Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Modi 3.0 @ 100 days: వంద రోజుల పాలన సాధించిందేమిటి?

Modi 3.0 @ 100 days: వంద రోజుల పాలన సాధించిందేమిటి?

ఆశయ సాధనలో వెనుకబడలేదు

కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలు కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ పాలనను బేరీజు వేసుకోవడం జరుగుతోంది. మొదటి రెండు పర్యాయాల మాదిరిగానే మూడవ పర్యాయం కూడా తమ పాలనను కొనసాగించడానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కొద్దిగా అవస్థలు పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సుస్థిర పాలన, పటిష్టమైన నాయకత్వం సవ్యంగానూ, సజావు గానూ కొనసాగుతు న్నప్పటికీ, వాగ్దానాలు, హామీల విషయంలో బీజేపీ ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితిలో ఉంది. తమ వంద రోజుల పాలనను పురస్కరించుకుని ఎన్‌.డి.ఎ ప్రభుత్వం సహజంగానే తమ సాఫల్యాలను ఎక్కువగాను, వైఫల్యాలను తక్కువగాను ప్రదర్శించడం జరుగుతోంది. పునర్వినియోగ ఇంధనం, సంక్షేమ పథకాలు, ప్రాథమిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో తాము సాధించిన సాఫల్యాలను ప్రభుత్వం మరోసారి ప్రజలకు వివరించింది. పద్ధెనిమిదవ లోక్‌ సభలో బీజేపీ నాయకత్వం ఎక్కువగా సంకీర్ణంపై ఆధారపడి ఉంటున్నప్పటికీ, ఆశయ సాధనలో మాత్రం వెనుకబడి లేమని మంత్రులు పదే పదే ఉద్ఘాటించడం జరుగుతోంది.
ఎన్నికల సందర్భంగా తాము చేసిన వాగ్దానాలను తాము తప్పకుండా నెరవేరుస్తామని, అసం పూర్తిగా మిగిలిన పోయిన తమ అజెండాను కూడా పూర్తి చేస్తామని గత 18వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పష్టం చేయడం జరిగింది. దేశంలో లోక్‌ సభకు, శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమర్పిం చిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తామని, ఇంగ్లీషు స్థానంలో హిందీని విస్తరించే ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సంకీర్ణ భాగ స్వాములను ఒప్పించే కార్యక్రమంలో ప్రభుత్వం నిమగ్నం అయినందువల్ల ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో కాలయాపన జరుగుతున్నట్టు కనిపిస్తోంది. లోక్‌ సభ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌తో కొద్దిగా భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా ఆటంకాలకు కారణం అయింది.
సుస్థిరత్వం, విధానాల కొనసాగింపు, రాజకీయ అనుకూలతలు సమర్థ పాలనకు కొలబద్దలే కానీ, ఇతర పార్టీలతో చర్చలు, సంప్రదింపులు జరపడం, అభిప్రాయాలను సేకరించడం, రాజీ మార్గం అనుసరించడం, ఏకాభిప్రాయం సాధించడం వంటివి కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అవసరమ వుతాయి. ఒక్కోసారి క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరోసారి ఆత్మరక్షణ పంథాను అనుసరించాల్సి ఉంటుంది. బీజేపీ ఈసారి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యా బలాన్ని సంపాదించలేకపోయినందువల్ల, సంకీర్ణ పార్టీల బలం అవసరమైనందువల్ల ఈ పద్ధతులన్నీ తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది. అయితే, సిద్ధాంతాలకు, వాగ్దానాలకు కట్టు బడిన పార్టీ అయినందువల్ల బీజేపీ తన భాగస్వామ్య పక్షాలను నమ్మించి, ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదివరకు అతి త్వరగా, అతి వేగంగా అమలు జరిగిన తమ నిర్ణయాలు, వాగ్దానాలు, ఆశయాలు ఇక మీదట కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది తప్ప నెరవేరకపోవడం జరగదని పార్టీ వర్గాలు పదే పదే చెబుతున్నాయి. గత రెండు పర్యాయాల్లో దేశం అంతర్జాతీయంగా ఒక బలమైన దేశంగా ఎదిగిందనడంలో సందేహం లేదు. ఆర్థికంగా బలపడిందనడంలో కూడా సందేహం లేదు. మూడవ పర్యాయం కూడా ఆ పరిస్థితుల్లో మార్పులు ఉండకపోవచ్చు.
వివాదాస్పద అంశమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు బిల్లు విషయంలో అందరినీ సంప్రదించడం జరుగుతోంది. ప్రజాభిప్రాయం మేరకు కొత్త పింఛన్‌ విధానానికి స్వస్తి చెప్పింది. ఉన్నతాధికార పదవులకు బయటి నుంచి ప్రము ఖులను తీసుకోవడాన్ని కూడా నిలిపి వేసింది. ప్రభుత్వం తన నిర్ణయాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి వారి అభిప్రాయాలను తెలుసు కోవడం జరుగుతోంది. ప్రభు త్వం అన్ని విషయాల్లోనూ వెసులుబాటుతో వ్యవహరిస్తోందనడానికి ఇదొక సంకేతం. సంకీర్ణంలోని భాగస్వామ్య పక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజల అభిప్రాయాలకు విలువ నిస్తోంది. సంఖ్యాబలం ఉన్నప్పుడైనా, సంకీర్ణంపై ఆధారపడినప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దేశానికి అవసరమైన, దేశానికి హితమైన కార్యకలాపాలనే అనుసరిస్తోంది తప్ప దేశాన్ని విభజించే, దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే, దేశాన్ని బలహీనపరిచే కార్యకలాపాలను అనుసరించడం లేదని పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా చేసిన వ్యాఖ్యలను అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News