విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలను నేరంగానే పరిగణించి, వాటిని చట్టంలో యథాతథంగా ఉంచాలంటూ ‘లా కమిషన్’ సిఫారసు చేసింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని, దేశంలో పరిస్థితులు మారిపోయినందువల్ల ఈ చట్టం పాతబడిపోయిందని, వలస పాలన నాటి ఈ చట్టానికి ఇక విలువ లేదని కొన్ని రాజకీయ పక్షాలు, న్యాయనిపుణులుచేస్తున్న వాదనను ఇది తోసిపుచ్చినట్టయింది. విద్వేషాలు రేకెత్తించే వ్యాఖ్యలు, ప్రకటనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, చట్టవిరుద్ధమైన మాటలు వగైరాలకు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 124ఏ ప్రకారం కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ఇటువంటి ప్రసంగాలను దేశ ద్రోహంగా కూడా పరిగణించడం జరుగుతుంది. నిజానికి ఈ ఐ.పి.సి 124ఏ సెక్షన్‌ని సుప్రీంకోర్టు 1962 ప్రాంతంలోనే సమర్థించడం, ఇది అవసరమని చెప్పడం జరిగింది.వీటిని కేవలం మాటల స్థాయిలో ఉన్నంత వరకు, విద్వేషాలను రెచ్చగొట్టనంత వరకు, శాంతి భద్రతలకు భంగం కలగనంత వరకు, కొంత పరిమితికి లోబడి ఉపయోగించవచ్చని, రాజ్యాంగపరంగా అనుమతించినంత వరకూ వీటిని వాడవచ్చని కూడా అది పేర్కొంది.
అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ పరిస్థితుల్లో ఎంతో మార్పు చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో లా కమిషన్ చేసిన సిఫారసులో భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని ఎంత వరకూ ఉపయోగించుకోవచ్చో స్పష్టంగా పేర్కొనలేదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. దేశంలో అనేక విద్వేషపూరిత ప్రసంగాల కేసులు కోర్టుల విచారణల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేవరకు వీటిని పెండింగ్‌లో పెట్టడం జరిగింది. ఐ.పి.సి 124ఏ సెక్షన్‌లో పొందుపరచిన అంశాలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేని మాట నిజమేనని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, ఇందులో పొందుపరచిన అంశాలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాలకు సంబంధించిన పరిమితులు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ ఇటీవలి కాలంలో కొన్ని వర్గాల నుంచి వాదనలు వినిపిస్తున్ననేపథ్యంలో ఇందులోని అంశాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. నిజానికి, ప్రస్తుత దేశ కాల పరిస్థితుల నేపథ్యంలో ఈ పునఃపరిశీలన కాల పరీక్షకు నిలబడకపోవచ్చు.
విద్వేషపూరిత లేదా రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనల నిరోధ చట్టానికి సంబంధించి రెండు అంశాలను లా కమిషన్ ప్రధానంగా ప్రస్తావించింది. దీనిని విచ్చలవిడిగా, యథేచ్ఛగా దుర్వినియోగం చేయడం ఇందులో ఒకటి. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా అన్నది రెండవ అంశం. ఒక చట్టాన్ని దుర్వినియోగం చేసినంతమాత్రాన దానిని ఉపసంహరించుకోవడం సమంజసం కాదని న్యాయ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనిని దుర్వినియోగం చేయడానికి మాత్రం చాలా అవకాశం ఉంది. అసమ్మతిని, విమర్శలను అణచివేయడానికి పాలక వర్గాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణ ఇప్పటికే ఉంది. రాజకీయ నాయకులు ప్రసంగాలు చేయడానికి ముందే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని లా కమిషన్ సూచించడం, దీనివల్ల విద్వేషపూరిత ప్రసంగాల కేసులు తగ్గిపోతాయని చెప్పడంపై పలువురు పలు రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, కొన్ని చట్టాలు వలస పాలకుల కాలం నాటివి అయినంత మాత్రాన వాటిని రద్దు చేయాల్సిన అవసరమేమీ లేదు. దేశంలో తరచూ తీవ్రవాద, వేర్పాటువాద సంబంధమైన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియా సైతం తిరుగుబాటు ధోరణులను ప్రోత్సహిస్తున్న పరిస్థితుల్లో ఈ చట్టాన్ని కొనసాగించడమే సమంజసమని లా కమిషన్ అభిప్రాయపడింది. వేర్పాటువాద ధోరణుల్ని, హింసను రెచ్చగొట్టడాన్ని, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ధోరణుల్ని నిరోధించడానికి, నియంత్రించడానికి ఇతరత్రా మరికొన్ని చట్టాలు పనిచేస్తున్నందు వల్ల ఈచట్టం అవసరం లేదని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు ఎక్కువగా చోటు చేసుకున్నందువల్ల ఇటువంటి ప్రసంగాల నిరోధానికి కూడాచర్యలు అవసరమని తేలుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఇందులోని అంశాలను పునఃపరిశీలించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం శుభ సూచకమేనని అనుకోవచ్చు.
Law commission: ఈ చట్టం ఉండాల్సిందే
ప్రస్తుత దేశ కాల పరిస్థితుల నేపథ్యంలో ఈ పునఃపరిశీలన కాల పరీక్షకు నిలబడకపోవచ్చు