Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Less rains this year: ఈ ఏడాది ఒక మోస్తరు వర్షాలే!

Less rains this year: ఈ ఏడాది ఒక మోస్తరు వర్షాలే!

వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉంది. దేశంలో ఈసారి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారతీయ వాతావరణ విభాగం (ఐ.ఎం.డి) రెండు రోజుల క్రితం ప్రకటించింది. అతి త్వరలో కేరళ రాష్ట్రం నుంచి వర్షరుతువు ప్రారంభయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అది తెలిపింది. వర్షాల విషయంలో దేశం ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వర్షాలు బాగా పడే అవకాశమున్న ప్రాంతాల విషయం లోనే కాకుండా తాము దేశమంతటికీ వర్తించే విధంగా వర్షాల గురించి చెప్పడం జరుగుతోందని కూడా ఐ.ఎం.డి తెలిపింది. వ్యవసాయ రంగం పూర్తిగా వర్షాల మీద ఆధారపడి ఉన్న ప్రాంతాలు ఇక నిబ్బరంగా ఉండవచ్చన అభిప్రాయం కలుగతోంది. అంతేకాక, ఒక మోస్తరు, మోస్తరుకు మించి, అధిక వర్షపాతం వంటి జోస్యాలనే అది చెప్పడం జరుగుతోంది కానీ, తక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని మాత్రం అది ఏ రాష్ట్రం విషయంలోనూ చెప్పకపోవడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జమ్మూ కాశ్మీర్‌ తదితర ప్రాంతాల్లో కూడా వర్షాలకు కొరత ఉండే అవకాశం లేదని ఐ.ఎం.డి వివరించింది.
గత ఏడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, హెచ్చుతగ్గులు ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాలే కాకుండా వ్యవసాయ రంగ ఆదాయం కూడా బాగా తగ్గి పోయింది. ముఖ్యంగా గ్రామీణాదాయం దెబ్బతినడంతో జాతీయాదాయం కూడా తగ్గి పోయింది. వ్యవసాయాభివృద్ధి కుంటుపడిన కారణంగానే ఆహార పదార్థాలు, ఇతర నిత్యా వసర వస్తువుల ధరలు పెరగడం జరిగింది. గ్రామీణాదాయం తగ్గినందువల్లే పరిశ్రమలు, వాణిజ్య సంస్థల పురోగతి స్తంభించి పోవడమే కాక, వినిమయ వస్తువుల రంగం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడే పక్షంలో కాయధాన్యాలు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు వగైరా పంటలు బాగా పండి, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండడం జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడే పక్షంలో రిజర్వాయర్లు నిండి, భూగర్భ జలాలు పెరిగి, వంటలకు, పంటలకు కొరత లేకుండా ఉంటుంది. నిరుడు వర్షాలు తక్కువగా పడడం వల్ల జలాశయాల్లోనూ, భూగర్భంలోనూ నీటి మట్టాలు 24 శాతానికి తగ్గిపోవడం జరిగింది.
ఏ ప్రాంతంలో ఏ విధంగా వర్షపాతం ఉండబోతోందన్న విషయంలో ఐ.ఎం.డి నుంచి స్పష్టత లభించాల్సి ఉంది. ఎంత వర్షం పడే అవకాశం ఉందన్న దానిని బట్టే రైతులు తమ ప్రాంతంలో పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల వారికి ఇటువంటి సమాచారం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. రానున్న కొద్ది వారాల్లో దీనికి సంబంధించి నిర్దిష్టమైన సమా చారం అందే అవకాశం ఉంది. ఎల్‌ నీనో కొద్దిగా బలహీన పడుతున్నందువల్ల, ఎల్‌ నైనా క్రమంగా బలం పుంజుకుంటున్నందు వల్ల అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని ఐ.ఎం.డి తెలియజేసింది. భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం ప్రారంభమైంది. వర్షాభావం ఉండడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా అధి కారులు రైతాంగానికి సహాయ సహకారాలు అందజేసే కార్యక్రమాలు చేపట్టడం మంచిది. దేశం మొత్తం మీద వర్షాల పరిస్థితి బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల కొన్ని పరిస్థితులను నిర్దిష్టంగా ఊహించలేం. అనుకూల పరిస్థితులతో పాటు, అవాంఛ నీయ, ప్రతికూల పరిస్థితులకు కూడా అధికారులు సిద్ధంగా ఉండక తప్పదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News