Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్minors in crime: మైనర్లు అయినా శిక్ష పడాల్సిందే! బాలనేరస్థులను పెద్దలకిందే జమకట్టాలంటూ కేంద్రం ప్రతిపాదన

minors in crime: మైనర్లు అయినా శిక్ష పడాల్సిందే! బాలనేరస్థులను పెద్దలకిందే జమకట్టాలంటూ కేంద్రం ప్రతిపాదన

అత్యాచారాలు, హత్యలు వంటి దారుణ నేరాలకు పాల్పడినప్పుడు నేరస్థులు మైనర్లయినా పెద్దవారి కిందే జమకట్టి కఠిన శిక్షలు విధించాల్సిందేనని ఈ మధ్య కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ స్పష్టంచేశారు. ఆమె కంటే ముందు ఇదే మంత్రిత్వ శాఖను నిర్వహించిన కృష్ణ తీరథ్ కూడా ఇదే విధమైన ప్రతిపాదన చేశారు. కానీ, బాలల హక్కుల ఉద్యమకారులు ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించడంతో ఇది మూలన పడింది. తాజాగా మేనకా గాంధీ ఇదే ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకు రావటంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది. అత్యాచారం వంటి నేరాలకు పాల్పడినప్పుడు పిన్న వయస్కులను, పెద్దవారిని ఒకే విధంగా విచారించాలని మేనక అభిప్రాయపడుతున్నారు. దారుణ లేదా క్రూరాతి క్రూర నేరాల విషయంలో న్యాయమూర్తులు పెద్దల విషయంలో వ్యవహరించినట్టే మైనర్ల విషయంలోనూ వ్యవహరించే విధంగా చట్టాలను సవరించాలని ఆమె ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉంది.

- Advertisement -

నిర్భయ కేసు విషయంలో పెద్దవారికి ఒక విధంగా, మైనర్ కు మరో విధంగా శిక్ష పడటం అనేది తీర్పునకు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని, ఆ తర్వాత మైనర్లు కూడా ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడటం ఎక్కువైందని ఆమె వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో 18 ఏళ్లు పైబడిన వారికి మరణ శిక్ష విధించగా, వారితో సమానంగా నేరానికి పాల్పడిన ఓ మైనర్ కు మూడేళ్లు మాత్రమే శిక్ష విధించి ఆతర్వాత విడుదల చేయడం జరిగింది. అయితే, నిర్భయ తండ్రి వాదన ప్రకారం, మాయమాటలు చెప్పి నిర్భయను బస్సులోకి పిలిచింది, ఆమెను ఇనుప కడ్డీలతో చిత్రహింసలు పెట్టింది ఈ మైనరేనన్న విషయాన్ని విస్మరించకూడదు. ఆమె మరణానికి ప్రధాన కారకుడు అతనేనని కూడా ఆయన వాదించారు. అతను మైనర్ కనుక చట్ట ప్రకారం అతని నేరాన్ని రికార్డుల నుంచి పూర్తిగా తొలగించటం జరిగింది. అతని దారుణ నేరాన్ని ఒక చిన్న దొంగతనంగా తీసిపారేయడం పట్ల ఆయనే కాక, పలువురు న్యాయ నిపుణులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో న్యాయం అనేది లేశమాత్రంగానైనా కనిపించడం లేదని కూడా నిపుణులు భావిస్తున్నారు.

చట్టంలోని ఈ లొసుగును ఉగ్రవాదులు సైతం ఉపయోగించుకుంటున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా సంస్థ ఈ అస్త్రాన్ని ఆధారం చేసుకుని కొత్త రకం ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్ లోకి పంపిస్తోందని తెలిసింది. భద్రతా సిబ్బంది గనుక పట్టుకున్న పక్షంలో తాము మైనర్లమని చెప్పాలని ఆ సంస్థ తమ కార్యకర్తలకు చెప్పి సరిహద్దులు దాటిస్తోంది. మైనర్లు నేరాలకు పాల్పడినప్పుడు వారికి పెద్దవారి స్థాయిలోనే శిక్షలు విధించాలనే మేనక ప్రతిపాదనలో న్యాయం, తర్కం లేకపోలేదు.

ఇది భావోద్వేగ వాదన

అయితే, ఇటువంటి ప్రస్తావనను, ప్రతిపాదనను దేశం ముందుకు తీసుకు రావటంలో న్యాయం ఏమీ లేదని, ఇది భావోద్వేగంతో, తాత్కాలిక ఆవేశంతో చేస్తున్న ప్రతిపాదన అని కొందరు బాలల హక్కుల ఉద్యమకారులు ఆక్షేపిస్తున్నారు. ఇది సహజ న్యాయాన్ని, తీర్పుల్ని ధిక్కరించినట్టే అవుతుందని కూడా వారు వాదిస్తున్నారు. శిక్షలు విధించడంలో వయసు వచ్చిన వారికి, వయసు రాని వారికి మధ్య తేడా ఉండాలని, వయసురాని వారి పట్ల కొద్దిగా వెసులుబాటు ధోరణితో వ్యవహరించాలని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయని వారంటున్నారు. పిన్న వయస్కులు పెద్దవారి మాదిరిగా విచక్షణతో వ్యవహరించలేరని, వారి మానసిక పరికపక్వత పెద్దవారి స్థాయిలో ఉండదని, పెద్దవారు ఆలోచించగలిగిన స్థాయిలో ఉంటే, పిన్న వయస్కులు ఆవేశంతో తప్ప ఆలోచనతో వ్యవహరించే అవకాశం ఉండదని అనేక ఇతర దేశాలు భావిస్తున్నాయి. తాము చేస్తున్న పనేమిటో, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించే వివేకం మైనర్లలో చాలా తక్కువగా ఉంటుందనేది శాస్త్రీయంగా కూడా తేలిన అంశమని వారు పేర్కొన్నారు.

మైనర్లు ఇతరుల ప్రభావానికి లోనవడం ఎక్కువగా ఉంటుందని, వారు పెద్దవారు చేసే పనిని గుడ్డిగా అనుకరిస్తుంటారని, వారిలో మానసిక పరిపక్వత చాలా తక్కువగా ఉంటుందని అంటూ, వారు బాల నేరస్థులకు తక్కువ శిక్ష విధించాలనే అభిప్రాయంతో దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఏకీభవిస్తున్నాయని పేర్కొన్నారు. పిన్న వయస్కులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వడమే న్యాయమని వారు స్పష్టం చేశారు. నిజానికి అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దారుణ నేరాలకు పాల్పడినప్పుడు పిన్నలైనా, పెద్దలైనా ఒకే విధమైన శిక్ష విధించడం జరుగుతోంది. అయితే, ప్రపంచంలోని అత్యధిక సంఖ్యాక దేశాలు మాత్రం మైనర్లకు తక్కువగానూ, పెద్దలకు ఎక్కువగానూ శిక్షలు విధిస్తున్నాయి. జర్మనీలోఅయితే, 21 ఏళ్ల వయసు వచ్చేవరకూ వారిని మైనర్లుగానే పరిగణిస్తారు. పిన్న వయస్కులు తమను తాము సంస్కరించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వక తప్పదని జర్మనీ భావిస్తోంది. మన శాసనకర్తలు కూడా ప్రపంచ దేశాల అభిప్రాయంతోనే మందుకు వెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News