Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Mental health: మానసిక ఆరోగ్యమూ మహా భాగ్యమే

Mental health: మానసిక ఆరోగ్యమూ మహా భాగ్యమే

ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం కూడా అని అర్థం

ఇటీవలే ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య జరుగుతున్న ఘర్షణ లేదా యుధ్ధంలో సామాన్య ప్రజలు ఎంతోమంది మరణించారు. అలాగే ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధంలో కూడా బలయ్యింది సామాన్యులే. ఈ పరిస్థితులలో అయా దేశాల ప్రజలు శారీరక గాయాలతో పాటుగా మానసికంగా గాయాల పాలవుతారు. ఇటువంటి సంఘటనలు ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒక దేశం యొక్క అభివృద్ధిలో ఆ దేశ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజా ఆరోగ్యం అంటే ‘ ప్రజలు కేవలం ఏదైనా ఒక వ్యాధి లేదా వైకల్యం లేకపోవడం మాత్రమే కాదని, వారు శారీరక, మానసిక, సాంఘిక మరియు ఆధ్యాత్మిక కుశలతలు కలిగి ఉండాలని ‘ తెలిపింది. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది. మానసిక ఆరోగ్యం అనేది భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును కలిగి ఉంటుంది. ఇది జ్ఞానం, అవగాహన మరియు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. మంచి మానసిక ఆరోగ్యం సవాళ్లను ఎదుర్కోవడానికి, జీవితమంతా వృద్ధి చెందడానికి, వ్యక్తుల మధ్య సానుకూల సంబంధాలు ఏర్పరచుకోడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది. మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది. మానసిక అనారోగ్యం గుండె, రక్త నాడుల వ్యవస్ధ సంబంధిత వ్యాధులను కలుగజేస్తుంది. బలహీనమైన మానసికారోగ్యం వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. మానసిక అనారోగ్యం సాంఘికపరమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇంకా డిప్రెషన్‌ కలిగిస్తుంది. బాధిత వ్యక్తుల శారీరక ఆరోగ్యం, జీవనోపాధిపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి మానసిక ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సులో అంతర్భాగం.
ప్రపంచ వ్యాప్తంగా గణాంకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం. 2019లో, ప్రతి ఎనిమిది మందిలో ఒక్కరు లేదా ప్రపంచవ్యాప్తంగా 970 మిలియన్ల మంది ప్రజలు మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు, ఆందోళన మరియు నిస్పృహరుగ్మతలు సర్వసాధారణంగా ఉన్నాయి.
2020లో, కోవిడ్‌19 మహమ్మారి కారణంగా ఆందోళన మరియు నిస్పృహ రుగ్మతలతో జీవించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రారంభ అంచనాలు కేవలం ఒక సంవత్సరంలో ఆందోళన మరియు ప్రధాన నిస్పృహరుగ్మతలకు వరుసగా 26% మరియు 28% పెరుగుదలను చూపాయి. సమర్థవంతమైన నివారణ మరియు చికిత్స ఎంపికలు ఉన్నప్పటికీ, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న చాలామందికి సమర్థవంతమైన సంరక్షణ అందుబాటులో లేదు. చాలామంది వ్యక్తులు కళంకం, వివక్ష మరియు మానవ హక్కుల ఉల్లంఘనలను కూడా అనుభవిస్తున్నారు. 2019లో, 58 మిలియన్ల పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారితో సహా 301 మిలియన్ల మంది ప్రజలు ఆందోళన రుగ్మతతో జీవిస్తున్నారు. 2019లో, 23 మిలియన్ల మంది పిల్లలు మరియు యుక్తవయస్కులు సహా 280 మిలియన్ల మంది డిప్రెషన్‌తో జీవిస్తున్నారు. 2019లో, 40 మిలియన్ల మంది బైపోలార్‌ డిజార్డర్‌ను అనుభవించారు. స్కిజోఫ్రెనియా దాదాపు 24 మిలియన్ల మంది బాధ పడుతున్నారు.
మానసిక అనారోగ్యానికి కారణాలు
సామాజికంగా పేదరికం, హింసకు గురికావడం, అసమా నతలు, వివక్షతలు, అన్యాయానికి గురవ్వడం, ఆస్తుల దురాక్రమణ, బెదిరింపులు, ఆర్థిక మాంద్యం, వ్యాధుల వ్యాప్తి, చీత్కారాలకు గురికావడం, బలవంతపు వలసలు, వాతావరణ సంక్షోభాలు పిల్లలలో శారీరక దండన, దీర్ఘకాలిక అనారో గ్యాలు, వ్యాపారాలలో నష్టాలు, అప్పులు, కుటుంబంలో నిర్లక్ష్యం పొందడం, అధిక పని, ఒత్తిడి మొదలైన కారణాలు చెప్పొచ్చు.
మానసికంగా ఆరోగ్యంగా లేనివారి లక్షణాలు
చేసే పనిపై ఆసక్తి లేకపోవడం, ఆనందాన్ని కోల్పోవడం, సాధారణ విచారం, అపరాధ భావాలు, నిద్ర పట్టకపోవడం, అలసట మరియు ఏకాగ్రత లోపించడం వంటివి.
మానసిక అనారోగ్య ఫలితాలు
ఇది పనిచేసే వ్యక్తి యొక్క సామర్థ్యానికి తీవ్రంగా ఆటంకం కలిగిస్తుంది. మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులకు హాని కలిగించే పరిస్థితులు కలిగి ఉంటారు. అత్యంత తీవ్రమైన స్థితిలో ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. వీరి కుటుంబాలు పేదరికంలోనికి నెట్టబడతారు. సాధారణ వ్యక్తుల కంటే తక్కువ జీవితకాలం బ్రతుకుతారు.
మానసిక ఆరోగ్యానికి సంబంధించి భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు
జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌.ఎం. హెచ్‌.పి) 1982లో అందరికీ కనీస మానసిక ఆరోగ్య సంరక్షణ లభ్యత, ప్రాప్యతను నిర్ధారించడం, మానసిక ఆరోగ్య పరిజ్ఞానం, నైపుణ్యాలను ప్రోత్సహించడం మానసిక ఆరోగ్య సేవ అభివృద్ధిలో సమాజాన్ని ప్రోత్సహించడం మరియు స్వయం-సహాయాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రారంభించబడింది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017లో భాగంగా, ప్రతి బాధిత వ్యక్తికి ప్రభుత్వ సంస్థల నుండి మానసిక ఆరోగ్య సంరక్షణ మరియు చికిత్స అందుబాటులో ఉంటుంది. 2020లో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడానికి 24/7 టోల్‌-ఫ్రీ హెల్ప్‌లైన్‌’ కిరణ్‌’ని ప్రారంభించింది. వయసుల వారిగా మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి, భారత ప్రభుత్వం 2021లో మనస్‌ (మానసిక ఆరోగ్యం మరియు సాధారణీకరణ వ్యవస్థ)ను ప్రారంభించింది.
పరిష్కారాలు
వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులు మరియు వాటి నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. మానసిక ఆరో గ్యం కూడా ముఖ్యమని ప్రజలు తెలుకోవాలి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిపై వివక్ష చూపకుండా తగిన వైద్యా న్ని అందించాలి. శారీరక వ్యాయామాలుతో పాటు యోగ, ధ్యా నం వంటి మానసిక వ్యాయామాలు కూడా చేయాలి. అధిక ఒత్తడిని తగ్గించుకోవాలి. మద్యం, డ్రగ్స్‌ వాటి జోలికి వెళ్ళకూడదు. వీటన్నింటికీ సమాజం, కుటుంబం సహకరించాలి.

  • జనక మోహన రావు దుంగ
    8247045230
    (నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News