కేసీఆర్ నియంతృత్వం పెరిగిపోయింది
దానికి తోడు ఎడాపెడా అప్పులు చేశారు
విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు
రేవంత్‌కు వనరుల లభ్యత లేదు
గ్రాడ్యుయేషన్ నాలుగేళ్లు అంటూ
మధ్యలో మానేయడానికి అవకాశమిస్తే ఎలా
కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యలే కాదు
తప్పుల భారమూ బోలెడంత ఉన్నది
తెలుగుప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్
ప్రొఫెసర్ జి. హరగోపాల్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా పని చేసి రిటైర్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది ఆయనను గురువులా భావిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సలహాల కోసం వెళుతుంటారు. మేధావులు, ఉద్యమకారులు సైతం ఆయనను అనుసరించకుండా ఉండలేరు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పెద్ద దిక్కుగా, మార్గదర్శిగా వ్యవహరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కేసీఆర్ ఓటమికి కంకణం కట్టుకున్న పౌరసమాజం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పీపుల్స్ జేఏసీ’కి కన్వీనర్‌గా వ్యవహరించారు. రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరుపైనా, ప్రస్తుతం రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవహరించే విధానంపైనా ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి, రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆందోళన పెరగడానికి కారణాలను తెలుగుప్రభ ప్రతినిధి స్కైబాబతో ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు. ఇదంతా ఆయన మాటల్లోనే..
కేసీఆర్ పద్ధతి నిరాశ పరిచింది
కేసీఆర్ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు. తెలంగాణ కల్చర్ తెలిసిన వాడు. ప్రజాస్వామికంగా నడుచుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక ఆయన ప్రవర్తించిన పద్ధతి చాలా నిరాశ పరిచింది. ఎవరితో మాట్లాడకపోవడం, ఎవరితో కలవకపోవడం, తనకు తోచింది చేయడం, కన్సల్టేషన్ లేకపోవడం, మంత్రులకు పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వకపోవడం.. రాష్ట్రంలో ఒక అథారిటేరియన్ రెజ్యూమ్ సాగింది. తెలంగాణ సమాజం, పౌర సమాజం, ప్రజాస్వామ్య ఉద్యమ శక్తులు అసలేమిటి ఈ మనిషి అని అనుకునేంతలా పరిస్థితి మారిపోయింది.
రేవంత్ ఆ తప్పులు చేయలేదు
రేవంత్‌రెడ్డి ఇదంతా చూసినవాడు గనుక.. కేసీఆర్ కంటే భిన్నంగా ఉండాలని, ప్రజాస్వామికంగా నడుచుకోవాలని ప్రయత్నించాడు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రిస్ట్రరేషన్ డెమోక్రసీని పెట్టాలని మేం కోరినపుడు ఏడవ పాయింట్‌గా దానిని పొందుపరిచారు. మొదట కన్సల్టేటివ్ ధోరణి, పౌర సమాజంతో, సంఘాలతో మాట్లాడడం, ఏదైనా మనం చెబితే వినడం, సాధ్యమైతే చేయడం.. ఇవన్నీ రేవంత్ పాలనలో కనిపించిన మార్పులు.
అంతే కాదు.. ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేసుకోవడానికి, సుందరయ్య భవన్‌లో మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాడు.
కేసీఆర్ టైంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఎన్‌జీవో భవన్‌లో పెట్టుకుంటే పొద్దున ఎనిమిది గంటలకే పోలీసులొచ్చి తాళం వేసుకొని పోయారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం మీటింగ్ పెట్టుకుంటే అలా చేయడమనేది భరించరాని విషయం. ఇలాంటివి ఇప్పటివరకు కాంగ్రెస్ పాలనలో జరగలేదు. అలా జరుగుతందని కూడా అనుకోవడం లేదు.
దేశవ్యాప్తంగా రెండే మోడళ్లు అమలవుతున్నాయ్
దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే మోడల్‌లో నడుచుకుంటున్నాయి. అదే న్యూ లిబరల్ డెవలప్‌మెంట్ మోడల్. రాజకీయ పార్టీల పునాది మాత్రం కాంట్రాక్టర్ క్లాస్‌గా మారింది. వ్యవసాయదారుడైనా, పారిశ్రామికవేత్త అయినా బాధ్యతారాహిత్యంగా ఉండలేరు. రైతు అబద్దాలు చెప్పడు. నిజాయితీగా ఉంటాడు. రాజకీయాలలో క్వాలిటీ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈ కాంట్రాక్టర్ క్లాసు అంటే.. మోసం చేయడం, భూమి అమ్మడం కొనడం, దాని నుంచి పిచ్చిగా డబ్బులు తీసుకోవడం. దీన్నుంచి ఉత్పత్తి రాదు, సంపద పెరగదు. అదే భూమి చేతులు మారుతుంది. కేసీఆర్ కాలంలో గానీ, వీళ్ల కాలంలో గానీ భూమి కేందంగా మారింది. ఆయన రెండకరాల అసైన్డ్ భూమిని కూడా లాక్కున్నడు. వీళ్లొచ్చి మళ్లా ల్యాండ్ వెరిఫికేషన్, మళ్లా రెగ్యులరైజేషన్ అంటున్నరు. ఆయన ప్రాజెక్టులు, కాళేశ్వరం కట్టారు. భవనాలు నిర్మించారు. వీళ్లేమో మూసీ ప్రక్షాళన, ప్రాజెక్టులు కడతామంటున్నారు.
ఫ్లోర్ల మీద ఫ్లోర్లకు అనుమతులు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రెండంతస్తుల భవనాల అనుమతుల స్థానంలో నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చి పోయిండు. కేసీఆర్ పీరియడ్‌లో అది 55 ఫ్లోర్లకు చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు 63, 64 అంతస్తుల దాకా పర్మిషన్ ఇస్తామంటున్నారు. నాలుగు ఫ్లోర్లున్న భవనాన్ని ఎనిమిదికి అప్‌గ్రేడ్ చేసినా ఫరవాలేదంటున్నారు. ఫోర్త్ సిటీ అంటున్నారు. అది కూడా కాంట్రాక్టర్ క్లాస్ విజనే. అదేమీ నిరుద్యోగం, అసమానతలను రూపమాపదు. సంక్షేమం వంటి అంశాలు పట్టవు.
విద్యకు ప్రాధాన్యం లేదు
నిజానికి రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉండాల్సింది. ప్రతి గ్రామంలో నాణ్యమైన విద్య అందించడం, మంచి ఆస్పత్రులు నిర్మించి వసతులు కల్పిస్తే బాగుండేది. 1960ల్లో ఏ ప్రభుత్వ హాస్పిటల్ చూసినా బెస్ట్‌గా ఉండేది. విద్య, వైద్యం.. ఇలా సేవలన్నీ ఉచితమే. అక్కడి నుంచి మనం కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్ దాకా వచ్చాం. నాణ్యమైన విద్య, ఉచితంగా మేలైన వైద్యం అందిస్తే మంచి పాలన అనిపించుకునేది.
తీరుమారిన రేవంత్ సర్కార్
రేవంత్‌రెడ్డి ఇంతకుముందు అనుసరించిన సంప్రదింపులు, అభిప్రాయాలను తీసుకోవడం, ప్రజాసంఘాలను కలవడం, ప్రజలను ఇన్వాల్వ్ చేయడం ఇప్పుడు లేవు. న్యూలిబరల్ డెవలప్‌మెంట్ మోడల్ ఎలా ఉంటుందంటే.. ఎవరేం చెప్పినా విన్నా వినకున్నా దాన్ని పుష్ చేయవలసిందే. ఆ మోడల్‌ను అమలు చేయవలసిందే. దాంతో క్వాలిటేటివ్ తేడా కనిపించడం లేదు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుంటుందని, పేద ప్రజలను, అట్టడుగు ప్రజలను పట్టించుకుంటుందనేది పోయింది.
ఎవరు అధికారంలోకి వచ్చినా కాంట్రాక్టర్ క్లాసే..
మరో ప్రమాణం.. కాంట్రాక్టర్ వ్యవహారం. మన దగ్గరున్న మూడు మేజర్ పార్టీలదీ ఇదే వ్యవహారం. బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇదే మోడల్ నడుస్తుంది. ఇదే కార్పొరేటైజేషన్, ఇదే ప్రైవేటైజేషన్, ఇదే కమర్షియలైజేషన్. రూలింగ్ పార్టీలన్నింటిలో కూడా ఐడియాజిలాజికల్‌గా గానీ, సమాజాన్ని చూసే పద్ధతిలో గానీ గుణాత్మకమైన తేడా ఏమీ లేదు. ఏవో కొన్ని తేడాలు అక్కడక్కడా కనిపించవచ్చు గానీ బేసిక్ మోడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ విషయంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇదే మోడల్‌లో ఒక పద్మవ్యూహంలో లాగా ఇరుక్కుపోయినవే. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా లేరు.
మళ్లీ పేదవాళ్ల భూములను ప్రభుత్వ భూములంటున్నారు. ఖమ్మంలో చాలాకాలంగా ఇళ్లు కట్టుకొని నివాసముంటున్న వారి ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఆ పేదవాళ్లు ఏమైపోతారు? ఎక్కడికి పోతారనే కన్సర్న్ఉండాలి కదా!. ఆ కన్సర్న్ లేకపోవడమే మనలాంటి వాళ్లకు డిస్టర్బింగ్‌గా ఉంది.
ఎవరికేం కావాలో చూడాలి కదా?
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. విధాన నిర్ణయం చేసేటప్పుడు ఏ ప్రమాణం ఏం కావాలి? ప్రజలు, నిరుద్యోగులు, రైతులకు ఏం కావాలన్నది చూడాలి. కేవలం సంపద పెరగాలి అంటే ఎలా? నిజానికి సంపద ఇప్పుడే కాదు.. టీఆర్‌ఎస్ పీరియడ్‌లో కూడా పెరిగింది. సాధారణ ప్రజల జీవితాల్లో మార్పు రాకపోతే ఏం పెరిగినట్టు? మనకు కొంత న్యాయం జరిగిందనే ఫీలింగ్ ప్రజల్లో రావాలి. అప్పుడే ఎన్నికల్లో దాని ఫలితం కనిపిస్తది. ఇప్పటికైనా కేబినెట్ అయినా, పార్టీ అయినా ఒక క్రాస్ సెక్షన్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
స్వేచ్ఛనివ్వకుండా విద్యా కమిషన్
విద్యారంగంపై ఒక కమిషన్ వేసిండ్రు. కానీ దానికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి, అటానమీ ఇచ్చి వాళ్లొక కాంప్రహెన్సివ్ రిపోర్టు ఇచ్చేలా చూడాల్సింది. కమిషన్ నడుస్తున్నంతలోనే కేశవరావు కమిటీ అంటూ ఇంకోటి వేశారు. ఫైనల్ రెకమెండేషన్స్ ఇవ్వుమని ఆకునూరి మురళి రిపోర్టును కేశవరావుకు ఇచ్చారు. ఇది ప్రాసెస్‌లో ఉంది. ఇంతలోనే కౌన్సిల్ ఫర్ వైస్ ఛాన్సలర్స్.. 13మంది వైస్ ఛాన్సలర్స్ మీటింగ్‌లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ పాలసీని కాంగ్రెస్ అధికారంలో ఉన్న పక్క రాష్ట్రం రిజెక్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కైనా ఒక పాలసీ ఉండాలి కదా.
అమెరికా పద్ధతి ఇక్కడ నడుస్తుందా?
వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రాడ్యుయేషన్ నాలుగు ఏళ్లు అని నిర్ణయించారు. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రికమెండేషన్. అమెరికాలో డిగ్రీ నాలుగేళ్లు ఉందని ఇలా మార్చారు. అమెరికాలో విద్య చాలా నాణ్యమైనది. నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్‌డీకి వెళ్లవచ్చు. మన దగ్గర ఈ విధానం పనికి రాదు. మన దగ్గర పిల్లలు గ్రామాల నుంచి వస్తారు. గ్రామాలలో ప్రభుత్వ స్కూళ్ల క్వాలిటీ చాలా పడిపోయింది. ఈ పరిస్థితులలో నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ ఎందుకు పెట్టినట్లు? అందులోనూ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్లు పెట్టారు. ఫస్టియర్ తరువాత మానేస్తే సర్టిఫికేట్, రెండేళ్ల తర్వాత డిప్లొమా, మూడేళ్ల తర్వాత డిగ్రీ, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనరరీ డిగ్రీ ఇచ్చి పీహెచ్‌డీ చేయడానికి ఎలిజిబుల్ అనే సర్టిఫికేట్ ఇస్తారట. కోర్సు నాలుగేళ్లు తప్పనిసరి అనకుండా ఏ సంవత్సరమైనా మధ్యలో వెళ్లొచ్చు అంటే.. చదువును వదిలేయడానికి ఒక అవకాశమిస్తున్నారు. పేదరికంలో ఉన్నవారు, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నవారు, తల్లిదండ్రులు ఏదైనా పని చూసుకొమ్మని అన్నపుడు ఏదైనా సమస్య వచ్చినపుడు మొదటి ఏడాదికే వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన పిల్లలకు నష్టం కలిగించే విధానమది. అమెరికాలో నడుస్తుంది కానీ మన దేశానికి పనికిరాదు. అలాంటి పాలసీని ఈ వైస్ ఛాన్సలర్లు ఎలా అంగీకరించారో. తర్వాత ఒక్క సంవత్సరమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే సిలబస్ ఏమిటి? ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం? కనీసం కేశవరావు కమిటీని అడగాలి కదా.. ఆకునూరి మురళి రిపోర్టును పరిశీలించాలి కదా!
ఎడ్యుకేషన్‌కు ఈ మాత్రం నిధులిస్తే ఎలా?
కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కొంత గాకున్నా కొంత విశ్వవిద్యాలయాల విషయంలో పూర్వ వైభవం వస్తుందని అనుకున్నాం. ఎడ్యుకేషన్‌కు బడ్జెట్‌లో 15 శాతం నిధులిస్తారని అనుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం దాకా బడ్జెట్ కేటాయింపు ఉంటే తెలంగాణ వచ్చాక కేసీఆర్ 6.5 శాతానికి తగ్గించేశాడు. మేం వెళ్లి గంటన్నర సేపు వాదిస్తే దాన్ని 7.3 శాతానికి పెంచారు. ఈసారి 8.3 శాతం చేశారు. నిజానికి విద్యకు 15 శాతం ఇవ్వాలనేది మన డిమాండ్. కనీసం 10 నుంచి 12 శాతమైనా చేయాలి. రాజస్థాన్‌లో 21 శాతం, కేరళలో 23 శాతం, ఢిల్లీలో 24 శాతం ఆయా ప్రభుత్వాలు కేటాయిస్తుంటే మన దగ్గర మాత్రం ఇంతే ఉంది.
యూనివర్సిటీలలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కేవలం వీసీలను నియమించి ఊరుకుంటే ఎలా? సీఎం, మంత్రులందరూ విద్యారంగం గురించి మాట్లాడుతున్నారే కానీ తగినంత బడ్జెట్ కేటాయించకుండా మాట్లాడితే ఎట్లా?
నైపుణ్యమొక్కటే సరిపోదు కదా.. సామాజిక స్పృహ అవసరం
స్కిల్ బేస్డ్ అంటూ స్కిల్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మార్కెట్ డిమాండ్ ఉంది కాబట్టి స్కిల్డ్ మ్యాన్‌పవర్ కావాలి కాదనలేని విషయం. కానీ స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు సోషల్ సైన్సెస్ ఎక్స్‍పోజర్ కూడా అవసరం. మనిషి, సోషల్ రిలేషన్స్, జ్ఞానానికి సమాజానికి సంబంధం, ప్రజల పట్ల బాధ్యత, కనీసం మనుషులను ఇష్టపడడం అవసరం. చదువుకున్న మనిషి అంటే విశాలమైన దృ క్పథం ఉండాలి కదా. చదువుకున్న వాడంటే క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. మంచి సమాజం అంటే ఏమిటనే కన్సెప్షన్ లేకుండా ఏ విద్యా విధానమైనా వృథాయే.
ఇంజినీర్లు, ఐటీ లాంటి వాళ్లను చూస్తున్నాం కదా.. ఉద్యోగంలో జాయినవుతరు, డబ్బులు సంపాయిస్తరు. కానీ వాళ్లు ఫ్యామిలీని మేనేజ్ చేయలేకపోతున్నరు. స్నేహాలు లేవు, ప్రేమించడం తెలియదు. విపరీతమైన హింస పెరిగింది. భార్య భర్తను, భర్త భార్యను చంపుకోవడం జరుగుతున్నది. చదువుకున్నవాళ్లే చేస్తున్నారు ఇలా. మన మేజర్ ఛాలెంజ్ ఇది కదా! చదువుకున్న సమాజం అంటే నాగరికత, మానవీయత కలిగిన సొసైటీ కదా..ఈ పర్‌స్పెక్టివ్ లేకుండా మీరు ప్రతిదానికి స్కిల్లు స్కిల్లు అంటే ఎలా? ఎడ్యుకేషన్‌లో ఈ కమిట్‌మెంట్, కన్సర్న్ చాలా ముఖ్యం. మనం చెప్పేదేమంటే స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు సోషల్ కాన్షియస్‌నెస్ కూడా ఇవ్వాలి.
నాణ్యమైన విద్యకు ప్రజల నుంచి డిమాండ్ రావాలి
గ్రామాల నుంచి మా పిల్లలకు మంచి విద్య కావాలి, అప్పులు చేయకుండా నాణ్యమైన విద్య అందాలనే డిమాండ్ రావాలి. కామన్ స్కూల్ విద్యా విధానమే కావాలనే మాట రావాలి. నేను కామన్ స్కూల్ నుంచే వచ్చాను. పాలమూరు చాలా వెనుకబడిన జిల్లా, అందునా వెనుకబడిన ఊరి నుంచి వచ్చాను. మా స్కూల్‌లో నేను హైస్కూల్ చదివేప్పుడు ముగ్గురు నలుగురు ఓబీసీలు, ముగ్గురు దళితులు, అగ్రకులాల వాళ్లు నలుగురు, ఒక అమ్మాయి, ఒక బాలసంతపు కులం బిక్షమెత్తుకునే అబ్బాయి బాలనాగయ్య ఉండేవారు. ప్రతి ఆదివారం బిక్షమెత్తుకోడానికి మా ఇంటికి వచ్చేవాడు. మా అమ్మ.. మీ క్లాస్మేట్ వచ్చాడురా అని బియ్యం, ఇతర వస్తువులు ఎక్కువే ఇచ్చేది. కామన్ స్కూల్ అంటే అది. బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా అందరూ ఒకే క్లాసులో కూర్చొని చదువుకోవడం. కొఠారీ కమిషన్ చాలా ఎలాబరేట్‌గా కామన్ స్కూల్ విద్యావిధానాన్ని రికమెండ్ చేసింది. ఇవాళ కామన్ స్కూల్ ఎక్కడ పోయిందో, ఆ కాన్సెప్ట్ ఎక్కడ పోయిందో తెలియడం లేదు. ఎంత చెప్పినా, ఉద్యమంలో ఎంత మాట్లాడినా ఒక స్టెప్ తీసుకొని కామన్ స్కూల్ విద్యా విధానం అమలు గురించి ఆలోచన చేయడం లేదు.
మురళి రిపోర్టుల మరోలా చెప్పాల్సింది
ఇప్పుడు ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి.. దానిమీద రూ.200 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. ఉన్న స్కూళ్ల పరిస్థితి ఏమిటి? పాఠశాలలు లేని గ్రామాల్లో పెడితే అవి బాగా నడుస్తాయి. కనీసం ప్రైమరీ లేదా అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టి హైస్కూల్ కొంచెం దూరంలో పెట్టినా పిల్లలు వెళ్లగలుగుతారు. అసలు స్కూలే లేకపోతే ఏ గ్రామమైనా వెలితిగా ఉంటుంది. ఇదే విషయం ప్రభుత్వంతో మాట్లాడాం. మురళి కమీషన్ సమయంలో కూడా చర్చ జరిగింది. 20 మంది విద్యావేత్తల తరఫున మురళి ముఖ్యమంత్రికి ఒక రిపోర్టు ఇచ్చాడు. తర్వాత మురళితో కమిషన్ వేశారు. మురళి ఇచ్చిన నివేదికలో కొంత ఫిలసాఫికల్‌గా, ఇంకొంత సమాజ భవిష్యత్తు గురించి ఒక ఫుల్ చాప్టర్ ఉండాల్సింది.
కొన్ని అనవసరమైన విషయాలు చెప్పారు. స్కూల్ టీచర్లకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని ఫీలయితే వాళ్లు మరింత కమిట్‌మెంట్‌తో పనిచేయాలని చెప్పాల్సింది. సమాజం మన బాగోగులు చూస్తున్నప్పుడు మనం అంతే కమిట్‌మెంట్‌తో కష్టపడి సమాజానికి సేవ చేయాలని రాస్తే బాగుండేది. జీతాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రంగంలోకి రండి, విద్యారంగాన్ని బలోపేతం చేయమని మోటివేట్ చేయాల్సి ఉండే. జీతం తగ్గిస్తే విద్యారంగానికి ఏం ప్రయోజనం? జీతాలు తగ్గించి దానిని స్కూలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టండి అంటారు. బ్రహ్మాండమైన బిల్డింగ్ కడితే బిల్డింగ్ ఎడ్యుకేషన్ కాదు కదా, టీచరే మంచి చదువు చెప్పాలి. టీచరే ముఖ్యం, బిల్డింగుల కన్నా.. మంచి జీతం ఉంది, రండి అని పిలవడానికి అవకాశముంటుంది.
మద్దతు ధర ఇవ్వకుండా రైతు ఎలా బతికేది?
రైతు సమస్యకు పరిష్కారం అంతిమంగా స్వామినాథన్ కమిషన్ నివేదికే. ఆ రిపోర్టు చెప్పిందేమిటంటే.. రైతు సాగు మీద పెట్టిన మొత్తం ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి ఆయన అమ్మే ధాన్యానికి ధర నిర్ణయించాలి. కుటుంబం, ఆరోగ్యం, పిల్లల చదువు, మిగతా అవసరాలు ఉంటాయి కదా. ఆ అవసరాల మేరకు కనీస ధర ఇవ్వాలి. ఆయన చెప్పిన ధర ఇవ్వాలి. కష్టం చేసి సమాజానికి అన్నం పెట్టే రైతుకు పెట్టిన ఖర్చు మేరకే ధర ఇస్తామంటూ ఎలా? కుటుంబం ఎలా నడుస్తుంది? అందుకే వాళ్లు అప్పులు చేయాల్సి వస్తున్నది. మళ్లీ ఆ అప్పులను మాఫీ చేస్తామని ప్రకటిస్తున్నారు. కానీ రైతు అసలు అప్పులెందుకు చేస్తున్నాడని ప్రభుత్వం ఆలోచించడం లేదు.
సంక్షోభంలో వ్యవసాయం
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగమే సంక్షోభంలో ఉంది. చివరికి అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఎంత టెక్నాలజీ ఉన్నా ఏం ఉపయోగం? కానీ చైనాలో పరిస్థితి భిన్నం. వాళ్లు మొదట్లో భూమిని పంచారు. రైతులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ వ్యవసాయం బాగుంది. కానీ మన పరిస్థితి ఏమంటే వ్యవసాయం నుంచి మనకు మిగులు రావడం లేదు. ఇండస్ట్రీలు పెరగడం లేదు. ఐటీ సెక్టార్, ఇన్‌కం టాక్స్ నుంచి కొంత ఆదాయం పెరిగింది. కానీ అది సరిపోవడం లేదు. కర్నాటక, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల స్థాయిలో మన బడ్జెట్ ఉంది. కానీ అప్పులు, అప్పుల మీద వడ్డీలు, తర్వాత ఇచ్చిన హామీల వల్ల ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది.
కొత్త రాష్ట్రం.. ఎడాపెడా అప్పులు
తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి.. కేసీఆర్ ప్రభుత్వానికి అప్పులు చేసే సౌలభ్యం చాలా ఉండింది. దానివల్ల ఎక్కడ అప్పు అడిగినా, ఎంత అడిగినా అప్పు దొరికింది. అందుకని ఆరు, ఏడు లక్షల కోట్ల దాకా అప్పు చేశారు. ఆ అప్పుల్లోంచి రైతులకు, అభివృద్ధికి ఖర్చు చేశారు. కొన్ని అప్పులెట్లుంటయంటే పదేళ్లలో తిరిగి చెల్లించాలి. ఆ పదేళ్లకు అప్పు తిరిగి చెల్లించాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చింది. వీళ్లు కొత్త అప్పు చేయాలంటే ముందు పాత అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చిపడింది. అంతకుముందు వాళ్లు వడ్డీ చెల్లించారు. వీళ్లు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాలి కాబట్టి ఆర్థిక వెసులుబాటు చాలా తగ్గిపోయింది. కేసీఆర్ ఉదారంగా ధనిక రైతుకు, భూస్వామికి, అసలు భూమి ఉంటే చాలు ఆ రైతు ఉన్నాడా లేడా, వ్యవసాయం చేస్తున్నాడా లేదా కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి రైతుబంధు ఇచ్చాడు. అట్లా ఇవ్వగలిగే ఆర్థిక స్థితి ఇప్పుడు లేదు. దాంతో 50, 60 ఎకరాలున్నవారిని తీసేశారు. అది వారికి ఆగ్రహం కలిగిస్తున్నది. రూ.21వేల కోట్లు విడుదల చేయాలంటే.. అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే ప్రశ్న వస్తున్నది. అంత ఉదారంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇక ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వచ్చినా ఇదే స్థితిని ఎదుర్కొనేవారు. ఇలాగే తగ్గించవలసి వచ్చేది. దాంతో అసంతృప్తులు వచ్చేవి.
రిసోర్సెస్ పరిమితమయ్యాయ్
ఆర్థిక వనరులలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. వీళ్ల రిసోర్సెస్ చాలా పరిమితమైపోయాయి. కేసీఆర్‌కు అపరిమితంగా ఉండేవి. ధనిక రాష్ట్రం కాబట్టి అప్పుడు అప్పు ఇచ్చేవారు హాయిగా ఇచ్చారు. చిన్న రాష్ట్రానికి ఆరేడు లక్షల కోట్లు అప్పు ఎలా పుట్టిందంటే.. ధనిక రాష్ట్రం, హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి తీర్చగలుగుతారని విశ్వాసంతో ఇచ్చారు. కానీ తిరిగి చెల్లించే వరకు స్థాయిలో ఆదాయం పెరగలేదు. కట్టాల్సిన అసలు, దాని వడ్డీ స్థాయిలో ఆదాయం రాలేదు. ఆరు లక్షల కోట్ల క్యాపిటల్‌ను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ స్థాయిలో ఆదాయం వస్తే రిటర్న్ చేయడం ఈజీ అయ్యేది. కానీ అలా జరగడం లేదు. ఇన్నాళ్లూ ప్రయోజనం పొందినవారు అర్థం చేసుకోవడం లేదు. మొన్నటి దాక వచ్చేవి, ఇప్పుడెందుకు రావడం లేదనే ప్రశ్న మాత్రమే వాళ్ల నుంచి వస్తున్నది. అయ్యో అప్పుల్లో పడ్డారట అనే సింపతీ రైతులకు గానీ ఏ సెక్షన్‌కు గానీ ఉండే అవకాశం లేదు.
అప్పు చేస్తున్నా ప్రాజెక్టులు కడుతున్నాం, వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది, పాడిలో మనది టాప్ స్కేల్స్‍లో ఉన్నాం అనుకున్నారు. కానీ రాష్ట్ర ఆదాయం ఆ స్థాయిలో పెరగలేదు. మూలధన వ్యయం అయితే ఆదాయం పెరిగేది. పబ్లిక్ సెక్టార్‌లో ఖర్చు పెడితే అది పూర్తిగా భిన్నంగా ఉండేది. అట్లా కాకుండా సంక్షేమం కోసమని ఎట్ల బడితే అట్లా ఇవ్వడం చాలా తప్పు.
ఒకవేళ విద్యారంగం మీద ఖర్చు చేసి ఉంటే మన పిల్లలు దేశవ్యాప్తంగా వెళ్లిపోయేవారు. దానికి కేరళను ఉదాహరణగా చూడొచ్చు. మనం ఏ హాస్పిటల్ వెళ్లినా నర్స్ ఎవరు అంటే కేరళ.. ఏ స్కూల్‌కు పోయినా టీచర్ ఎవరంటే కేరళ అంటున్నారు. పశ్చిమాసియా అంతా కేరళ వాళ్లే. మనవాళ్లేం చేశారు, విద్యారంగాన్ని పాడు చేశారు. దాంతో పిల్లలు ఇక్కడ తప్ప ఎక్కడికీ వెళ్లే స్థితి లేదు. ఆ దృష్టి వీళ్లకు లేదు. దేశానికి కేరళ టీచర్లను అందిస్తుంటే తెలంగాణ ఎందుకు అందించలేకపోయింది? విద్యారంగాన్ని ఈ పదేళ్లలో బాగుచేసి ఉంటే ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదు. దీన్నిబట్టి కేసీఆర్‌ది షార్ట్ సైటెడ్ అని తెలుస్తది. కాంగ్రెస్ వాళ్లది అయోమయ పరిస్థితి. బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు.
ఉద్యోగులను మోటివేట్ చేయలేకపోయారు
ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలున్నాయి మన దగ్గర. మంచిదే.. దానికి తగ్గట్టు ఉద్యోగులకు ఆ విషయాన్ని వివరించి మీకున్న జీతాలకు తగ్గట్టు నిజాయితీగా కష్టపడి పనిచేయమని, అవినీతికి పాల్పడవద్దని చెప్పాలి. అదేం చేయడం లేదు. దానివల్ల డెడికేటెడ్ మ్యాన్ పవర్ లేకుండా పోయింది. తెలంగాణ తెచ్చుకున్నాం, కష్టపడి పనిచేస్తాం అనే మోటివేషన్ చేయలేకపోయారు. ఎందుకంటే వీళ్లే తెలంగాణను మర్చిపోయారు. తెలంగాణ ప్రైడ్, తెలంగాణ ఫ్యూచర్, తెలంగాణ పునర్నిర్మాణం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక గొప్ప అవకాశం. కానీ దానిని సరిగా వినియోగించుకోలేదు. చరిత్రలో వారు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. పదేళ్ల తరువాత వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇన్నేసి సమస్యలున్నయ్. పైగా సుదీర్ఘమైన దాని చరిత్రలో చేసిన తప్పుల భారాన్ని కూడా అది మోయవలసి వస్తున్నది.
-(ఇంటర్వ్యూ : స్కైబాబ)

