Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Microsoft outage: గడగడలాడించిన సాఫ్ట్‌వేర్‌ వైఫల్యం

Microsoft outage: గడగడలాడించిన సాఫ్ట్‌వేర్‌ వైఫల్యం

మైక్రోసాఫ్ట్‌ లో చోటు చేసుకున్న ఒక పెద్ద సాంకేతిక లోపం ప్రపంచాన్ని ఒక్కసారిగా గడగడలాడిం చింది. మైక్రోసాప్ట్‌ కు చెందిన ఒక విభాగంలో గత శుక్రవారం సాంకేతిక పరిజ్ఞానం ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సేవలు, వ్యాపారాలు, చివరికి నిత్య జీవిత కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. ఈ సాంకేతిక లోపం ఒక మహమ్మారి మాదిరిగా ఒక్కసారిగా ప్రపంచమంతా వ్యాపించిపోయింది. విమాన సర్వీసులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆరోగ్య సేవలు, బ్యాంక్‌ వ్యవహారాలు, చిల్లర వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సైబర్‌ ముప్పును సకాలంలో కనిపెట్టి, దాని నుంచి ప్రజానీకాన్ని, కంప్యూటర్‌ వ్యవస్థలను కాపాడడానికి ఉద్దేశించిన ‘క్రౌడ్‌ స్ట్రయిక్‌’ అనే అత్యంత ఆధునిక సైబర్‌ సెక్యూరిటీని మరింత అధునాతనం చేసే క్రమంలో సాంకేతిక లోపం తలెత్తి, ఈ వైఫల్యం చోటు చేసుకోవడం విషాదకరం. ప్రపంచాన్నంతటినీ ఒక పటిష్ఠమైన నెట్కర్క్‌ ద్వారా కలిపి ఉంచే కంప్యూటర్‌ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో గుర్తు చేస్తూ, శుక్రవారం నాడు అందరి కంప్యూటర్‌ స్క్రీన్ల మీదా ఒక్కసారిగా ‘బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌’ అనే సందేశం ప్రత్యక్షమైంది. అనేక ప్రాంతాల్లో సిస్టమ్స్‌ ను పునరుద్ధరించడం జరిగింది కానీ, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి అనేక వారాలు పట్టే అవకాశం ఉంది.
ఈ సాంకేతిక వైఫల్యంతో కంప్యూటర్‌ వ్యవస్థల భద్రత గురించి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అందులో ఉన్న సమాచారమంతా సురక్షితంగా ఉంటుందా అనే ప్రశ్న కూడా తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. పొరపాటున జరిగినా, గ్రహపాటున జరిగినా, ప్రమాదవశాత్తూ జరిగినా, సందర్భవ శాత్తూ జరిగినా ఇది ప్రపంచ దేశాలకు ఒక మహమ్మారిలా విపత్తులు తీసుకు రావడం ఖాయం అని చెప్పక తప్పదు. ఇప్పుడు చోటు చేసుకున్న సాంకేతిక వైఫల్యం ఉద్దేశపూర్వకంగా జరిగిన పొరపాటు కాకపోవచ్చు. అది మైక్రోసాఫ్ట్‌ విభాగంలోని భద్రతా వైఫల్యం వల్లే ఇది చోటు చేసుకుందనడంలో సందేహం లేదు. పరీక్షించడంలో, వినియోగించడంలో, ప్రక్రియను అమలు చేయడంలో సాంకేతిక వైఫల్యం సంభవించినట్టు మైక్రోసాఫ్ట్‌ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇది భద్రతా లోపానికి సంబంధించిన వ్యవహారం అనడంలో సందేహం లేదు. ఈ ప్రత్యేక క్రౌ్‌డ స్ట్రయిక్‌’ అనే అత్యంత ఆధునిక సైబర్‌ సెక్యూరిటీకి అనేక అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆ అంచెలన్నిటినీ దాటుకుని సంభవించిన ఈ ‘వైఫల్యం ప్రపంచ దేశాలనన్నిటినీ ప్రమాదంలో పడేయడం అన్నది తేలికగా, ఆషామాషీగా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు.
ఈ వైఫల్యాన్ని అతి తక్కువ సమయంలో గుర్తించడం వల్ల ప్రపంచానికి పెను ప్రమాదం తప్పింది. లేని పక్షంలో యావత్‌ ప్రపంచం స్తంభించిపోయేది. కంప్యూటర్‌ సంబంధమైన అన్ని వ్యవస్థలు, అన్ని సేవలు తిరిగి కోలుకోలేనంతగా కుప్పకూలిపోయేవి. అంతేకాదు, ఇటువంటి వైఫల్యం ఉద్దేశ పూర్వకంగా లేదా దురుద్దేశంతో జరిగిన పక్షంలో సైన్స్‌ సంబంధమైన సినిమాలో జరిగినట్టుగా ఘోరమైన ప్రమాదాలు జరిగి ఉండేవి. కోట్లాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. బిలియన్ల కొద్దీ నగదు హారతి కర్పూరమయ్యేది. వివిధ దేశాల భద్రతా వ్యవస్థల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేది. అదృష్టవశాత్తూ, సైనిక విభాగాలకు చెందిన కంప్యూటర్‌ వ్యవస్థలు ఈ నెట్వర్క్‌ కిందకు రానందువల్ల అనేక దేశాలు బతికిపోయాయి.
ప్రపంచ దేశాలు మరీ ఎక్కువగా ఇటువంటి కేంద్రీకృత కంప్యూటర్‌ వ్యవస్థల మీద ఆధారపడి ఉండడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులోని ప్రతి వ్యవస్థా ఒక దానితో ఒకటి ముడిపడి ఉంది. కొందరు టెక్నాలజీ సరఫరాదార్ల మీద మొత్తం వ్యవస్థలన్నీ ఆధారపడి ఉండడం జరుగుతోంది. సర్వర్లు, శాటిలైట్లకు సంబంధించిన ప్రపంచవ్యాప్త నెట్వర్కుల మీద ఆధారపడడమనేది ఒక విధంగా తీవ్రస్థాయి అసౌకర్యాలకు, ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇది పెను ప్రమాదాలకు, ఉపద్రవాలకు దారితీసే అవకాశం ఉంటుంది. భద్రతా వ్యవస్థలను మరింతగా పటిష్ఠం చేయడం, అధునాతనం చేయడం, వాటి చుట్టూ అనేక అంచెల భద్రతను నిర్మించడం వంటివన్నీ అవసరమే కానీ, ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం కూడా అవసరమేనని ఈ సాంకేతిక వైఫల్యం వల్ల అర్థమవుతోంది. ఒకే ‘విండో’ వల్ల ప్రపంచం ఏదో ఒకనాడు తప్పకుండా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పుడు జరిగిన సాంకేతిక వైఫల్యం ఒక హెచ్చరిక మాత్రమే. మరోసారి ఈ విధంగా జరిగితే ఏం చేయాలన్నది ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News