Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Modi Guru: ఆమే నా గురువు

Modi Guru: ఆమే నా గురువు

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ ఇటీవల కనుమూసిన విషయం తెలిసిందే. తన తల్లి అంటే ఆయనకు ఎనలేని గౌరవం. తన జీవిత గురువు తల్లేనంటారు ఆయన. తల్లి నిరాడంబర జీవితం, క్రమశిక్షణ తనకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందంటారు. తన జీవిత ప్రయాణంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఆమె అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పదని చెప్పారు. అందరికి మంచి చేయాలని, అందరూ సంతోషంగా ఉండాలని తన తల్లి ఎప్పుడూ కోరుకునేవారని మోదీ చెప్పారు. తన తల్లి హీరాబెన్‌ గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు …
“ అమ్మ ఎన్నో కష్టాలు పడింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. శక్తివంచన లేకుండా పోరాటం చేసింది. ఉన్నత విలువలు గల వ్యక్తి ఆమె. జీవితంలో ఎలాంటి అగ్నిపరీక్షలు ఎదురైనా తలదించలేదు. ఇప్పటికీ నాకు గుర్తే. నేను గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినపుడు మా అమ్మను నా జీవిత మార్గదర్శిగా, బోధకురాలిగా సన్మానించాలనుకున్నాను. అదే అమ్మకు చెపితే ఆమె అస్సలు ఒప్పుకోలేదు. పైగా తాను సాధారణమైన మనిషిని మాత్రమేనంది. ‘కొడుకుగా నీకు జన్మనిచ్చాను. కానీ నిన్ను ఇంత వాడిని చేసింది ఆ భగవంతుడే’ అని జవాబిచ్చింది. ఈ రోజుకు కూడా మా అమ్మ పేరున ఒక్క పైసా ఆస్తి లేదు. మా అమ్మ బంగారు నగలు పెట్టుకోగా నేనెన్నడూ చూడలేదు. వాటిపై ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదు. ఎప్పటిలాగా తన జీవిత చరమాంకం వరకూ చిన్న గదిలో నిరాడంబరమైన జీవితం గడుపింది. నిఘంటువులో మనం ఎన్నో పదాలు చూస్తుంటాం. అలాంటి పదం కాదు అమ్మ అంటే. ఎన్నో భావోద్వేగాలను గుదిగుచ్చితే రూపు సంతరించుకునేదే అమ్మ. ఆమెలో ప్రేమ, నమ్మకం, ఓర్పు, మరెన్నో సద్గుణాలు రాశిపోసుకుని ఉంటాయి. దేశాలు, మతాలు, కులాలు, రంగు వివక్షలకు అతీతంగా అమ్మ పట్ల ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన ప్రేమ జాలువారుతుంటుంది.

- Advertisement -

బిడ్డలకు జన్మనివ్వడమే కాదు. వారిని మంచి ఆలోచనాపరులుగా తీర్చిదిద్దుతుంది. ఉన్నత వ్యక్తులుగా వారిని నిలబెడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తుంది. పిల్లల క్షేమం కోసం, ఎదుగల కోసం దేన్నైనా త్యాగం చేయడానికి వెరవని గొప్ప వ్యక్తిత్వం తల్లిది. నన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది నా తల్లిదండ్రులు. నా వ్యక్తిత్వమే కాదు నేను పొందుతున్న గౌరవం, ప్రేమ అన్నీ నా అమ్మానాన్నలు పెట్టిన భిక్షే. మా అమ్మ ఎంత నిరాడంబర జీవో అంత విలక్షణమైన వ్యక్తి కూడా. మా అమ్మ గురించి నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ల తల్లులను గుర్తుచేస్తాయి. ఆమె ఒక తపస్వి. మనిషిని గొప్పగా చేయగల శక్తిమంతురాలు ఆమె. పిల్లల్లో గొప్ప విలువలను నింపే అద్భుతమైన గుణం అమ్మలో దాగుంది. అమ్మ ఒక వ్యక్తి కాదు…మాత్రుత్వానికి రూపు.

మా అమ్మ గుజరాత్‌ లోని మెహ్సనలోని విస్నాగర్‌ లో పుట్టారు. చిన్నతనంలోనే తను అమ్మ ప్రేమకు దూరమైంది. స్పానిష్‌ ఫ్లూ ఉద్రుత రూపం దాల్చిన సమయంలో ఆమె తల్లి చనిపోయింది. తల్లి లేకుండానే ఆమె బాల్యం గడిచిపోయింది. అందరిలా అమ్మ దగ్గర మారాం చేసే, అల్లరి చేసే అవకాశమే ఆమెకు లేకుండా పోయింది. అమ్మ ఒడిలో పడుకుని ఆడుకున్న తీపి గుర్తులూ ఆమెకు లేవు. ఆమె బాల్యమంతా ఎన్నో ఎగుడుదిగుడుల మధ్య క్లిష్టంగా సాగింది. చదువుకోవడానికి బడికి వెళ్లలేకపోయింది. పేదరికం, దారిద్య్రంలోనే ఆమె బాల్యం కరిగిపోయింది. ఆమెకు చదవడం రాదు. రాయడం రాదు. వీటి వేటి గురించి ఆమె ఎన్నడూ చింతించలేదు. ఇదంతా దైవేంచ్ఛ అనేది.

కానీ తల్లి ముఖం కూడా ఎరగనన్న బాధ ఆమెను చివరికంటా వెన్నాడుతూనే వచ్చింది. పుట్టింట్లో అందరికన్నా అమ్మే పెద్ద పిల్ల. అంతేకాదు పెళ్లిచేసుకుని వెళ్లిన ఇంట్లో ఆమే పెద్ద కోడలు. చిన్నతనం నుంచీ ఇంట్లో పనులన్నీ ఆమే చేసేది. తోబుట్టువుల బాగోగులు సైతం ఆమే చూసుకునేది. పెళ్లైన తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వహించడంలో కూడా ఆమె ఎన్నడూ వెనకడుగు వేయలేదు. కుటుంబపోషణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, సమస్యలు తలెత్తినా ఇంట్లో అశాంతి నెలకొనకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోయేలా నిశ్శబ్దంగా తన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ వెళ్లిపోయింది.
వాద్‌ నగర్‌ లో ఒక చిన్న ఇంట్లో మేము ఉండేవాళ్లం. ఆ ఇంటికి కిటికీలు కూడా ఉండేవి కావు. ఇంటికి టాయ్‌ లెట్‌, బాత్రూములు ఉండడం ఒక్కటే అప్పుడు మాకున్న లగ్జరీ. ఇంటి గోడలు మట్టితో చేసినవి. బంకమన్నుతో పైకప్పు కట్టారు. చిన్నా, పెద్దా అంతా అందులోనే ఉండేవాళ్లం. వెదురు మొద్దులతో వేసిన ఒక గట్టును నాన్న అమ్మ కోసం ఆ ఇంట్లో కట్టారు. దానిపై అమ్మ వంట వండేది. ఆ గట్టుపైనే కుటుంబసభ్యులమందరం కూర్చుని అన్నం తినేవాళ్లం. రోజు గడవడం కష్టంగా ఉన్నప్పటికీ ఆ విషయాలేవీ పిల్లలకు తెలియకుండా అమ్మానాన్నలు నిశ్శబ్దంగా తమ బాధ్యతలను నిర్వహించేవారు.

మా నాన్న దామోదర్‌ పొద్దున్నే నాలుగు గంటలకే పనికి వెళ్లిపోయేవారు. ఆయన ఎంతో క్రమశిక్షణతో ఉండే మనిషి. ఆయన ఉదయం బయటకు వెళుతున్నారంటే అప్పుడు సమయం నాలుగు గంటలు అయిందని అందరికీ తెలిసిపోయేది. నాన్న తన టీ షాపును తెరవడాని కంటే ముందు గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని ఆతర్వాతే పని ప్రారంభించేవారు. మా అమ్మ కూడా ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. నాన్నతో పాటు ఆమె కూడా ఉదయమే నాలుగు గంటలకు లేచి ఇంటి పనులు ప్రారంభించేవారు. తెల్లారకుండానే పనులన్నీ పూర్తిచేసేసేవారు. బియ్యం, పప్పులు బాగు చేయడం దగ్గర నుంచి అన్ని పనులూ ఆమ్మే చేసుకునేది. ఆమెకు ఎవ్వరూ సహాయకులు లేరు. పిల్లల్ని కూడా ఇంటి పనిలో సహాయం చేయమని ఎన్నడూ ఆమె అడిగింది లేదు. అమ్మ ఎంతో కష్టపడ్డం మేం గమనించేవాళ్లం. అందుకే పిల్లలం మా అంతట మేమే ఆమెకు సహాయపడేవాళ్లం. విడిచిన బట్టలు తీసుకెళ్లి ఊరి చెరువులో నేను ఉతికేవాడిని.

ఈత కొట్టడం అంటే నాకు ఇష్టం. ఇటు బట్టలు ఉతికే పని చేయడంతోపాటూ నీటిలో ఈత కొడుతూ ఎంజాయ్‌ చేసేవాడిని. ఇంటి ఖర్చుల కోసం అమ్మ కొన్ని ఇళ్లల్లో అంట్లగిన్నెలు తోమేది. ఇంటి ఖర్చుల కోసం చర్ఖా పని చేసేది. తన పని కోసం ఇతరుల మీద ఆధారపడ్డం అమ్మకు ఇష్టం ఉండేది కాదు. వర్షాకాలం వస్తే మట్టితో కట్టిన మా ఇల్లు నీళ్లు కారేది. అప్పుడు మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇల్లు చెరువును తలపించేది. ఇంట్లోకి నీళ్లు కారకుండా మా అమ్మ ఏవేవో చేస్తూ ఎంతో కష్టపడేది. నీళ్లు కారేచోట గిన్నెలు పెట్టి వర్షపునీటిని నింపేది. ఆ నీటిని ఇంటిపనులకు రెండు మూడు రోజులపాటు ఉపయోగించేది. అలా వర్షపు నీటిని ఆమె భద్రపరిచేది. మా మట్టి ఇంటిని అమ్మ రోజూ పేడతో అలికేది. ఎండిన పేడతో కిటికీలు లేని ఇంట్లో పొయ్యను వెలిగించి వంటను చేసేది. ఇల్లంతా పొగతో నిండిపోయేది. ఆ పొగతో గోడలన్నీ నల్లబడిపోయేవి. దీంతో తరచూ గోడలకు సున్నం వేయాల్సి వచ్చేది. ఆ పని కూడా అమ్మే చేసేది. అంతేకాదు బంకమట్టితో రకరకాల అందమైన గిన్నెలను, వస్తువులను చేసి వాటితో ఇంటిని చక్కగా అలంకరించేది. ఇంట్లోని పాతసామగ్రిని రీసైక్లింగ్‌ చేయడంలో ఆమెది అందెవేసిన చేయి.
పడుకునే పక్కలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచేది. దుప్పట్లపై పిసరంత దుమ్ము కనిపించినా ఆమె సహించేది కాదు. వందేళ్ల వయసులో సైతం ఆమె తన పనులు తానే చేసుకునేది. పరిశుభ్రం విషయంలో కూడా చివరి వరకూ అస్సలు సర్దుబాటు వైఖరి చూపలేదు. ఆమెను చూడడానికి నేను ఎప్పుడు గాంధీనగర్‌ వెళ్లినా తన చేతులతో నాకు స్వీట్లు తినిపించేది. శుభ్రమైన రుమాలుతో నా మూతిని ఆమే స్వయంగా తుడిచేది. తను కట్టుకున్న చీర కుచ్చిళ్లలో ఎప్పుడూ ఒక టవల్‌, రుమాలు దోపుకుని ఉండేది. పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించే వారంటే ఆమెకు ఎంతో గౌరవం. మా ఇంటి పక్కన ఉన్న మురికి కాలవను శుభ్రం చేయడానికి పనివారు వచ్చిన ప్రతిసారీ వాళ్లకి టీ ఇవ్వకుండా పంపేది కాదు. అలా సఫాయి కర్మచారీలకు ఆమ్మ టీ ఇవ్వడం చుట్టుపక్కల ఎంతో ఫేమస్‌ అయిపోయింది. మా అమ్మ అనగానే గుర్తొచ్చే మరో విషయం ఏమిటంటే వేసవి వస్తే చాలు అమ్మ గిన్నెల్లో నీళ్లు పోసి పక్షుల కోసం బయట ఉంచేది. మా ఇంటి చుట్టుపట్ల తిరిగే వీధి కుక్కలకు రోజూ ఏదో ఒకటి తప్పకుండా పెడుతూ వాటి ఆకలి తీర్చేది.
మా నాన్న టీ షాపు నుంచి తెచ్చే మీగడతో నోరూరించే రుచికరమైన నెయ్యిని అమ్మ తయారు చేసేది. ఈ నెయ్యిని మాకే కాదు చుట్టుపక్కల ఉండే ఆవులకు కూడా అమ్మ పెట్టేది. రోజూ రోటీలకు నెయ్యి బాగా రాసి ఆవులకు పెట్టేది. అంతేకాదు ఒక్క మెతుకును కూడా వ్రుధా పోనిచ్చేది కాదు. మా ఇంటిచుట్టు పట్ల ఎప్పుడు పెళ్లిళ్లు జరిగినా విందుకు వెళితే అన్నం పారేయద్దని మరీ మరీ చెప్పేది. విందుల్లో గాని, ఇంట్లో గాని ఎంత తినగలరో అంతే విస్తళ్లల్లో వడ్డించుకోమని చెప్పేది . తన చివరి రోజుల వరకూ కూడా ఆమె తను ఎంత తినగలదో అంతమాత్రమే పెట్టుకుని తినేవారు. రోజూ టైముకు భోజనం చేసేది. అన్నం బాగా నమిలి తినడం ఆమెకు అలవాటు. అలా తింటే బాగా జీర్ణమవుతుందనేవారు. ఇతరుల ఆనందాన్ని చూసి ఎంతో సంతోషించే వ్యక్తి ఆమె. పండగలప్పుడు మా అమ్మ చేసే రకరకాల వంటకాలను తినడానికి చుట్టుపక్కల పిల్లలు వచ్చేవాళ్లు.

మా ఇంటి చుట్టుపట్లకు సాధువులు ఎవరు వచ్చినా వారిని ఇంటికి భోజనానికి పిలుస్తుండేది అమ్మ. పిల్లలకు మంచి జరగాలని ఆశీర్వదించమనేది. ఇతరుల బాధలను అర్థంచేసుకునేలా, వారికి సహాయం చేసేలా పిల్లలు ఉండాలని కోరేది. అమ్మలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉండేది. అంతర్గతంగా గొప్ప సంస్కారి ఆమె. తన కొడుకు ప్రధాని అయినందుకు గర్వంగా ఉందా అని ప్రశ్నించిన వారికి ఆమె జవాబు ఎంతో లోతుగా ఉండేది. ‘మీకు మల్లేనే నేను గర్వపడుతున్నా. ఇందులో నేను చేసిందేమీ లేదు. అంతా దేవుడి అనుగ్రహం. ఆయన చేతుల్లో నేను ఒక సాధనం మాత్రమే’ అని జవాబిచ్చేది.
ఒక్క రెండు సందర్భాలలో తప్ప అమ్మ ఎప్పడూ నాతో కలిసి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నేను గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినపుడు నా జీవిత బోధకురాలు నా తల్లి అని తలచి నేను ఆమెను సన్మానించాలనుకున్నాను. కానీ ఆమె అంగీకరించ లేదు. చదువుకోకపోయినా ఎంత వివేకంగా వ్యవహరించవచ్చో ఆమె నుంచి నేర్చుకున్నాను. ఆమె ఆలోచించే ధోరణి, ఆమె లోని దూరద్రుష్టి నన్ను ఎప్పుడూ ఆశ్చర్యచకితుడిని చేస్తుంటుంది. దేశ పౌరురాలిగా తన బాధ్యతలేమిటో కూడా ఆమెకు బాగా తెలుసు. ఎన్నికల్లో తప్పకుండా తన ఓటు హక్కును ఉపయోగించుకునేవారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా అన్నింటిలో ఆమె ఓటు వేశారు. ప్రజలకు సేవ చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి.

మంచి జీవనం కొనసాగించాలి అని ఆమె నాకు ఎప్పుడూ చెప్పేవారు. తన జీవితానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ ఆమెకు లేవు. అలాగే ఇతరులు తనకు చేయాలనే ఆశలు కూడా ఆమెకు లేవు. దేవుడి మీద ఆమెకు అపరిమిత విశ్వాసం. ఎక్కువ సమయం జపం చేస్తూ గడిపేవారామె. అందులో మునిగి నిద్రపోయేవారు కాదు. అందుకే ఆమె నిద్రపోవాలని కొన్నిసార్లు ఇంట్లో వాళ్లు ఆ జపమాలను కనపడకుండా దాచేసేవారు. అమ్మలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఆమె మెమరీ పవర్‌ అమోఘం. ఎన్నో సంవత్సరాల క్రితం నాటి విషయాలను సైతం ఈ రోజు జరిగినంత స్పష్టంగా చెప్తారామె. చుట్టాల తాతలు, అమ్మమ్మల పేర్ల సైతం ఇట్టే చెప్పేస్తారు. అలాగే చిన్న పిల్లల్లో తలెత్తే రకరకాల అనారోగ్య సమస్యలకు సలహాలు ఇస్తుంటారు. అందుకోసం ఎందరో అమ్మ దగ్గరకు వస్తుంటారు. నా అభిప్రాయాలను అమ్మ ఎప్పుడూ గౌరవిస్తుంది. నాకెన్నడూ ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పలేదు. అన్ని విషయాలలోనూ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది.

ఆహారం విషయం దగ్గర నుంచి అలవాట్ల వరకూ నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి అని ఎంతో సున్నితంగా చెప్పేది. నేను ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని చెప్పినపుడు కూడా ఆమె పల్లెత్తు మాట గాని, కోపం గాని వ్యక్తంచేయలేదు. నేనెక్కడ ఉన్నా ఆమె ఆశీర్వచనాలు నాకు ఎప్పుడూ అందుతుండేవి. గుజరాత్‌ ముఖ్యమంత్రి నయినా, దేశ ప్రధానినయినా బిజీగా ఉండి తనను చూడడానికి రాలేకపోయినపుడు ఆమె ఎన్నడూ బాధపడలేదు. నీకు ఉన్న అతి పెద్ద ప్రజా బాధ్యతలను నిర్వహించు అంటూ భుజం తట్టి ప్రోత్సహించింది. ఆమెకు వందనాలు…” అని తల్లిని గుర్తుచేసుకున్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News