Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Mangalore blasts: మచ్చ తెచ్చిన మత విధ్వంసం, రాజకీయ పార్టీలు నోరు అదుపులో పెట్టుకోకపోతే..

Mangalore blasts: మచ్చ తెచ్చిన మత విధ్వంసం, రాజకీయ పార్టీలు నోరు అదుపులో పెట్టుకోకపోతే..

మత ఘర్షణలు, మతపరమైన విధ్వంసాలు, మతోన్మాదుల కుట్రలు, పేలుళ్లు వగైరాలు దేశాన్ని ఒక పట్టాన వదిలి పెట్టేలా లేవు. దేశంలో ఎక్కడో అక్కడ ఇటువంటివి చోటు చేసుకుంటూ ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. నవంబర్ 19వ తేదీన మంగళూరులో అక్టోబర్ 23వ తేదీన కోయంబత్తూరులలో జరిగిన మతపరమైన పేలుళ్లు ఈ నగ్నసత్యాన్ని మరోమారు చెప్పకనే చెప్పాయి. ముస్లింలలో కొన్ని వర్గాలు ఎలా తప్పుదోవ పట్టి హింసా విధ్వంసకాండలకు పాల్పడుతున్నదీ ఈ సంఘటనలు కళ్లకు కడుతున్నాయి. మంగళూరులో పేలుడు పదార్థాలను ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకుని ఆటో రిక్షాలో వెళ్లిన మహమ్మద్ షరీక్ కు ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్) సంస్థకు చెందిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉండే అవకాశం లేకపోలేదని దర్యాపు విభాగాల అధికారులు చెబుతున్నారు. ఐ.ఎస్ సిద్ధాంతాలను బాగా ఒంటబట్టించుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వారు వివరిస్తున్నారు. పోలీసులు కర్ణాటకలోని మంగళూరులో కనీసం ఏడు స్థలాల్లో ఆధారాల కోసం సోదాలు జరిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో తన సొంత కారులో పేలుళ్లు సంభవించడంతో ప్రాణాలు కోల్పోయిన జమీషా ముబిన్ కు, మహమ్మద్ షరీక్ కు సన్నిహిత సంబంధాలు ఉండే అవకాశం లేకపోలేదని కూడా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

షరీక్ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటించాడని, సెప్టెంబర్ 21 ప్రాంతంలో శివమొగ్గ జిల్లాలో బాంబులతో ప్రయోగాలు కూడా చేశాడని తెలిసింది. ఈ సంఘటనలో అతని ఇద్దరు సహచరులు పోలీసులకు పట్టుబడ్డారు. కానీ అతను మాత్రం పోలీసుల కళ్లుగప్పి, మైసూరు పారిపోయాడు. అక్కడ అతను మళ్లీ పేలుడు పదార్థాలతో ప్రయోగాలు ప్రారంభించాడు. అతను మంగళూరుకు చేరుకుని అక్కడ బాంబు పేలుళ్లు చేపట్టాలని భావించాడు. అయితే ఆటోలో వెడుతున్న సమయంలో ప్రెషర్ కుక్కర్ లో పెట్టిన ఐ.ఇ.డి బాంబు ఒక్కసారిగా పేలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షరీక్ కొద్దిగానైనా కోలుకుంటే తప్ప అతని కుట్ర వ్యవహారం పూర్తిగా బయటపడదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అతని గురించి ఇప్పటికే తెలుసుకున్న వాస్తవాలు ఏమిటంటే, అతనికి పలువురు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. మంగళూరు, కోయంబత్తూరు పేలుళ్లతో వారందరికీ భాగస్వామ్యం ఉందనే అనుమానం కూడా కలుగుతోంది. వారంతా ఇంకా ఎక్కడెక్కడ పేలుళ్లకు పథకం వేసిందీ కూడా వెల్లడి కావాల్సి ఉంది. ముబిన్ నివాసం నుంచి సుమారు 75 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే ఈ ఉగ్రవాదులు ఎంత పెద్ద ప్రణాళికను సిద్ధం చేసుకున్నదీ అర్థం చేసుకోవచ్చు. కోయంబత్తూరు, మంగళూరు సంఘటనల మధ్య ఏమేరకు సంబంధాలున్నదీ వాటి వెనుక ఎటువంటి ఉద్దేశాలు, పన్నాగాలు ఉన్నదీ, ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమందికి ప్రమేయం ఉన్నదీ బయటపడాల్సి ఉంది. అయితే ఇంతవరకూ తెలిసిన సమాచారమే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కర్నాటకలోని కోస్తా ప్రాంతంలో ఉన్న మంగళూరు మొదటి నుంచీ మత ఘర్షణలకు ఆలవాలంగా ఉంటూ వస్తోంది. ముస్లింలు, హిందువుల మధ్య తరచూ ఘర్షణలు జరగటం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. వాస్తవానికి దేశంలో ఉగ్రవాద ధోరణులు చాలావరకు తగ్గుముఖం పట్టాయని, మరీ ముఖ్యంగా ‘జిహాదీ ఉగ్రవాదం’ బాగా తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ఈ మధ్య తన నివేదికలో తెలియజేసింది. ప్రధానంగా ఆరేళ్ల నుంచి దేశంలో ఉగ్రవాద ధోరణులకు ఆలవాలమైన జమ్మూ, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో సైతం మతోన్మాదుల హింసా, విధ్వంసకాండలు బాగా తగ్గాయని కేంద్రం కూడా గణాంకాలతో సహా సమాచారం అందించింది. నిజంగానే చాలా ఏళ్ల నుంచి దేశంలో మత ఘర్షణలు, మతపరమైన హింసలు కనిపించలేదు. అవిశ్రాంత నిఘా, గూఢచారి కార్యకలాపాల కారణంగా ఇవి చాలా వరకు అదుపులోనే ఉంటున్నాయన్నది వాస్తవం. అయితే, శాంతి సామరస్యాలను కాపాడటమనేది ఒక పెద్ద సవాలుగా పరిణమించిందన్న మాట మాత్రం నిజం. పాలకులకు ఇది కత్తి మీద సామేననడంలో సందేహం లేదు. మంగళూరు, కోయంబత్తూరు పేలుళ్ల సంఘటనలపై జరుగుతున్న దర్యాప్తు ఏవిధమైన సమాచారాన్ని బయట పెట్టనప్పటికీ, ఈ ఉగ్రవాద ధోరణుల వల్ల, వాటి మధ్య ఉన్న లింకుల వల్ల దేశ భద్రతకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉన్నదీ అవగతమవుతోంది. మంగళూరు, కోయంబత్తూరు పేలుళ్ల సంఘటనలపై ఇప్పటికే రాజకీయంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు సమాజానికి ఏమాత్రం మేలు చేయకపోగా మరింత హాని చేస్తాయని ఖాయంగా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News