Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Karnataka: కాంగ్రెస్‌కు కొత్త పాఠం

Karnataka: కాంగ్రెస్‌కు కొత్త పాఠం

వాస్తవానికి కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితలు ఊహించినవే. మొత్తం 224 శాసనసభ స్థానాలలో కాంగ్రెస్‌ 135 వరకూ చేజిక్కించుకోగలుగుతుందని చాలామంది ముందే అంచనా వేయడం జరిగింది.అనేక వర్గాలు, అనేక ప్రాంతాలు అనుకూలంగా ఓట్లు వేయడం వల్లే ఈ పార్టీ విజయం సాధించగలిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే, వాస్తవమేమిటంటే, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నందువల్లే కాంగ్రెస్‌ ఘన విజయం సాధించగలిగిందనే విషయాన్ని విస్మరించకూడదు. అంతేకాదు, జనతా దళ్‌ (సెక్యులర్‌)కు రాష్ట్రంలో గణనీయంగా మద్దతు తగ్గుముఖం పట్టడం కూడా కాంగ్రెస్‌ విజయానికి కొంత కారణం. మొత్తానికి బీజేపీ ప్రభుత్వంపట్ల వ్యతిరేకత పెరగడం, జనతా దళ్‌(ఎస్‌)కు మద్దతు తగ్గడం, మరో బలమైన పార్టీ లేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకోవాల్సి వచ్చింది. బీజేపీ కాంగ్రెస్‌ స్థానాలలో సగం స్థానాను దక్కించుకుంది కానీ, జనతా దళ్‌ మాత్రం దారుణంగా దెబ్బతింది. పైగా, బీజేపీకి, కాంగ్రెస్‌ పార్టీకి ఓట్ల శాతంలో ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ.
ఇక ఎన్నికల తర్వాత జనతా దళ్‌ (ఎస్‌) ఏ వైపు మొగ్గు చూపుతుందనేది అంతుబట్టని విషయమేమీ కాదు. 2018లో ఇక్కడ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు, ఆ పార్టీ శాసనసభ్యులు ఎవరికి మద్దతునిచ్చారో తెలిసిందే. మరోసారి హంగ్‌ ఏర్పడి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. నిజానికి, ఇది కాంగ్రెస్‌ వర్గాలు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురయిన ఫలితం ఇది. ఇవన్నీ కాకుండా, కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఈ పార్టీ ఐక్యంగా ఉండడం, ఎన్నికల విజయం మీదే దృష్టి పెట్టి ఒకే తాటి మీద నిలబడడం. ఇందుకు భిన్నంగా బీజేపీ అంతర్గత కలహాలతో అప్రతిష్ఠపాలయింది. ఇతరత్రా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్‌చేసిన న్యాయమేమీ లేదు, బీజేపీ చేసిన అన్యాయమేదీ లేదు. కాంగ్రెస్‌ స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టగా, బీజేపీ ఎక్కువగా జాతీయ అంశాలను మాత్రమే ప్రస్తావించింది. అంతేకాదు, బీజేపీ మీద ఎక్కువగా దుష్ప్రచారం జరగడం కూడా కాంగ్రెస్‌ విజయానికి చాలావరకు కారణం. విచ్ఛిన్నకర రాజకీయాలను అనుసరిస్తోందంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం ఈ పార్టీ మీద కొద్దిగా అపనమ్మకం కలిగించింది. అయినప్పటికీ, బీజేపీ నాయకులంతా ఒకే తాటి మీద నిలబడి ఉంటే కర్ణాటక ఫలితం మరోలా ఉండేదన్న సంగతి కాంగ్రెస్‌ పార్టీకి కూడా తెలుసు. కర్ణాటక స్థితిగతులను బట్టి చూస్తే ప్రస్తుతానికి కాంగ్రెస్‌ విజయం సాధించడం, బీజేపీఅధికారం నుంచి తప్పుకోవడం సబబేననిపిస్తుంది.
మొత్తానికి కర్ణాటక ఎన్నికలనుంచి ఈ రెండు ప్రధాన పార్టీలు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. బీజేపీ నాయకులు లేనిపోని అహంకారాలకు పోకుండా, కలిసికట్టుగా వ్యవహరించడం అలవరచుకోవాలి. మత వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇదే కారణాల మీద 2021లో పశ్చిమ బెంగాల్‌ చేదు అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది.ప్రాంతీయ ఆశయాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాంగ్రెస్‌ కూడా ఇలా ఒకే తాటి మీద నిలబడడాన్ని అలవరచుకోవాలి. లౌకికవాదం పేరుతో ఒక వర్గాన్ని చేరదీసి, మరొక వర్గాన్ని దూరం ఉంచడమనే పద్ధతికి ఇకనైనా స్వస్తిచెప్పాలి. మొత్తంగా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండడం మంచిది. ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాల విషయంలో వందేళ్ల క్రితం ఉన్న అభిప్రాయాలకు, ఇప్పటి అభిప్రాయాలకు తేడా ఉందని కాంగ్రెస్‌ అర్థం చేసుకోవాలి. మొత్తానికి కర్ణాటక ఓటర్లు ఈ రెండు జాతీయ పార్టీలకు సరైన గుణపాఠాలు నేర్పారనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News