Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్loose tongue: నోరు జారిన ఫలితం

loose tongue: నోరు జారిన ఫలితం

రాజకీయ సమస్యలు, చట్ట సంబంధమైన నియమాలు కలిసి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని ఒక దుష్ఠశక్తిగా నిలబెట్టాయి. 2019లో ఎన్నికల సమయంలో ఆయన వాడిన పరుష పదజాలం ఒకటి ఆయనకు శిక్ష పడేలా చేసింది. “మోదీ అనే ఇంటి పేరు కలిగిన వారంతో దొంగలు కావడం ఎలా జరుగుతోంది?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా దాఖలు కావడంతో సూరత్‌ న్యాయస్థానం ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పరువు నష్టం దావా కేసుల్లో ఇంతకంటే ఎక్కువ శిక్షా కాలం ఉండదు. శిక్షతో పాటు ఆయనను లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హుడిగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ శిక్ష మీద సహజంగానే న్యాయ సంబంధమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్‌ గాంధీ వ్యాఖ్య ఎవరైనా ఒక నాయకుడిని ఉద్దేశించి చేసినవా లేక మొత్తం ఇంటి పేరును ఉద్దేశించి చేసినవా అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారన్నది అర్థమవుతూనే ఉంది. అయితే, నేర శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 499 ప్రకారం ఇది ఆ ఇంటి పేరు కలిగిన వారందరికీ వర్తించే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా వ్యక్తి వ్యక్తిగతంగా మనస్తాపం చెందిందీ, లేనిదీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటి పేరున్న వారందరూ మనస్తాపం చెందిన దాఖలాలు లేవు. అదే విధంగా ఈ ఇంటి పేరున్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా మనస్తాపం చెందిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక ఈ పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎంపీ పూర్ణేశ్‌ మోదీ కూడా తమ ఇంటి పేరు కలిగిన వారందరినీ రాహుల్‌ దూషించడం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేయలేదు. తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయలేదు.
ఈ మాట అన్నందుకు గరిష్ఠ స్థాయిలో శిక్ష విధించడం విచిత్రంగానే ఉంది. సాధారణంగా దిగువ స్థాయి కోర్టులు గరిష్ఠ స్థాయిలో శిక్షలు విధించడానికి చట్టాలు అవకాశం కల్పిస్తాయి. నేరానికి తగ్గట్టుగా అవి శిక్షలు విధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఓ ఇంటి పేరును ఉపయోగించి యాదృచ్ఛికంగా వ్యాఖ్యలు చేసినందుకు గరిష్ఠ స్థాయిలో ఇంత పెద్ద శిక్ష విధించాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రతరం అయినప్పటికీ ఇంత పెద్ద శిక్ష విధించాల్సిన అవసరం లేదనే నిపుణుల అభిప్రాయం. దీనిపై ఆయన ఉన్నత స్థాయి న్యాయస్థానానికి వెళ్లడం, స్టే తెచ్చుకోవడం వంటివి జరగవచ్చు గాక. కానీ, సభ్యత్వానికి, పోటీకి అనర్హుడిగా చేయడం అవసరమా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన రాజకీయ జీవితం మీద దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
నిజానికి దేశంలో రాజకీయాలు నేరమయం అయిపోయాయి. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయడం పరిపాటి అయిపోయింది. సిద్ధాంతాల ప్రాతిపదిక మీద కాకుండా వ్యక్తిగతంగా కూడా నిందలు, అపనిందలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం అయిపోయాయి. అవినీతికి, ద్వేషపూరిత ప్రసంగాలు, ప్రకటనలకు కొదవే లేదు. అయితే, ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని ప్రభావితం చేసేంతగా పరువు నష్టం దావా మీద శిక్ష పడాల్సిన అవసరం ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న. ఆధునిక ప్రజాస్వామ్యంలో పరువు నష్టం దావాకు అవకాశం ఉండనే ఉండకూడదు. ఇది నేరం కానే కాదనే విషయాన్ని గమనించాలి. అధికారాన్ని ప్రశ్నించడం అనేది చాలా పెద్ద నేరమని వలస పాలకులు మాత్రమే భావించేవారు. ఇప్పుడది వారసత్వంగా వస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజాసేవకులను విమర్శించకుండా ఉండడానికి, కార్పొరేట్‌ సంస్థల దురాగతాలను ప్రశ్నించకుండా ఉండడానికి పరువు నష్టం ఒక ఆయుధంలా ఉపయోగపడుతోంది. భావవ్యక్తీకరణకు తీవ్రంగా భంగం కలిగిస్తే తప్ప పరువు నష్టం దావా వేయకూడదని 2016లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఒక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకే కాక, దీన్ని రాజకీయ వ్యతిరేకతకు, అసమ్మతికి కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. సూరత్‌కోర్టు తీర్పు నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అజెండాలో పరువు నష్టం దావాను రద్దు చేస్తామనే వాగ్దానం కూడా చేసే అవకాశం ఉంది. విమర్శించడానికి మరే అంశమూ దొరకనట్టు ఇంటి పేరును వాడుకోవడం సమంజసం కాదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News