Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్జెన్‌ ఎక్స్‌తో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చెప్పాలి.. ప్రజల కోసం శాస్త్రవేత్తల డిమాండ్‌

జెన్‌ ఎక్స్‌తో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చెప్పాలి.. ప్రజల కోసం శాస్త్రవేత్తల డిమాండ్‌

ఒక పక్కన రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన కాలుష్యంలో ముంచెత్తే ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టేందుకు మసిపూసి మారేడు తరహాలో చేస్తున్న టీజీవీ సంస్థ బండారాన్ని ప్రజల కోసం శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ బృందానికి చెందిన డాక్టర్‌ కె. బాబూరావు, డాక్టర్‌ కె. వెంకట్‌ రెడ్డి, డాక్టర్‌ డి. రాంబాబు, డాక్టర్‌ అహ్మద్‌ ఖాన్‌, డాక్టర్‌ పి.జి. రావు, డాక్టర్‌ ఎం. బాపూజీ నేతృత్వంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు తాజాగా మరో లేఖ రాశారు. అందులో.. ప్రధానంగా కేంద్రం ఇటీవల టీజీవీ సంస్థను హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ (జెన్‌ ఎక్స్‌) విషయంలో అదనపు వివరాలు అడిగినప్పుడు, అందులో ఇచ్చిన సమాచారంలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయని కుండ బద్దలుకొట్టారు. ప్రజాప్రయోజనాలు, శాస్త్రీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలు స్పష్టం చేయాలని జెన్‌ ఎక్స్‌తో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ప్రాజెక్టు అప్రైజల్‌లో వైరుధ్యాలు ఇలా: 2025 ఆగస్టు 12న ఇచ్చిన అప్రైజల్‌ సందర్భంగా తాము పీటీఎఫ్‌ఈ ఉత్పత్తిలో సస్పెన్షన్‌ పాలిమరైజేషన్‌ను ఉపయోగిస్తామని, దానివల్ల అసలు పెర్‌ఫ్లూరోక్టనాయిక్‌ యాసిడ్‌ (పీఎఫ్‌ఓఏ) లేదా హెక్సాఫ్లూరోప్రోపైలీన్‌ ఆక్సైడ్‌ డైమర్‌ యాసిడ్‌ (హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ/జెన్‌ ఎక్స్‌) లాంటి సర్ఫక్టాంట్లు అక్కర్లేదని చెప్పారు. ఈ టెక్నాలజీ కారణంగా సాధారణంగా అయితే ఫ్లోరినేటెడ్‌ ప్రాసెసింగ్‌ ఎయిడ్లు.. అంటే పీఎఫ్‌ఓఏ గానీ, హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ, జీఎక్స్‍-902, ఇతర పీఎఫ్‌ఏఎస్ సర్ఫక్టాంట్లు అవసరం ఉండదు. హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ విషయంలో మంత్రిత్వశాఖ ఇటీవల అడిగిన వివరాల్లో మాత్రం, ఈ విషయం కంటే విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే, వాస్తవ ఉత్పత్తి మార్గం ఇంకా పరిశీలనలో ఉందంటూ ఆమోదించలేని ఒక అనిశ్చిత పరిస్థితి గురించి కంపెనీ చెప్పింది.

ఈఐఏ రికార్డులో కనపడని పీఎఫ్‌ఏఎస్ వెల్లడి: పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) ప్రాసెస్‌లో ఎక్కడా కూడా వారు సమర్పించిన నివేదికలో గానీ, ప్రజాభిప్రాయ సేకరణలో గానీ, తర్వాత ఇచ్చిన సమాధానాల్లో గానీ, టీజీవీ సంస్థ ఫ్లోరినేటెడ్‌ సర్ఫక్టాంట్‌ లేదా పీఎఫ్‌ఏఎస్ పదార్థం వినియోగం గురించి వెల్లడించలేదు. పర్యావరణ ప్రభావం, పర్యవేక్షణ లేదా రసాయనాల శుద్ధి గురించి ఈ రికార్డు మౌనం పాటించింది. స్థానికులెవ్వరికీ అవసరమైన సమాచారం లేదా ముప్పు అంచనా గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు.

విధానపరమైన లోపాలు: పీఎఫ్‌ఏఎస్ అవసరం లేని సస్పెన్షన్‌ పాలిమరైజేషన్‌ విధానం అమలు చేస్తామని కంపెనీ చెప్పి, జెన్‌ ఎక్స్‌ (హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ) విషయంలో ఇచ్చిన తాజా సమాచారానికి అసలు విధానపరమైన ఆధారాల్లేవు. దీనివల్ల లేనిపోని గందరగోళంతో పాటు పైకి చెప్పకుండా పీఎఫ్‌ఏఎస్ ఉపయోగించడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుంది.

పణంగా ప్రజా, పర్యావరణ ప్రయోజనాలు: హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏతో సహా పీఎఫ్‌ఎఎస్ పదార్థాలను అంతర్జాతీయంగా అత్యంత విషపూరితమైన రసాయనాలుగా గుర్తించారు. వీటివల్ల ప్రజలకు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో పాటు పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. వీటిలో పిల్లల ఎదుగుదల లోపం నుంచి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం వరకు అన్నీ ఉంటాయి. అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు (యూఎస్ ఈపీఏ, ఈయూ ఈసీహెచ్‌ఏ, ఓఈసీడీ) లాంటివి ఈ పదార్థాలను చాలా ప్రమాదకరమైనవని చెప్పడంతో పాటు దశలవారీగా వీటిపై నిర్బంధాలు విధించాయి. హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ విషయంలో ప్రస్తుతం కంపెనీ ఇచ్చిన వివరణతో తలెత్తిన గందరగళం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రధానంగా భూగర్భ జల కాలుష్యం, ఆహార గొలుసు ప్రభావితం కావడం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం కలగడం లాంటి సమస్యలు దీనివల్ల ఉంటాయన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రభావితమయ్యే ప్రజలకు నిర్దిష్టమైన, తనిఖీ చేయగల డేటా కావాలి. దాంతోపాటు సాధారణ హామీలు కాకుండా కచ్చితంగా అమలు చేయగల రక్షణ నిబంధనలుండాలి.

ఏం జరుగుతోందో స్పష్టంగా చెప్పండి: అసలు ఈ మొత్తం ఉత్పత్తి ప్రక్రియలో టీజీవీ సంస్థ ఎలాంటి ఫ్లోరినేటెడ్‌ సర్ఫక్టాంట్‌ లేదా పీఎఫ్‌ఏఎస్ ప్రాసెసింగ్‌ పదార్థాలు (హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ/జెన్‌ ఎక్స్‍, జీఎక్స్‍-902, పీఎఫ్‌ఓఏ, పీఎఫ్‌ఓఎస్, లేదా ఇతర పదార్థాలు) వాడుతున్నారా, వాడతారా, లేదా ఉత్పత్తిలో ఏ దశలోనైనా ఉపయోగిస్తారా, అనుబంధ కార్యకలాపాల్లో, శుభ్రం చేయడంలో లేదా వ్యర్థాల శుద్ధిలో వాడతారా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇందుకు సంబంధించిన డిక్లరేషన్‌ను అధికారిక ప్రాజెక్టు రికార్డులో వెంటనే ప్రస్తావించాలి. వాటిని ఇంగ్లీషులోను, తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

పీఎఫ్‌ఏఎస్ వాడుతున్నట్లు అంగీకరించినా, హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ, సంబంధిత పీఎఫ్‌ఏఎస్లను ఏ గాఢతలో, ఎంత మొత్తంలో ఉపయోగిస్తారో సమగ్ర సాంకేతిక డోసియర్‌ను కచ్చితంగా ఇచ్చి తీరాలి. అలాగే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ప్రదేశంలో మట్టి, భూగర్భ జలాలు ఎలా ప్రభావితమవుతాయో విశ్లేషించాలి. ఒకవేళ పీఎఫ్‌ఏఎస్ లీకయితే అత్యవసర ప్రతిస్పందన ఎలా ఉంటుందో స్పష్టం చేయాలి. పీఎఫ్‌ఏఎస్ మానిటరింగ్‌ డేటాను, శుద్ధి చేసే వ్యవస్థ సామర్థ్యాన్ని థర్డ్‍ పార్టీతో తనిఖీ చేయించి, ఆ ఫలితాలను రియల్‌ టైంలో బహిరంగపరచాలి. సమగ్రంగా నిధులు సమకూర్చి, ఒక నిఘా కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలి. అందులో తాగునీటి పరీక్షలు, ఉద్యోగుల ఆరోగ్య పరీక్షలు, స్థానికుల సమస్యల పరిష్కార వ్యవస్థ, పీఎఫ్‌ఏఎస్ వల్ల ఏదైనా కాలుష్యం జరిగితే వెంటనే దానికి తగిన పరిహారం, పరిష్కారం కల్పించేలా అది ఉండాలి.

ప్రావీణ్యత, రిస్క్‍ ఎలకేషన్‌పై ప్రశ్నలు:హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏపై తాము అడిగిన కొత్త ప్రశ్నలకు కంపెనీ ఏం సమాధానం ఇచ్చిందో మంత్రిత్వ శాఖ స్పష్టీకరించాలి. అంతర్జాతీయ ఫ్లోరోపాలిమర్‌ లైసెన్సర్లు (కెమోర్స్‍, డ్యూపాంట్‌, సోల్వే) లాంటి వాటి కంటే హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ లేదా ఇతర పీఎఫ్‌ఏఎస్లను అత్యంత సురక్షితంగా వాణిజ్యపరమైన స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో టీజీవీ ఎస్ఆర్‌ఏఏసీఎల్‌ సంస్థ నిర్వహించగలదని కేంద్ర మంత్రిత్వశాఖ నమ్ముతోందా? ఒకవేళ పీఎఫ్‌ఏఎస్ సంబంధిత కార్యకలాపాలు చేయాలనుకుంటే.. అందులో టెక్నాలజీ లైసెన్సర్లు ఎవరెవరు, కంపెనీ ముప్పు విషయంలో ఎలాంటి నిబద్ధత చూపిస్తోంది, స్వతంత్ర తనిఖీలు, ఆడిటింగ్‌ చేయిస్తారా, ఆఫ్‌ సైట్‌లో కూడా కాలుష్యం ఎలా ఉంటుంది, దీర్ఘకాలం పాటు బాధ్యత పాటిస్తారా అనే విషయాలు స్పష్టీకరించాలి.

శాస్త్రీయ విజ్ఞానం, అంతర్జాతీయ అనుభవాన్ని పట్టించుకోరా? : ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉన్న అంతర్జాతీయ శాస్త్రవిజ్ఞానం, పర్యావరణ, ప్రజారోగ్య ఆందోళనలు.. ఇలాంటివాటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ దృష్టికి తేవాలనుకుంటున్నట్లు ప్రజల కోసం శాస్త్రవేత్తలు చెప్పారు. మంత్రిత్వ శాఖ కేవలం కంపెనీ చెప్పిన విషయాలనే నమ్ముతోందని, కానీ ఆ కంపెనీ మాత్రం ఇప్పటి వరకు హెచ్‌ఎఫ్‌పీఓ-డీఏ (జెన్‌ ఎక్స్‍) గురించిన మెటీరియల్‌ సేఫ్టీ డేటా షీట్‌ (ఎంఎస్డీఎస్) అందించ లేదని గుర్తుచేశారు. జెన్‌ ఎక్స్‌ అనే పదార్థం అత్యంత విషపూరితమని, దానిపై ప్రపంచవ్యాప్తంగా కఠిన నియంత్రణలు విధించారని కూడా తెలిపారు. ఇదే రసాయనం వల్ల నార్త్‍ కరొలినా (అమెరికా), జీజియంగ్‌ ప్రావిన్స్‍ (చైనా) లాంటిచోట్ల తీవ్రంగా విషపూరితం అయ్యిందని, అక్కడ అత్యాధునిక శుద్ధి వ్యవస్థలున్నాకూడా ఆ కాలుష్యం నుంచి నదీ జలాలను, భూగర్భ జలాలను కాపాడలేకపోయాయని గుర్తుచేశారు.

చైనా వాళ్లు ఏం చేశారు?: పైపెచ్చు, టీజీవీ ఎస్ఆర్‌ఏఏసీఎల్‌ సంస్థ వారు టెక్నాలజీ ఇస్తారని చెబుతున్న చైనా సరఫరాదారులు ఇప్పటి వరకు తమ సొంత పరిధిలో ఎక్కడా పీఎఫ్‌ఏఎస్ డిశ్చార్జిలను విజయవంతంగా నియంత్రించినట్లు లేనే లేదని తెలిపారు. అత్యంత కఠినమైన నియంత్రణ నిబంధనలు ఉన్న అలాంటి ప్రాంతాల్లోనే నదీ జలాల కాలుష్యాన్ని ఆపలేకపోతే.. కర్నూలు లాంటి చోట్ల అలాంటి కార్యకలాపాలను ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలా నిర్వహించగలరని సూటిగా ప్రశ్నించారు. శాస్త్రీయ సాక్ష్యాలు, అంతర్జాతీయ అనుభవం లాంటివాటిని పక్కన పెట్టి.. పీఎఫ్‌ఏఎస్ నియంత్రణలో వైఫల్యాలన్నీ చాలా స్పష్టంగా ఇప్పటికే తెలుస్తున్నాయని చెప్పారు. అందువల్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్టాక్‌హోమ్‌ కన్వెన్షన్‌, అంతర్జాతీయంగా ఇలాంటి ఆర్గానిక్‌ కాలుష్య కారకాల నియంత్రణలో అమలు చేస్తున్న విధానాలను వెంటనే ఇక్కడ పునరుద్ధరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad