగించనున్నట్టు కేజ్రీవాల్ స్పష్టంచేశారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో అవినీతి ప్రధాన అజెండాగా మారనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 170 నియోజకవర్గాల్లో గ్రామ సర్పంచ్ అభియాన్ పేరుతో ఆప్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను వినూత్నంగా అమలు చేస్తున్నట్టు ఆప్ కర్నాటక కన్వీనర్ పృథ్వి రెడ్డి వెల్లడించారు. ప్రతి పోలింగ్ బూతుకు 10 మంది కార్యకర్తలను నియమిస్తున్నట్టు పృథ్వి తెలిపారు. ఇలా కిందిస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తున్న ఆప్ రాష్ట్రంలోని ప్రముఖులకు ఇప్పటికే గాలం వేసి, టికెట్ ఇచ్చి బరిలో దింపే ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో ఉంది. రాష్ట్రంలో తమను 4వ పార్టీగా కాకుండా ‘జేసీబీ’కి ప్రత్యామ్నాయ పార్టీగా చూడాలని ఆప్ గట్టిగా చెబుతోంది. ‘జేసీబీ’ అంటే రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలకు మరోపేరుగా ఆప్ ఇక్కడ సంబోధిస్తోంది. అంటే జనతా దళ్ సెక్యులర్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అని జేసీబీకి అర్థం.

గతకొంత కాలంగా హిందుత్వ అజెండా, మోరల్ పోలీసింగ్ పేరుతో మతతత్వాన్ని రెచ్చగొడుతున్న శ్రీ రామ సేన కూడా ఇండిపెండెంట్లుగా కనీసం 25 మంది అభ్యర్థులను బరిలోకి దింపే పనిలో ఉన్నట్టు ఆ పార్టీ చీఫ్ ప్రమోద్ ముతాలిక్ వెల్లడించారు. ఇదే జరిగితే మంగళూరు వంటి ప్రాంతాల్లోని హిందూ ఓట్లు బీజేపీ నుంచి చీలటం ఖాయమనే అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News