Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Changing equations: మారిపోతున్న రాజకీయ చిత్రం

Changing equations: మారిపోతున్న రాజకీయ చిత్రం

400 +పై బీజేపీ గురి

రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో 400 స్థానాలను చేజిక్కించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టు కున్న బీజేపీ భారీ ఎత్తున పొత్తుల పర్వంలోకి దిగిపోయింది. తన నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ఏదో విధంగా తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్నదే ఈ పార్టీ ఏకైక ధ్యేయమై పోయింది. పొత్తుల విషయంలో బీజేపీ ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల విషయంలో ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పూర్తిగా రూపుదిద్దుకోని ప్రతిపక్ష ఇండీ కూటమి ఇంకా కొనసాగుతున్నట్టే భావించాలి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిన వాగ్దానాలను కేంద్రం నెరవేర్చనందుకు నిరసనగా 2018లో ఎన్‌.డి.ఏ నుంచి వైదొలగిన తెలుగుదేశం పార్టీతో బీజేపీ ఎట్టకేలకు పొత్తు కుదర్చుకోగలిగింది. ఇండీ కూటమికి దూరంగా జరుగుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమంగా ఎన్‌.డి.ఏకు దగ్గరవుతూ వచ్చారు. ఒడిశాలో 1998-2009 సంవత్సరాల మధ్య ఎన్‌.డి.ఎలో కొనసాగిన బిజా జనతా దళ్‌ మళ్లీ ఎన్‌.డి.ఎతో పొత్తు కుదర్చుకుంది.
ఇక రైతుల ఉద్యమం శాంతిస్తే తప్ప అకాలీదళ్‌ వైఖరి ఏమిటన్నది స్పష్టం కాకపోవచ్చు. అది సమీప భవిష్యత్తులో తప్పకుండా ఎన్‌.డి.ఏ కూటమిలో చేరే అవకాశం ఉంది. తమిళ నాడులో ఆల్‌ ఇండియా అన్నా డి.ఎం.కె కూడా ఎన్‌.డి.ఏకు సన్నిహితం కావడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. అన్నిటికన్నా ఆశ్చర్యకర విషయమేమిటంటే, కొద్ది నెలల క్రితం వరకూ కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పేర్కొన్న బీహార్‌ ముఖ్యమంత్రి, జనతా దళ్‌ (యు) అధినేత నితీశ్‌ కుమార్‌ ప్రస్తుతం నరేంద్ర మోదీ మూడవసారి అధికారం చేపట్టడమే తన లక్ష్యమంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా అనేక పార్టీలు బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ కూటమిలో చేరడానికి సుముఖత చూపించడమే కాకుండా, ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి కూడా.
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇంతవరకూ కాంగ్రెస్‌ పార్టీతో మిత్రపక్షాలుగా, భాగస్వామ్య పక్షాలుగా వ్యవహరించిన కొన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు బీజేపీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ తో తెగతెంపులు చేసుకుని, ఇండీ కూటమి నుంచి వైదొలగి, సొంతగా పోటీ చేయడానికి, బీజేపీకి మద్దతునివ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే తెగతెంపులు చేసుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌ లోని మొత్తం 42 స్థానాల్లోనూ తమ పార్టీయే పోటీ చేస్తుందని ప్రకటించడం కూడా జరిగింది. పుండు మీద కారం రాసినట్టు, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ బహరాంపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అధీర్‌ రంజన్‌ చౌధురి మీద ప్రసిద్ధ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరేకు చెందిన శివసేన తమ మిత్రపక్షాలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (శరద్‌ పవార్‌), కాంగ్రెస్‌ పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించేసింది.
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి రెండు ప్రధాన స్తంభాలుగా నిలబడిన కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు కేరళలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. నిజానికి ఇక్కడి పరిస్థితి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉంది. స్థానికంగా రెండు ప్రధాన కూటములకు నాయకత్వం వహిస్తున్న ఈ రెండు జాతీయ పక్షాలు కేరళలో ప్రధాన శత్రువులుగానే చెలామణీ అవుతు న్నాయి. వాటి మధ్య పచ్చగడ్డి వేస్తే ఇప్పటికీ భగ్గుమంటుంది. ప్రస్తుతం ఇక్కడ వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడి రాహుల్‌ గాంధీ మీద మార్క్సిస్టు పార్టీ అనీ రాజాను అభ్యర్థిగా నిలబెట్టింది. వామపక్షాల సహాయ సహకారాలు లేకుండా కేవలం ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మద్దతుతో రాహుల్‌ గాంధీ వాయనాడ్‌ నుంచి విజయం సాధించే అవకాశం లేదు. దేశంలోని అత్యధిక సంఖ్యాక రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు బీజేపీకే మద్దతునిచ్చే ఉద్దేశంలో ఉన్నట్టు విదితమవుతోంది. త్వరలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పటికే అర్థమైపోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News