వాస్తవానికి, కర్ణాటకలో సాధించిన ఘన విజయంతో కాంగ్రెస్ ఒక్క ఆ రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాల్సింది. కానీ, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు సీనియర్ నాయకులు దాదాపు సిగపట్టకు దిగడంతో ఆ ఉత్సాహమంతా నీరుకారిపోయినట్టయింది. ఈ దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు ఆనందపడుతున్న బీజేపీయేతర ప్రతిపక్షాలు కూడా ఈ పరిణామంతో గప్‌చుప్‌గా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగకుండా, అతి స్వల్పకాలంలోనే పరిష్కారం కావడం వారికి కాస్తంత ఊరటనిచ్చింది. అయిదేళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సిద్దరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. ఈసారి ఆయన పార్టీ ఆదేశాల మేరకు అనేక విషయాలతో రాజీపడి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించాల్సి వచ్చింది. కాగా, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి తనకే అన్ని అర్హతలూ ఉన్నాయంటూ మంకుపట్టు పట్టిన డి.కె. శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాకుండా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగడం జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విజయం సాధించే పక్షంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారడం జరుగుతుంది. శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాల్సి ఉంటుంది. నిజానికి, కాంగ్రెస్‌లో రెండు పదవులు నిర్వహించడం నియమ విరుద్ధమే అయినా శివకుమార్ విషయంలో ఈ నియమాన్ని కొద్ది కాలం పాటు సడలించాల్సి వచ్చింది. పార్టీలో వివాదాలు శ్రుతిమించకుండా ఉండేందుకు పార్టీ ఈ రాజీ మార్గాన్ని అవలంబించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా కల్పించుకోవడం వల్ల సమస్య పరిష్కారమైనప్పటికీ, పార్టీలో అనేక అంతర్గత వివాదాలను, విభేదాలను పరిష్కరించడంలో ఇప్పటికే నిష్ణాతుడైన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమస్య పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించారు. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండడం, బీజేపీని ఎదుర్కోవాల్సి ఉండడం, ప్రతిపక్షాల కూటమికి సారథ్యం వహించే సమస్య ప్రాధాన్యం సంతరించుకుంటుండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలో పార్టీ నాయకుల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం జరగడం పార్టీని కొద్దిగా ఇరకాటంలో పెట్టిన మాట నిజమే అయినప్పటికీ, మొత్తానికి ఖర్గే, శివకుమార్, సిద్దరామయ్య వంటి నాయకులు పరిణతి ప్రదర్శించి తక్కువ కాలంలోనే సమస్యను పరిష్కరించడం ప్రశంసనీయ విషయం. సామాజిక న్యాయంలో సిద్ధహస్తుడైన సిద్దరామయ్య, ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దగల శివకుమార్, అపర చాణక్యుడుగాపేరున్న మల్లికార్జున్ ఖర్గేలు లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీనిగెలిపించగలరనే నమ్మకం పార్టీ అధిష్ఠానానికి ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నాయకులంతా మత సామరస్యానికి, మతాల మధ్య సయోధ్యను పెంపొందించడానికి కట్టుబడిన నాయకులు.
కాగా, మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకలో అనుసరించిన ఎన్నికల వ్యూహాన్నే ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించి పార్టీని తిరిగి అందలం ఎక్కించగలరని కర్ణాటక నాయకుల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా నమ్మకం ఏర్పడుతోంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీ తీసుకు వచ్చిన ఖర్గే పైన ఇతర పార్టీలకు కూడా నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు ప్రాధాన్యం, ప్రాభవం తగ్గిపోయిందనే అభిప్రాయంతో ఉన్న ప్రతిపక్షాలకు కాంగ్రెస్ మళ్లీ ఆశాజ్యోతిగా కనిపిస్తోంది. ఇక కర్ణాటకను ఒక మోడల్‌గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సిద్దరామయ్య మీద ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పాలన మీద నమ్మకం ఏర్పడితే దేశవ్యాప్తంగా ఈ పార్టీ మీద నమ్మకం పెరిగే అవకాశం ఉంది.