శిశువు గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అధ్యక్షుడు ఆర్.వి. అశోకన్ చేసిన సూచనలు దేశవ్యాప్తంగా మళ్లీ లింగ నిర్ధారణ పరీక్షలపై చర్చలకు, వాదనలకు దారితీశాయి. ఆయన వాదనతో విభేదించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షల స్థానంలో మరో వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన సూచనలో కూడా లోటు పాట్లు కనిపిస్తున్నాయి. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను నేరంగా పరిగణిస్తూ 2003లో చేసిన చట్టం లైంగిక నిష్పత్తిని పెంచడానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదని, పైగా వైద్య నిపుణులపై ఒత్తిడి తీసుకు రావడానికి, వారిని వేధించడానికి ఇది దోహదపడిందని ఆయన తెలిపారు. ఇందుకు బదులుగా ఒక మాతా శిశు పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా గర్భస్థ శిశువును కాపాడడం, ఆ శిశువు బాగోగులను పరిరక్షించడం జరగాలని ఆయన సూచించారు.
అశోకన్ ఉద్దేశం ప్రకారం, గర్భంలో శిశువు ప్రాణం పోసుకున్నప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకూ ఆ శిశువును పర్యవేక్షించడం జరగాలి. ‘‘ఏదైనా అవాంఛనీయ పరిణామం చోటు చేసుకున్న పక్షంలో తల్లితండ్రుల్ని లేదా, వైద్యుల్ని బాధ్యుల్ని చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు వీలైనంతగా ఉపయోగించుకోవాలి’’ అని ఆయన ప్రతిపాదించారు. ఆడ శిశువు విషయంలో సామాజిక దృక్పథం ప్రతికూలంగా ఉండడమనేది ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తోందని, ఒక సామాజిక దురాచారానికి వైద్యపరమైన పరిష్కారాన్ని అమలు చేయడంలో అర్థం లేదని అశోకన్ స్పష్టం చేశారు. అయితే, సామాజిక నిపుణుల ప్రకారం, లింగ నిర్ధారణ పరీక్షల ప్రభావం లైంగిక నిష్పత్తి మీద లేదని చెప్పలేం. 1991లో ప్రతి 1,000 మంది పురుషులకు 927 మంది మహిళలుండగా, 2011 నాటికి ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండడం జరిగిందని సామాజిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం, 2019-2021 సంవత్సరాల మధ్య ఈ లైంగిక నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు మహిళల సంఖ్య 1020కి చేరుకోవడం కూడా జరిగింది. అంతేకాదు, 2015లో 1,000 మంది బాలురకు 918 ఉన్న బాలికల సంఖ్య 2022 నాటికి 934కు పెరిగింది.
దీన్ని బట్టి, లింగ నిర్ధారణ పరీక్షల ప్రభావం లైంగిక నిష్పత్తి మీద లేదనడానికి అవకాశం లేదు. కేవలం లింగ నిర్ధారణ పరీక్షల చట్టం ద్వారా మాత్రమే లైంగిక నిష్పత్తి పెరుగుతుందని, పెరగాలని ఆశించలేం. సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, విద్యా, అవగాహన స్థాయిల్లో పెరుగుదల, ఆడపిల్లల పుట్టుకకు అనుకూలంగా ప్రచారం వగైరా కారణాల వల్ల కూడా లైంగిక నిష్పత్తి బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలో ఏదైనా లోపం ఉందంటే అది దాని అమలులోనే ఉంది. అనేక రాష్ట్రాల్లో వైద్యులను ఈ చట్టం కింద అరెస్టులు చేయడం జరిగిందని అశోకన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వారు ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకే వారిని అరెస్టు చేయడం జరిగింది తప్ప, వారిని తప్పుడు కేసుల్లో ఇరికించడమో, ఉత్తి పుణ్యానికి శిక్షించడమో జరగలేదు. ఈ చట్టాన్ని సమర్థవంతంగా, పటిష్ఠంగా అమలు చేయనందువల్ల ఇప్పుడు కూడా అనేక రాష్ట్రాల్లో గర్భంలో స్త్రీ శిశువు ఉన్నప్పుడు గర్భస్రావాలు చేయించడం జరుగుతోంది. ఇందుకు సామాజిక దృక్పథంలో మార్పు తీసుకు రావడమే శాశ్వత పరిష్కారం. ఇందుకు బాగా సమయం పడుతుందనడంలో సందేహం లేదు.
ఈ చట్టాన్ని రద్దు చేయడమంటే ఆడ శిశువుకు అన్యాయం చేయడమే అవుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆడశిశువు పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది. అశోకన్ చేసిన మరో సూచన కూడా ప్రస్తుత చట్టం కంటే సమస్యాత్మకమే అవుతుంది. భారతదేశం వంటి అధిక జనాభా కలిగిన, అనేక కులాలు, మతాలు ఉన్న, దురాచారాలు, దురభిప్రాయాలు వేళ్లు పాతుకుపోయిన దేశంలో గర్భస్థ శిశువుపై పర్యవేక్షణ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. అంతకన్నా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్నే కొనసాగించడం శ్రేయస్కరం.