Corruption allegations against Minister’s OSD : “కాసులిచ్చుకో.. కాలుష్యం చేసుకో!” – ఇది రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో ఓ ఉన్నతాధికారి నినాదంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న సుమంత్‌పై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ అధికారి అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, దానికి కులం రంగు పులమడం, “పార్టీ అంతర్గత విషయం”గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి…? అసలు సుమంత్ బాగోతమేంటి..?
తనకు చెందిన వ్యక్తిని తన కోటరీలోని వ్యక్తిని ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించడాన్ని కొండా సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఓఎస్డీగా విధులు నిర్వహించే సుమంత్ చేసిన లావాదేవీలు జరిపిన మంత్రాంగాల గురించి తెలుగుప్రభ ముందే బయటపెట్టింది. అసలు ఇటువంటి ఓఎస్డీలు ఏయే నిబంధనల ప్రకారం ఉద్యోగంలో నియమింపబడాలి?, అలాగే వారి విధులు ఏ పరిమితుల లోపల ఉండాలి అన్న అంశాలను కూడా వరుస కథనాల్లో ప్రస్తావించింది. సాధారణంగా ఆయా మంత్రులు తాము నమ్మిన వ్యక్తికి అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ, తమ కార్యకలాపాలు చక్కబెట్టడం అనేది సాధారణ విషయం. కానీ, ఇక్కడ జరిగింది అంతకు మించి. అటవీ శాఖ, పర్యావరణ శాఖ, దేవాదాయ శాఖల్లో సుమంత్ తన పరిధిని దాటి వ్యహరించిన విషయాలు.. ఆయా శాఖ అధికారులకు ఉన్నతాధికారులకు బహిరంగంగా తెలిసిన విషయమే. ఈ మధ్యనే రిటైర్ అయిన ఓ ఐఎఫ్ఎస్ ఉన్నతాధికారి కార్యాలయంలోకి వెళ్లి, ఆయన సీటులోనే కూర్చుని, ఆయా అధికారులతో రివ్యూ చేసిన సంఘటనలు కూడా ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ప్రస్తావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ కు మొదటి ఫిర్యాదు అందిందే ఇక్కడి నుంచి అని కూడా చెబుతున్నారు. ఆ తరువాత వరుసపెట్టి పర్యావరణ సంబంధ విషయాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రతి నెలా కాలుష్య నియంత్రణా మండలి రాష్ట్ర కార్యాలయంలో జరిగే టాస్క్ ఫోర్స్ కమిటీ విచారణలో జోక్యం చేసుకున్న విషయం దగ్గరి నుంచీ ఆయా శాఖల సిబ్బంది బదిలీల్లోనూ తన చేతివాటంపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. కాలుష్య నియంత్రణా మండలి ఆయా ఫార్మా, సిమెంట్ కంపెనీల భవిష్యత్ ను నిర్ధారించగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే దక్కన్ సిమెంట్ కంపెనీ కానీ మరో సిమెంట్ కంపెనీ గానీ అలాగే రసాయన పరిశ్రమలు కానీ వారి ఉత్పత్తి క్రమంలో చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని కలుషితం చేయటం పీసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవటం టాస్క్ ఫోర్స్ విచారణ చేపట్టడం వారిపై తూతూ మంత్రపు చర్యలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇక్కడ పరిపాటే.
కాలుష్యం చేస్తూ చిక్కినప్పుడల్లా ఆయా కంపెనీల యాజమాన్యాలు వారివారి స్థాయిలను బట్టి సచివాలయం కేంద్రంగా పైరవీలు చేసుకుంటూ పీసీబీ అధికారులపైన ఒత్తిడి పెంచి చర్యలు తీసుకోకుండా నిలువరిస్తుంటారు. ఇది ఆయా టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికలను పరిశీలిస్తే ఏమాత్రం భాషాపరిజ్ఞానం ఉన్నవారికైనా ఇట్టే అర్థమవుతుంది, దానికోసం సాంకేతికత రసాయన శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు. సరిగ్గా ఈ లోపాన్నే ఒడిసి పట్టిన సుమంత్ పీసీబీ ఉన్నతాధికారుల నుంచి మొదలుపెడితే పారిశ్రామిక వర్గాలపైన ఒత్తిడి పెంచారు. బీఫార్మసీ చదివిన సుమంత్ కు ఈ విషయం ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. తను ఆయా అధికారులతో, పారిశ్రామికవేత్తలతో, పరిశ్రమల లైజనింగ్ సిబ్బందితో నెరిపిన లావాదేవీలు, సంభాషణలు లోతుగా విచారిస్తే అవన్నీ బట్టబయలవుతాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఓ పరిశ్రమకు పీసీబీ మూసివేత ఉత్తర్వులు సిద్ధం చేయగా వాటిని అధికారులపై ఒత్తిడి తెచ్చి రద్దు కూడా చేసి, కాలుష్య నివారణా సూచనలు చేసేశాడు. ఈవిధంగా గుమ్మడిదల నల్లచెరువు కేసులోనూ, అదే నియోజకవర్గం జిల్లెలవాగు కేసులోనూ తన ప్రతిభ చూపాడు. ఇదంతా ఒకెతె్తౖతే అరబిందో పరిశ్రమపై ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కాలుష్యం తగ్గించకపోతే కాల్చివేస్తానన్న హెచ్చరిక తరువాత జరిగిన పరిణామాలలోనూ అయ్యగారి ఒత్తిళ్లు అధికారులపై ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అలాగే నల్గొండ కాలుష్య నియంత్రణా మండలి ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఫార్మా, సిమెంట్ కంపెనీలపై తను చేపట్టిన “కాసులిచ్చుకో కాలుష్యం చేసుకో” నినాదం అక్కడి పారిశ్రామిక వాడలో పెను సంచలనం. ఇవన్నీ కలగలిపిన సమాచారం తెలుగుప్రభకు అంశాలవారిగా అందింది. కాలుష్యంపై ఫిర్యాదు చేసిన స్థానికులు ఆపై కాలుష్య నియంత్రణా మండలిలో దశలవారిగా జరిగిన టాస్క్ ఫోర్స్ విచారణను సైతం కమిటీ చేపట్టిన నామమాత్రపు చర్యల సారాంశం కూడా తెలుగుప్రభ సమీకరించింది. ఇంత కాలుష్యం ఓ ప్రైవేటు వ్యక్తి ఎలా చేయగలడన్నది ప్రధాన ప్రశ్న.
సుమంత్‌పై ఎందుకీ పట్టుదల : కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీకి చెందిన ఎంపీ మల్లు రవి రెండు రోజులుగా మంత్రి సురేఖపై జరుగుతున్న విషయాలన్నీ కాంగ్రెస్ అంతర్గతమని, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక వారు తమ అభిప్రాయాలను మీడియా ముందు బహిరంగంగా ప్రకటిస్తారని సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపారు. ఆయన చెబుతున్నట్టు ఇది కేవలం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైతే మీడియా మాట్లాడే అవసరమే లేదు. కొండా సురేఖ రాష్ట్ర మంత్రి, ఆమె వద్ద పనిచేస్తున్న ఓఎస్డీ ప్రభుత్వ జీతం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాడు. మంత్రికి బదులుగా ఆయా శాఖల అధికారులతో రివ్యూలు చేస్తూవచ్చాడు. ఇలా చేసిన క్రమంలోనే కోట్ల రూపాయల తప్పిదాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రజలకు నిఖార్సైన పరిపాలన అందించటం కోసం ప్రమాణం చేసిన ఈ మంత్రి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం ఎలా అవుతుంది. బాధ్యత గల మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన విషయంపై పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అప్పటికే తెలుగుప్రభ సుమంత్ వ్యవహారాన్ని పతాక శీర్షికలో ప్రచురించింది. అలాగే ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. ఒక వ్యక్తి చేస్తున్న అక్రమాలపై నియమించిన శాఖ చర్యలు తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా అవుతుంది? అంటే పరోక్షంగా సుమంత్ లాంటి వ్యక్తులను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందని పరోక్షంగా ప్రజలకు చెప్పదలచుకున్నారా అని తెలంగాణ సమాజం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది.
బీసీ ఎవరు : సుమంత్ ను విచారణ కోసమో, అరెస్టు చేయటం కోసమో తెలియదు కానీ బుధువారం రాత్రి మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చినప్పుడు మంత్రి కుమార్తె సుష్మిత పోలీసులతో వాగ్వాదం చేశారు. తాను మీడియా వేదికగా వేం నరేందర్ రెడ్డి మొదలు నల్గొండ జిల్లాకు చెందిన అనేక మంది పేర్లు ప్రస్తావిస్తూ మాపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రెడ్లు మా బీసీలను తొక్కేస్తున్నారంటూ ఇక్కడ ఓ కులాన్ని కులచిచ్చు రేపడానికి ప్రయత్నించారు. అసలు 14వ తేదీ రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి సుమంత్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాక జరిగిన పరిణామాలే ఇవన్నీ. ఇంతకీ సుమంత్ ఎవరు సుమంత్ బీసీనా అని విచారణ చేస్తే కళ్లు బైర్లుకమ్మే విషయాలు బయటపడ్డాయి. బీసీ పదానికి, సుమంత్ కు సంబంధం లేదు. సుమంత్ ఇంటిపేరు నార్ల. సుమంత్ తల్లిదండ్రులు నార్ల సుబ్రహ్మణ్యం, నార్ల సుగుణలు. తండ్రి రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి. వీరిది కమ్మ కులం. ఈ కుటుంబం ఆంధ్రా నుంచి వలస వచ్చిన కుటుంబం. ఇప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కడి నుంచి వచ్చింది. పారిశ్రామికవేత్తలను కాలుష్యం పేర అటవీ శాఖ అధికారులను బదిలీ పేర దేవాదాయ శాఖ ఉద్యోగులను రకరకాల వేధింపులతో ఆ మంత్రి పేషీనే గబ్బు పట్టించిన సుమంత్ కోసం ఎందుకు కొండా సురేఖ అంత తాపత్రయ పడుతున్నారన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
లోగుట్టు ఇదీ : అందుబాటులో ఉన్న ఓ సమాచారం ప్రకారం సుమంత్ తొలి రోజుల్లో ముందూ వెనకా చూసుకోకుండా కొందరు పారిశ్రామిక వేత్తలతోటి తాను సాగించిన సంభాషణ ప్రకారం ఇదంతా తాను చేస్తోంది మంత్రి కోసం అంటూ చెప్పుకున్నారు. కొన్ని చోట్ల ఆయా వర్గాలు వీటిని అత్యంత చాకచక్యంగా రికార్డు చేసినట్టు కూడా సమాచారం. ఇప్పుడు వీటిని బయటపెడితే మీ అంతు చూస్తామంటూ కొండా వర్గీయులు బాహాటంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఇక్కడ చూస్తే తప్పు చేసిన వ్యక్తిని ప్రభుత్వం తొలగించింది. దీన్ని ఇక్కడతో మంత్రి వదిలిపెట్టి ఉంటే విషయం మరోలా మనకు అర్థమయ్యేది. కానీ కొండా సురేఖ కుటుంబం యావత్తూ దీన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకోవటంతోనే అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి దీనిపై ప్రత్యేక సిట్ విచారణ జరిపి, ఆ శాఖలో జరిగిన కలుషిత లెక్కలు కాలుష్యం పేరుమీద జరిగిన వసూళ్లను, పీసీబీ రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్గాల్లోనే వినపడుతుండటం విశేషం.
భగ్గుమంటున్న బీసీ సంఘాలు : బీసీల రిజర్వేషన్లు, బీసీ సాధికారత కోసం ఒకవైపు బీసీలంతా పార్టీలకతీతంగా ఐక్యమవుతుంటే ఈ మంత్రేంటి బీసీ నినాదాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుమంత్ అక్రమాలను దాచిపెడుతున్నారంటే ఆయన అక్రమాల్లో పాలుపంచుకున్నట్టే అని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్న బీసీ ఉద్యమాన్ని ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన నీరుగార్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. తమ సామాజిక వర్గానికి మచ్చ తెచ్చే ఇలాంటి చర్యలు ఖండిస్తున్నామని బీసీ నేతలు చెబుతున్నారు.
సెటిల్ చేస్తామని పార్టీ పెద్దలు చెప్పారు: కొండా సురేఖ : ‘గత కొన్ని రోజులుగా నాకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలను గురువారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు వివరించా. పోలీసులు వచ్చిన సమయంలో చోటుచేసుకున్న డ్రామాను కూడా తెలియచేశా. నా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. సెటిల్ చేస్తామని పార్టీ పెద్దలు చెప్పారు. మిగిలిన విషయాలు వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా’ అని చర్చల అనంతరం మంత్రి సురేఖ మీడియాతో అన్నమాటలివి. ఈ మాటలు బట్టి ఆమె సమస్యలేంటో, కాంగ్రెస్ పెద్దలు ఏం సెటిల్ చేస్తామన్నారో అది ఆమెకు, ఆ పార్టీ పెద్దలకే తెలియాలని సామాన్యులు చర్చించుకుంటున్నారు.


