Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Maldives: చైనా కబంధ హస్తాల్లో మాల్దీవ్స్

Maldives: చైనా కబంధ హస్తాల్లో మాల్దీవ్స్

మాల్దీవుల చైనా కబ్జా చేయడం ఖాయం

విదేశీ విధానాన్ని మార్చుకునే విషయంలో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ మొయిజు బాగా హడావిడి పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ పటం రాత్రికి రాత్రి మారిపోబోతోందన్నట్టుగా ఆయన తమ విదేశీ విధానాన్ని ఆదరా బాదరాగా పూర్తి చేస్తున్నారు. అటు భారతదేశం గానీ, ఇటు చైనా గానీ ఎక్కడికీ వెళ్లడం లేదనే విషయాన్ని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ సంక్షోభం తలెత్తినా భారతదేశం తనకు ఎప్పటికీ అండగానే ఉంటుందనే విషయాన్ని కూడా అది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ దేశాలు ఎంతగా ప్రయత్నించినా మాల్దీవుల పుణ్యమాని హిందూ మహా సముద్రంలో చైనా తిష్ఠ వేసే కార్యక్రమం దాదాపు పూర్తయిపోయింది. ‘మాల్దీవులకు సైనిక శిక్షణ ఇవ్వడానికి, సైన్యానికి ఉచితంగా ఆధునిక ఆయుధాలను సరఫరా చేయడానికి’ ఉద్దేశించిన ఒప్పందం మీద మాల్దీవులు, చైనాలు సంతకాలు చేయడం జరిగిపోయింది. నిజానికి, ఈ వ్యవహారం మాల్దీవులకే కాక, హిందూ మహా సముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఎంత హానికరమో మొయిజు పట్టించుకున్న పాపాన పోలేదు.

- Advertisement -


మాల్దీవులు స్వతంత్రంగా, స్వయంప్రతిపత్తితో మనుగడ సాగించేలా, అది భవిష్యత్తులో తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయడానికి ఈ ఒప్పందం అన్ని విధాలుగానూ ఉపయోగపడుతుందని ఆయన ఒప్పందం అనంతరం ప్రకటించారు. భారతదేశ సైనిక బలగాలు, సైనిక పరికరాలు, భద్రతా వ్యవస్థల స్థానంలో చైనా బలగాలను, చైనా పరికరాలను, చైనా భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడమనేది పూర్తిగా మాల్దీవుల ఇష్టానిష్టాలకు సంబంధించిన వ్యవహారం. తమ దేశానికి అవసరమైన వాటిని ఎంచుకోవడానికి మొయిజుకు అధికారముంది. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి తాము భారతీయ బలగాలను పంపేయదలిచామని, ఇక నుంచి చైనా బలగాల సాయంతో తాము తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని చెప్పడంలో మాత్రం అర్థం లేదు. ఆయన తెలిసో తెలియకో దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నట్టు కనిపిస్తోంది.
నిజానికి, సైనిక శిక్షణ, ఆధునిక పరికరాలు వగైరాల విషయంలో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదు. ప్రపంచ రాజకీయాలన్నీ ద్రోహాలు, మోసాలతో నిండిపోయిన దశలో ఉచిత భోజనాలకు అవకాశం లేదనే విషయాన్ని మొయిజు గ్రహించవలసి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా చైనా ఏం కోరుకుంటోంది? ఏ విధమైన ఒత్తిడి తేవాలనుకుంటోంది? చైనా దేశానికి భారీ మొత్తాలలో మాల్దీవులు బకాయి పడినట్టు ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రకటించింది. చైనాకు మాల్దీవులు ఇప్పటి వరకూ 1370 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉందని అది తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని దీవులను చైనా కొనుగోలు చేయడానికి వీలుగా 2015లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు యామీన్‌ చట్టాలను చేయడం జరిగింది. ఆయన తర్వాత అధికారం చేపట్టిన ఇబ్రహీం సోలీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. చైనాకు మాల్దీవులు చెల్లించాల్సిన సొమ్ముకు ప్రతిగా చైనా మాల్దీవుల భూములను కబ్జా చేయడం ఖాయమని మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్‌ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి.
చైనాతో సైనిక ఒప్పందం కుదర్చుకోవడమన్నది కొరివితో తలగోక్కున్నట్టే అవుతుంది.

ఈ ఒప్పందం కుదర్చుకోవడం వల్ల మాల్దీవులకే కాదు, భారతదేశానికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. తూర్పు లడఖ్‌ ప్రాంతంలో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌ తన సైనిక బలగాలను అప్రమత్తం చేయడం, సర్వసన్నద్ధం చేయడం వంటివి అవసరమవుతాయి. భారత దేశ ఆందోళనలను, భయాలను మాల్దీవులు ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునే సూచనలు కనిపించడం లేదు. భారత్‌ శివార్లలో ఉద్రిక్తతలు పెరగడమంటే మాల్దీవులకు కూడా నష్టం వాటిల్లబోతోందనే అర్థం చేసుకోవాలి. ఇలాంటివి జరగకుండా చేయగల సత్తా మాల్దీవులకు లేదు. భారతదేశం ముందస్తు జాగ్రత్తగా లక్షద్వీప్‌ లోని తమ నౌకా స్థావరాలను బలోపేతం చేయడం ప్రారంభించింది. ఇది ఇలా ఉండగా, చైనా నుంచి మాల్దీవులు మిరియాల పొడిని, బాష్పవాయు గోళాలను ఎందుకు దిగుమతి చేసుకుంటోందో అర్థం కావడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News