Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Missing golden opportunity: జారిపోతున్న సువర్ణావకాశం

Missing golden opportunity: జారిపోతున్న సువర్ణావకాశం

తమ మధ్య ఐక్యత కోసం ప్రతిపక్షాలు రాజకీయంగా తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవడం అవసరం. అటువంటి సువర్ణావకాశం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూడాల్సి ఉంటుంది. కీలక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవకాశాలు చేజారిపోవడం ఖాయం. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుల మీద సి.బి.ఐ, ఈ.డిల దాడుల రూపంలో ఆ సువర్ణావకాశం కలిసి వచ్చింది. వీటిని ఉపయోగించుకుని ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా ప్రధాని కార్యాలయంలో అడుగుపెడుతూ, “నేను తినను, ఎవరినీ తిననివ్వను’ అంటూ శపథం చేశారు. తాను అవినీతికి పాల్పడడని, ఇతరులను కూడా అవినీతికి పాల్పడనివ్వడని దాని అర్థం. 2జి, బొగ్గు కుంభకోణాలపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను అడ్డుపెట్టుకుని 2014లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. తాను స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనను అందిస్తానని మోదీ కూడా వాగ్దానం చేశారు.
ఆయన చెప్పినట్టుగానే, ఏవో ఒకటి రెండు ఆధారరహిత ఆరోపణలు తప్ప అవినీతికి సంబంధించి ఆయన ప్రభుత్వం మీద సరైన ఆరోపణంటూ ఒక్కటి కూడా ఇంతవరకూ రాలేదు. పాలనా యంత్రాంగంలో బీజేపీ బలంగా పాతుకుపోయి ఉండడం, రాష్ట్రాలలో కూడా ఆ పార్టీకి ఎదురు లేకుండా ఉండడం, పాలక పక్ష సభ్యులపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో పస లేకపోవడం వగైరా కారణాల వల్ల బీజేపీ చేతికి ఇంతవరకూ మట్టి అంటలేదు. అయితే, అవినీతికి సంబంధించి ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు చేస్తుండడం, వారిపై సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను అధికారులు దాడులు చేస్తుండడం ప్రతిపక్షాలను ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. 2014 తర్వాత నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరుపుతున్న దాడుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.సీబీఐ అధికారులు, ఆదాయపన్ను శాఖాధికారుల దాడులు కూడాఈ మధ్య కాలంలో మరీ పేట్రేగిపోయాయి.
కాగా, ఇతర అంశాలలో ఇంతవరకూ ఒక్క తాటి మీదకు రాలేకపోయిన ప్రతిపక్షాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న విషయంలో మాత్రం కొద్ది పాటి సంఘీభావాన్ని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ తొమ్మిది ప్రతిపక్షాలు ప్రధానమంత్రికి ఒక ఉమ్మడి లేఖ రాశాయి. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేయగానే ప్రతిపక్షాలు ఈ లేఖను రాయడం జరిగింది. ఈ లిక్కర్‌ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కుమార్తె, భారత్‌ రాష్ట్ర సమితికి చెందిన ఎం.ఎల్‌.సి కె. కవిత పేరు కూడా ఉంది. ఈ ప్రతిపక్షాల ఉమ్మడి లేఖపై కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సంతకం చేయలేదు. దీనిపై కవితకు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌కు మధ్య వాగ్వాదం కూడా నడిచింది.
వారి వాగ్వాదం విషయం ఎలా ఉన్నప్పటికీ, ఇతర ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్నట్టే కాంగ్రెస్‌ నాయకుల మీద కూడా కేంద్ర సంస్థల మీద కూడా దాడులు జరిగే అవకాశం లేకపోలేదు. కేంద్ర సంస్థలు జరుపుతున్న దాడులలో సుమారు 95 శాతం దాడులు ప్రతిపక్ష నాయకుల మీదే జరుగుతున్నట్టు ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.విచిత్రమేమిటంటే, ఇటువంటి కీలక అంశం మీద కూడా ప్రతిపక్షాలు ఎవరి దోవ వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలోని పొత్తుల కారణంగానూ, ప్రతిపక్షాల ఐక్యత కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌, భారత్‌ రాష్ట్ర సమితి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు కాంగ్రెస్‌తో తీవ్రంగా విభేదిస్తున్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక్కటైపోవాల్సిన ప్రతిపక్షాలు ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి.ఒక వర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, భారత్‌ రాష్ట్ర సమితి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఉండగా, మరో వర్గంలో కాంగ్రెస్‌, డి.ఎం.కె, వామపక్షాలు చేరిపోయాయి. కేంద్ర సంస్థల దాడులతోనైనా సంఘటితం అవుతాయని ఆశించిన ప్రతిపక్షాలు 2024 ఎన్నికలకు ముందుగా మరో సువర్ణావకాశాన్ని చేతులారా జారవిడుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News