ఒక నాయకుడి పనితీరును అంచనా వేయడానికి పదవి ప్రాము ఖ్యం కాదు.. ఆ పదవిలో ఆయన చేసిన పని, పార్టీకి చేకూర్చిన బలం, కార్యకర్తల కు కల్పించిన భరోసా, సంస్థను ఎంత పటిష్ఠం చేశారన్నదే అసలు కొలమానం. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత మరింత కీలకం. ప్రభుత్వం పాలన సాగిస్తుంటే.. పార్టీని ప్రజల్లో నిరంతరం క్రియాశీలంగా ఉంచడం, ప్రభుత్వం – పార్టీ మధ్య సమన్వయం సాధించ డం, క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యాలు.
ఈ ప్రమాణాలతో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ రెండేళ్ల ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. కార్యకర్తలతో అనుసంధానం, సంస్థాగత నిర్మా ణం, క్షేత్రస్థాయి చైతన్యమే ఆయన కార్యాచరణలో ప్రధానంగా కనిపిస్తాయి.
కాంగ్రెస్‌కు కార్యకర్తలే వెన్నెముక. ఎన్నికల సమయంలో మాత్రమే కేడర్‌ను సమీకరించడం కాకుండా.. సాధారణ రోజుల్లోనూ పార్టీ కార్యక్రమాలతో అనుసంధానించి ఉంచడం సంస్థాగత బలానికి కీలకం. ఈ దిశగా మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ కార్యకలాపాలను గాంధీభవన్‌కే పరిమితం చేయకుండా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామా ల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కార్యకర్తల సమావేశాలు, జిల్లాల పర్యటనలు, స్థానిక నాయకులతో సంప్రదింపు ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు నాయకత్వానికి – కేడర్‌కు మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలపైనా పార్టీ కార్యాచరణను విస్తృతం చేశారు. రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్లిన బీసీ కులగణన అంశాన్ని తెలంగాణలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేశారు. కులగణనను కేవలం గణాంకాల అంశంగా కాకుండా.. రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాల్లో సమానత్వం, సామాజిక న్యాయంతో అనుసంధానిస్తూ చర్చను ముందుకు తీసుకెళ్లారు.
అదేవిధంగా ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ కార్యక్రమాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా జాతీయ నాయకత్వం నిర్దేశించిన కార్యాచరణను క్షేత్రస్థాయికి చేర్చే ప్రయత్నం జరిగింది. కార్యక్రమం ప్రకటించడం ఒక ఎత్తయితే.. దాన్ని చివరి కార్యకర్త వరకు తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో పార్టీ యంత్రాంగాన్ని కదిలించడంపై దృష్టి సారించారు.
జనహిత పాదయాత్రల ద్వారా వివిధ ప్రాంతాల్లో పర్యటించ డం కూడా కార్యకర్తలతో ప్రత్యక్ష అనుసంధానానికి వేదికగా మారింది. గాంధీభవన్‌లో సమావేశాలతో పాటు జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా అధ్యక్షుడు – కేడర్ మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేశారు.
అధికార పార్టీకి ప్రభుత్వం – పార్టీ మధ్య సమన్వయం మరో కీలక అంశం. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది ఒక వేదికగా నిలిచింది.
ఇక సంస్థాగత నిర్మాణం విషయానికి వస్తే ‘సంఘటన్ సృజన్ అభియాన్’కు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. జిల్లా అధ్యక్షుల నియామకం, జిల్లా కమిటీల ఏర్పాటు, మండలం, పట్టణం, డివిజన్ స్థాయిలో అధ్యక్షులు, కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పార్టీకి అన్ని స్థాయిల్లో పనిచేసే యంత్రాంగాన్ని సిద్ధం చేసే ప్రయత్నం జరిగింది.
యువత, విద్యార్థులను పార్టీతో అనుసంధానించేందుకు ‘న్యాయ్ భోజ్’, ‘చాత్రోంకీ గూంజ్’ వంటి కార్యక్రమాలను రాష్ట్రం లో నిర్వహించారు. భవిష్యత్ రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం సంస్థాగత విస్తరణకు కీల కం. అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, బూత్ స్థాయిలో కేడర్‌ను అప్రమత్తం చేయ డం ద్వారా ఎన్నికల సన్నద్ధతపైనా దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం ఈ క్రమంలో భాగమే.
సంస్థాగత వ్యవస్థ బలపడాలంటే నిర్మాణంతో పాటు నాయకత్వ నైపుణ్యం కూడా అవసరం. అందుకే జిల్లా అధ్యక్షులకు శిక్షణ శిబిరాలు నిర్వహించి పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సంస్థాగత వ్యవహారాలు, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాల్లో దిశానిర్దేశం చేయడం మరో ముఖ్యమైన అడుగు.
మొత్తంగా మహేశ్‌కుమార్ గౌడ్ రెండేళ్ల అధ్యక్ష పదవీకాలాన్ని కేవలం కార్యక్రమాల సంఖ్యతో అంచనా వేయడం సరికాదు. కార్యకర్తలతో అనుబంధం ఎంత పెరిగింది? సంస్థాగత నిర్మాణం ఎంత పటిష్ఠమైంది? అధిష్ఠా నం ఇచ్చిన పిలుపులు గ్రామస్థాయికి ఎంతవరకు చేరాయి? ప్రజా సమస్యలపై పార్టీ ఎంత చురుగ్గా స్పందించింది? ప్రభుత్వం – పార్టీ మధ్య సమన్వయం ఏ మేరకు మెరుగుపడింది? వంటి అంశాల సమాహారంగానే ఈ ప్రస్థానాన్ని చూడాలి.
అధ్యక్ష పదవి హోదా కాదు.. పార్టీని నడిపించే బాధ్యత. అధిష్ఠానం ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఒక వైపు.. కార్యకర్తల మాటను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం మరోవైపు. ఈ రెండు బాధ్యతల మధ్య సమతుల్యత సాధిస్తూ పార్టీని నిరంతరం ప్రజల్లో ఉంచడం రాష్ట్ర అధ్యక్షుడి అసలు పరీక్ష. ఆ పరీక్షలో మహేశ్‌కుమార్ గౌడ్ దృష్టి ప్రధానంగా కార్యకర్తలతో అనుసంధానం.. సంస్థాగత బలోపేతం.. క్షేత్రస్థాయి క్రియాశీలతపైనే నిలిచింది. పార్టీ కార్యక్రమాలను కేడర్‌కు చేరువ చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం, శ్రేణులను నిరంతర కార్యాచరణలో ఉంచడం ద్వారా రెండేళ్ల ప్రస్థానంలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
హానుమాండ్ల ఝాన్సీ రెడ్డి
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్

