మన జీవితంలో శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించే మనం, మనసుకు కలిగే బాధను మాత్రం చాలా సందర్భాల్లో పట్టించుకోము. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, నిరాశ వంటి సమస్యలను బయటకు చెప్పుకోలేక మనలోనే దాచుకుంటాం. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి ప్రశాంతమైన మనసు ఎంతో అవసరం. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, మానసిక అనారోగ్యంపై ఉన్న అపో హలు, వివక్షను తొలగించడం, అవసరమైన వారికి నాణ్య మైన మానసిక ఆరోగ్య సేవలు అందేలా చూడడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యాలు.
1992లో ప్రారంభమైన ప్రపంచ ఉద్యమం
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం చరిత్రను పరిశీలిస్తే, దీనిని వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ (డబ్ల్యూ.పి.ఎం.హెచ్) ఆధ్వర్యంలో తొలిసారిగా 1992 అక్టోబర్ 10న నిర్వహించారు. అప్పటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ ఈ కార్యక్రమాన్ని వార్షిక ప్రపంచ వ్యాప్త అవగాహనా కార్యక్రమంగా ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రారంభంలో ఈ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్ ఉండేది కాదు. 1994 నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన థీమ్‌ను ప్రకటించడం ఆనవా యితీగా మారింది. 1994లో తొలిసారిగా ప్రకటించిన థీమ్ “ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం”. మానసిక ఆరోగ్యం అనేది ఒక్కరోజు చర్చించే అంశం కాదు, దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజారోగ్య ఉద్యమంలో భాగం.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
2026 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రధాన సందేశం “మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవించిన వారి మాటలను వినాలి, వారి అనుభవాలను గౌరవించాలి, వాటి ఆధారంగా నిజమైన మార్పును తీసుకురావాలి”. మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తులను కేవలం చికిత్స పొందుతున్నవారిగా కాకుండా, మానసిక ఆరోగ్య సేవల అభివృద్ధిలో తమ అనుభవాల ద్వారా విలువైన సూచనలు అందించగల భాగస్వాములుగా చూడాల్సిన అవసరాన్ని ఈ థీమ్ గుర్తుచేస్తోంది.
పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ మంది, అంటే దాదాపు ప్రతి ఏడుగురిలో ఒకరు, ఏదో ఒక మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు అత్యంత సాధారణమైన మానసిక ఆరోగ్య సమస్యల్లో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు వయస్సు, లింగం, విద్య లేదా ఆర్థిక పరిస్థితులతో సంబం ధం లేకుండా ఎవరికైనా రావచ్చు. విద్యార్థుల్లో చదువు, పరీక్షలు, భవిష్యత్తుపై ఆందోళన; యువతలో ఉద్యోగం, సంబంధాలు, సామాజిక ఒత్తిళ్లు; ఉద్యోగుల్లో పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు; వృద్ధుల్లో ఒంటరితనం, ఆరోగ్య సమ స్యలు వంటి అంశాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అయితే సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది చికిత్స తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు అవగాహన లోపం, సామాజిక అపో హలు, మానసిక అనారోగ్యంపై ఉన్న వివక్ష వంటివి చెప్పవచ్చు.
ఆరోగ్యం అంటే కేవలం శారీరకం కాదు
“రోగం లేకపోవడమే ఆరోగ్యం” అనే భావన చాలా మందిలో ఉంది. కానీ సంపూర్ణ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు. వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సమతుల్యంగా ఉండటం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. శరీరానికి విశ్రాంతి, పోషకాహారం, వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా విశ్రాంతి, భావోద్వేగ మద్దతు, ఆరోగ్యకరమైన సంబంధాలు, సానుకూల జీవనశైలి అవసరం.
మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి?
మానసిక ఆరోగ్యం అంటే “మానసిక వ్యాధి లేక పోవడం” మాత్రమే కాదు. వ్యక్తి తన సామర్థ్యాలను గుర్తిం చుకోవడం, రోజువారీ జీవితంలోని ఒత్తిడులను సమర్థవం తంగా ఎదుర్కోవడం, భావోద్వేగాలను సమర్థంగా నిర్వ హించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం, కుటుంబం, సమాజంలో తన బాధ్యతలను నిర్వర్తించగలగడం కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే. జీవితంలో అప్పుడప్పుడు బాధ, ఆందోళన, కోపం, నిరాశ, ఒత్తిడి రావడం సహజం. అయితే ఈ భావాలు ఎక్కువ కాలం కొనసాగి వ్యక్తి చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం, సంబంధాలు లేదా రోజువారీ కార్యకలాపాలను ప్రభా వితం చేస్తే నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం.
మానసిక అనారోగ్యంపై అపోహలు తొలగాలి
మన సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి- మానసిక సమస్యలు ఉన్న వారు “పిచ్చివాళ్లు”.. మనసు బలహీనంగా ఉన్నవారికే మానసిక సమస్యలు వస్తాయి.. సైకాలజిస్టు లేదా సైకియా ట్రిస్ట్ను కలవడం అంటే తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నట్టే.. మానసిక సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి.. మాన సిక సమస్యలకు చికిత్స అవసరం లేదు.. – ఇవన్నీ అపో హలే. మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఇతర ఆరోగ్య సమస్యల మాదిరిగానే శ్రద్ధ, సరైన అంచనా, అవసరమైన ప్పుడు చికిత్సను కోరుతాయి. జ్వరం, దగ్గు లేదా ఇతర శారీరక సమస్యలు వచ్చిన ప్పుడు వైద్యుడిని సంప్రదించడం సహ జంగా భావించినట్లే, మనసులో ఇబ్బందులు ఎదురైన ప్పుడు క్లినికల్ సైకాలజిస్టు లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదిం చడం సాధారణ ఆరోగ్య సంరక్షణలో భాగంగానే చూడాలి.
సైకోథెరపీతో మార్పు సాధ్యమే..
మానసిక ఆరోగ్య సమస్యలను బట్టి వివిధ రకాల సైకోథెరపీ విధానాలు ఉపయోగించబడతాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సి.బి.టి) ఆలోచనలు, భావోద్వే గాలు, ప్రవర్తన మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుని సమస్యాత్మక ఆలోచనా విధానాలను మార్చుకోవడానికి సహాయపడుతుంది. డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడిని తట్టుకోవడం, సంబంధా లను మెరుగుపరు చుకోవడం వంటి అంశాల్లో ఉపయోగ పడుతుంది. సమస్య ను బట్టి ఇతర శాస్త్రీయ సైకోథెరపీ విధానాలను కూడా నిపుణులు సూచించవచ్చు. అవస రాన్ని బట్టి సైకాలజికల్ థెరపీతో పాటు సైకియాట్రిక్ చికిత్స, మందులు లేదా ఇతర వైద్య సేవలు కూడా అవసరమవుతాయి.
మనసును కాపాడుకోడానికి అలవాట్లు
తగినంత నిద్ర..
ప్రతిరోజూ సరైన సమయానికి నిద్రపోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం. వ్యాయామం: నడక, యోగా లేదా ఇతర శారీరక కార్యకలాపాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకో వడం. సమతుల్య ఆహారం: పోషకాహారం తీసుకోవడం, భోజనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సామాజిక అను బంధం: కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, మనసులోని విషయాలను విశ్వసనీయమైన వారితో పంచుకోవడం. డిజిటల్ వినియోగంపై నియంత్రణ: అవసరానికి మించి ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం. భావాలను వ్యక్తపరచడం: బాధ, ఆందోళన, కోపం వంటి భావాలను అణచివేయకుండా ఆరోగ్యకర మైన మార్గాల్లో వ్యక్తపరచడం. కుటుంబం అండగా నిలవాలి. మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తికి కుటుంబం అందించే మద్దతు ఎంతో కీలకం. సమస్యను అర్థం చేసుకోకుండా విమర్శించడం, నిందించడం, “ఇది నీ ఊహ మాత్రమే” అని కొట్టిపారేయకుండా వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో “నీకు ఏం ఇబ్బందిగా ఉంది?”, “నేను నీతో ఉన్నాను”, “అవసరమైతే నిపుణుల సహాయం తీసుకుందాం” అనే భరోసా వ్యక్తికి ఎంతో మద్దతు నిస్తుంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు కూడా మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మానసిక ఆరోగ్యాన్ని చర్చించడం సిగ్గుపడాల్సిన విషయం కాదు అనే భావన సమాజంలో బలపడాలి. అనుభవించిన వారి మాటలు వినాలి. 2026 సందేశం మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవించిన వారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోంది. వారి అనుభవాలను అర్థం చేసుకుని, వాటి ఆధారంగా మరింత మానవీయమైన మానసిక ఆరోగ్య సేవలను అందించాల్సిన అవసరం ఉంది.
మనసు బాగుంటేనే జీవితం బాగుంటుంది
మానసిక ఆరోగ్యం కుటుంబం, విద్య, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, సామాజిక సంబంధాలతో ముడిపడి మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మానసిక సమస్యలను దాచిపెట్టడం, నిర్లక్ష్యం చేయడం కాకుండా, వాటి గురించి స్వేచ్ఛగా మాట్లాడే ఆరోగ్యకర మైన వాతావరణాన్ని సమాజంలో కల్పించాలి. “సహాయం తీసుకోవడం బలహీనత కాదు.. మన పట్ల మనం చూపిం చుకునే బాధ్యత”. అవసరమైన సమయంలో డాక్టర్ల సహాయం తీసుకోవడంతో పాటు, కుటుంబం, స్నేహితులు, సమాజం కూడా బాధితులకు అండగా నిలవాలి. మన ప్రభుత్వం ‘టెలి-మానస్ (14416)’ ద్వారా ఉచిత మానసిక ఆరోగ్య సహాయాన్ని అందిస్తున్నప్పటికీ, అవగాహన లోపం, అపోహల కారణంగా చాలామంది ఇప్పటికీ సహాయం కోరేందుకు వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చా లంటే మానసిక ఆరోగ్యంపై అవగాహనను పెంచడం, అందుబాటులో ఉన్న సేవలను ప్రజలకు చేరువ చేయడం, అవసరమైన వారికి సకాలంలో మద్దతు అందించడం అత్యవసరం. మానసిక ఆరోగ్యాన్ని ప్రతి వ్యక్తి హక్కుగా గుర్తించి, దానికి తగిన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఆరోగ్య కరమైన, సానుభూతి కలిగిన సమాజాన్ని నిర్మించగలం.
8500003142
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
చిమ్ముల అనూష రెడ్డి
క్లినికల్ సైకాలజిస్ట్
పడకంటి మహేష్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్

