Menstruation myths and taboos : ఒక వైపు చంద్రుడిపై మానవ మేధస్సు విజయకేతనం ఎగరేస్తుంటే, మరోవైపు సమాజపు లోతుల్లో పాతుకుపోయిన అశాస్త్రీయ భావనలు, అంధ విశ్వాసాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇటీవల ఒక పద్దెనిమిదేళ్ల యువతి, ఇంట్లో జరగబోయే మతపరమైన కార్యక్రమం కోసం నెలసరిని వాయిదా వేసే మాత్రలు వాడి, రక్తం గడ్డకట్టి (డీప్ వీన్ థ్రాంబోసిస్) మరణించడం, ఈ విషాదకర వాస్తవానికి నిలువుటద్దం. ఇది కేవలం ఒక యువతి అకాల మరణం కాదు; ఆచారాల పేరిట, దైవం పేరు చెప్పి, తరతరాలుగా స్త్రీల ఆరోగ్యంపై, వారి అస్తిత్వంపై సమాజం చేస్తున్న దాడికి ఒక చేదు గుళిక. ఈ సంఘటన, నెలసరి చుట్టూ అలుముకున్న అజ్ఞానపు పొరలను చీల్చి, హేతుబద్ధమైన, శాస్త్రీయమైన చర్చకు తక్షణమే తెరతీయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
సృష్టికి మూలమైన ఋతుస్రావాన్ని ‘మైల’గా, ‘అపవిత్రం’గా పరిగణించడం మన సమాజంలో వేళ్లూనుకుపోయిన ఒక సాంస్కృతిక వైపరీత్యం. ఈ భావజాలం కారణంగానే, దైవకార్యాలకు, శుభకార్యాలకు తమ శారీరక స్థితి అడ్డంకిగా మారకూడదనే తీవ్రమైన మానసిక ఒత్తిడికి మహిళలు గురవుతున్నారు. ఈ ఒత్తిడే వారిని వైద్యుల సలహా లేకుండా, ప్రమాదకరమైన హార్మోన్ల మాత్రల వైపు నడిపిస్తోంది. నోరెథిస్టెరోన్ వంటి సింథటిక్ హార్మోన్లతో పనిచేసే ఈ మాత్రలు, శరీరం సహజమైన జీవక్రియలో కృత్రిమంగా జోక్యం చేసుకుంటాయి. వీటి విచక్షణారహిత వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సరైన అవగాహన లేకపోవడం, ఫార్మసీలలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి సులభంగా లభించడం పరిస్థితిని మరింత జఠిలం చేస్తోంది. రక్తం గడ్డకట్టడం, హార్మోన్ల అసమతుల్యత, భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు, మానసిక ఆందోళన వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయని వైద్య ప్రపంచం హెచ్చరిస్తున్నా, ‘ఆచారం’ ముందు ‘ఆరోగ్యం’ చిన్నబోతోంది.
“The great question that has never been answered, and which I have not yet been able to answer, despite my thirty years of research into the feminine soul, is ‘What does a woman want?'”
____Sigmund Freud
ఫ్రాయిడ్ వంటి మేధావికే అంతుచిక్కని ప్రశ్న అది. కానీ, సమాధానం చాలా సులభం. స్త్రీకి కావలసింది గౌరవం, స్వేచ్ఛ, తన శరీరంపై తనకే హక్కు. కానీ, శతాబ్దాలుగా ఈ సమాజం ఆమెకు ఇచ్చిందేమిటి..? నెలసరి… ఋతుస్రావం… పీరియడ్స్. ఈ పదాలు వినగానే పెదవి విరిచే, కనుబొమ్మలు ముడిచే ఒక సభ్య సమాజం. వంటింటి గడప దాటొద్దు, పూజ గది నీడ తాకొద్దు, గుడి గోపురం వైపు చూడొద్దు, పచ్చడి జాడీని ముట్టుకోవద్దు… ఇలా అంతులేని ఆంక్షల కంచెలో, తరతరాలుగా స్త్రీ శరీరాన్ని, ఆమె అస్తిత్వాన్ని బంధించారు.
The body that bleeds for five days without dying is not a symbol of weakness, but of strength and creation.
ఈ నెత్తుటి చుక్క నిజంగా అపవిత్రమా..? స్త్రీ శరీరంలో జరిగే ఈ అత్యంత సహజమైన జీవక్రియ, సర్వాంతర్యామి అయిన దైవాన్ని అపవిత్రం చేయగలదా..? ఈ అపోహల విషవృక్షానికి వేర్లు ఎక్కడ ఉన్నాయి.? ఈ ప్రశ్నల గోడలను బద్దలుకొట్టి, వాస్తవపు వెలుగులోకి రావాల్సిన సమయం ఇది.
అసలు ఏమిటీ ఋతుస్రావం – శాస్త్రం చెప్పే సత్యం : ఈ అంశంపై అల్లుకున్న అజ్ఞానపు పొరలను చీల్చాలంటే, ముందుగా ఈ ప్రక్రియ వెనుక ఉన్న జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. స్త్రీ శరీరం ఒక అద్భుతమైన సృష్టి కర్మాగారం. ప్రతీ నెలా, ఆ కర్మాగారం ఒక కొత్త జీవికి ప్రాణం పోయడానికి సిద్ధమవుతుంది. ఆ సన్నద్ధతలో భాగమే ఈ నెలసరి. గర్భధారణ జరగనప్పుడు, గర్భాశయంలో సిద్ధమైన అమృతమయమైన పొర, ఫలదీకరణ చెందని అండంతో కలిసి, యోని ద్వారా బయటకు విసర్జించబడుతుంది. ఇది అపవిత్రం కాదు, ఇది సృష్టికి మూలం, జీవానికి నాంది.
“Menstruation is the only blood that is not born from violence, yet it’s the one that disgusts them the most.” – Rupi Kaur
అపోహల పుట్ట: మూలాలు ఎక్కడ ఉన్నాయి : మరి ఇంతటి సహజమైన, సృజనాత్మకమైన ప్రక్రియపై ఇన్ని అపోహలు, ఆంక్షలు ఎందుకు పుట్టుకొచ్చాయి.. ? దీనికి మూలాలు ప్రాచీన కాలపు జీవన విధానంలో, సామాజిక నిర్మాణంలో, శాస్త్ర విజ్ఞానంపై అవగాహన లేకపోవడంలో ఉన్నాయి.
పరిశుభ్రతా కారణాలు: ప్రాచీన కాలంలో, నేటిలాగా శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లు, మెన్‌స్ట్రువల్ కప్పులు అందుబాటులో లేవు. స్త్రీలు కేవలం గుడ్డ పీలికలను వాడేవారు. దీనివల్ల రక్తస్రావం లీకవడం, పరిశుభ్రత పాటించడం కష్టంగా ఉండేది. వంటిల్లు, పూజ గది వంటి పవిత్రమైనవిగా భావించే ప్రదేశాల్లో, ఈ రక్తపు మరకలు అంటకుండా ఉండేందుకు వారిని దూరంగా ఉంచి ఉండవచ్చు.
విశ్రాంతి అవసరం: నెలసరి సమయంలో కొందరు స్త్రీలు శారీరక నొప్పులు, నీరసంతో బాధపడతారు. ఆ రోజుల్లో వారికి కఠినమైన పనుల నుంచి (పొలం పనులు, వంట పనులు) విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఈ ఆచారాలు మొదలై ఉండవచ్చు. కాలక్రమేణా, ఈ ‘విశ్రాంతి’ కాస్తా ‘వివక్ష’గా, ‘అంటరానితనం’గా రూపాంతరం చెందింది.
పితృస్వామ్య భావజాలం: అనేక సమాజాల్లో, స్త్రీ పురుషుడి కంటే తక్కువ అనే భావన బలంగా ఉండేది. స్త్రీ శరీరాన్ని, ఆమె జీవక్రియలను నియంత్రించాలనే ఆలోచనా విధానం, ఈ ఆచారాలను మరింత బలంగా పాతుకుపోయేలా చేసింది. స్త్రీని అపవిత్రురాలిగా చిత్రీకరించడం ద్వారా, ఆమెను సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు దూరం పెట్టడం, ఆమెపై ఆధిపత్యం చెలాయించడానికి ఒక సాధనంగా మారింది.
ఆంక్షల విషవలయం: ప్రాణాలతో చెలగాటం : “దేవుడికి కోపం వస్తుంది,” వంటి భయాలతో, స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే తేదీలలో నెలసరి వస్తుందేమోననే భయంతో, చాలామంది మహిళలు వైద్యుడి సలహా లేకుండానే, నెలసరిని వాయిదా వేసే హార్మోన్ల మాత్రలను వాడుతున్నారు. ఈ మాత్రలు శరీరంలోని సహజమైన హార్మోన్ల వ్యవస్థను అతలాకుతలం చేస్తాయని, భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నా, ‘దేవుడికి దూరమవుతామేమో’ అనే భయం వారిని కబళిస్తోంది.
గుడిలోకి స్త్రీ.. దైవానికి అపవిత్రమా : ఇక అసలు ప్రశ్నకు వద్దాం. మహిళ గర్భ గుడిలోకి అడుగు పెడితే దేవుడు మలినం అయితే.. తన గర్భ గుడిలోకి రావడం వద్దు అనుకుంటే, అసలు ఆ దేవుడు పుట్టేవాడా..? సృష్టికి మూలమైన స్త్రీ గర్భాశయం అనే దేవాలయం నుంచే కదా ఈ జగమంతా పుట్టింది? ఆ గర్భ గుడిని పవిత్రంగా ఉంచే నెలసరి ప్రక్రియ అపవిత్రం ఎలా అవుతుంది…? కామాఖ్య దేవి ఆలయంలో, అమ్మవారి ఋతుస్రావాన్ని సృష్టికి సంబరంగా జరుపుకుంటారు. మరి, ఒకచోట పవిత్రమైనది, మరోచోట అపవిత్రం ఎలా అవుతుంది…? ఈ వైరుధ్యమే, ఈ ఆంక్షలు దైవ నిర్మితాలు కావని, అవి మానవ నిర్మితాలని స్పష్టం చేస్తోంది.
మార్పు రావాలి.. మన నుంచే మొదలవ్వాలి..
“The beginning of freedom is the realization that you are not the slave of your thoughts.” – Jiddu krushnamurthi
ఈ అపోహల సంకెళ్లను తెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పాఠశాల స్థాయి నుంచే, ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా ఋతుస్రావం గురించి శాస్త్రీయమైన అవగాహన కల్పించాలి. తల్లులు తమ కూతుళ్లతో, తండ్రులు, సోదరులు తమ ఇంట్లోని స్త్రీలతో ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడాలి. మత పెద్దలు, గురువులు ఈ అశాస్త్రీయమైన ఆచారాలను ఖండించాలి.
నెలసరి అనేది ఒక శాపం కాదు, అదొక వరం. అదొక బలహీనత కాదు, అదొక జీవశక్తి. స్త్రీని తల్లిగా, దేవతగా పూజించే ఈ దేశంలో, ఆమె శరీరంలోని అత్యంత సహజమైన, సృజనాత్మకమైన ప్రక్రియను అపవిత్రంగా చూడటం కంటే పెద్ద హిపోక్రసీ మరొకటి ఉండదు. ఒక అమాయక ప్రాణం అర్పించిన వెల, మన ఆలోచనా విధానంలో మార్పునకు నాంది కావాలి. దైవం పేరుతో మన దేహాలను హింసించుకోవడం భక్తి అనిపించుకోదు. ఆచారాన్ని గుడ్డిగా అనుసరించడం సంస్కృతి కాదు. ఆరోగ్యం కంటే విలువైంది ఏదీ లేదని గ్రహించి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకుని, మన ఆడబిడ్డల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ దిశగా సమాజం మేల్కొననంత కాలం, ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి.


