సమీప భవిష్యత్తులో తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూలంకషంగా వివరించారు. దేశం గురించి, దేశంలో తాము చేపట్టబోయే చర్యల గురించే కాక, దేశానికి అడుగడుగునా అడ్డు తగులుతున్న శక్తుల గురించి కూడా ఆయన వెల్లడించారు. కొన్ని వర్గాలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన అంశాలను గురించి కూడా ఆయన బహిరంగంగానే ప్రకటించడాన్ని బట్టి, దీనిపై దేశ ప్రజలు చర్చించుకోవడానికి, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా అవకాశం కలిగింది. మళ్లీ విడిగా ఈ అంశాల గురించి చర్చలు, సంప్రదింపులు జరపాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. మోదీ తన మూడవ పర్యాయ ప్రభుత్వంలో మొదటిసారి ఎర్ర కోట మీద నుంచి ప్రసంగించడం జరుగుతోంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎర్రకోట మీద నుంచి ప్రసంగించడం ఇది వరుసగా 11వసారి. ఆయన ప్రసంగం తీరును బట్టి అర్థమవుతున్నదేమిటంటే, గత పదేళ్ల పాలనకు ఇదొక కొనసాగింపు. ఇది సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ బీజేపీయే అధికారం చెలాయిస్తుంది.
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని, ఇది దేశ లౌకికవాద వ్యవస్థను కాపాడుతుందని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశానికి ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కోల్ కతాలో ఒక డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో ఆయన దేశంలోని మహిళలకు రక్షణ పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో మహిళల భద్రతకు సంబంధించి మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. బహుశా ఇటీవల సెబి తీరుపై హిండెన్బర్గ్ బయటపెట్టిన నివేదికను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఉండాలి. దేశంలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతీ యువకులు లక్షల సంఖ్యలో రాజకీయాల్లో ప్రవేశించా ల్సిన అవసరం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. బంగ్లాదేశ్ లో ప్రశాంత పరిస్థితులు పునరుద్ధరణ కావడంపై కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఆయన తమ పదేళ్ల పాలనను సమీక్షిస్తూ, ఉత్పత్తి రంగంలో భారతదేశం కొత్త పుంతలు తొక్కు తోందని, అవినీతిని కూడా చాలావరకు తగ్గించడం జరిగిందని, ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా తాము తమ లక్ష్యసాధన విషయంలో రాజీపడడం గానీ, విశ్రమించడం గానీ ఉండబో దని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం, ఎక్కువ సంఖ్యలో యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడం వంటివి ఆహ్వానించదగ్గ అంశాలే కానీ, ఇవి వివాదాస్పద అంశాలనడంలో సందేహం లేదు. పైగా ప్రభుత్వానికి పక్షపాత ధోరణిని, దురుద్దేశాలు అంటగట్టడానికి వీలైన అంశాలు. కాగా, మోదీ ప్రసంగించే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని రెండవ వరుసలో కూర్చోబెట్టడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులకు ఈసారి మొదటి వరుసలో స్థానం కల్పిం చడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఇది మర్యాదలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడం వివాదాస్పద అంశంగా మారే అవకాశం ఉంది. ముస్లిం సమాజానికి సంబంధించిన ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో బీజేపీ ప్రభుత్వం కేవలం పక్షపాత ధోరణితో దీన్ని ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తోందనే అభిప్రాయం ఏర్పడుతుంది. నిజానికి, రాజ్యాంగం ఈ స్మృతి అమలుకు తగిన అవకాశం కల్పించింది. ప్రభుత్వం అవినీతిపై పోరాటం జరపడానికి ఎవరికీ, ఎటువంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చు కానీ, తమ మీద మాత్రమే అవినీతి ఆరోపణలు చేయడం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మరింత లోతుగా తమ ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.