Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Missing Children: మాయమైపోతున్నారు

Missing Children: మాయమైపోతున్నారు

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి… ఆడుకుంటూ ఆడుకుంటూనే అమాంతం మాయమైంది. తప్పిపోయిన ఆ బాలిక కోసం ఓ తల్లి మనసు తల్లడిల్లుతూనే వుంది. ఏళ్లకేళ్లు గడుస్తున్నా జాడ దొరకక మరో తల్లి జావగారిపోయింది. కన్నీళ్లింకిన ఇంకో తల్లి చూపు పిల్లాడి కోసం వెతుకుతూనే వుంది. ఇలా ఒకరిద్దరు కాదు, ప్రతి ఏడాది వందల సంఖ్యలో పిల్లలు అదృశ్యమవుతున్నారు. పేగు తెంచుకుని పుట్టిన కన్నబిడ్డ ఉన్నట్టుండి కనిపించ కుండా పోతే, ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతం. అప్పటివరకూ చేయి పట్టుకుని తిరిగి మారాం చేసిన పిల్లలు ఒక్కసారిగా మాయమైపోతే, ఆ తల్లిదండ్రులు ఏమై పోతారు? దేశవ్యాప్తంగా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ చిన్నారి తప్పిపోతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నారులు తప్పిపోవడానికి రకరకాల కారణాలు తోడవు తున్నాయి. జన సమ్మర్థ ప్రదేశాలు, పని వెదుక్కోవడం, క్లిష్టమైన కుటుంబ పర్థితు లతో ఇల్లు విడిచిపోవడం, అక్రమ రవాణాదారుల ప్రభా వం, బాల్య వివాహాలు, బాల కార్మికులు, అల్లర్లు, విప త్తులు, కుటుంబ కలహాలు, హింస తదితర కారణా లతో ఇల్లు విడిచిపోతున్నారు. వీరందరినీ తప్పిపోయిన చిన్నారులుగానే పరిగణిస్తారు. పిల్లలను అపహరించి అక్రమంగా రవాణా చేసే ముఠాలకూ కొదవ లేదు. ఇలా రకరకాల పరిస్థితుల్లో కుటుంబాలకు దూరమ వుతున్న లక్షలాదిమంది చిన్నారులు… వెట్టిచాకిరి, ఇళ్లలో పని, బానిసత్వం, భిక్షాటన, అవయవాల దోపిడి, లైంగిక వ్యాపారంలో మగ్గిపోతున్నారు. కొంతమంది అక్రమా ర్కులు పిల్లలను అపహరించి లాభదాయిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
కఠినమైన చట్టాలున్నా, ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగిస్తున్నా, చిన్నారుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా పిల్లల అదృశ్యం మాత్రం ఆగడంలేదు. ఇంటివద్ద ఆడకుంటున్న పిల్లలను ఎత్తుకుపోతున్నారు. టీనేజీ వయసు వచ్చాకా వారే ఇల్లు విడిచిపోతున్నారు. కొంతమందిని బూచాళ్లు కిడ్నాప్‌ చేస్తు న్నారు. దేశవ్యాప్తంగా 2018 తర్వాత అదృశ్యమవుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం 47 వేల మంది చిన్నారుల ఆచూకీ తెలియడం లేదు. వారిలో 71.4 శాతం మంది మైనర్‌ బాలికలేనని ఆ నివేదిక తెలి పింది. కనిపించకుండా పోయిన బాలబాలికల సంఖ్య 2022తో కలిపి ఐదు సంవత్సరాల కాలంలో బాగా పెరిగింది. 2021లో కంటే 2020లో 19.8 శాతం తగ్గింది. కానీ 2018లో కంటే 2019లో 8.9 శాతం, 2017తో పోలిస్తే 2018లో 5.6 శాతం పెరిగింది. ఆచూకీ తెలియకుండా పోయిన చిన్నారులలో ఆయా రాష్ట్రాల అధికారులు కొందరి ఆచూకీ తెలుసుకున్నప్పటికీ గణాం కాలలో తేడా మాత్రం అధికంగానే ఉంది. తాజాగా ఎన్సీ ఆర్బి వెలువరించిన వార్షిక నివేదికలో 2022లో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు, 24 మంది ట్రాన్సెజెండర్లు కలిపి మొత్తం 83,350 మంది దేశ వ్యాప్తంగా కనిపించకుండా పోయారు. అదృశ్యమవుతున్న చిన్నారుల సంఖ్య పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో అధికంగా ఉంది. 2017, 2018, 2019, 2020, 2021 లలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా, 2022లో బెంగాల్‌లో అత్యధికంగా 12,455 మంది చిన్నా రులు కనిపించకుండా పోయారు. కిడ్నాపులు, బలవంతపు వివాహాలు, దీర్ఘకాల మానసిక, సామాజిక పరిస్థితులు, విరక్తి, నిరంతర అవమానాలు, వేధింపులు, చదువు ఆగిపో వటం, బహిష్కరణలు తదితర కారణాలతో చిన్నారులు కని పించకుండా పోతున్నారు.
తెలుగు రాష్ట్రాల పోలీసులకు మిస్సింగ్‌ కేసులు తల నొప్పిగా మారాయి. గడచిన కొంత కాలంగా మిస్సింగ్‌ కేసులు పెరుగుతుండడంతో అన్ని వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమవుతున్న పిల్లల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండడం మరింత ఆందోళనను కలిగిస్తున్న అం శం. పిల్లలను అపహరించే ముఠాలు అనేక చట్ట విరుద్ధ మైన కార్యకలాపాలకు ముక్కుపచ్చలారని పసిమొగ్గలను బలిచేస్తున్నాయి. పిల్లలు పుట్టింది మొదలు, ఈ అపహరణ దశల వారీగా కొనసాగుతుండటం విచారకరం. కొన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రత సరిగా లేకపోవడం తో అప్పుడే పుట్టిన శిశువులను అపహరించి పిల్లలు లేని దంపతులకు భారీ మొత్తాలకు విక్రయించిన ఘటనలు అనేకం. యాచకవృత్తిలోకి దించడం, అవయవ వ్యాపారు లకు పిల్లల్ని విక్రయించడం, బాలకలైతే వ్యభిచార గృహాలకు తరలించడం, అయిదు నుంచి పదిహేను ఏళ్ల వయస్సున్న చిన్నారులను కర్మాగారాల్లో బాలకార్మికులుగా చేర్పించడం, ఇళ్లలో పనివారిగా కుదర్చడం, అత్యంత ప్రమాదకరమైన బాణసంచా, ఆయుధాల తయారీలోనూ వినియోగించడంతో పాటు వివిధ జంతువులపై టెస్టింగ్‌ కోసం ప్రయోగించే మందులను (వైద్యపరీక్షలకు) పిల్లలపై ప్రయోగించే అమానుష చర్యలు జరుగుతున్నాయి. అధునాతన టెక్నాలజిని వాడడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలుగు రాష్ట్రాల పోలీసులు మిస్సింగ్‌ కేసులను చేధించలేక పోతున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బలవంతంగా యాచకవృత్తిలోకి దింపుతున్న ముఠాలను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్‌ 11, 2023న ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. పిల్లల అదృశ్యానికి సంబంధించి రాష్ట్రం దేశంలో 8వ స్థానంలో ఉన్నట్లు కథనంలో ఉందని, ఇది తీవ్రమైన అంశంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జె. అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తప్పిపోయిన పిల్లల కేసులకు సంబంధించి ప్రామా ణిక విధి విధానాలు రూపొందించాలని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం, 2015 వంటి చట్టాలు బాధిత చిన్నారుల సంరక్షణకు సంబంధించినవి. మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ చిన్నారులకు తోడ్పా టు అందించేందుకు కేంద్ర ప్రాయోజిత బాలల సంరక్షణ సేవలను అమలు చేస్తోంది. ట్రాక్‌ చైల్డ్‌ ఆపరేషన్‌ స్త్మ్రల్‌, ముస్కాన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్పిపోయిన పిల్లల స్థితిగతుల్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నాయి. ఏడాదిలో రెయసార్లు ఆపరేషన్‌ స్త్మ్రల్‌, ముస్కాన్‌ కార్యక్ర మాల ద్వారా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందకు యత్నిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు ప్రత్యేక యాప్‌ రూపొందించి ఈమేరకు కృషి చేస్తోంది. ఎక్కడైనా ఓ చిన్నారి తప్పిపోతే పోలీసుల కోసం 100, చైల్డ్‌ లైన్‌ కోసం 1098కు ఫోన్‌ చేయడంతోపాటు పోలీసుస్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. బాధిత చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ప్రభుత్వపరంగా వ్యవస్థల్లో నెలకొన్న లోపాలు, అడ్డంకులను సరిదిద్దాలి. ఇలాంటి కేసులకు సంబంధించి అంతరాష్ట్ర సమన్వయం, సహాయ, పునరావాసాలు అవసరమవుతాయి. చిన్నారులు దూరమైతే ఆ కుటుంబ సభ్యులు ఎంతో క్షోభ అనుభవిస్తుం టారు. పిల్లలు తప్పిపోకుండా పాటించాల్సిన జాగ్రత్త చర్యలపై కుటుంబాల్లో అవగాహన కల్పించాలి. తప్పిపోయిన చిన్నారులను వెదికి సత్వరమే కుటుంబం వద్దకు చేర్చే పటిష్ట వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే ఈ సమస్య తీవ్రత చాలావరకూ తగ్గుతుంది.
కనిపించకుండాపోతున్న పిల్లల సమస్య చాలా చిత్ర మైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ సమస్య ఉన్నా, కనిపించకపోవడానికి ఓ స్పష్టమైన నిర్వచనం లేదు. ఫలానా చోట ఉంటారనుకునే బాలుడు అక్కడ ఉండకపోవడాన్ని ‘మిస్సింగ్‌’గా పరిగణిస్తున్నారు. తల్లిదం డ్రులు, సంరక్షకులు లేదా చట్టపరంగా నిరక్షణ బాధ్యతలు కలిగివున్న వ్యక్తి లేదా సంస్థకు వివరాలు తెలియని పిల్లలను మిస్సింగ్‌ చైల్డ్‌ గా పరిగణిస్తారు. ఇలాంటి పిల్లల రక్షణ, పోషణ అవసరమని జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ఆర్టికల్‌ 92లో పేర్కొన్నారు. ఇంటినుంచి పారిపోయిన వారు మాత్రమే కాకుండా, కిడ్నాప్కు గురైన వారిని కూడా కనిపించకుండాపోయిన పిల్లలుగా గుర్తిస్తారు. బెల్జియంలో మార్క్‌ డుట్రాక్స్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా టీనేజీలో ఉన్న ఆడపిల్లలను కిడ్నాప్‌, మానభుగం, హత్యలు చేస్తున్నట్లు 1996లో బయటపడింది. ‘డుట్రాక్స్‌ అప్లైర్‌’ అని పిలిచే ఈ ఉదంతానికి చలించిపోయిన బెల్జియన్లు సుమారు మూడు లక్షల మంది వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ’వైట్‌ మార్చ్‌’ అని పిలిచే నిరసన ప్రదర్శనకు స్పందనగా అప్పటి బెల్జియన్‌ ప్రధాని దేహానే అమెరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ సాయం కోరారు. అప్పటికే ఈ సంస్థకు ఇతర దేశాల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తుండటంతో ‘ఇంటర్నే షనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ సంస్థ (ఐసీఎం శ్రీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1999 ఏప్రిల్లో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు బహుమఖంగా విస్తరించింది.

- Advertisement -


కోడం పవనకుమార్‌, 9848992825

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News