Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Liquor politics: లిక్కర్ పాలిటిక్స్ తో 'యూ-టర్న్ మ్యాన్' కు కొత్త కష్టాలు

Liquor politics: లిక్కర్ పాలిటిక్స్ తో ‘యూ-టర్న్ మ్యాన్’ కు కొత్త కష్టాలు

దేశంలో మద్యం రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పలు దక్షిణాది రాజకీయ నేతలు, పారిశ్రామిక వేతలను వణికిస్తోంది. ఇదంతా ఓ కొలిక్కి రాకముందే అటు బిహార్ లోనూ మద్యం రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

- Advertisement -

తమ రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కల్తీ మద్యం తాగి మృతి చెందుతున్న ఘటనలపై ఎన్.హెచ్.ఆర్.సి.కి దమ్ముంటే విచారణ జరిపించాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ సవాలు చేశారు. రాష్ట్రంలోని శరన్ జిల్లాలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తును ప్రశ్నించిన నితీష్, ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తరచూ జరుగుతున్నాయని గర్జించారు.

బిహార్ లో 2016 నుంచి లిక్కర్ తయారీ, అమ్మకం, సేవనం అన్నీ సంపూర్ణంగా నిషేధించామని నితీష్ పదేపదే గుర్తుచేస్తున్నారు. మద్యం తాగేందుకు, అక్రమంగా మద్యం తయారు చేసేందుకు, కల్తీ మద్యం తయారు చేసేందుకు మద్య నిషేధ చట్టాన్ని ధిక్కరించేందుకు ఎవరకీ హక్కు లేదని ఆయన హూంకరిస్తున్నారు. ఓవైపు ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు, డిప్యుటీ సీఎం తేజస్వి మద్యం మత్తులో తేలుతుంటారని ఆర్జేడీ ఎమ్మెల్యేలే బాహాటంగా వెల్లడిస్తుంటే మరోవైపు నితీష్ మెడకు ఈ కల్తీ మద్యం మృతుల కేసు చిక్కుకోవటం హైలైట్.

“ఆల్కహాల్ సేవనంతో మరణాలు దేశంలోని ఏ ప్రాంతంలో జరగటం లేదు? గతంలో ఇలాంటివి జరగ లేదా? విషపూరితమైన కల్తీ మద్యం తాగి ఎంతమంది మరణించ లేదు? మరి అలాంటప్పుడు మానవ హక్కుల కమిషన్ కేవలం బిహార్ లోనే ఎందుకు దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపుతోంది? ఇతర రాష్ట్రాలకు సైతం తమ బృందాలను పంపి ఈ దిశగా కమిషన్ విచారణ ఎందుకు చేపట్టడం లేదు”?.. అంటూ నితీష్ నిప్పులు చెరగటం ధర్మబద్ధమే అని సామాన్యులంతా నితీష్ పక్షం వహిస్తున్నారు.

“బీజేపీ వాళ్లు ఇతర రాష్ట్రాల్లో జరిగే ఇలాంటి కేసులపై పెదవి విప్పరేం ? గతంలో ఇలాంటి విషయాలపై లేని అభ్యంతరం కొత్తగా ఇప్పుడెందుకు కమలనాథులకు వచ్చింది?” అంటూ నితీష్ బీజేపీని కడిగిపారేస్తున్నారు. నితీష్ లేవనెత్తిన తాజా ప్రశ్నలపై బీజేపీలో ఎవరూ పెదవి విప్పటం లేదు కానీ బాధితులకు అండగా ఉండాలని మాత్రం బీజేపీ గట్టిగా గళం విప్పుతుండటం బిహార్ సీఎం కోపాన్ని నషాళానికి తెప్పిస్తోంది. 82 మంది ఉసురు తీసిన బిహార్ కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. పైగా మృతులకు ఎటువంటి ఆర్థిక సాయం చేసే సవాలే లేదని నితీష్ పదేపదే చెబుతుండటంతో విపక్ష పార్టీలకు మంచి అస్త్రం దొరికినట్టైంది.

నిజానికి మద్య నిషేధం బిహార్, గుజరాత్ లో అమల్లో ఉందన్న మాటే కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. 2015లో మద్య నిషేధం బిల్లు బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఈ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చింది. అప్పట్లో బిహార్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా ఈ విషయంపై మాత్రం నితీష్ కు బాసటగా నిలిచింది. ఇప్పుడు అదే బీజేపీ ఇదే విషయంపై నితీష్ కు చుక్కలు చూపిస్తుండటం నితీష్ ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారింది. రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇవే జరుగుతున్నాయని మాజీ డిప్యుటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోడీ నితీష్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడి కూడా నితీష్ ను ఒకప్పుడు ప్రశంసించిన వారే. “మద్య నిషేధంతో నితీష్ చాలా సాహసోపేతమైన అడుగులు వేస్తున్నారని” మోడీ అభినందించారు కూడా.

ఒకప్పుడు గుజరాత్ లో కల్తీ మద్యం 42 మంది ప్రాణాలు తీసిన సంగతి గుజరాత్ బీజేపీ మరచిపోయినట్టుందనే విమర్శలు సైతం జేడీయూ నుంచి వినిపిస్తున్నాయి. 2009లో అత్యంత కఠినమైన చట్టాన్ని గుజరాత్ సర్కార్ అమల్లోకి తెచ్చింది. మద్య నిషేధం చట్టాన్ని అతిక్రమిస్తే మరణ దండన విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. 136 మంది కల్తీ మద్యంతో మృతిచెందిన నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చట్టం చేసింది. ఇంత కఠిన చట్టం దేశంలో అమలులో ఉన్నది గుజరాత్ లో ఒక్కటే. అప్పట్లో అక్కడ మోడీ సీఎంగా ఉన్నారు.

బిహార్ అంత కఠినమైన చట్టాలు తేలేదు కానీ మద్యం అక్రమ వ్యాపారం చేస్తే మాత్రం జైలుకు వెళ్లాల్సిన పని లేదని కానీ భారీ జరిమానాలు తప్పవని ఈ చట్టాన్ని కాస్త సవరించింది. కానీ అక్రమంగా రాష్ట్రంలోకి రవాణా అవుతున్న మద్యం, అనుమతులు లేకుండా రాష్ట్రంలో యథేచ్ఛగా తయారవుతున్న మద్యంపై బిహార్ సర్కారు దృష్టిసారించడంలో వైఫల్యం చెందింది. చలి కాలంలో, పండుగల సీజన్ లో బిహార్ లో ఈ కల్తీ మద్యం బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు మనం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. బిహార్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్య నిషేధం బిల్లు పాసైనా ఒక్క ఆర్జేడీ మాత్రం ఈ చట్టం అమలుపై సందేహాలు వెలిబుచ్చింది. లాలూ సీఎంగా ఉన్నప్పుడు మద్యంపై ఏకంగా పన్నునే ఎత్తేశారు!

అసలే నితీష్ కు ‘యు-టర్న్ మ్యాన్’ అనే పేరుంది. ఏవిషయం పైన అయినా ఆయన తన నిర్ణయాన్ని ఇట్టే మార్చేసుకుంటారని ప్రతీతి. ఆర్జేడీతో జత కట్టడం, కటీఫ్ చెప్పడం, బీజేపీతో జత కట్టడం, కటీఫ్ చెప్పడం ఇలాంటి చరిత్ర నితీష్ కెరీర్లో చాలా ఉంది. ఓవైపు మద్య నిషేధం బిల్లు అనే ఆయన కొత్త ఎక్సైజ్ పాలసీ కూడా తెచ్చారు. అదేమంటే “రాష్ట్ర రెవిన్యూ పెరిగాలి కదా” అంటారు. 2005 నవంబర్ లో ఆయన ఇష్టానుసారం ఆల్కహాల్ బిజినెస్ కు లైసెన్సులు ఇచ్చేశారు. రాజధాని పట్నాకు సమీపంలోనే ఆల్కహాల్ మానుఫాక్చరింగ్ ప్లాంట్స్ కూడా పుట్టుకొచ్చాయి. కానీ ఆతరువాత ‘యు-టర్న్’ తీసుకుని 2016లోకానీ మద్యనిషేధం చట్టాన్ని చేయలేదు. నిజానికి బిహార్ నుంచి ఖనిజ సంపద అధికంగా ఉన్న ఝార్ఖండ్ విడిపోవటంతో బిహార్ రాష్ట్ర ఆదాయం నేలచూపులు చూసింది. దీంతో మద్యాన్ని ఓ అతిపెద్ద వనరుగా నితీష్ ప్రయోగించారు. అయితే ఇష్టానుసారంగా మద్యం వ్యాపారం సాగుతుండటంతో బిహార్ లో పెద్ద ఎత్తున గృహ హింసతోపాటు నేరాలు పెరిగాయి. కానీ ఇవేవీ పెద్దగా ఎక్కడా పోలీస్ స్టేషన్లలో నమోదు కాకపోవటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు వచ్చిన ఢోకా ఏం లేదనట్టు అధికారిక రిపోర్టులు చెప్పేవి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం విపరీతంగా క్రైమ్ పెరగటంతో మహిళా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడిక్కడ నితీష్ ను ఘెరావ్ చేసి, మద్య నిషేధం కోసం పట్టుబట్టాయి. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తానంటూ అధికారం చేపట్టారు నితీష్. నిజానికి అంతకు ముందు ఈ మద్యం వ్యాపారంతో ఆగర్భ శ్రీమంతులైంది జేడీయూ, బీజేపీ నేతలే అన్నది రాష్ట్రంలో బహిరంగ రహస్యం.

విచిత్రమైన మరో సంగతి చెప్పుకోకపోతే ఈ కథకు అసలు కోణం మిస్ అయినట్టే. మద్య నిషేధాన్ని నితీష్ ప్రకటించగానే ..”డ్రై స్టేట్ లో రెవిన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇలా డ్రై స్టేట్ అయితే కొత్త పెట్టుబడులు రావ”ని మీడియా అంతా ‘యాంటీ నితీష్’ గా కొత్త పల్లవి అందుకుంది. అసలు హైలైట్ ఇదన్నమాట. ఈ సందర్భంలో డ్రై స్టేట్ అయిన గుజరాత్ కు పెట్టుబడుల వరద ఎలా వస్తోందని మాత్రం మీడియా ప్రస్తావించే సాహసం చేయలేదు. కానీ నిజం చెప్పాలంటే విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు ఊరించే గుజరాత్ మాత్రం ఏటా 10,000 కోట్ల రూపాయలను మద్య నిషేధం కారణంగా నష్టపోతోంది. అయినా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో యూ-టర్న్ ఎప్పుడూ తీసుకోలేదు.

లిక్కర్ ట్యాక్సుతో 2015-16 మధ్యకాలంలో బిహార్ ఖజానాకు 4,000 కోట్లు వచ్చి చేరింది. మరి ఇలాంటప్పుడు అసలు నితీష్ ను మోడీ ఎందుకు ప్రశంసల్లో ముంచెత్తారు? దీనికి కారణం క్విడ్ ప్రో కో తరహా విషయంలా.. “ పెద్ద నోట్ల రద్దును నితీష్ సమర్థించారు కనుక నితీష్ మద్య నిషేధాన్ని మోడీ ప్రశంసించారు ” .. అని రాజకీయ విమర్శకులు లాజిక్ చెబుతారు. లిక్కర్ అనేది ఎన్నికల అంశం, అందుకే ఇటీవలే జరిగిన బైపోల్స్ లో కూడా బీజేపీ ఈ అంశాన్ని మరోమారు లేవనెత్తింది. బిహార్ మహిళా ఓటర్లకు ఇది అతిపెద్ద ఆకర్షణీయమైన అంశంగా మారింది.

బిహార్ రాష్ట్ర్ ప్రభుత్వ అధికారులు మద్య నిషేధం సంపూర్ణంగా రాష్ట్రంలో విఫలమైందని ‘ఆఫ్ ది రికార్డ్’ అంగీకరిస్తున్నారు. దీనికి బలమైన కారణాలు చాలానే ఉన్నాయన్నది మనమంతా అర్థం చేసుకోవాల్సిన సత్యాలు. బిహార్ లోకి మద్యం చాలా ఈజీగా స్మగ్లింగ్ అవుతుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు ఆఖరుకి పొరుగు దేశమైన నేపాల్ నుంచి సీదా ఇక్కడికి లిక్కర్ సప్లై అవుతుంది. నేపాల్-బిహార్ బోర్డర్ లో సశస్త్ర సీమా బల్ జవాన్లు రేయింబవళ్లు కంటికి రెప్ప వేయకుండా పహారా కాస్తున్నా, గంగా నది వెంబడి మోటార్ బోట్ల ద్వారా ఈ అక్రమ రవాణా బ్రహ్మాండంగా సాగుతోందని అధికారులు వివరిస్తుండటం విశేషం. మరి ఇలా నదీ రవాణాపై కన్నేయటమంటే అసాధ్యం. ఇక స్మగ్లింగ్ విషయానికి వస్తే ఎవరికీ అనుమానం రాకుండా చిన్న పిల్లలు, మహిళలతో ఇదంతా చేపించేస్తారు.

కొసమెరుపు మరోటి ఉంది. ఇదే అసలు విషయం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కల్తీ మద్యం కేసులు, అనారోగ్యాలు, మరణాలు సంభవించటం చాలా రొటీన్ గా మనం చూస్తుంటాం. కానీ బిహార్ కేస్ డిఫరెంట్. అందేంటంటే కల్తీ మద్యం తాగి అనారోగ్యంపాలైన వ్యక్తి ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడు. ఎందుకంటే ఇలా చికిత్సకు వెళ్తే కల్తీ మద్యం కేసులో తనను ఇరికిస్తారని, కేసు నమోదు చేసి రచ్చ జరుగుతుందని ..ఈ గొడవల్లో చిక్కుకోవటం ఇష్టం లేక వాళ్లు అలాగే అనారోగ్యాన్ని భరిస్తారు. అనారోగ్యం నుంచి కోలుకోలేక చివరికి వారు కన్నుమూస్తారు. దెబ్బకు ఇక్కడ మరణాల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News