Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Literature icon: సంచలన కవి శ్రీశ్రీ

Literature icon: సంచలన కవి శ్రీశ్రీ

జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న తొలి తెలుగు పాట ‘తెలుగు వీర లేవరా’

తెలుగు సాహితీ లోకంలో ఒక సంచలనం శ్రీశ్రీ. తూటాల్లాంటి మాటలతో ఆకలి రాజ్యంలో రక్తాక్షరాలు చిందిన శ్రీశ్రీ చివరి క్షణం వరకూ మార్క్సిజాన్నే మనసా వాచా కర్మణా నమ్మారు. ‘మహా ప్రస్థానం’తో తెలుగు కవిత్వాన్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్లారు. శ్రీశ్రీని తలచుకోవాలంటే ప్రత్యేకంగా ఒక సమయం, సందర్భం అవసరం లేదు. కాలే కడుపులు, మండే గుండెలు, ఖాజీ జేబులు శ్రీశ్రీని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి దార బోసా’ అంటూ ఉగ్రరూపంతో ముందుకు అడుగులేసిన ఈ మహాకవి, మరో ప్రపంచపు త్రేతాగ్ని కోసం కదం తొక్కారు. కుక్కపిల్లలోనూ, అగ్గిపుల్లలోనూ కవిత్వాన్ని చూసిన ఈ సంచలన కవి చివరికి ఆకలి రాజ్యంలో ప్రపంచం కంపించేలా కేకలు వేశారు. 1910 ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ కవి ‘నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం’ అంటూ 1983 జూన్‌ 15న అస్తమించారు.
శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతుల పుత్రుడైన శ్రీశ్రీ 1931లో మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేశారు. 1935లో విశాఖపట్నంలోని ఏవీఎస్‌ కాలేజీలో డిమాన్‌ స్ట్రేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టి, ఆంధ్రప్రభ, ఆంధ్రవాణి, ఆకాశవాణిలలో పనిచేశారు. ఆ తర్వాత సాహితీ వనంలో తన ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీశ్రీ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. శ్రీశ్రీ కవిత్వం విషయానికి వస్తే ఆయన కవిత్వాలలో బాధలు, బాధితులే ముఖ్య పాత్రధారులు. ఆకలితో అలమటించేవాళ్లు, సమస్యలతో సతమతమయ్యే వాళ్ల కోసమే ఆయన తన జీవితమంతా దారపోశారు. 1930, 1940లలో అమెరికాలో ప్రారంభం అయిన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నంతా చుట్టుముట్టేసింది. సహజంగానే దాని ప్రభావం శ్రీశ్రీ మీద కూడా పడింది. అదే ప్రభావం ‘మహాప్రస్థానం’ కవితల్లోనూ ప్రస్ఫుటంగా ప్రతిఫలించాయి. మార్క్సు మార్గంలో నడిచిన శ్రీశ్రీ చివరి క్షణం వరకూ అదే సిద్దాంతాన్ని నమ్మారు.
శ్రీశ్రీ కవితల్లో చాలా భాగం ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం ఆయన కవితల ఇతివృత్తాలు జన సామాన్యానికి బాగా దగ్గరగా ఉండడమే. ‘అందమైన అబద్ధాల్లో కన్నా నిష్ఠూరమైన నిజాల్లోనే మంచి కవిత్వం దర్శనం అవుతుంది’ అని శ్రీశ్రీ అనేవారు. ఆయన ఎప్పుడో 85 ఏళ్ల క్రితం రాసిన ‘మనమంతా బానిసలం, పీనుగులం, గానుగలం’ అనే మాట శ్రమ దోపిడీకి నిలువెత్తు తార్కాణంగా ఇప్పటికీ కనిపిస్తుంది. ‘శైశవగీతి’తో పసి హృదయాలను పలకరించాలన్నా, అవతలి గట్టున నిలబడిన ఒక నిస్సహాయ బాటసారికి అండగా నిలబడాలన్నా అది ఒక్క శ్రీశ్రీకే సాధ్యమవుతుంది. అందుకే చలం అన్నారు “ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ” అని. విచిత్రమేమిటంటే, ‘మహా ప్రస్థానం’ ముందు మాట కోసం చలాన్ని సంప్రదిస్తే ఆయన ఏకంగా ఒక చిన్న పుస్తకమే రాసేశారు.
కన్యాశుల్కం నాటకంతో గ్రాంథికానికి పూర్తిగా స్వస్తి చెప్పి వ్యావహారికంలోకి దూకేసిన గురజాడ అప్పారావు మాదిరిగానే శ్రీశ్రీ కూడా పూర్తిగా గ్రాంథికానికి తిలోదకాలు ఇచ్చేశారు. గణబద్ధమైన చందస్సుకు సమాధి కట్టేసి, వాడుక భాషలోనే కవితలు రాయడం ప్రారంభించారు. “అప్పటి వరకు వెయ్యేళ్లుగా క్లాసికల్‌ భాషలో నలిగిన తెలుగు కవిత్వాన్ని చక్కని మలుపు తిప్పిన వ్యక్తి గురజాడ” అని శ్రీశ్రీ అనేవారు. శ్రీశ్రీ కవిగానే కాకుండా మాటలు. పాటల రచయితగా కూడా ప్రసిద్ధి పొందారు. తెలుగులో డబ్బింగ్‌ సినిమాలతో కలిపి సుమారు వెయ్యి పాటలు రాశారు. 1950లో వచ్చిన ‘ఆహుతి’ సినిమాతో శ్రీశ్రీ సినిమా ప్రస్థానం ప్రారంభమైంది. ‘అల్లూరి సీతారామ రాజు’ సినిమాలో ఆయన రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న తొలి తెలుగు పాట ఇదే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News