Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Literature in smart phone era: స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో..సాహితీ లోకం

Literature in smart phone era: స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో..సాహితీ లోకం

..అప్పుడే ఈ వాట్సప్‌ సమూహాల విలువ, గౌరవం, పెరుగుతుంది

కాలాలు ఎన్ని మారినా సాహిత్య లక్ష్యం ఒకటే… సమాజాన్ని చైతన్య పరచటం, విజ్ఞానంతో జాగృతం చేయడం. ఆయా సాహిత్యాలను సృష్టించే రచయితలు, ఎంత విలువైన సాహిత్యం సృష్టించిన, అది సంబంధిత లక్ష్యాలకు చేరాలి అంటే… ఏదో ఒక వాహకం అవసరం, ఆవాహక పాత్రను, పత్రికలు, పుస్తకాలు, గతంలో పోషించాయి ప్రస్తుతం పోషిస్తున్నాయి. ఆయా వాహకాల ద్వారా లక్ష్యాలైన పాఠకులను చేరినప్పుడే వాటిని వారు ఆస్వాదించినప్పుడే, ఆయా రచనల విలువ పెరుగుతుంది, రచయితలకు సార్ధకత వస్తుంది. ఈ సాహితీ వాహకాలైన, పత్రికలు, పుస్తకాల, స్థానంలో, 2015 సం: నుండి.. కొత్తగా వచ్చిన స్మార్ట్‌ ఫోన్‌ సాయంతో… పాఠకులకు అత్యంత త్వరగా చేరవేసే… ఫేస్‌బుక్‌ వాట్సప్‌, వాట్సప్‌ సమూహాలు, అందుబాటులోకి వచ్చాయి.
పత్రికలు మాత్రమే వాహకాలుగా ఉన్న కాలంలో… రచయితల సంఖ్య పరిమితంగా ఉండేది, తమ భావాలను రచన రూపంలో వివిధ ప్రక్రియలలో వ్రాసి సంబంధిత పత్రికలకు పంపినప్పుడు ఆయా పత్రికలలో పనిచేసే రచయితలైన సహాయ సంపాదకులు, సంపాదకులు, ఆ రచనలను, క్షుణ్ణంగా చదివి, సాహితీ విలువలు ఉన్నప్పుడు, వారికి గల అనుభవంతో మార్పులు చేర్పులు చేసి ప్రచురించేవారు, తద్వారా పత్రికల్లో ప్రకటించబడ్డ రచనలకు ఒక ప్రామాణికత, విలువ, గౌరవం, ఉండేది. ప్రస్తుత కాలంలో ఎక్కువ పత్రికలలో రచనలు చూసేది ఉద్యోగులు మాత్రమే..! రచయితలు కారు!, వాటి మీద వారికి అవగాహన ఉండదు, అరకకొర రచయితలు ఉన్న, ఆర్థిక మాన్యం వల్ల ఒక్కరే అన్ని పనులు చూసుకునే పరిస్థితి, అందువల్ల పత్రికల్లో ప్రచురించే రచనల సంఖ్య రాను రాను పలచబడుతుంది.
ఈ క్రమంలో ఆధునిక సాహితీ రంగంలో… ఇంటర్నెట్‌, సాయంతో.. పనిచేస్తున్న స్మార్ట్‌ ఫోన్లు.. వాటిలో ఉండే ఫేస్‌బుక్‌ వాట్సప్‌, సమూహాలు. ఆధునిక సాహిత్యం వెలవడానికి విస్తృతంగా పనిచేస్తున్నాయి. తద్వారా రచనల సంఖ్య, రచయితల సంఖ్య, విశృంఖలంగా పెరిగిపోతుంది, కొత్త రచయితలు పుట్టుకొస్తున్నారు, సాహితీ సమూహాల సాయంతో, వివిధ రచనల మీద శిక్షణలు ఇవ్వడం కూడా జరుగుతుంది, సంబంధిత సమూహ నిర్వాకుని పర్య వేక్షణలో, ఆరోగ్యకర వాతావరణంలో, క్రమశిక్షణాయుతంగా నిర్వహించబడుతున్న, ఫేస్‌ బుక్‌, వాట్సప్‌ సమూ హాలు ఆధునిక సాహిత్య వికాసానికి చేస్తున్న కృషి అభినందనీయం. కానీ ఈ కృషి అత్యంత అల్పం కావడం విచారకరం.
ఆధునికంగా అంది వచ్చిన ఈ సాంకేతిక వాహ కాల వల్ల, వేగము సంఖ్య పెరిగిన మాట వాస్తవమే కానీ, సాహితీ విలువలు ఘోరంగా పడిపోయాయి. ఈ ఆధునిక రచయితలు, తమకు తోచిన విధంగా రాసుకుని, ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్న చందంగా… ఎవరి రచన వారికి అద్భుతం అన్నట్టుగా… తమ తమ ఫేస్బుక్‌ ఖాతాల్లో వాట్సాప్‌ సమూహాల్లో పోస్ట్‌ చేయడమే ఆలస్యం, క్షణాల్లో వేలల్లో అభినందనలు (లైకులు) వందల్లో అభినందన అభిప్రాయాలు (కామెంట్‌లు) వచ్చి చేరతాయి, అదే స్త్రీ రచయితలు అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాస్త సాహిత్య పరిజ్ఞానం ఉన్న పాఠకులు ఆ కవిత్వాలు రచనలు ఆ లైకులు కామెంట్ల హోరు, చూసిపడే ఆవేదన అంతింత కాదు, అయినా చేసేదేమీ లేదు. ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఎంతటి అనర్హుడైన, అధికమంది చెంత చేరితే అందలం ఎక్కినట్టు ప్రస్తుత సాహిత్యం తీరు కూడా అలాగే ఉంది.
అలా మాధ్యమాల సాయంతో రచయితలుగా మారిన వారు అందరూ సాహితి నిర్వీర్యులు అనడానికి అవకాశం లేదు, అందులోనూ ఎంతో అద్భుతంగా గొప్పగా రాసేవారు ఉన్నారు, కానీ వారి సంఖ్య అత్యల్పం. ఆర్థిక పుష్టి ఉన్న ఆధునిక రచయితలు , తాము రాసిన రచనల వంటి రచనలను. సమూహాలకు పరిమితం చేయకుండా వాటిని పుస్తకాలుగా అచ్చు వేయించి… తాము ప్రముఖ రచయితల మంటు.. చాటింపు మొదలు పెట్టుకుంటారు, అంతటితో ఆగక, సంబంధిత పుస్తకాన్ని ప్రముఖుల చేతుల్లో పెట్టడం, ఎంతైనా భరించి అంతకన్నా ప్రముఖమైన పుస్తకంలో సమీక్ష వచ్చే ప్రయత్నాలు చేయడం, ఆపైన మంచి మంచి పురస్కారాలు అందించే, సంస్థలు, వ్యక్తుల వెంట పడటం. అనుకున్న విధంగా పురస్కారాలు అడిగి తెచ్చుకోవడం, అంతటితో ఆగక అవకాశం దొరికితే రాష్ట్ర, జాతీయ, స్థాయిలో లభించే పురస్కారాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం, అష్టకష్టాలు పడి అనుకున్నది సాధించి, అంతటితో తృప్తి పడక, తమ రచనలపై ఎవరైనా పరిశోధనలు చేస్తారా అని వెతుకు లాడటం. అది కూడా పూర్తయ్యాక, ఎంత ఖర్చయినా ‘డాక్టరేట్‌’ బిరుదు… కావాలి, ఇది నేటి ఆధునిక రచయితల సాహితీ ప్రస్థానం, ఇటువంటి స్వార్థ సాహితీపరుల… సమాజంలో మన సాహిత్యపు విలువలు ఎలా పెరుగుతాయి!? పది కాలాలపాటు గుర్తుండి పోయే ప్రామాణిక రచనలు ఎన్ని వస్తాయి?
కొసమెరుపుగా… వాట్సప్‌ సమూహాల నిర్వహణలోని వింతలు, విడ్డూరాలు, గురించి కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం వాట్సాప్‌ సమూహాలు పుట్టగొడు గుల్లా పుట్టకొస్తున్నాయి, సమూహాల లక్ష్యాలు ఒకటే అందులోని సభ్యులు ఒక్కరే… ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?’ అన్నట్టు ‘ఈసముహం చూసినా ఏమున్నది కొత్తదనం?’ మూడు సొంత భాజాలు… ఆరు ఎత్తిపోత పోస్టులు తప్ప, ఇక సమూహంలో ఉండేవారు చిత్రమైన భావాలు కలిగి ఉంటారు, తమకు సంబంధించిన రచనలు , తామున్న అన్ని గ్రూపుల్లో పదే పదే పంపిణీ చేస్తుంటారు, పది నిమిషాలకోసారి ఎంతమంది మెచ్చుకున్నారో లెక్కలు వేస్తూ ఉంటారు, వీరికి నిత్యం కావలసింది మెచ్చుకోలులే తప్ప, విమర్శలు పనికిరావు , అలా విమర్శించిన వారు వారికో శత్రువు. వారి రచనలను వారి పోస్టులను అందరూ అభినందించాలి కానీ వారికి మాత్రం ఎవరి పోస్టులను ఎవరి రచనలను చదివే, అభినందించే తీరిక అస్సలు ఉండదు. వారి దృష్టిలో వారు మాత్రమే పనివంతులు, మిగతా వాళ్ళందరూ పనిలేని వారు, ఇదే సూత్రం వారి వారి పుట్టినరోజులు పెళ్లిరోజులకు పంపించే శుభాకాంక్షలకు వర్తిస్తుంది. కొత్తగా వచ్చిన ఈ మాధ్యమాలపట్ల, పాఠకులు, వీక్షకులు, చక్కటి అవగాహన పెంచుకుని , సందర్బ శుద్ధితో… సమూహాలు ఏమిటో? వాటి లక్ష్యాలు ఏమిటో? అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా, పరిమితంగా, సందర్భోచిత సమాచారాలు అందించాలి, అప్పుడే ఈ వాట్సప్‌ సమూహాల విలువ, గౌరవం, పెరుగుతుంది. వాటి యొక్క లక్ష్యాలు నెరవేరతాయి. ఆధునికంగా అందరం రూపాంతరం చెందటం ఎంతైనా అవసరం, కానీ ఆ మార్పు ఆనందం కలిగించాలి, ఆరోగ్యాన్ని చేకూర్చాలి, కానీ వెగటు పుట్టించి అనారోగ్యం కలిగించకూడదు. ఈ ఆరోగ్యకర దిశగా మన సాహితి వికాసం ఆధునిక యుగాన వెలుగొందాలని ఆశిద్దాం.

  • డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు
    7729883223.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News