Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Mamata Vs Governor: మమత రాజ్యంలో సరికొత్త వివాదం

Mamata Vs Governor: మమత రాజ్యంలో సరికొత్త వివాదం

ఇద్దరు పోలీస్‌ అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందోనివేదిక పంపాలని రాష్ట్ర గవర్నర్‌ కోరడంతో రాజ్‌ భవన్‌ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మళ్లీ వివాదం ప్రారంభం అయింది. కోల్‌ కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఇందిరా ముఖర్జీ తమ పరిధులు దాటి అనుచితంగా వ్యవహరించారంటూ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌ బోస్‌ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజ్‌ భవన్‌ లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి మీద తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ వచ్చిన ఆరోపణలపై ఈ ఇద్దరు పోలీస్‌ అధికారులు చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా, అనుచితంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిజానికి, గవర్నర్‌ పై వచ్చిన ఆరోపణలపై ఇంత వరకూ చర్యలు తీసుకోవడం జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం గవర్నర్‌ పై చర్యలు తీసుకోవడమన్నది సాధ్యం కాని విషయం. అయితే, ఈ పోలీస్‌ అధికారులు ఆ లైంగిక వేధింపుల ఆరోపణపై వ్యాఖ్యానించడం ఏమాత్రం సమంజసంగా లేదని ఆయన స్పష్టం చేశారు.
గవర్నర్‌ ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది. గత ఎన్నికల్లో హింసాకాండ చోటు చేసుకున్నప్పుడు ఆ హింసాకాండ బాధితులు కొందరు గవర్నర్‌ ను కలుసుకోవాలని భావించారు. గవర్నర్‌ కూడా అందుకు అంగీకరించారు. అయితే, వినీత్‌ గోయల్‌, ఇందిరా ముఖర్జీలు ఆ బాధితులు రాజ్‌ భవన్‌ లో ప్రవేశించకుండా అడ్డుకుని, వారిని వెనక్కు పంపేశారు. సహజంగానే ఇది గవర్నర్‌ కు ఆగ్రహం కలిగించింది. ఒక మహిళను నడిబజార్లో వివస్త్రను చేయడం పైనా, ఒక దంపతులను నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడం పైనా, ఎన్నికల్లో హింసాకాండ పైనా గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు కోరడం కూడా జరిగింది. ఇటువంటి విషయాల్లో గవర్నర్‌ ప్రభుత్వాన్ని నివేదిక కోరడమనేది సమంజసమైన విషయమే. ఆర్టికల్‌ 167 ప్రకారం ఇటువంటి నివేదికలు కోరడానికి గవర్నర్‌ కు అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కేంద్ర సర్వీసుల అధికారులపై గవర్నర్‌ లేదా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా అన్నది వేరే విషయం.
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ ఓ కట్టుకథ అని, పోలీసులే ఇటువంటి కట్టుకథలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పోలీస్‌ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడం వల్ల అనవసర రాద్ధాంతం తలెత్తడం తప్ప ఉపయోగ మేమీ ఉండదు. తమిళనాడు, కేరళ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతున్న స్థితిలో ఇందులో తాజాగా పశ్చిమ బెంగాల్‌ కూడా చేరినట్టయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి గవర్నర్లు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్న ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోంది. గవర్నర్‌, రాష్ట్ర ప్రభ్వుత్వాలకు మధ్య వివాదం ఏర్పడిందంటే దాని అర్థం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయనే. సాధారణంగా గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య బిల్లుల ఆమోదం విషయంలోనే రాద్దాంతం మొదలవుతుంది. అయితే, ఈసారి శాసనసభ్యులతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలన్నదానిపై కూడా వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి మీద గవర్నర్‌ పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. ప్రభుత్వానికి, గవర్నర్లకు మధ్య ఇటువంటి వివాదాలు తలెత్తకుండా ఎంత త్వరగా రాజ్యాంగ సవరణ చేస్తే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News