Thursday, January 22, 2026
Homeఓపన్ పేజ్Rohith Vemula Bill: 'రోహిత్‌ వేముల' బిల్లును ప్రవేశపెట్టనున్న కర్ణాటక ప్రభుత్వం.. చట్టంగా మారితే చరిత్రాత్మకమే.!

Rohith Vemula Bill: ‘రోహిత్‌ వేముల’ బిల్లును ప్రవేశపెట్టనున్న కర్ణాటక ప్రభుత్వం.. చట్టంగా మారితే చరిత్రాత్మకమే.!

Rohith Vemula Bill by Karnataka Government: హైదరాబాద్ విశ్వవిద్యాలయం(UoH)లో 2016, జనవరి 17 న దళిత పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య.. దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దళిత విద్యార్థులపై వివక్షకు వ్యతిరేకంగా రోహిత్‌ కేసు కీలకంగా మారింది. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తరువాత, కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో కుల ఆధారిత వివక్ష, వేధింపులను అరికట్టడానికి వేముల రోహిత్‌ పేరు మీద బిల్లును ప్రవేశపెట్టనుంది.. ‘ది కర్ణాటక రోహిత్‌ వేముల (బహిష్కారం లేదా అన్యాయం నిరోధక) (విద్య, వ్యక్తిత హక్కు) బిల్లు–2025’ అని నామకరణం చేశారు. 

- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం

రోహిత్‌ వేముల సభ్యుడిగా ఉన్న అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) మరియు RSS అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మధ్య వివాదం కారణంగా రోహిత్‌కు స్కాలర్‌షిప్‌ను నిలిపివేసి హాస్టల్ నుంచి బహిష్కరించారు. దీంతో తీవ్ర మనస్తాపంతో జనవరి 17, 2016న వేముల UoH క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. వేముల తన సూసైడ్ నోట్‌లో కుల వివక్షను నిరసిస్తూ, “నా జననం నా ప్రాణాంతక ప్రమాదం” అని పేర్కొనడం యావత్‌ దేశాన్ని కలచివేసింది. విద్యాసంస్థల్లో దళితులతో పాటు ఇతర అణగారిన వర్గాలపై వివక్ష, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతని మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

Also Read: https://teluguprabha.net/national-news/important-trains-cancelled-due-to-winter-season/

ఈ క్రమంలో మే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘వేముల’ చట్టం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక భాగంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్యకు, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎ. రేవంత్ రెడ్డి , సుఖ్‌వీందర్ సింగ్ సుఖులకు లేఖలు పంపారు. విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను నివారించడానికి వేముల పేరు మీద చట్టం తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు డిసెంబర్ 8-19 తేదీల్లో జరగనున్న శీతాకాల సమావేశాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వం రోహిత్‌ వేముల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చినట్లయితే చరిత్రాత్మకం కానుంది. కర్ణాటకలో రోహిత్‌ వేముల, 2025 బిల్లు ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సమస్యలను పరిష్కరించడంలో కీలకం కానుంది. ఈ బిల్లును పరిశీలించిన కొంతమంది విద్యావేత్తలు, న్యాయ నిపుణులు.. ఆమోదం పొంది చట్టంగా మారినట్లయితే “కులం ఆధారంగా వివక్షత, వేధింపులు, దౌర్జన్యాలను” అణిచివేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కులం ఆధారంగా వివక్ష కేసుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి పౌర పరిష్కారాలను ఈ చట్టం చూపిస్తుంది. అంతేకాకుండా వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై జరిమానాలను విధిస్తుంది. విద్యా సంస్థల్లో లైంగిక వేధింపుల కేసులకు సంబంధించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ మాదిరిగానే రోహిత్‌ వేముల బిల్లు.. ఈక్విటీ కమిటీ ఎదుట ఫిర్యాదు చేయవచ్చు. ఆ తర్వాత ఈ విషయాన్ని జిల్లా కోర్టులు మరియు హైకోర్టుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Also Read: https://teluguprabha.net/international-news/whatsapp-will-be-banned-soon-in-russian-government/

బాధితులు ఎవరైనా కావచ్చు

అయితే ఈ బిల్లును కేవలం విద్యార్థులకే పరిమితం చేయలేదు. కుల వివక్షను ఎదుర్కొన్న వ్యక్తి ఏదైనా ఉన్నత విద్యా సంస్థకు చెందిన విద్యార్థి కావచ్చు.. అధ్యాపక సభ్యుడు లేదా బోధనేతర సిబ్బంది కావచ్చు.. బాధితులు ఏ విభాగానికి చెందిన వారైన విస్తృత వివక్షను పరిష్కరిస్తుందని బిల్లు పేర్కొంది. ప్రవర్తన, వ్యవహారశైలి, బహిష్కరించడం, మినహాయించడం, వారిపట్ల అనుసరించే తీరు, ఆచారాలు, ప్రమాణాలు, అభ్యాసాల్లో తేడాలు.. వీటిని వివక్షగా పరిగణిస్తారు. ఈ బిల్లు.. వివక్ష అనేది పరోక్ష లేదా సంస్థాగతంగా లేదా రెండూ కావచ్చునని పేర్కొంది. ‘పరోక్ష వివక్ష’లో కులంతో సంబంధం లేని వ్యాఖ్యలు లేదా చర్యలు ఉండొచ్చు. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఏదైనా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే చర్యలు దీని పరిధిలోకి వస్తాయి.

ఇక ‘సంస్థాగత వివక్ష’లో చట్టబద్ధమైన ఆదేశాలు లేదా కార్యనిర్వాహక మండలి, విద్యా మండలి లేదా పరిశోధన సమీక్ష కమిటీలు వంటి పాలక సంస్థల స్థాపన, పనితీరు ఉండవచ్చు. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులపై ప్రతికూల ప్రభావాన్ని సృష్టించడం అనేది సంస్థాగత వివక్ష పరిధిలోకి వస్తుంది. అంతేకాకుండా ఈ బిల్లు అట్రాసిటీ ఇంకా వివక్షత మధ్య వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తుంది. అట్రాసిటీ ‘షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989లోని సెక్షన్ (3) కింద సవరణ చట్టాన్ని సూచిస్తుంది. విద్యా సంస్థలో తరగతులు, హాస్టళ్లు, ఆరోగ్య కేంద్రాలు, క్రీడా మైదానాలు, సిబ్బంది గృహాలు, పార్కులు, వీధులు వంటి పబ్లిక్‌ ప్లేసులు, క్యాంటీన్లు, రవాణా సౌకర్యాలు మొదలైన వాటితో సహా బోధన, పరిశోధన, పరిపాలన, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ఇలా పలు చోట్ల వేధింపులను ఎదుర్కొంటే అట్రాసిటీగా పరిగణిస్తారు. 

జరిమానాలు, జైలు శిక్ష

రోహిత్ వేముల 2025 బిల్లు.. దాని నిబంధనల ప్రకారం వివిధ నేరాలకు వ్యక్తులు లేదా సంస్థలపై వేర్వేరు జరిమానాలను విధిస్తుంది. వివక్షకు సంబంధించి వ్యక్తులకు లిఖిత పూర్వక క్షమాపణ చెప్పడమే అతి తక్కువ శిక్ష అని ఈ బిల్లు నిర్దేశిస్తుంది. ఇక అట్రాసిటీ కేసుల్లో కఠినమైన శిక్షలను నిర్దేశిస్తుంది. అట్రాసిటీ నిబంధనల ప్రకారం మొదటి నేరానికి కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ. 10,000 జరిమానా విధించవచ్చు. బాధితుడికి రూ. లక్ష వరకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. ఓ వ్యక్తి పదే పదే అట్రాసిటీకి పాల్పడితే రూ. 1 లక్ష జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 

ఇక ఉన్నత విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ నేరానికి కనీసం రూ. 1 లక్ష నుంచి గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు జరిమానాను కోర్టు విధిస్తుంది. అంతేకాకుండా, అటువంటి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం లేదా గ్రాంట్ అందించదని బిల్లు చెబుతోంది. ఉన్నత విద్యా సంస్థలో ఎక్కడైనా జరిగే ఏదైనా వేధింపులు, వివక్షత లేదా అట్రాసిటీ శిక్షార్హమని బిల్లు నిర్దేశిస్తుంది. విద్యాసంస్థల పరిధిలోని హాస్టళ్లలో లేదా సంబంధిత ప్రదేశాల్లో విద్యార్థులు వివక్షను ఎదుర్కోకుండా నిర్వాహకుల బాధ్యతను ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News