Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Labour policy according Gandhiji: గాంధీజీ దృష్టిలో కార్మిక విధానాలు

Labour policy according Gandhiji: గాంధీజీ దృష్టిలో కార్మిక విధానాలు

కార్మిక సమస్యల పరిష్కరానికి ట్రస్టీషిప్‌ సిద్ధాంతం

‘కోటీశ్వరులు, పెట్టుబడుదారులూ లేకుండా దేశం మనగలుగుతుంది. కానీ శ్రామికులు లేకుండా మన లేదు…’ అన్నారు గాంధీజీ. ఇది ఎప్పటికీ అక్షర సత్యం. బ్రిటీషు వారితో ప్రత్యేక తరహాలో పోరాడి, భారతదేశానికి స్వాతంత్య్రం సముపార్జించి పెట్టిన మహనీయుడు పూజ్య బాపూజీ. తాను నమ్మిన ప్రేమ, సత్యం, అహింస అనే సిద్ధాంతాల ద్వారా ఆయన ఎన్నో రంగాల్లో ప్రయోగాలు జరిపి కృతకృత్యులయ్యారు. మహాత్ముని ఆశయాల ప్రభావం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లోనే గాకుండా కార్మికరంగంలో కూడా అత్యున్నత శిఖరాల్ని స్పృశించిందని చెప్పవచ్చు. కార్మిక సమస్యలపై గాంధీజీ వెలిబుచ్చిన అభిప్రాయాలు కొత్తగానూ, మానవీయ విలువలతోనూ ఉండేవి. అవి భారతీయ కార్మిక విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అహింసాయుత మార్గం ద్వారా గాంధీజీ నాయకత్వంలో నిర్వహించబడ్డ జాతీయ ఉద్యమాలు కార్మిక వర్గానికి ఎంతో ప్రేరణనిచ్చి అండగా నిలిచాయి.
స్వచ్ఛంద మధ్యవర్తిత్వం
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన గాంధీజీకి తొలి సవాలు కార్మికలోకం నుంచే ఎదురైంది. 1918లో అహ్మదాబాద్‌లోని వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ జీతాలను పెంచాలంటూ పట్టుబట్టారు. యజమానులు ససేమిరా అనడంతో కార్మికులు సమ్మెకు దిగారు. సమస్యను గాంధీజీ ముందుంచారు. మిల్లు యజమానులు చాలామంది గాంధీజీకి సన్నిహితులైనా, ఆయన కార్మికుల పక్షానే నిల్చున్నారు. ఇరుపక్షాలూ మధ్యవర్తిత్వ మండలి ద్వారా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కానీ, చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగింది. గాంధీజీ కూడా సమ్మెకే మద్దతిచ్చి, తొలిసారిగా నిరాహార దీక్ష అస్త్రాన్ని ప్రయోగించారు. చివరకు యజమానులు దిగివచ్చి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించి, 35 శాతం జీతం పెంపుదలకు ఒప్పుకున్నారు. సమస్య సామరస్యంగా పరిష్కారమైంది. అలా యజమానులు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాల్ని ‘స్వచ్ఛంద మధ్యవర్తిత్వం’ ద్వారా పరిష్కరించుకోవాలనే గాంధీజీ కొత్త సూత్రం రూపుదిద్దుకుంది. అంతేగాక గాంధీజీ స్వయంగా కార్మికుల తరపున మధ్యవర్తిగా వ్యవహరించడంతో స్వచ్ఛంద మధ్యవర్తిత్వానికి ఓ గుర్తింపు వచ్చింది. మధ్యవర్తిత్వం బోర్డులో ఒకరు యజమాని ప్రతినిధి, మరియొకరు కార్మికుల ప్రతినిధి ఉండాలని గాంధీజీ సూచించారు. ఈ పద్ధతి ప్రకారం, ఇద్దరు మధ్యవర్తులకూ అంగీకారం కుదరని ఎడల వారిరువురు కలిసి ఎన్నుకొన్న మరియొక మధ్యస్తునికి విషయం నివేదించాల్సి ఉంటుంది. అతని తీర్పు తుది తీర్పుగా భావించి, ఉభయ పక్షాలూ దానికి కట్టుబడి ఉండాలని గాంధీజీ తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఈ స్వచ్ఛంద మధ్యవర్తిత్వం మేలైన మార్గమని గాంధీజీ అభిప్రాయం. అహమ్మదాబాద్‌ వస్త్ర పరిశ్రమ కార్మికుల అసోసియేషన్‌ స్థాపనకు కూడా గాంధీజీ మార్గాలు బాగా దోహదపడ్డాయి.
పారిశ్రామిక సంబంధాలు
యజమానులు, కార్మికుల మధ్యసత్సంబంధాలు ఉండాలని, అందుకు ఇరు వర్గాలూ సుహృద్భావంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మెలగాలని గాంధీజీ కోరుకునేవారు. పారిశ్రామిక సంబంధాల్లో హింసాయుత చర్యలకు తావివ్వరాదని ఆయన నొక్కివక్కాణిస్తుండేవారు. వ్యక్తిగత ధూషణ, నిర్బంధం, భయపెట్టడం వంటి చర్యల్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. పారిశ్రామిక శాంతి ఉంటే ఆ పరిశ్రమ అభివృద్ధి చెందటంతోపాటు కార్మికుల పనిపరిస్థితులు, వేతనాలు మెరుగవుతాయని ఆయన అంటుండేవారు. కార్మికుల్ని కూడా కష్టించి పనిచేయాలని, ఆర్థికాభివృద్థికి సహకరించాలని హితవు చెబుతుండేవారు. కష్టించకుండా ఆదాయం పొందడాన్ని గాంధీజీ గర్హించేవారు. కఠోర పరిశ్రమ, అంకితభావం, నిజాయితీ, అహింసలతోనే ఆర్థిక సమానత్వం చేకూరుతుందని ఉద్భోదించేవారు. కార్మికులు అలా చేసిననాడు ఉత్పత్తుల్లో న్యాయంగా వారికి రావల్సిన వాటా గురించి అడిగే హక్కు కలిగి ఉంటారని ఆయన అభిప్రాయం.
కార్మికులు నిర్మాణాత్మకమైన, సామరస్యమైన ధోరణుల్ని అవలంభించాలని గాంధీజీ కోరుకున్నప్పటికీ వారి సమ్మె హక్కుకి ఆయన వ్యతిరేకత చెప్పలేదు. హక్కుల్ని సాధించుటకు ఇతర మార్గాలు విఫలమైనప్పుడే కార్మికులు సమ్మెకు పూనుకోవాలని, యజమానులు మధ్యవర్తిత్వానికి అంగీకరించిన తక్షణమే సమ్మె విరమించుకోవాలని సూచించారు. కార్మిక ఉద్యమం స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ఉండాలని గాంధీజీ అభిలషించేవారు. యజమానులు, కార్మికుల మధ్య శాశ్వతమైన ఘర్షణ, స్పర్ధలు ఉండరాదని చెప్పేవారు. వీరు జాతీయ సేవలో సహోద్యోగులు కావున, పరిశ్రమలో కూడా భాగస్వాములని గాంధీజీ అభిప్రాయం. అందువల్లే వీరిరువుర్ని బలమైన వర్గాలుగా ఆయన గౌరవించేవారు.
ట్రస్టీషిప్‌ సిద్ధాంతం
అహమ్మదాబాద్‌ సమావేశంలో ‘ట్రస్టీ షిప్‌’అనే నూతన భావనకు గాంధీజీ అంకురార్పణ చేశారు. కార్మికులు ఉత్పత్తి చేసిన దానికి యజమానులు ధర్మకర్తలు వంటి వారని గాంధీజీ అభిప్రాయం. పెట్టుబడిదారీ వ్యవస్థను సోషలిస్టు వ్యవస్థగా మార్చుటకు దోహదపడే ఒక సాధనం లాంటిది ఈ ట్రస్టీషిప్‌. దీనిలో పెత్తందారీ విధానానికి తావులేదు. ఇది తొలుత కమ్యూనిష్టు సిద్ధాంతమైన ‘వర్గ పోరాటానికి’ ప్రత్యామ్నాయంగా భావించబడింది. యజమానులు ట్రస్టీలుగా వ్యవహరిస్తే, కార్మికులు మూలధనంతో సహకరించి తమశక్తిని సద్వినియోగ పరచగలరని, మిల్లునూ, యంత్రాల్ని తమ ఉత్పత్తి సాధనాలుగా పరిగణించి, సొంత ఆస్తులను కాపాడినట్లు కాపాడగలరని గాంధీజీ విశ్వసించారు. నిజానికి మూలధనం, శ్రమ పరస్పరం ట్రస్టీలని, రెండూ వినియోగదారుల ట్రస్టీలవుతాయని ఆయన అభిప్రాయం. ఆ విధంగా గాంధీజీ శ్రమ, మూల ధనాల్ని సమాజాభివృద్ధికి తోడ్పడే ఉత్పత్తి సాధనాలుగా గుర్తించారు. పలు కార్మిక సమస్యలను పరిష్కరించడానికి ట్రస్టీషిప్‌ సిద్ధాంతం దోహదపడుతుందని గాంధీజీ భావించారు. 1957 సంవత్సరంలో జరిగిన 15వ భారతీయ కార్మిక సమావేశంలో కార్మికులు పారిశ్రామిక సంస్థల నిర్వహణలో పాల్గొనేందుకు యజమానులు సూత్ర ప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఇది గాంధీగారి ట్రస్టీషిప్‌ సిద్ధాంతానికి చక్కని నిదర్శనం.
సిద్ధాంతాల ఔచిత్యం..
శ్రమ, శ్రామికుల గురించి గాంధీజీ వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటి పారిశ్రామిక ప్రపంచానికి కొత్తగా కన్పించవచ్చు. ప్రస్తుతం వేగంగా మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో గాంధీజీ సిద్ధాంతాల్ని అనువర్తింపజేయడం సాధ్యమేనా అని కొందరు అనుమానపడొచ్చు. అయితే మనదేశంలో తలెత్తే కార్మిక సమస్యల పరిష్కారానికి గాంధీజీ సూచించిన నైతిక సిద్ధాంతాలు, క్రమశిక్షణ నిబంధనావళులు వృధాగా పోవని భావించాలి. నేడు మన కార్మిక రంగానికి లెక్కకు మిక్కిలి కార్మిక చట్టాలు, వాటిని అమలు పరిచే యంత్రాంగాలు ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో సమ్మెలు, లాకౌట్లు, హింసాయుత చర్యలు అక్కడక్కడా కొనసాగుతానే ఉన్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభుత్వాల ఏకపక్ష విధానాలు, యజమానుల స్వార్థపూరిత చర్యలతో కార్మికుల స్థితిగతులు మెరుగవడం లేదు. దీన్నిబట్టి కేవలం చట్టపూర్వక చర్యలవల్లే పారిశ్రామిక శాంతి పూర్తిగా నెలకొనదని రుజువవుతోంది. కాబట్టి కార్మిక విధానాలు, పారిశ్రామిక సంబంధాలుప్రాయోజనకర రీతిలో కొనసాగడానికిచట్టపరమైన చర్యలతోపాటు, గాంధీజీ ప్రతి పాదనల్ని కూడా అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు అన్ని రంగాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. సత్యం, అహింసలతో కూడిన గాంధీతత్వం నేడు అనేక సమస్యలతో పాటు, కార్మిక సమస్యల పరిష్కారానికి కూడా సమాధానం సూచిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే వారి బోధనలు నాటికీ, నేటికీ ఆరాధ్యాలు, ఆచరణ యోగ్యాలు.
పీ.వీ.ప్రసాద్‌

  • 9440176824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News