Sunday, September 15, 2024
Homeఓపన్ పేజ్Modi defines Secularism!: మోదీ నోట సెక్యులరిజం మాట!

Modi defines Secularism!: మోదీ నోట సెక్యులరిజం మాట!

కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు ప్రవచించే కుహానా లౌకికవాదాన్నే కాక, అసలు లౌకికవాదాన్నే గట్టిగా వ్యతిరేకించే ప్రధాని నరేంద్ర మోదీ నోట ఇటీవల వెలువడిన లౌకికవాదం మాట దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఎర్రకోట మీద నుంచి ప్రసంగిస్తూ, రాజకీయ పండితులనే కాక, అభిమానులను సైతం ఆశ్చర్యచకితుల్ని చేసే ప్రకటనలు కొన్ని చేశారు. ఆయన ఈ సందర్భంగా ఉపయోగించిన లౌకిక పౌర స్మృతి (ఎస్‌.సి.సి)కి అర్థం తెలియక రాజకీయ విశ్లేషకులు దీనినొక బ్రహ్మ పదార్థంగా అభివర్ణిస్తున్నారు. “మతం మీద ఆధారపడిన, వివక్షను సృష్టించగలిగిన చట్టాలకు మన ఆధునిక సమాజంలో స్థానం లేదు. అందువల్ల దేశానికి ఒక లౌకిక పౌర స్మృతి అవసరమని భావిస్తున్నా. ఈ మేరకు మాకు అనేక అభ్యర్థనలు అందాయి. మేం కూడా అనేక ఆదేశాలు జారీచేయడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉమ్మడి పౌర స్మృతి మతపరమైనది. వివక్షతో కూడినది’ అని ఆయన స్పష్టం చేశారు. సుమారు 75 ఏళ్లుగా ఉమ్మడి పౌర స్మృతిలో మగ్గుతున్న భారతదేశం ఇక లౌకిక పౌర స్మృతి వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మోదీ దేనినైనా మసిపూసి మారేడు కాయ చేయ గలరు. తాను చేసిన ప్రకటనకు దేశవ్యాప్తంగా అనుకూలతలు లభిస్తాయని ఆయన ఆశించి ఉంటే ఆయన చాలావరకు ఇందులో విజయం సాధించడమే జరిగింది. ఇందులో కొద్దిగా గందరగోళం నెలకొని ఉంది కానీ, ఆయన నోట సెక్యులర్‌ అనే మాట రావడం కొద్దిగా ఆశించిన ఫలితాన్నే ఇచ్చింది. అయితే, లౌకిక పౌర స్మృతి అంటే అర్థం కాక రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) వంటి బీజేపీ సంస్థలు మాత్రం అయోమయంలో పడిపోయాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌ మొదట జనసంఘ్‌ను, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని ప్రారంభించిన దగ్గర నుంచి కాషాయ దళం ప్రతి ఏటా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు వస్తామనే వాగ్దానం చేస్తూనే వస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్‌ 370 రద్దు అనే రెండు అంశాలు లేని మేనిఫెస్టో లేదంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. సాధారణంగా లౌకికవాదాన్ని భుజాన వేసుకుని తిరిగే ప్రతిపక్షాలు మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న కారణంగానే లౌకికవాదం గురించి మాట్లాడడం ప్రారం భించారంటూ విమర్శలు సాగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా, అతి శక్తివంతమైన పార్టీగా ఉన్న బీజేపీ లౌకికవాదానికి ప్రజల విశ్వాసాన్ని చూరగొ నడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలున్నాయన్నది ప్రతిపక్షాలకు కూడా కొరుకుడు పడడం లేదు.
అమలు జరుగుతుందా?
బీజేపీ ఇటీవలి తన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి పౌర స్మృతి ద్వారా మాత్రమే దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకు వెళ్లవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. ప్రతి విషయంలోనూ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలు ప్రత్యేక హక్కులు అనుభవించడం చూసిన బీజేపీ ప్రభు త్వం దీన్ని బలహీన పరచాలంటే అందుకు ఉమ్మడి పౌర స్మృతి ఒక్కటే బ్రహ్మాస్త్రమని భావిస్తోంది. మోదీ లౌకిక పౌరస్మృతి అనే మాటను సృష్టించడం ద్వారా, ఎటువంటి వివరాలలోకి వెళ్లకుండానే, లౌకిక ఉమ్మడి పౌరస్మృతి, మతపరమైన పౌరస్మృతి అనే మాట ద్వారా చర్చను రేకెత్తించారు. ఈ లౌకిక స్మృతి గురించి ఆయన గానీ, ఆయన మంత్రులు గానీ, ఆయన పార్టీ నాయ కులు గానీ ఎటువంటి వివరాలనూ బయటపెట్టడం లేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ కూడా అయోమయంలో పడిపోయింది. నిజానికి, లౌకిక పౌర స్మృతి అనే మాటను వాడడం ద్వారా మోదీ ఒక్క రాయితో రెండు పిట్టల్ని కొట్టినట్టయింది. తమ సంకీర్ణానికి రెండు బలమైన మూల స్తంభాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జె.డి (యు)లతో పాటు ఆయన కాం గ్రెస్‌ పార్టీ తదితర ప్రతిపక్షాల నోళ్లు కూడా మూయించి నట్టయింది.
పార్లమెంటులో తమ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, తన ఇమేజ్‌ను నిలబెట్టు కోవడానికి, తాను చేయదలచుకున్నది చేసే తీరతానని చెప్పడానికి మోదీ ఇటువంటి మాటను ఉపయోగించారా అని విశ్లేషకులు కూడా తర్జనభర్జనలు చేస్తున్నారు. సాధారణంగా లౌకిక వాదం ఊసెత్తని మోదీ దేశంలో ఈ లౌకికవాదం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలని, కాంగ్రెస్‌ పార్టీ కుహానా లౌకికవాదాన్ని బహిర్గతం చేయాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌ మధ్యప్రదేశ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉమ్మడి పౌర స్మృతి (యు.సి.సి)కి సంబంధించి శాసనసభల్లో తీర్మానాలు చేయడం జరిగింది. మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇదే మార్గంలో ప్రయాణించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపైన సాధ్యమైనంత త్వరగా చర్య తీసుకోవాలంటూ ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఇప్పటికే తమ ప్రకటనలు, సమావేశాల ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తోంది. మోదీ తన స్వల్పకాలిక ప్రయోజనాల కోసమే కాక, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూడా అకస్మాత్తుగా యు.సి.సిని తీసుకు వచ్చే అవ కాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా అనేక కీలక విషయా లను సైతం పక్కన పెట్టిన మోదీ ప్రభుత్వం ఇటువంటి చర్యల విషయంలో సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది.
వేచి చూసే ధోరణి
నిజానికి, గత లోక్‌ సభ ఎన్నికల్లో తమకు అత్యధిక సంఖ్యాబలం లభిస్తుందని భావించిన బీజేపీ ఈ యు.సి.సి తదితర కీలక నిర్ణయాల విషయంలో ముసాయిదాలను తయారు చేసుకోవడం ఎన్నికల ముందు నుంచే ప్రారంభించింది. వక్ఫ్‌ బోర్డు చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కూడా అది తమ ఎన్‌.డి.ఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడికి తలవంచి ఈ బిల్లును ఉమ్మడి పార్లమెంటరీ సంఘానికి అప్పగించవలసి వచ్చింది. కుల, మత ప్రసక్తి లేకుండా 45 ఉన్నతాధికార పదవులకు నియామకాలు జరిపించాలన్న నిర్ణయాన్ని కూడా రిజర్వేషన్లకు సంబంధించిన ఒత్తిడి కారణంగా మోదీ ప్రభుత్వం పక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రైవేట్‌ రంగాల్లోని అనుభవజ్ఞులను, నిపుణులను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి నేరుగా తీసుకోవాలన్న ఉద్దేశం నీతి ఆయోగ్‌ నుంచి వచ్చింది. ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా ప్రతిభావంతులైన వారిని చాలా మందిని అది ఇప్పటికే తీసుకోవడం కూడా జరిగింది. 2018 నుంచి ఇంత వరకూ 63 మంది అధికారులకు ఈ విధంగా నియమక పత్రాలు ఇవ్వడం జరిగింది. అప్పట్లో మోదీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నందువల్ల ఇది ఎటువంటి ఆటంకాలూ లేకుండా సాగిపోయింది. ఇప్పుడు సంఖ్యా బలం లేనందువల్ల వ్యతిరేకత ఎదురవుతోంది. విచిత్రంగా ఇందుకు మిత్రపక్షాల నుంచే వ్యతిరేకత వచ్చింది. సహజంగానే కాంగ్రెస్‌ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి.
తన నిర్ణయాలు, చర్యలు సరైనవేనని మోదీ గట్టి నమ్మకం. ఆయన ఏనాడూ ఎవరి ఒత్తిడినీ ఖాతరు చేయలేదు. ఎవరేమన్నా పట్టించుకోలేదు. అయితే, మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మోదీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రెండు అడుగులు ముందుకు వేసే ముందు మోదీ ఒక అడుగు వెనక్కు వేస్తారని, అది ఆయన నైజమని ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ, ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అడుగులు ముందుకు వేయడానికి ఎక్కువ సమయమే తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తన హిందుత్వ అజెండాను అమలు చేయడానికి ఆయన వెనుకాడే ప్రసక్తి లేదు. తన ఆలోచనలు, సిద్ధాంతాలతో ఆయన కొద్దిగా రాజీపడుతున్నారంటే, ఆయన భవిష్యత్తులో ఏదో చేయబోతున్నారని అర్థం. ఆయన లౌకికవాదంపై చర్చ లేవదీస్తున్నారు. దీనిపై వేడిగా, వాడిగా చర్చ జరగాలన్నది ఆయన సంకల్పం. చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన పలు కీలక అంశాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • ఎన్‌.వి. కాళేశ్వరరావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News