Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Karnataka Elections: కర్ణాటక ఎన్నికలే కాంగ్రెస్‌కు ఆదర్శం

Karnataka Elections: కర్ణాటక ఎన్నికలే కాంగ్రెస్‌కు ఆదర్శం

మధ్యప్రదేశ్, తెలంగాణలో కర్నాటక కాంగ్రెస్ వ్యూహం అమలు

కర్ణాటకలో అనుసరించిన వ్యూహాన్నే మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా అనుసరించి, విజయం సాధించాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది. మరో ఆరు నెలల్లో మధ్యప్రదేశ్‌ శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు మధ్య సుమారు 1,450 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక సారూప్యతలున్నట్టు కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి అనుసరించిన వ్యూహాన్నే మధ్యప్రదేశ్‌లో కూడా అనుసరించవచ్చని, ఈ రెండు రాష్ట్రాలలోనూ ఒకే విధమైన రాజకీయ పరిస్థితులున్నాయని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను ఒకప్పటి కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ తన భుజాలకెత్తుకున్నారు. ప్రచారంలోనే కాక పాలనలోనూ ఆయన తనకంటూ ఒక ప్రత్యేక విశిష్టతను అభివృద్ధి చేసుకున్నారు.
నిజానికి, కర్ణాటక ఎన్నికల ప్రచార సారథి, ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్యకు, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచార సారథి కమల్‌నాథ్‌కు మధ్య వ్యక్తిత్వాలలో, వ్యవహారశైలిలో హస్తిమశకాంతరం తేడా ఉంది. కానీ, ఇద్దరికీ వారి వారి రాష్ట్రాలలో గణనీయమైన పలుకుబడి ఉంది. కాంగ్రెస్‌ వర్గాలలో కూడా వారికి పట్టు, పలుకుబడి ఉన్నాయి. మరో ఆరు నెలల్లో మధ్యప్రదేశ్‌ శాసనసభకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయనగా, కమల్‌నాథ్‌ కర్ణాటక బాణీలో ప్రచారానికి నడుంబిగించారు. జోరుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగిపోతోంది. ఎన్నికల కమిషన్‌ ఎన్నికల తేదీలను ప్రకటించేలోపే మొత్తం 230 స్థానాలకుగాను 80 శాతం స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి స్క్రిప్టును తయారు చేసిన ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సేవలను తాము కూడా వినియోగించుకోవాలని కమల్‌నాథ్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం సునీల్‌ కనుగోలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు క్యాబినెట్‌ హోదా కలిగిన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆయన బృందం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో పనుల్లో నిమగ్నం కావడం జరిగింది.
ఇక్కడ వివిధ సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం, కాంగ్రెస్‌ పార్టీయే ఇక్కడ అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాక, మూడు వారాల క్రితం పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లో పర్యటించి, ఈ రాష్ట్రంలో మొత్తం 230 శాసనసభా స్థానాలలో 150 స్థానాలను కాంగ్రెస్‌ అవలీలగా గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహానికి అంతులేదు. ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు వ్యతిరేకంగా ఉన్న వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం, ఓటర్లు మతపరంగా ఏకీకృతం కాకుండా నివారించడం ప్రస్తుతం కాంగ్రెస్‌ వ్యూహంలో ప్రధాన భాగాలు. రాష్ట్రంలో ఇటీవల హిజాబ్‌ వివాదం చెలరేగింది. మత మార్పిళ్లు, జిహాద్‌కు సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి అంశాలను కూడా కాంగ్రెస్‌ పరిగణనలోకి తీసుకుంటోంది. మతపరమైన అంశాల జోలికిపోకుండా హిందువులను తమ వైపునకు తిప్పుకోవాలని కమల్‌నాథ్‌ ఆలోచిస్తున్నారు. జబల్పూర్‌లో కాంగ్రెస్‌ హనుమంతుడి విగ్రహానికి, ఆయన గదకు కాషాయ రంగులు వేయడం, కొన్ని మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దాంతో బీజేపీ ఆ పార్టీకి ‘చునావీ హిందూ’ (ఎన్నికల హిందూ) అని పేరు పెట్టింది. కమల్‌నాథ్‌ హనుమంతుడి భక్తుడనే విషయం అందరికీ తెలిసిన విషయమే.
జ్యోతిరాదిత్య సింధియాతో పాటు గత 2020 మార్చిలో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన నాయకులను కమల్‌నాథ్‌ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌నుంచి వెళ్లిపోయిన కారణంగానే కమల్‌నాథ్‌ ప్రభుత్వం అప్పట్లో కుప్పకూలింది. కొందరు మాజీ కాంగ్రెస్‌ నాయకులుఇప్పటికే కమల్‌నాథ్‌కు సంకేతాలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా హస్తగతం చేసుకోవాలనేది బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఈ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు ఈ రాష్ట్రంలో పర్యటించిన ఈ నాయకులు త్వరలో మరిన్నిసార్లు పర్యటనలు జరిపే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News