Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Manjari IPS: ఈమె పేరే ఓ టెర్రర్,పురుషాధిక్య ప్రపంచంలో ఆధిక్యం చాటిన మహిళా లాఠి

Manjari IPS: ఈమె పేరే ఓ టెర్రర్,పురుషాధిక్య ప్రపంచంలో ఆధిక్యం చాటిన మహిళా లాఠి

మంజరి జరుహార్‌ బీహార్‌ రాష్ర్ట తొలి మహిళా ఐపిఎస్‌ అధికారి. ‘మేడమ్‌ సర్‌’ పుస్తక రచయిత్రి కూడా. సమర్థవంతమైన పోలీసు అధికారిగా ఎందరిచేతో ప్రశంసలు అందుకుంటున్న మహిళ. పురుషాధిపత్యం ఉన్న పోలీసు వ్యవస్థలో మగాళ్లకు స్త్రీలు ఏమీ తీసిపోరని నిరూపించిన వ్యక్తి.
విధి నిర్వహణలో అందించిన సమర్థవంతమైన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమె పోలీస్‌ పతకాన్ని అందుకున్నారు. అంతేకాదు రాష్ర్టపతి పోలీసు మెడల్‌ గ్రహీత కూడా ఆమె. క్రమశిక్షణ, నీతినిజాయితీలకు, విలువలకు కట్టుబడి ఉండే వాళ్లే లీడర్లు అవుతారంటారామె. లీడర్‌ నిర్ణయాలు తీసుకోగలగడమే కాదు తన బృందంతో శక్తివంతంగా వాటిని అమలుపరచగలగాలి అని మంజరి గట్టిగా నమ్ముతారు. విధినిర్వహణను సజావుగా నిర్వహించేలా వారికి సరైన మార్గదర్శకత్వం చూపించగలగాలని ఆమె భావిస్తారు. విశేషమేమిటంటే తను నమ్మిన ఈ విశ్వాసాలన్నింటినీ చేతల్లో చూపించిన అధికారిణి మంజరి.

- Advertisement -

బీహార్‌ లాంటి చోట నేర ప్రపంచాన్ని వణికించడమే కాదు, శాంతిభద్రతలను కాపాడడంలో మంజరి అందరిచేత శభాష్‌ అని అనిపించుకున్నారు. ఆడపిల్ల అంటే మంచి గృహిణిగా ఉండాలనే కుటుంబ వాతావరణంలోనే ఆమె పెరిగారు. తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు పిల్లల్లో ఆమె పెద్దది. ఆమెను ఒక కాన్వెంట్‌లో చేర్చారు. అందులో ఎంబ్రాయిడరీ నేర్పేవారు. మంజరి కూడా అక్కడ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. చదువులో సైతం ఆమె ఎప్పుడూ ముందుండేవారు. కానీ మంజరి తల్లి మటుకు తన కూతురుకు వంట, ఎంబ్రాయిడరీ వస్తే చాలనుకున్నారు. ఒక ఇల్లాలికి ఉండాల్సిన సద్గుణాలు అవేనని భావించే రోజులు అవి. ఉద్యోగంలో చేరే ఆలోచనే మంజరిలో లేదు. ఇంటిపనులు చేయడం బాగా వస్తే మంచి భర్త దొరుకుతాడు అని అమ్మవాళ్లు ఎప్పుడూ నాతో అనేవాళ్లు అని మంజరి గుర్తుచేసుకున్నారు.

మంజరికి 19 ఏళ్లకే పెళ్లి చేసేసారు. కానీ ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు మంజరి. తన జీవిత లక్ష్యాన్ని తానే నిర్దేశించుకోవాలని ఆమె భావించారు. ఆ బాధ్యతను తల్లిదండ్రుల చేతిలో పెట్టకుండా తన చేతుల్లోకే తీసుకున్నారు. ‘మా బంధువుల్లో చాలామంది ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ఉన్నారు. ఆ ఉద్యోగాలు ఎంతో గౌరవప్రదమైనవని నాకు అనిపించింది. దాంతో ఐపిఎస్‌ కావాలని నేను నిశ్చయించుకున్నాను’ అని మంజరి చెప్పారు. అలా ఢిల్లీలోని రావూస్‌ ఐఎఎస్‌ స్టడీ సర్కిల్‌లో చేరి సివిల్‌కి సిద్ధమయ్యా. 1976లో సివిల్స్‌కు ఎంపికయ్యా. బీహార్‌ నుంచి తొలి ఐపిఎస్‌ మహిళా అధికారిణిగా అధికారపగ్గాలు చేపట్టా’ అని మంజరి చెప్పుకొచ్చారు.
‘నా కెరీర్‌లో ఎంతోమంది మహిళలు కష్టాలు పడ్డం, వారు రకరకాల హింసకు గురయిన సంఘటనలను చూశాను. ముఖ్యంగా పితృస్వామ్య వ్యవస్థలో వాళ్లు గురవుతున్న రకరకాల సంప్రదాయ సంస్కృతీ ఆధిపత్య ధోరణులు, హింస, కష్టాలు నన్ను ఎంతగానో కదిలించాయి. అవి నాపై తీవ్రంగా ప్రభావం చూపాయి. తమకు న్యాయం కావాలనే తపన వారి కళ్లల్లో నేను చూశాను’ అంటారు మంజరి.
బీహార్‌లోని దానాపూర్‌లో తొలి కేసును మంజరి చేపట్టారు. ఆ ఘటనలో ఒక యువతిని అత్తమామలు కాల్చి చంపి నీళ్లల్లో పడేయడానికి ప్రయత్నించారు. ఈ కేసు విచారణలో అత్తమామలు, భర్త చేతుల్లో తాను పడుతున్న హింస గురించి ఆ యువతి తన తల్లిదండ్రులకు రాసిన ఎన్నో లేఖలు మంజరికి దొరికాయి. ‘ఆ యువతి పేద కుటుంబం నుంచి వచ్చింది. ఇచ్చిన కట్నం చాలలేదని, ఇంకా తెమ్మని ఆ యువతిని అత్తమామలు హింసించి చంపారు. యువతి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కేసు కొట్టేయాలని బతిమిలాడారు. కానీ నేను అలా చేయలేదు. నేరస్తులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాను. కానీ బాధిత యువతి తల్లిదండ్రుల మాటలు అప్పుడు నన్ను ఎంతో షాక్‌కి గురిచేశాయి’ అని ఆ కేసు గురించి మంజరి చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అదే రకమైన పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సెక్షన్‌ 498 మహిళలకు రక్షణగా నిలిచిందన్నారు. స్త్రీల రక్షణకు మరెన్నో కఠినమైన చట్టాలు కూడా వచ్చాయని కాని మహిళలు తీవ్ర బాధలకు గురయిన తర్వాతే న్యాయం పొందే పరిస్థితులు వారికి ఉంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఇప్పటికీ ఎందరో స్త్రీలు తీవ్ర హింసకు, అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు అనా మంజరి అంటారు.

మహిళలను పోలీసు ఆఫీసర్లుగా చూసి ఇప్పటికీ మగాళ్లు ఇంకా తట్టుకోలేకపోతున్నారని, వారు పురుష ఆఫీసర్లతో సమానమైన వారనే వాస్తవానికి జీర్ణం చేసుకోలేకపోతున్నారని మంజరి వ్యాఖ్యానించారు. సబార్డినేట్‌ సిబ్బందిలో ఈ ధోరణి బాగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. మగ పోలీసు అధికారులతో సాహెబ్‌… హుజూర్‌ అని సంబోధిస్తూ మాట్లాడే కానిస్టేబుల్స్‌ మహిళా పోలీసు అధికారులతో ‘మేడమ్‌సర్‌’ అనే కొత్త పదాన్ని వాడుతుంటారు అని చెప్పారు.

ఆడవాళ్లు తమకెదురైన కష్టాలను ఛాలెంజింగ్‌గా ఎదుర్కోవాలి. ఒత్తిడికి, భయానికి లోనుకాకుండా ధైర్యంగా వ్యవహరించాలి. ప్రతికూలంగా ఆలోచించడం మానేసి జీవితంలో ధైర్యంగా ముందుకు అడుగువేయాలి అంటారు మంజరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News