Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Law and Order: కుప్పకూలిన శాంతిభద్రతలు

Law and Order: కుప్పకూలిన శాంతిభద్రతలు

ఢిల్లీలోని షాబాద్‌ ప్రాంతంలో అందరూ చూస్తూ ఉండగా ఒక 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేయడం దిగ్భ్రాంతికరం.విషపూరితమైన పురుషాధిక్యానికే కాక, ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ప్రజల నిర్లిప్తతకు కూడా ఇది అద్దం పట్టింది. ఢిల్లీ నగర నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన ఇంకా అనేక ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓ ఇరవై ఏళ్ల యువకుడు ఆ బాలికను అనేక పర్యాయాలు కత్తి పోట్లు పొడవడమే కాకుండా, బండరాయితో కొట్టి చంపడాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం, తమకేమీ సంబంధం లేనట్టు పక్క నుంచే వెళ్లిపోవడం ఎంతో మనస్తాపంతో పాటు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ బాలికకు ఆ యువకుడు బహుశా స్నేహితుడయి ఉండాలి. ఒక్క వ్యక్తయినా ఈ ఘటనలో కల్పించుకుని ఆ యువకుడికి అడ్డుపడినా లేక పోలీసులకు సమాచారం అందించినా ఆ బాలిక బతికిపోయి ఉండేది. ఈ సంఘటనను గమనించిన జనం భయపడి పారిపోయినట్టయితే వేరే విషయం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ, వీడియో ఫుటేజ్‌ ప్రకారం, అందరూ చూస్తూ వెళ్లిపోవడమే అందులో కనిపించింది. ఈ సంఘటన ఎవరికీ పట్టలేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? ఈ సంఘటన చూసినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం ఈ సంఘటన కంటే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పోలీసులను అప్రమత్తం చేయాలని కూడా వారు అనుకోలేదంటే ఆశ్చర్యం వేస్తోంది.
హంతకుడిని ఆపడానికి ఒక్క వ్యక్తయినా ముందుకు వెళ్లి ఉంటే ఆ బాలిక ప్రాణాలతో మిగిలేదని పోలీసులు కూడా చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసులు హంతకుడిని అరెస్టు చేయడమనేది ఆ బాలిక కుటుంబానికి ఊరట కలిగించి ఉండవచ్చు. అయితే, ఆ హంతకుడిలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం కాకపోవడం మరింతగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ కళ్ల ముందు ఒక బాలికను ఒక యువకుడు అతి దారుణంగాహత్య చేస్తున్నా జనానికి పట్టకపోవడంఒక ఎత్తయితే, ఆ యువ హంతకుడు ఏమాత్రం విచారం వ్యక్తం చేయకపోవడం మరో ఎత్తు. ఇక ఇది దేశంలో మరెక్కడో జరిగిన విషయం కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన సంఘటన. రాజధానిలో సైతం మహిళలకు రక్షణ లేదా అన్న ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి ఎప్పుడూ జరిగే, సర్వసాధారణ సంఘటనలుగా జనం భావిస్తున్నారా? సాధారణంగా రోడ్డు మీద చిన్న వివాదం జరిగినా, రోడ్డు ప్రమాదం జరిగినా గుమిగూడే జనం ఇక్కడ మాత్రం ఎందుకు తమకేమీ పట్టనట్టు ఉండిపోయారన్నది ప్రశ్న.
ఆ బాలికను అతను నడిరోడ్డు మీద ఆ విధంగా హత్య చేయడం సమాజంలో వేళ్లు పాతుకుపోయిన పురుషాధిక్యానికి పరాకాష్ఠ. పురుషాధిక్యంలోని విష బీజాలు అక్కడ బాగా వ్యక్తమయ్యాయి. అంతకన్నా ఘోరమైన విషయమేమిటంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి తదితర మంత్రులు ఈ సంఘటనను వెంటనే రాజకీయాలకు ఉపయోగించుకోవడం. శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వానివేనంటూ ఆయన విమర్శలకు దిగడానికి ఇది సరైన సమయంగా కనిపించింది. రాజకీయ స్వప్రయోజనాలు మానవత్వాన్ని కూడా మంటగలుపుతున్నాయి. శాంతిభద్రతలు ఎవరి అధీనంలో ఉన్నప్పటికీ, బాలిక దారుణ హత్య మీద సరైన విధంగా స్పందించాల్సిన ప్రభుత్వం ఈ బాధ్యతను కేంద్రం మీదకు నెట్టి పబ్బం గడుపుకోవాలని చూడడం సిగ్గు చేటైన విషయం. హత్యా రాజకీయాలకు, శవ రాజకీయాలకు పాల్పడడానికి సమయం, సందర్భం అంటూ లేకుండాపోవడం హత్య కంటే గర్హించాల్సిన విషయం. ఇటువంటి పాలకులు మతపరమైన ఓట్ల కోసం ఆ యువకుడిని కాపాడడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నిజానికి, ఇది సామాజికంగా చోటు చేసుకుంటున్న మార్పులకు కూడా అద్దం పడుతోంది. పాలకుల పట్ల, పోలీసుల పట్ల రాను రానూ పెరుగుతున్న నిర్లిప్తత, ఉదాసీన వైఖరిని ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. పక్కనే హత్య జరుగుతున్నా, పక్కనే అత్యాచారం జరుగుతున్నా ప్రజలకు పట్టకపోవడం ఏమిటి? ఒక బాలికపై దారుణం జరుగుతున్నా కనీస మానవత్వం వ్యక్తం కాకపోవడాన్ని బట్టి సమాజంలో కొత్త రకం ధోరణులు ప్రబలుతున్నాయనేది స్పష్టమవుతోంది. ఇందుకు కారణం ప్రతిదాన్నీ అవినీతితో ఆలస్యాలతో ముడిపెట్టడం కారణం కావచ్చు. కోర్టు కేసులు విపరీతంగా ఆలస్యం కావడం, రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, ఓటు బ్యాంకులు తయారు కావడం, మత, కుల రాజకీయాలు వగైరా సామాజిక, రాజకీయ పరిణామాలు, జాడ్యాలన్నీ దీని మీద ప్రతిబింబించడం ప్రారంభమైంది. రోడ్డు మీద కళ్లెదుట దారుణం జరుగుతున్నా జనం పట్టించుకోకపోవడానికి ఇంతకన్నా ముఖ్యమైన కారణాలు మరేమి ఉంటాయి?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News