Sunday, June 23, 2024
Homeఓపన్ పేజ్Modi strategy INDIA alliance self goal: మోదీ వ్యూహంతో ఇండీలో గందరగోళం

Modi strategy INDIA alliance self goal: మోదీ వ్యూహంతో ఇండీలో గందరగోళం

యుద్ధంలో ఎటువంటి వ్యూహమైనా చెల్లిపోతుంది. ఎన్నికల సమయంలో కూడా ఏది చేసినా, ఏం మాట్లాడినా నడిచిపోతుంది. ఎన్నికల ఫలితాల రోజున ఢిల్లీలో అదే జరిగింది. గత జూన్ 4వ తేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున వివిధ పార్టీల ప్రధాన కార్యాలయాల్లో ఏం జరిగింది? ఎటువంటి రాజకీయాలు, ఎటువంటి వ్యూహాలు చోటు చేసుకున్నాయి? ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో పూర్తిగా బీజేపీకే అనుకూలంగా ఉండబోవడం లేదని అర్థమైపోవడంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఎన్.సి.పి వంటి పార్టీల నాయకుల్లో తీవ్రస్థాయి ఉత్కంఠ మొదలైంది. వ్యూహాలు మారిపోయాయి. ఆలోచనలు మారిపోయాయి. ప్రతి పార్టీ కార్యాలయంలోనూ, ప్రతి అగ్రనేత నివాసంలోనూ ఫోన్లు
అవిశ్రాంతంగా రింగవుతూనే ఉన్నాయి. ఫలితాల రోజు వ్యూహాలకు సంబంధించి కొన్ని మరాఠీ పత్రికల్లో సంతోష్ మాహూర్కర్ పేరుతో ప్రత్యేక కథనాలు వచ్చాయి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కీలక హోదాలో ఉండడంతో ఆ వార్తా కథనాలను ఇంగ్లీషు జాతీయ పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి.

- Advertisement -

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు బీజేపీకి 240కు మించి స్థానాలు లభించే అవకాశం లేదని అందరికీ అర్థమైపోయింది. ఆ సమయంలో టీవీలకు అతుక్కుపోయి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా సమావేశమై తదుపరి కార్యక్రమం గురించి చర్చించారు. తాము ప్రతిపక్షంలో కూర్చోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఒకరిద్దరు ప్రతిపక్ష నాయకులకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారు. ప్రతిపక్షాలు తమకు తోచిన నిర్ణయం తాము తీసుకోవచ్చని, తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. ఇక ఇండీ కూటమి తమ ఏర్పాట్లు తాము చేసుకోవాలని కూడా సూచించారు. లోక్ జన శక్తి
పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్, శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే కూడా ఇందుకు అంగీకరించి, బీజేపీతో పాటు ప్రతిపక్షంలో కూర్చోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన ఎన్.డి.ఎ సమావేశానికి మోదీ రాకపోవడానికి ఇదే కారణం.

ఎత్తులు, పైయెత్తులు
ఆ రోజు మధ్యాహ్నం మోదీ స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, జె.డి (యు) అధినేత నితీశ్ కుమార్ కు ఫోన్ చేసి, ఫలితాలు అనుకూలంగా లేనందువల్ల తాము ప్రతిపక్షంలో కూర్చోదలిచామని, చంద్రబాబు, నితీశ్ కుమార్ లు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని సూచించారు. ఇండీ కూటమి అధికారంలోకి వచ్చే పక్షంలో ప్రభుత్వం పరిస్థితి,
దేశ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందో అర్థం చేసుకున్న చంద్రబాబు, నితీశ్ కుమార్ లు ఈ మాటలు విని నిర్ఘాంతపోయారు. వారికి ఏం చేయాలో తోచలేదు. కాగా, బీజేపీ నిర్ణయం గురించి ఇండీ కూటమిలోని నాయకులకు కూడా తెలిసిపోయింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ లకు ఇది కొరుకుడు పడలేదు. నిజానికి, బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ కూటమి మాత్రమే కాక, ఇండీ కూటమి, తదితర ప్రతిపక్షాలు సైతం బీజేపీయే ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం జరుగుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఈ మారిన పరిస్థితికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ఖర్గే, రమేశ్ లకు ఏం చేయాలో పాలుపోలేదు. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడమే మంచిదని కూడా భావించారు కానీ, ఆ తర్వాత మనసు మార్చుకుని, ఎన్.సి.పి నాయకుడు శరద్ పవార్ కు ఫోన్ చేసి, చంద్రబాబు, నితీశ్ కుమార్ లతో మాట్లాడవలసిందిగా సూచించారు. పవార్ వెంటనే నితీశ్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉందన్న విషయం పవార్ కు ఎలా తెలిసిందని నితీశ్ అడిగారు. తనకు ఆ విషయం తెలియదని, ఇండీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉందని, నితీశ్ తో టచ్ లో ఉండాలని మాత్రమే తనకు ఖర్గే
చెప్పారని పవార్ వెల్లడించారు.

అప్పుడు నితీశ్ అన్ని విషయాలనూ పవార్ కు తెలియజేశారు. ఇద్దరి మధ్యా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశంలోని ప్రతి వ్యక్తికీ రూ. 8,500 బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, పైగా సంపదను పంచుతామని, ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని, ఇది దేశానికి పెను భారం కాబోతోందని వారిద్దరూ చర్చించుకున్నారు. అసలు ప్రధానమంత్రిగా ఎవరు ఉండబోతున్నారనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోబోతోందంటూ ఉప్పందించిన మల్లికార్జున్ ఖర్గే పూర్తి వివరాలను తమకు చెప్పకపోవడాన్ని వారు తప్పు బట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏదో కుతంత్రం చేస్తోందన్న అభిప్రాయం కూడా వారికి కలిగింది. ఇదే అభిప్రాయాన్ని పవార్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెవిలో కూడా వేశారు.

దిక్కుతోచని పరిస్థితి
పవార్ అంతటితో ఊర్కోలేదు. వెంటనే ఖర్గేకు ఫోన్ చేసి బీజేపీ నిర్ణయం గురించి తమకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. తనకు కూడా ఈ వార్త ఇప్పుడే తెలిసిందని, అందుకనే తానీ విషయం తెలియజేయలేకపోయాయని ఖర్గే తెలిపారు. భావి వ్యూహం రచించే ముందు ప్రధానమంత్రి ఎవరన్నది నిర్ణయం కావాలని పవార్ నొక్కి చెప్పారు. అఖిలేశ్ యాదవ్ కూడా ఖర్గేకు ఫోన్ చేసి, తనను సంప్రదించకుండా ఎవరూ ఏ నిర్ణయమూ తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఏదైనా నిర్ణయం
తీసుకునే పక్షంలో తాను ఇండీ కూటమి నుంచి వైదొగుతానని కూడా ఆయన గట్టిగా హెచ్చరించారు. కొద్ది సేపటిలోనే ఈ వార్త ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నిటికీ తెలిసిపోయింది. ఎన్నికల ఫలితాలు రావడం కొనసాగుతున్నప్పటికీ, ఇండీ కూటమిలో మాత్రం ఒక సంక్షోభ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వాగ్దానాల విషయంలో ఇండీ కూటమిలోని పార్టీలు తర్జన భర్జన పడుతూనే ఉన్నాయి. కాగా, ఈలోగా చంద్రబాబు, నితీశ్ కుమార్ లు బీజేపీ నాయకత్వానికి ఫోన్ చేసి తాము ఎన్.డి.ఎ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పడం జరిగింది.

బీజేపీకి 240 స్థానాలు లభించినందు వల్ల, పాశ్వాన్, షిండేల పార్టీలను కలుపుకుంటే మొత్తం సంఖ్యాబలం 264కు పెరిగింది. బలమైన ప్రతిపక్షంగా ఏర్పడడానికి అవకాశం కలిగింది. జయంత్ చౌధురి ద్వారా మోదీ, అమిత్ షాలకు ఇండీ కూటమిలో తలెత్తిన సంక్షోభం గురించి పూర్తి వివరాలు అందాయి. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ గనుక అధికారం చేపట్టే పక్షంలో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో వెంటనే రూ. 8,500 పడిపోతాయంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో లక్షలాది మంది ప్రజలు కాంగ్రెస్ కార్యాలయాల ముందు బారులు తీరడం ప్రారంభించారు.
కాంగ్రెస్ చేసిన ఈ వాగ్దానాలన్నిటినీ తీర్చడం వల్ల ఖజానా మీద ఎంత భారం పడేదీ ఊహించుకుని ఇండీ కూటమి నాయకులు తీవ్రంగా ఆందోళన పడడం మొదలుపెట్టారు. ఇండీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతునిచ్చే పక్షంలో తాము ఈ గండం నుంచి గట్టెక్కగలమని కూడా కొన్ని పార్టీలు సూచించాయి. అయితే, కాంగ్రెస్ ఏదో ఒక సమయంలో హఠాత్తుగా మద్దతును ఉపసంహరించుకునే అవకాశం ఉందని, చంద్రశేఖర్, చరణ్ సింగ్, దేవె గౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు ఈ విధంగానే కుప్పకూలాయని కూడా కొన్ని పార్టీలు పేర్కొన్నాయి.

బీజేపీ గనుక అధికారం చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తే పక్షంలో రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ వ్యవహారాలు బీజేపీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ద్వారా ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాలకు తెలియజేయడం జరిగింది. అందుకు అన్ని పార్టీలూ సమ్మతించాయి. చివరికి, జూన్ 5 సాయంత్రం మోదీ బీజేపీ కార్యాలయానికి వచ్చి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. తమ మేనిఫెస్టోలోని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. మోదీ, అమిత్ షాలు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యూహాన్ని అమలు చేశారా లేక ఇదంతా అనుకోకుండానే జరిగిందా అన్నది ఇదమిత్థంగా తెలియదు కానీ, తెరవెనుక ఏదో జరిగిందన్న విషయం
మాత్రం అర్థమవుతోంది. ఏది ఏమైనా ఇది వాజ్ పేయీ, అద్వానీల నాటి బీజేపీ కాదని, ఎదురు దాడితో ఆత్మరక్షణ చేసుకోవడమనే వ్యూహం ఇక్కడ రూపుదిద్దుకుందని అర్థం చేసుకోవాలి.

– టి.వి. వరప్రసాద్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News