Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Kejriwal only dream: కేజ్రీవాల్ టార్గెట్ ఎర్రకోటలో ప్రసంగించడమే

Kejriwal only dream: కేజ్రీవాల్ టార్గెట్ ఎర్రకోటలో ప్రసంగించడమే

పీఎం అని కాదు నన్ను అప్డా నరేంద్ర భాయి అని పిలవమంటున్న మోడీ కేజ్రీవాల్ ఆశలకు గండికొట్టడంలో విజయం సాధిస్తారా? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టు కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా? ఆప్ కు జాతీయ పార్టీ హోదా దక్కడం ఖాయమా? ఇంతకీ కేజ్రీవాల్ టార్గెట్ నెక్ట్స్ పార్లమెంట్ ఎన్నికలా? ఇందుకు ఆయన అప్పుడే రోడ్ మ్యాప్ రెడీగా పెట్టుకున్నారా? నిజమా? ఇంత దీర్ఘ కాలిక ప్రణాళిక సిద్ధం చేయటం, అమలు చేయటం సాధ్యమా? ఇప్పటివరకూ కేజ్రీవాల్ సాధించినదంతా ఇలాంటి ముందస్తు ప్రణాళికలతోనేనా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు గుజరాత్, దేశ రాజకీయాలపై అసలు ప్రభావం చూపే అంశాలన్నది మాత్రం సత్యం. అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఆప్ ను కట్టడి చేయటాన్ని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంటే, ఆప్ కు మూకుతాడు వేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

- Advertisement -

మోడీ ఎమోషనల్ స్పీచ్ గుజరాత్ లో హైలైట్ కావటం వెనుక కూడా కేజ్రీవాల్ పార్టీ ఉందనే విషయం చాలామందికి తెలియదు. “నేను ఢిల్లీలో పీఎంనే కానీ ఇక్కడ ఉన్నంతసేపు నన్ను అప్డా నరేంద్ర భాయి అని పిలవ”మని మోడీ ఎన్నికల సభల్లో ప్రసంగించడాన్ని గుజరాతీలను సగర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తోంది. ఇవన్నీ ఆప్ కు ఏమాత్రం ఓట్లు పడకుండా చేసేందుకే కమలనాథులు అనుసరిస్తున్న పక్కా వ్యూహం. గుజరాత్ ను క్లీన్ స్వీప్ చేస్తూనే, కాంగ్రెస్ తోపాటు ఆప్ ను చావు దెబ్బ కొట్టాలని, ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా తమ పని అవుతుందని మోడీ, షా ద్వయం కసరత్తు చేస్తున్నారు.

ఇటు కాంగ్రెస్ కూడా ఎంతోకొంత తన ఉనికిని చాటుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గుజరాత్ కాంగ్రెస్ ప్రచారాల్లో పెద్దగా హైలైట్స్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేవు. భవిష్యత్తులో సీఎం కావాలని తాపత్రయ పడుతున్న జిగ్నేష్ వంటివారే కాస్త దూకుడుగా మాటలు ప్రయోగిస్తూ, వార్తల్లో నిలుస్తున్నారు. గుజరాత్ లో ఓ “సైలెంట్ వేవ్” రావటం ఖాయమని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుకు దిస్కూచిగా మారతాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే, దళిత్ లీడర్ జిగ్నేష్ మేవాని జోస్యం చెబుతున్నారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో 120 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జిగ్నేష్ చెబుతుండటం కాంగ్రెస్ శ్రేణులకే ఆశ్చర్యం కలిగిస్తోంది. నిరంకుశత్వం, నిరుద్యోగిత, ధరాఘాతానికి సరైన జవాబు గుజరాతీ ఓటరు చెబుతాడని ఆయన విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు రాక తప్పదని ఆయన డీకోడ్ చేస్తుండటం కొత్తగా ఉంది.

కేవలం 33 సీట్లతో, 30.74 శాతం ఓట్ షేర్ తో 1990లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోవటం ఖాయమని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈసారి సుమారు 50 స్థానలతోనే కాంగ్రెస్ సరిపెట్టుకునే పరిస్థితి దాపురించేలా పరిస్థితులున్నట్టు తెలుస్తోంది. ఇలా జరిగితే ఆప్ కు రెండవ స్థానం ఇచ్చి మూడవ స్థానంతోనే కాంగ్రెస్ సర్దుకోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే పార్టీని వీడి బీజేపీలో చేరిన వారు చాలా ఎక్కువ కావటంతోపాటు తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలోకి కూడా కాంగ్రెస్ నుంచి వలసలు పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడింది. గత కొన్నేళ్లుగా గుజరాత్ కాంగ్రెస్ కు సరైన నేతలు, జనాకర్షణ ఉన్న లీడర్లు లేకపోవటంతో గుజరాత్ కాంగ్రెస్ లో నాయకత్వ లేమి అతిపెద్ద సవాలుగా మారింది. “నాయకుడు లేని, నాయకత్వం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటెలా వేస్తామ”ని చాలామంది గుజరాతీలు అడుగుతున్న కామన్ కొషన్.

హర్యానా స్థానిక ఎన్నికల్లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ మంచి దూకుడు మీద ఉంది. ఇటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ఆప్ ధీమా వ్యక్తంచేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ అధికారంలోకి వచ్చేది తామే అని కేజ్రీవాల్ టీం పదేపదే పబ్లిసిటీ చేసుకుంటోంది. గత కొన్ని నెలలుగా ఆప్ ఇక్కడ కార్యక్రమాలను పెద్ద ఎత్తున, గ్రామస్థాయి నుంచి చేసుకుని వస్తున్నా, బీజేపీ కోటలో పాగా వేయటం అంత ఈజీగా కాదు. మహా అయితే కేజ్రీవాల్ పార్టీ ఇక్కడ నెంబర్ 2 గా అవతరించవచ్చు.

ఇక జాతీయ పార్టీ హోదా విషయానికి వస్తే ఆప్ కు గుజరాత్ లో కేవలం రెండంటే రెండు సీట్లు వచ్చినా చాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇక జాతీయ పార్టీగా అవతరిస్తుంది. దీని ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా ఉంటుందని అంచనా వేసిన బీజేపీ ఆప్ ను ఒక్క సీటు కూడా గెలవనివ్వకుండా “మిషన్ జీరో” అన్న కాన్సెప్ట్ తో ప్రచారంలో దూసుకుపోతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి జాతీయ పార్టీగా అవతరించాలనేది కేజ్రీవాల్ కలగా ఉన్న ప్రస్తుత తరుణంలో గుజరాత్ ఎన్నికలు ఆప్ కు చావో రేవోగా మారాయి. ప్రధాని పీఠాన్నిఎక్కి దేశాన్ని పాలించాలనే ఏకైక కల సాకారం దిశగా కేజ్రీవాల్ పకడ్బందీ ప్రణాళికను 2011 నుంచి ప్రారంభించారని ఆయన్ను బాగా ఎరిగినవారు చెబుతారు. ఇందులో భాగంగానే ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజా జీవితంలోకి ఆర్భాటంగా అడుగు పెట్టి, తన ఇమేజ్ ను చాటుకున్నారు. ఎప్పటికైనా ఎర్రకోట బురుజు నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయాలనేదని కేజ్రీవాల్ లక్ష్యం.

ఆప్ అంతర్గత సర్వే చెబుతున్న విషయాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 18 శాతం వోట్ షేర్ దక్కుతుందని, బీజేపీకి 36 శాతం దక్కితే, ఆమ్ ఆద్మీకి 34శాతం ఓట్ షేర్ దక్కుతుందని ఈ సర్వే సారాంశం. ఇదే నిజమైతే 2023లో తానే మోడీకి అసలైన పోటీదారుడని కేజ్రీవాల్ ప్రచారం షురూ చేసి, దేశమంతా ఊదరగొట్టడం ఖాయమని ఢిల్లీ సర్కిల్స్ లో ఆసక్తికరమైన సరికొత్త రాజకీయ సమీకరణాలపై చర్చలు సాగుతున్నాయి. అలాంటప్పుడు మరోమారు కాంగ్రెస్ సాయాన్ని కేజ్రీవాల్ అభ్యర్థించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, గోవాల్లో రాష్ట్ర పార్టీగా ఆప్ కు గుర్తింపు దక్కగా గుజరాత్ లో 6 శాతం ఓట్లు దక్కి, 2 సీట్లు వచ్చినా గుజరాత్ రాష్ట్రంలో ఈ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు దక్కుతుంది. ఇలా గుజరాత్ లో కూడా గుర్తింపు సంపాదించుకుంటే 4 రాష్ట్రాల్లోనూ ఉన్న పార్టీ కాబట్టి జాతీయ పార్టీ హోదా ఆటోమేటిక్ గా దక్కుతుంది. దీనికి చెక్ పెట్టేందుకే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నానా తంటాలు పడుతున్నాయి.

2023లో 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాబట్టి ఆప్ మరోసారి తన ఉగ్ర రూపాన్ని చాటుకునేందుకు ఛాన్స్ వస్తుందని అప్పుడే వాటికి కూడా రోడ్ మ్యాప్ రెడీగా పెట్టారు కేజ్రీవాల్. కనీసం మరో 10 ఏళ్ల వరకు అవసరమైన పొలిటికల్ రోడ్ మ్యాప్ ను ముందుగా సిద్ధం చేసుకోవటం కేజ్రీవాల్ కు ముందు నుంచీ ఉన్న అలవాటే. త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, కర్నాటక, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సత్తా చాటుకునే అవకాశం ఎలాగూ ఉండనే ఉంది. కాబట్టి గుజరాత్ ఎన్నికల్లో అయితే ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్టు ప్లాన్ బీ, ప్లాన్ సీని కూడా కేజ్రీవాల్ రెడీగా పెట్టుకున్నారు.

ఒకవేళ గుజరాత్ లో సంఖ్యాపరంగా, ఓట్ షేర్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం కేజ్రీవాల్ మరింత దూకుడుగా తక్షణం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు మరో ప్లాన్ రెడీగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలపై పట్టు, బేస్ లేదు కనుక, కర్నాటకపై ఫోకస్ పెట్టేందుకు కేజ్రీవాల్ ఆసక్తి చూపుతున్నారు. కానీ హిందీ మాట్లాడే రాష్ట్రాలపై ఆయనకు మంచి పట్టున్నందున ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల రాజకీయాలపై గట్టిగా దృష్టి పెడుతున్నారు. ఇక్కడ కూడా కేజ్రీవాల్ పార్టీకి ఎటువంటి వ్యవస్థా లేకపోయినా మొండిగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే చర్యలు మాత్రం చేపట్టే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే రాజస్థాన్ లో గెహ్లాట్, సచిన్ పైలట్ రచ్చ కారణంగా కాంగ్రెస్ ఇక్కడ అప్రతిష్టపాలై, ప్రజల్లో చులకన అయింది. ఈనేపథ్యంలో అచ్చం పంజాబ్ స్టైల్ రాజకీయాలు చేసి, రాజస్థాన్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కలలు కంటోంది. ఎక్కడ కాంగ్రెస్ వీక్ అయితే అక్కడ ఆప్ ఎంటర్ అయి, బలపడుతోంది. ఇది పొలిటికల్ సెంటిమెంట్ గా కూడా మారిపోయింది. కాంగ్రెస్ ఓట్లను తన ఖాతాలో వేసుకోవడం ఆమ్ ఆద్మీ స్ట్రాటెజీకూడానూ. సో పంజాబ్ ఎక్స్ పరిమెంట్ నే ఎడారి రాష్ట్రంలోనూ ఫాలో అయ్యే మాస్టర్ ప్లాన్ లో ఢిల్లీ సీఎం తలమునకలై ఉన్నారట.

ఇక హిందూ ఓటర్లు అత్యధికంగా ఉన్న జమ్మూపై ఎప్పుడో దృష్టిసారించారు కేజ్రీవాల్. అతి త్వరలో జమ్మూ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖలో కూడా హుషారు వచ్చి, వరుసపెట్టి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జమ్మూ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సై అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అందుకు రెడీగా ఉండేలా ఏర్పాట్లు తెరవెనుక ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. సాఫ్ట్ హిందుత్వ అజెండాతో ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చురుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటూ తానో జాతీయ వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు సర్వం ఒడ్డుతున్నారు కేజ్రీవాల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News