Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Mom and her love: అమ్మ నుండి అందుకొన్న తొలి వరం కమ్మనైన క్షీరం

Mom and her love: అమ్మ నుండి అందుకొన్న తొలి వరం కమ్మనైన క్షీరం

అమ్మ పాలకు మించిన అమృతం లేదు

తల్లికి మించిన దైవం లేదు. అమ్మ పాలకు మించిన అమృతం లేదు. నవమాసాలు గర్భంలో ఉండి అమ్మ నుండి అందుకొన్న తొలి వరం కమ్మనైన క్షీరం. మన దేశంలో ఆగస్టు 1 నుండి 7 వ తేదీ వరకు తల్లిపాల వారోత్స వాలు జరుగుతాయి. ఈ సంవత్సరం థీమ్‌ ఉద్యో గస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు తల్లిపాలు కొనసాగేందుకు సహకరిధ్దాం. పిల్లలు ఆరోగ్యవంతులుగా పెరిగి అభివృద్ధి చెందడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ , యునిసెఫ్‌ మరియు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలవారు సరి అయిన పోషణ విధానములుగా సిఫార్సు చేస్తున్నారు.
బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లి పాలు ప్రారంభించాలి. మొదట ఆరు నెలల వయస్సు వరకు తల్లి పాలు మాత్రమే ఇప్పించడం, ఆరు నెలల మీదట అనువైన కుటుంబ ఆహారం అదనంగా ప్రారంభించడం, తల్లిపాలు రెండు సంవత్సరాల వయస్సు వరకు లేదా వీలైనంత కాలం ఇప్పించడం చేయాలి. . ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా ఆనందంగా బ్రతికేవచ్చు. తల్లి పాలు తాగడం నుండే బిడ్డ ఆరోగ్యం ఆరంభం అవుతుంది. ఇవి శిశువుకు ప్రకృతి ఇచ్చే సహజ సిద్ధమైన టీకా. ఇవి సహజమైన పునరుత్పాదక మరియు వ్యర్థాలు, కాలుష్యం లేని వనరు. బిడ్డకు ఈ పాలు ఎంతో శ్రేష్ఠమే కాక పౌష్టికాహారం కూడా. శిశువుకు తల్లి పాలకు మించిన ఆహారం లేదు, ఉండదు , ఉండబోదు కూడా. ఇవి ప్రోటీన్లు, విటమిన్లు, పిండిపదార్ధాలు, కాల్షియం, పొటాషియం , ఖనిజాలు, సూక్ష్మపోషకాలు, అవసరమైన మేరకు పుష్కలంగా ఉండడం వలన పిల్లలు తగినంత బరువు పెరుగుతారు.వీటిలో శక్తివంతమైన ప్రతోరోధకాలు ఉన్న కారణంగ అంటువ్యాధులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు , అలర్జీలు, ఆస్తమా, చెవి సంభందిత వ్యాధులు సెప్సిస్‌, న్యుమోనియా, డయేరియాల నుండి శిశువును కాపాడుతాయి. వీటిలో ఫాటీ ఆసిడ్స్‌ బిడ్డ మెదడు పెరుగుదలకు దోహదం చేయడం వలన తెలితేటలు పెరుగుతాయి, ఇంకా అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్ని అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గించడమే కాక నరాల అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపు తాయి.తేలికగా జీర్ణమవడంవలన మల బద్ధక సమస్యలు రాకుండా కాపాడుతాయి. భవిషత్తులో స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి రాకుండా కాపాడు తాయి. ప్రసవం అయిన వెంటనే మొదటి అరగంట నుండి ఒక గంట వ్యవధిలో తల్లి పాలలో కోలాస్ట్రం ఉంటుంది.ఈ పాలు ఎంత తొందరగా త్రాగించడం మొదలుపెడితే అంత మంచిది. బిడ్డకు వ్యాధి నిరోధకశక్తిని పెంచి అనేక వ్యాధులనుండి దూరంగా ఉంచడంతో పాటు ఇంతకు ముందు చెప్పుకున్న లాభాలన్నీ పొందవచ్చు. శిశువు జీవితంలోని మొదటి నెలలకు అవసరమైన శక్తిని ,పోషకాలను తల్లి పాలు అందిస్తాయి. బిడ్డకు ఆరు నెలలు పూర్తయ్యేవరకూ తల్లి పాలు మాత్రమే పట్టాలి. ఈ ఆరు నెలలు చాలా కీలకం. తల్లి పాలల్లో ఎనభై శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. తల్లి తన బిడ్డకు దాహం వేస్తున్నట్లు అనిపించినప్పుడల్లా పాలివ్వవచ్చు. వేడి వాతావరణంలో కూడా ఆరునెలల వయస్సు లోపు పిల్లలకు నీరు అవసరం లేదు. ఆరు నెలల తరువాత తల్లి పాలతో పాటు పరిపూర్ణమైన ఆహారాన్ని అందించడం మొదలు పెట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. డాక్టర్‌ సలహా మేరకు విటమిన్లు, మినరల్స్‌, సిరఫ్లను ఇవ్వొచ్చు. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లి పాలు పట్టాలి. తల్లికి , పాలు తాగే బిడ్డకు ఎలాంటి సమస్య రానంత వరకూ , తల్లి మరల గర్భంతో ఉన్నా కూడా బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. ఆ తరువాత తల్లీ బిడ్డలకు ఇష్ఠమైనంతవరకూ తల్లి పాలు పెట్టవచ్చు.
తల్లి పాలివ్వడం అనేది తనకు, తన బిడ్డకు మరియు ప్రపంచానికి తల్లి నుండి లభించే బహుమతి. ఇది ఎల్లప్పుడూ సులభం కానప్పటికీ, ఇది ఎల్లప్పుడూ విలువైనదే. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోనున్న ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ ( హెల్త్‌ మేనేజ్మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ – హెచ్‌.యం. ఐ.యస్‌ ) 2021-22 నివేదిక ప్రకారం భారతదేశంలో చాలా రాష్ట్రాలు పుట్టిన ఒక గంటలోపే నవజాత శిశువులకు తల్లిపాలు పట్టించడంలో 90 శాతం సఫలీకృతమయ్యాయి, అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణతో సహా 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాయి.చండీగఢ్‌ 84.95 శాతంతో మొదటి స్థానంలో, వెస్ట్‌ బెంగాల్‌ 84.80 శాతంతో రెండవ స్థానంలో, మణిపూర్‌ 83.62 శాతంతో మూడవ స్థానంలో ఉండగా , సిక్కిం 83.41 శాతం, పంజాబ్‌ 81.67 శాతం , అరుణాచలప్రదేశ్‌ 81.28 శాతం , తెలంగాణా 80.75 శాతం, గోవా 73.64 శాతం, అండమాన్‌ మరియు నికోబార్‌ దీవులు 72.53 శాతం , పుదుచ్చేరి 69.00 శాతం , ఢిల్లీ 67.00 శాతంతో ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత సంస్థలు నవజాత శిశువులకు రోగాల నుండి శిశువును రక్షించే ప్రతిరోధకాలను కలిగి ఉన్న ముర్రుపాలులో కొలొస్ట్రమ్‌ను అందుకోవడంలో 85 శాతం కంటే తక్కువగా నమోదు చేయబడ్డాయి.తల్లి పాలు మాత్రమే తాగే పిల్లలు ప్రాణాంతక వ్యాధులతో మరణించే అవకాశం తక్కువ అని ఈ నివేదిక తెలిపింది.ఈ విధంగా తల్లి పాలు కొన సాగించక పోవడం వలన కలిగే నష్టాలపై మన దేశం లో జరుపబడిన అంతర్జాతీయ అధ్యయనంలో ప్రతీ సంవత్సరం నీళ్ళ విరేచనాలు, న్యుమోనియా లతో సుమారు ఒక లక్ష మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు మరణిస్తున్నారు. ప్రతీ ఏటా 34.7 కోట్ల మంది పిల్లలు నీళ్ళ విరోచనాలకు , 0.24 కోట్ల మంది పిల్లలు న్యుమోనియా జబ్బులకు, 40,382 మంది పిల్లలు స్థూల కాయానికి లోనవుతున్నారు. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.యస్‌-5)లో 14 రాష్ట్రాలు,యుటిలు (ఫేజ్‌-II కింద కలిపివేసినవి) కు సంబంధించిన ఫలితాలును నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం), డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ పాల్‌, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ భూషణ్‌, జనాభా, పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోషకాహారం, ఇతర ముఖ్య సూచికల ఫ్యాక్ట్‌షీట్‌లను విడుదల చేశారు. దీనిప్రకారం 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే వారు 2015-16 (యన్‌.హెచ్‌.యస్‌.-4)సర్వేలో 54.9 శాతం ఉండగా 2019-21 సర్వే వచ్చేసరికి 63.7 శాతానికి ఎగబాకింది. ఇందులో అధికంగా గ్రామీణులు 65.1 శాతం, పట్టనవాసులు 59.6 శాతంగా ఉన్నారు. ఇది ఎంతో శుభపరిణామం.తల్లిపాల గురించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వీటి వలన కొంత మంది శిశువులు తల్లి పాలకు దూరం అవుతున్నారు. అటువంటి తల్లులకు ఈ సందర్భంగా అవగాహన చెయ్యవలసిన అవసరం ఉంది. కొంత మంది పిల్లలు పాలు త్రాగిన వెంటనే వాంతు చేస్తారు.తాగేట ప్పుడు నోటితో కొంత గాలిని పీల్చడం వలన ఇలా జరుగుతుంది.ఇది ప్రమాదం కాదు .దీనిని వైద్యభాషలో పోసెట్టింగ్‌ అంటారు.తల్లిపాలు పెట్టిన వెంటనే నేల లేదా మంచంపై పడుకోబెట్టకుండా , భుజంపై వేసుకొని కొంతసేపు ఉంచాలి.ఎక్కువగా కదల్చరాదు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు బిడ్డకు అదనంగా నీరు అవసరం లేదు. బిడ్డకు అవసరమైన నీరు తల్లి పాలలోనే ఉంటాయి. శిశువుకు విరోచనాలు ఐతే కొంతమంది తల్లులు పాలు పెట్టరు.డాక్టరు సలహా మేరకు పట్టించడం ఆపలే తప్ప, సొంతగా అపనవసరం లేదు. తల్లి గర్భవతిగా ఉన్నా కూడా బిడ్డకు పాలివ్వొచ్చు. కొన్ని పరిస్థితులలో ఒకటి రెండు రోజులు బిడ్డకి అందించక పోయిన తరువాత వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. పాలిచ్చే తల్లి అవసరం మేరకు పండ్లు తీసుకోవాలే తప్ప ఎక్కువ పండ్లు తల్లి తీసుకోనవసరం లేదు.మరో పెద్ద అపోహ ఏంటంటే సిజెరియన్‌ అయిన వెంటనే తల్లి లేవకూడదని పాలు త్రాగించరు. అలాకాక తల్లి పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే డాక్టర్‌ సూచన మేరకు నర్సుల సహాయంతో బిడ్డకు పాలు ఇవ్వాలి. శిశువు పుట్టిన తరువాత తల్లినుండి వచ్చే పాలు సరిపోవని బయట పాలు అందిస్తారు, అలా చేయకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. పాలు పెడుతున్న ప్రతీ సారి రొమ్ము ముందు భాగాన్ని పరిశుభ్రం చేయనవసరం లేదు.ఇలా చేస్తుంటే రొమ్ము నుండి వెలువడే కొన్ని ఆయిల్స్‌ వలన పాలు పట్టేక్రియ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. పాలిచ్చే తల్లులుకు ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతంలో అన్ని ఆహారపదార్థాలు తిననివ్వరు.ఇది చాలా పెద్ద అపోహ. పాలిచ్చే తల్లికి మంచి పోషకాహారాన్ని , పండ్లు, పాలు, మంసాహారులైతే మాంసాహారాన్ని అందించాలి. అప్పుడే బిడ్డకు అవసరమైన పాలు అందుతాయి.మన దేశంలో కొంత మంది తల్లులు బిడ్డకు పాలు పెట్టడం వలన తమ అందం పోతుందని పాలివ్వరు.అమ్మతనానికి మించిన అందం ఈ ప్రపంచంలో ఉందా..! ప్రకృతిలో ఏ జంతువు ఇలా ఆలోచించదు. బిడ్డకు బయట నుండి డబ్బాపాలు అందిస్తారు.ఇది చాలా తప్పు. ప్రకృతి ప్రసాదించిన గాలినే పీల్చుతాం. ప్రకృతి అందించిన నీటినే త్రాగుతాం. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తీసుకోగలమా? అలానే తల్లి పాలకు కూడా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. విదేశాల నుండి తీసుకొచ్చిన పాల పొడులు కూడా అమ్మ పాలకు మించిపోవు. తల్లులందరూ బాగా ఆలోచించాలి. పిల్లలకు పెద్దయిన తరువాత ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవ్వాలనుకుంటారు. కానీ వాటి కంటే పిల్లలకు ఇచ్చే మొదటి ఆస్తి తల్లిపాలనే విషయం గుర్తెరగాలి. పాలివ్వడం వలన అందంమేమీ తరగదు. ఇంకా పెరుగుతుంది.బిడ్డకు పాలివ్వడం వలన తల్లికి కూడా లాభాలున్నాయి. ప్రసవంలో తల్లి బరువు ఎక్కువ పెరుగుతుంది. పాలివ్వడం వలన బరువు తగ్గుతారు. రొమ్ము కేన్సర్‌, అండాశయ కేన్సర్‌ , రక్తపోటు, టైప్‌ 2 మధుమేహం వంటి రోగాలు భవిషత్తులో రాకుండా అడ్డుకుంటాయి. పిల్లలు పుట్టిన తరువాత తమ శిశువులకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఉండే దేశం క్రొయేషియా. ఇక్కడ 98 శాతం మంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇంకా రువండా, చిలీ, బురుండి వంటి దేశాలలో ఉండే తమ పిల్లలకు పాలిచ్చే తల్లులు 80 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులలో అనగా ఉద్యోగరీత్యా, బయట పనులు చేయడం వలన తమ శిశువుకు పాలు అందివ్వలేరు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రసవానంతర సెలవులు ఇస్తున్నారు. అలానే ప్రైవేటు రంగంలో కూడా కనీసం ఆరు మాసాలు వేతనంతో కూడిన సెలవివ్వాలి. పాలిచ్చే అమ్మ పొలం పనులకు కూలీ పనులకు, ఆ ఆరు మాసాలు వెళ్లకుండా ఇంటిలోని యజమానులు, కుటుంబసభ్యులు సహకరించాలి. ఈ సంవత్సర లక్ష్యాలు ఆరోగ్యకేంద్రాలు మరియు పని ప్రదేశాలలోని మహిళా ఉద్యోగినులకు మద్దతుకై దేశ వ్యాప్తంగా విస్తృత అవగాన చర్యలు, ప్రసూతి అర్హతలు మరియు ఇతర సహాయ చర్యల సమాచారాన్ని తెలియపరచడం, ఈ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగినులను ప్రోత్సహించే కార్యక్రమాలను బలోపేతం చేయడం. మనదేశంలో ప్రసూతి ప్రయోజన చట్టం 2017 ,అధికారిక రంగంలో పనిచేస్తున్న మహిళలకు ప్రసూతి ప్రయోజనాల ప్రాధాన్యతను తెలుపుతుంది. శిశు ఆహార చట్టం 1992 సవరణలతో 2003 నుండి, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 లు పాలిచ్చే తల్లులకు మరియు శిశువులకు రక్షణ కల్పిస్తుంది.
(ఆగస్ట్‌1న ప్రపంచ తల్లి పాల దినోత్సవం సందర్భంగా)
డిజె మోహన రావు
శ్రీకాకుళం జిల్లా
9440485824.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News