Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Lions life is toughest to lead: మ‌గ సింహం బ‌తుకు.. బితుకు బితుకు

Lions life is toughest to lead: మ‌గ సింహం బ‌తుకు.. బితుకు బితుకు

బ‌తికుండాలంటే అనుక్ష‌ణం పోరాడాల్సిందే

బ‌తికిన‌న్నాళ్లూ సింహంలా బ‌తికాడు మారాజు..
ఇన్నాళ్లూ రాజకీయాల్లో నేను సింహంలా బ‌తికాను
సింగ‌మ‌ల్లె నీవు శిఖ‌ర‌ము చేరు…

- Advertisement -

ఇలా చాలా గొప్ప‌గా బ‌తికేవాళ్ల గురించి, ధైర్యానికి మారుపేరుగా చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు సింహం గురించే ప్ర‌స్తావిస్తారు. నిజానికి మ‌నంద‌రికీ ఇన్నాళ్లూ తెలియ‌ని విష‌యం ఏమిటంటే.. మ‌గ సింహం బతుకు కుక్క కంటే హీనంగా ఉంటుంది! అవును.. పుట్టిన ఏడాదిలోపు చ‌నిపోయే మ‌గ‌సింహాల సంఖ్య చాలా ఎక్కువ‌. ఎలాగోలా బ‌తికి బ‌య‌ట‌ప‌డినా మూడేళ్ల వ‌య‌సు నుంచే వాటికి క‌ష్టాలు మొద‌లవుతాయి. అప్ప‌టి నుంచి తోటి మ‌గ‌సింహాల దాడిలో ఎప్పుడు చ‌స్తామా అని భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సి వ‌స్తుంది. జూ పార్కుల్లో ఉండే సింహాలు దాదాపు 20 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు జీవిస్తాయి. అడవుల్లో సింహం స‌గ‌టు వ‌య‌సు 16 ఏళ్లు. కానీ మ‌గ సింహాలు మాత్రం మ‌హా అయితే 12 ఏళ్ల వ‌ర‌కే బ‌తికుంటాయి!!

ఆఫ్రికాలో సింహాల సంత‌తి కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. అందులోనూ కెన్యాలో ఇవి బాగా క‌న‌ప‌డుతుంటాయి. కానీ ఇటీవ‌ల అక్క‌డ సింహాల‌కు పెట్టింది పేరైన మ‌సాయ్ మ‌రా అనే ప్రాంతంలో ఈ మ‌ధ్య జెస్సీ అనే మ‌గ సింహం చ‌నిపోయి క‌నిపించింది. ఎలా చ‌నిపోయింద‌ని జంతుప్రేమికులు దానికి పోస్టుమార్టం చేయిస్తే.. మూడు మ‌గ‌సింహాలు క‌లిసి దాడి చేసి దాన్ని చంపేసిన‌ట్లు తేలింది. అలా చంపేసిన వాటిలో దాని సొంత కొడుకు జెస్సీ2 కూడా ఉండ‌టం విశేషం!

సింహాలు సాధార‌ణంగా ఒక ప్రైడ్ అనే బృందంగా క‌లిసుంటాయి. ప్ర‌తి ప్రైడ్‌లో ఆడ సింహాలు చాలా ఉంటాయి. ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ పెద్ద మ‌గ‌సింహాలు కూడా వాటితో ఉంటాయి. ఆడ సింహాలు ఎక్కువ కాల‌మే బ‌తికినా.. మ‌గ‌వి మాత్రం అంత‌కాలం ఉండ‌లేవు. ప్ర‌తి రెండు మ‌గ‌సింహం పిల్ల‌ల్లో ఒక‌టి పుట్టిన ఏడాదిలోపే చ‌నిపోతుంది. పుట్టిన‌ప్ప‌టి నుంచే మ‌గ సింహం పిల్ల‌ల‌ను బ‌య‌ట అడవిలో వ‌దిలేస్తే, ఆడ‌వాటిని మాత్రం జాగ్ర‌త్త‌గా సంర‌క్షించుకుంటాయి. ఇలా అడ‌విలో ఉండే పిల్ల‌లు పాముకాటుకు, హైనాల దాడికి గురై చ‌నిపోతాయి. మ‌రికొన్ని పెద్ద మ‌గ‌సింహాల దాడిలో కూడా చ‌నిపోతాయి. ఎలాగోలా బ‌తికి బ‌ట్ట‌క‌డితే మూడేళ్ల త‌ర్వాతి నుంచి అవి స్వ‌తంత్రంగా తిరుగుతాయి. కానీ ఇలా తిరిగేట‌ప్పుడు కూడా వాటికి ప్ర‌మాదం పొంచి ఉంటుంది. ప‌ది ప‌న్నెండేళ్లు దాటి ఏ మ‌గ సింహ‌మూ బ‌త‌క‌డం చాలా క‌ష్టం.

కెన్యాలో మ‌ర‌ణించిన జెస్సీ వ‌య‌సు 12 ఏళ్లు. దానికంటే చిన్న‌వైన‌, బ‌ల‌మైన మూడు మ‌గ‌సింహాలు క‌లిసి దాన్ని చంపేశాయి. చిన్న మ‌గ సింహాలు కాస్త పెద్ద‌వైతే, అవి బ‌లం పుంజుకుని, మిగిలిన‌వాటి మీద దాడి చేస్తాయి. ప్ర‌తి ప్రైడ్ అనే గుంపు త‌మ‌దైన కొంత ప్రాంతాన్ని ఎంచుకుంటాయి. ఆ ప్రాంతంలోకి వేరే సింహం రావ‌డానికి వీల్లేదు. అలా వ‌స్తే, అక్క‌డున్న‌వ‌న్నీ క‌లిసి దాడి చేసి చంపేస్తాయి.

మ‌గ సింహాలు చిన్న‌విగా ఉన్న‌ప్పుడు వాటి సొంత కుటుంబ‌స‌భ్యులు కాకుండా వేరే మ‌గ‌సింహం కంట‌ప‌డితే చాలు.. ప్రాణం పోయిన‌ట్లే. లేదా ఇవి ప‌రుగు తీయ‌గ‌లిగితే ఆ దాడి నుంచి పారిపోవాలి. ఇలా పారిపోయి త‌మ‌ది కాని ప్రైడ్‌లోకి వెళ్లాయంటే, అక్క‌డుండే మ‌గ సింహాలు లేదా ఇత‌ర జంతువుల బారిన ప‌డి మ‌ర‌ణించే ప్ర‌మాద‌మూ ఉంటుంది. ముందు చెప్పుకొన్న‌ట్లుగా ఎలాగోలా మూడు సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చేవ‌ర‌కు బ‌తికుంటే మాత్రం.. త‌మ సొంత ప్రైడ్‌ను వ‌దిలి వెళ్లిపోయి స్వ‌తంత్రంగా బ‌త‌కాల్సిందే. కొన్నిసార్లు అలా వెళ్లేట‌ప్పుడు అవి త‌మ వ‌య‌సులోనే ఉండే బంధువులు, సోద‌రుల‌ను క‌లుస్తాయి. అప్పుడు అవ‌న్నీ క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డ‌తాయి. ఇలా ఎక్కువ సింహాలు క‌లిస్తే, అన్నీ క‌లిసి బ‌లోపేతం అవుతాయి. బ‌య‌ట నుంచి మ‌గ సింహాలు ఈ ప్రైడ్‌వైపు రాకుండా చూసుకోగ‌లిగితే చాలు.. వీటి సంత‌తి క్ర‌మంగా పెరుగుతుంది.

పోరాట‌మే శ‌ర‌ణ్యం
అడ‌విలో సాధార‌ణంగా సింహాల‌కు మూడు నియ‌మాలు ఉంటాయి. ఆడ సింహంతో జ‌త‌క‌ట్ట‌డం, త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం, పోరాడ‌టం. ఈ మూడు నియ‌మాల‌ను గట్టిగా పాటించ‌గ‌లిగితేనే ప‌ది-ప‌న్నెండేళ్ల వ‌ర‌కు మ‌గ సింహాలు బ‌తికుంటాయి. ఒక‌టే ప్రైడ్‌లో 5 నుంచి 9 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు ఉండ‌గ‌లిగితే సింహాలు చాలా పిల్ల‌ల‌ను కంటాయి. అలాగే వాటిని చాలావ‌ర‌కు కాపాడుకుంటాయి. కానీ ఆడ సింహాలు మాత్రం మూడేళ్ల వ‌య‌సు దాటిన మ‌గ సింహాల‌ను త‌మ ప్రైడ్‌లో ఉంచేందుకు ఇష్ట‌ప‌డ‌వు.

మ‌గ సింహాల బ‌తుకు ఇంత దుర్భ‌రంగా ఉంటుంద‌ని నిజంగా తెలిసిన త‌ర్వాత ఎవ‌రైనా.. సింహంలా బ‌తికేవాడిని అని అన‌గ‌ల‌రా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News