సరిగ్గా వందేళ్ల క్రితం 1923 మే 1న తమిళనాడులో మొట్టమొదటిసారిగా మే డే ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా చికాగోలో ఉద్యమం ప్రారంభమైన రోజు ఇది. కాగా, పరిశ్రమలలో కార్మికుల పని గంటలను మార్చడానికి అవకాశం కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్లును ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం నిన్న చడీ చప్పుడూ లేకుండా ఉపసంహరించుకోవడం గమనించాల్సిన విషయం. ఈ బిల్లును ఉపసంహరించడం కార్మిక లోకానికి ఒక విధంగా శుభ సూచకమే కానీ, ఈ వందేళ్ల ప్రస్థానంలో కార్మికులు ఎన్ని పోరాటాలు సాగించారో, ఎన్ని అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నారో చెప్పడం కష్టం. ఒక పక్క సాంకేతిక పరిజ్ఞాన పురోగతి, మరొక పక్క అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తదితర పరిణామాల కారణంగా కార్మిక సంఘాలు క్రమక్రమంగా కనుమరుగైపోతుండడమో, ఈ సంక్షేమ సమాజం చక్రాల కింద నలిగిపోవడమో జరుగుతోంది. ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ ఉండడం, లాభసాటిగా నడుస్తున్న వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలు సైతం వెనుకపట్టు పడుతుండడం, కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రైవేట్ రంగం ముందుకు రాకపోవడం వగైరాల కారణంగా ఉత్పత్తి రంగం క్రమక్రమంగా చిక్కి శల్యమవుతోంది. జీడీపీలో ఉత్పత్తి రంగ వాటా కొద్ది కొద్దిగా తగ్గిపోతోంది. ఫలితంగా వలస కార్మికుల పరిస్థితి అధ్వానంగా తయారవుతోంది.
ఇది ఇలా ఉండగా, సేవా రంగం మాత్రంప్రభుత్వానికికనక వర్షం కురిపిస్తోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు తగ్గిపోతుండగా, ప్రభుత్వ రంగం ఉద్యోగావకాశాలను పెంచడానికి విదేశీ పెట్టుబడుల కోసం ఎర్ర తివాచీలు పరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వెంటపడడం గమనించి పారిశ్రామికవేత్తలు కూడా గొంతెమ్మ కోరికలతో ప్రభుత్వాల నుంచి వీలైనన్ని వసతుతో పాటు, అధికారాలను కూడా రాబట్టుకుంటున్నారు. ఏక గవాక్ష అనుమతులు, ఉచిత విద్యుత్ సరఫరా, దీర్ఘకాల భూమి లీజు, సరళమైన పర్యావరణ నిబంధనలు, తమకు వీలైన కార్మిక చట్టాలు ఇందులో కొన్ని. పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కూడా ఎంతవరకైనా లొంగిపోవడం జరుగుతోంది. పారిశ్రామికవేత్తల నుంచి ఇటువంటి కారణంగానే, తమిళనాడు ప్రభుత్వం ‘ఫ్యాక్టరీస్ (తమిళనాడు సవరణ) బిల్లు’ పేరుతో గత నెల ఒక బిల్లును తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. అయితే, డి.ఎం.కె మిత్రపక్షాలు సైతం ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించడంతో గత ఏప్రిల్ 24న ఈ బిల్లును పక్కన పెట్టేశారు.మే 1వ తేదీన ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవడం జరిగింది.ఈ బిల్లు కొన్ని పరిశ్రమల కోసమేనని రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పింది.
తమిళనాడులో ఇటీవల అత్యధిక సంఖ్యాక వలస కార్మికులు వివిధ ప్రాంతాలకు వలస పోవాల్సి వచ్చింది. వలస కార్మికులపై సర్వత్రా దాడులుజరుగుతున్నాయనే వదంతులతో వారంతా చెల్లాచెదురై పోయారు. వారిలో నమ్మకాన్ని పాదుగొలిపి, వారిని సురక్షిత ప్రాంతాలలో ఉంచడానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా తిరుపూర్‌లో జౌళి కార్మికులలో చాలామంది చెల్లాచెదురు కావడం జరిగింది. నిజానికి ఉద్యోగ భద్రత విషయంలో ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఏటా కొద్దో గొప్పో పెరిగే జీతాలకు ద్రవ్యోల్బణానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. బేరం చేసుకునే శక్తి సామర్థ్యాలు కూడా కార్మికులకు కొరవడుతున్నాయి. అన్నిటికీ మించి ఉత్పత్తి కేంద్రాలు మటుమాయం అవుతున్నాయి. ఇవన్నీ కార్మికుల్లో తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. ఈ పరిస్థితి మరింత విషమించకుండా, కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా మారకుండా ఉండాలన్న పక్షంలో ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. ప్రభుత్వాల పెట్టుబడులు కూడాపెరగాల్సి ఉంది. అంతేకాక, కార్మికుల సామాజిక ప్రయోజనాల మీద ప్రభుత్వాలు విధిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.