Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Lesson taught by violence: హింస నేర్పిన గుణపాఠం

Lesson taught by violence: హింస నేర్పిన గుణపాఠం

తన పేరు ముత్తారం (మంథని), పెద్దపల్లి జిల్లా లోని ఒక మారుమూల మండలం. మూడు దశాబ్దాల హింసాకాండకు సాక్షీభూతం తను. ఉద్యమం పేరుతో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వాళ్ళు, ఉద్యమ లక్ష్యం పేరుతొ ప్రాణాలను తృణప్రాయంగా తుంచిన వాళ్ళు, రాజ్యం పేరుతొ రక్తాన్ని చిందించిన వాళ్ళు, విధి నిర్వహణలో విగతులైన వారు, తామెందుకు చని పోతున్నమో కూడా తెలియకుండా అసువులు బాపిన వారు ఒక్కరా ఇద్ద్దరా వందలాది బిడ్డలు తన కండ్లేదుటే ఒక్కరొక్కరుగా రాలుతుంటే, తన ఒడిని చేరుతుంటే గుండె చెరువయ్యేలా ఏడవడం మినహా తానేమీ చేయలేక మౌనం వహించిన నేలతల్లి తను. మానేటి నీటిలో, బగుళ్ళ గుట్టల్లో, పచ్చని పొలాల్లో చిక్కని రక్తం చిందినప్పుడల్లా సిద్దాంతాల మద్య పోరుండాలే గానీ మనుషుల మద్య పోరెందుకు బిడ్డా అని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నది, కన్నతల్లి, కట్టుకున్న ఇల్లాలు, కడుపున పుట్టిన బిడ్డల గొంతుకల్లోని బాధను అర్థంచేసుకోనివాళ్ళు, వరదలై పారిన వారి కన్నీల్లనే చూడలేని వాళ్ళు నా గోడు మాత్రం వింటారు కనకనా అని మౌనంగా కన్నీళ్లను దిగమింగుకున్నది . ఏది జరుగకూడదు అనుకున్నదో అదే జరిగింది, చేతికందిన బిడ్డలు కోతకోసిన పంటలా ఒకరొకరుగా ఒరిగిపోయారు. మేఘాలు ఎగిరిపోయాయి, సిద్దాంతాలు ఆగిపోయాయి, పోలీసుల కవాతులు సద్దుమనిగాయి. వెనక్కి తిరిగి చూసు కుంటే బిడ్డలు లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేని తల్లుల కండ్లలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు, తమ భవిష్యత్తు చిందర వందర కావడానికి కారకులెవరని పదే పదే ప్రశ్నించుకుంటున్న భార్యలు, కన్నబిడ్డలు, ఆ నాయకుడే బతికుంటే మా బతుకిట్లుండేనా అని గొణుగుతున్న సామా న్యులు, అడుగడుగునా స్మశాన నిశ్శబ్దం ఆవహించింది. రేపటి తరానికి నిజమేంటో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనుషుల విలువ, మానవత్వపు విలువ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే గుండె పొరల్లో దాగిఉన్న జ్ఞాపకాలను మళ్ళీ నెమరేసుకుంటున్నది ఆ తల్లి.
ముత్తారం (మంథని) ఒకప్పుడు ఉద్యమాల గడ్డ. పోలీసుల కవాతులు, నక్సలైట్ల ప్రజాకోర్టులతో దద్దరిల్లిన నేల, బాంబుల మోతతో, తుపాకుల గర్జనలతో అశాంతికి చిరునామాగా నిలిచిన మండలం. వందలాది యువకులు ఏదో సాదించాలని, ఎవరినో ఎదిరించాలని స్పష్టత లేని సుదూర లక్ష్యాల కోసం ఎర్రజెండాల నీడలో రుదిర దారాలు పారించిన నేల. ఇన్ఫార్మర్‌ల పేరుతో, సాను భూతిపరుల పేరుతో, తీవ్రవాదుల పేరుతో, పోలీసుల పేరుతో, దొరల పేరుతో, దోపిడీవర్గం పేరుతో వర్గపోరులో ప్రాణాలు తృణప్రాయంగా తుంచివేయబడ్డ నిత్య అగ్ని గుండం. అన్నల చేతుల్లో నలిగిపోయి, పోలీసుల చేతుల్లో చితికిపోయి జీవశ్చవాలుగా మారినవారి స్ంయతే లెక్కేలేదు. సానుభూతి పరుల పేరుతో, తీవ్రవాదుల పేరుతో, అను మానితుల నిపంతో వందలాది యువకులు సంవత్సరాల తరబడి పోలీసుస్టేషన్‌ల చుట్టూ రోజుల తరబడి తిరు గుతూ, హాజర్లు వేయించుకుంటూ, లాటీదెబ్బలు తినడం అక్కడి నిత్యకృత్యం. ఎన్నికలోచ్చాయంటే బ్యాలెట్‌ బాక్సు లు మోసేది వీరే, నాయకులు గ్రామాలను సందర్శించిన ప్పుడు ముందు నడిచింది వీళ్ళే. పేదల పక్షపాతుల మంటూ ఒక వర్గం, ప్రజాస్వామ్య పరిరక్షకులమంటూ పోలీసు యంత్రాంగం రెండు వర్గాలు ఆంబోతుల్లా పోరా డుతుంటే మద్యలో నలిగిన అమాయకపు లేగలెన్నో, బీడుబారిన భూములెన్నో. హింస ఏ ప్రశ్నకూ సమాదానం కాదని చెప్పడానికి మూడు దశాబ్దాల ముత్తారం (మం థని) రక్త చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం. అది ఖమ్మంపల్లి కావ చ్చు, ఓడేడు కావచ్చు, మచ్చుపేట, మైదంబండ కావచ్చు, అడవిశ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌ లు మొదలు కేశనపల్లి వరకు మండలంలో ఏ ఊరిని పరికించి చూసినా అడు గడుగునా దర్శనమిచ్చేవి చితికిన కుటుంబాలు, చెదిరిన జ్ఞాపకాలు.
కొండపల్లి వల్లించిన సిద్దాంతాలు కావచ్చు, గద్దర్‌ గళమెత్తిన పాటలు కావచ్చు మరింకేమైనా కారణం కావచ్చు, కాని ఎందరో యువకులు ఎర్రజండాను ముద్దా దేలా చేసింది మాత్రం సత్వరన్యాయం దొరుకుతుందన్న నినాదం మాత్రమే. మొదటి తరాన్ని ముందుకు నడిపింది చంద్రన్న అయితే, తరువాతి తరాన్ని ఎగదోసింది రాజేష్‌ @ తిరుపతి. గమ్మత్తైన విషయం ఏమిటంటే యువతరాన్ని ఉర్రూతలూగించి ఉసిగోల్పిన గద్దర్‌, ఉద్యమానికి భీజం వేసిన చంద్రన్న, ఉద్యమపంథాను చాటిచెప్పిన తిరుపతి నాటి వాసనలకు దూరంగా నేడు ప్రశాంతంగా బతుకుతు న్నారు, ఏదో సాదిస్తామని ఊగిపోయిన వేలాది యువ కులు, నిరుపేదల బతుకులు మాత్రం గాలిలో దీపాల్లా అటు ఇటూ ఊగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోయిన వారు కొందరు, పోలీసుల దెబ్బలకు జీవశ్చవాలైన వారు ఎందరో ఇంకా గ్రామాలలో తచ్చాడుతూనే ఉన్నారు, అందరిలో కనిపించేది ఒక్కటే శూన్యం, నిస్తేజం, నిశ్శబ్దం.
దశాబ్దాలు గడిచినా ఇంకా అదే ఊరు, అవే అగ చాట్లు. చదువులు పెరుగలేదు, కొలువులు పెరగలేదు, రైతులు ఎదగలేదు, నాయకులు మారలేదు. నాడు కాలి పోయిన ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి రావడానికి దశా బ్దాలు పట్టింది, పేదల కాళ్ళు అరిగేలా చేసాయి. ఊరొ దిలిన కుటుంబాలు తిరిగి చూడనైనా లేదు. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట లాండ్‌ ఫోన్‌ను చూసిన మండలం, సెల్‌ ఫోన్‌ కోసం దశాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో పూర్తి కావలసిన వంతెనలు ఇప్పటి వరకు పూర్తికాలేదు. నాడు ప్రశ్నించడమే ఆయుధంగా మొదలైన ఉద్యమ ఫలితమా అన్నట్లు నేడు గ్రామాల్లో ప్రశ్నించే తత్వమే చచ్చిపోయింది. ఎదగాలనుకునేవాడు ఊరొదలాలనే తత్వాన్ని రంగరించింది నాటి అనుభవం. ఇనుము విస్తారంగా ఉన్నా ఇక్కడికి ఘనులు రాలేదు, వరి, పట్టి, మిరప రాసులు పోసే రైతులున్నా నిలువచేసే గోడౌన్‌ లు రాలేదు. రాజకీయ చైతన్యమున్నా స్థిరమైన నాయకుడు రాలేదు. ఎందుకూ అన్న ప్రతి ప్రశ్నకూ ఒక్కటే జవాబు అమ్మో ముత్తారమా.
తుపాకీ గొట్టాన్ని పట్టుకుని హోంగార్డు శంకర్‌, మాజీ సర్పంచ్‌ రాయలింగుల చావులను తన ఖాతాలో వేసుకున్న మాయా లక్ష్మణ్‌ తుపాకీ గొట్టానికే బలైపోయాడు. ఉద్య మాల్లో ఉండీ, అటుతరువాత ఉద్యమానికి వ్యతిరేకంగా నడిచి మండలంలో అలజడి సృష్టించిన జడల నాగరాజు జీవితం అటు ఉద్యమానికి, ఇటూ ప్రజా జీవితానికి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఉద్యమ దాహానికి కేశనపల్లి మాజీ సర్పంచ్‌ మొగిలి బలైపోతే, ప్రతీకారానికి (అప్పట్లో ఆ పని చేయించింది పోలీసులే అని అందరూ విశ్వసించారు) ఏ తప్పు చేయని మరో మాజీ సర్పంచ్‌ గిరి చంద్రయ్య ప్రాణాలోదిలిండు.
ఎన్నో ఆశలతో, ఏదో సాదించాలనే తపనతో, ప్రజాశ్రేయస్సే జీవితాశయంగా ముందుకు సాగిన ఓడేడు యువతరం నాయకుడు పోతి పెద్ది ప్రభాకర్‌ రెడ్డి వర్గపోరుకు బలిపశువయ్యిండు. మచ్చు పేట మాజీ సర్పంచ్‌ తో మొదలయ్యి బియ్యని జగ్గం వరకు జరిగిన హత్యలు, దశాబ్దాల కిందట మొదలై మాయా లక్ష్మణ్‌ వరకు కోసాగిన ఎన్కౌటర్‌ లు ఒకటీ రెండూ కాదు గ్రామ గ్రామంలో రక్తమోడిన జనాలు, చితికిపోయిన కుటుంబాలు రక్తప్రవాహంతో మీరేం సాదించారని ప్రశ్ని స్తూనే ఉన్నాయి. జవాబుచెప్పడానికి ఎవరైనా ఉంటే గనుకనా. హింస ఏ ప్రశ్నకూ జవాబు కాదని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంటుంది. కండ్లముందే బిడ్డలు బలయిపోయి పేగులు తెగేలా కడుపు కొట్టుకుని ఏడ్చిన అమ్మా నాన్నలు, నమ్ముకున్న తోడు అర్ధాంతరంగా విడిపోతే నాకు దిక్కెవరని తల్లడిల్లిన విదవలు, తండ్రి ప్రేమకు నోచుకోని పిల్లలు, ఆత్మీయున్ని కోల్పోయిన తోబుట్టువులు అందరిదీ ఒక్కటే ప్రశ్న ఏ ప్రస్తానం కోసం ఈ హింస? బందూకులు చేతబట్టి బలైపోయిన ఉద్యమ కారులు కావచ్చు, ఆ బందూకు కర్కశానికి బలైపోయిన అమాయకులు కావచ్చు, ఉద్యోగ భాద్యతలో బలైపోయిన పోలీసులు కావచ్చు పోయిన ప్రాణాలెవరివైనా విలవిల లాడింది మాత్రం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. బ్రత కడం, బ్రతికించడం, మేల్కోవడం, మేల్కొలపడం ఇవికదా ఉద్యమ నిర్వచనాలు మరి జీవితాలను బలితీసుకుంటూ నడిపేది ఉద్యమమేలా అవుతుంది? ప్రశ్నించడానికి ఆ మండలానికి నోరులేదు, ప్రశ్నించినా ఇప్పుడు వినేవారు లేరు. కాని కాలగమనంలో అడుగునపడిపోయిన కఠిన నిజాలను విశ్లేశించక పొతే, గుణపాటాలు నేర్చుకోకపోతే, ప్రశ్నించే గొంతుక స్థానాన్ని ఆయుధం, నడిపించే నాయ కుని స్థానాన్ని అధికారం లాక్కునే ప్రమాదమున్నది.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి
    న్యాయవాది, 9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News